ఈ మధ్య బాగా ప్రాచుర్యం లోకి వచ్చిన డైట్ ఈ కేటోజెనిక్ డైట్? విదేశాల్లో ఎప్పటి నుండి ఇది ప్రాచుర్యంలో ఉంది. కానీ మన దేశంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యనే బాగా ప్రాచుర్యం పొందినది. ఈ క్రెడిట్ మొత్తం వీర మాచినేని రామకృష్ణ గారికే దక్కుతుంది. అసలు ఆయనంటూ ఒక విప్లవం లాగా దీన్ని ప్రచారం చేయక పోతే ఇంత మందికి అసలు దీని గురించి తెలుసుకునే అవకాశమే ఉండేది కాదు. సరే అసలు ఇప్పుడు కీటోజెనిక్ డైట్ అంటే ఏమిటో ఆ డైట్ పాటించడం వల్ల మన శరీరం లో ఏమి జరుగుతుందో తెలుసుకుందాము. నాకు సాధ్యమైనంత వరకు సరళంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.
మన శరీరం తనకు కావాల్సిన శక్తి కోసం ఫ్యాట్ లేదా కొవ్వు ను ఉపయోగించాల్సి వచ్చినప్పుడు కొవ్వును కీటోన్స్ గా విచ్చిన్నం చేస్తుంది. ఆ కీటోన్స్ ను శరీరానికి శక్తిని ఇచ్చే ఇంధనంగా వాడుతుంది. ఈ రకమైన ప్రక్రియ ను కీటోసిస్ అంటారు. మనలో సాధారణంగా 90 శాతం మంది తమ శరీరానికి కావలసిన శక్తిని కొవ్వు నుండి కాక కార్బోహైడ్రేట్స్/పిండిపదార్ధాల నుండి వచ్చేలా ఆహారాన్ని తీసుకుంటుంటారు. అది కూడా అవసరమైన దాని కన్నా ఎక్కువ తీసుకుంటారు. అందువల్ల శరీరానికి అవసరమైన శక్తి కి మించి ఉన్న శక్తి/గ్లూకోస్ అంతటినీ మనం శరీరం కొవ్వు గా మార్చి శరీరంలో నిల్వ చేసుకుంటుంది.
మనం రోజూ తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్( పిండి పదార్ధాలు), ఫ్యాట్( కొవ్వు), ప్రోటీన్స్ (మాంసకృతులు) ఉంటాయి. మన శరీరానికి పిండి పదార్ధాలు, కొవ్వు, మాంసకృతులలో ఈ మూడింటిలో అన్నింటికన్నా పిండి పదార్ధాలను/కార్బోహైడ్రేట్స్ ను వెంటనే గ్లూకోస్ గా మార్చి శక్తిని తయారు చేసుకోవడం చాలా చాలా తేలిక. అందుకే మనం తినగానే ముందు కార్బోహైడ్రేట్స్ ను వాడుకుంటుంది. మన పాంక్రియాస్/క్లోమ గ్రంధి ఇన్సులిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్( విచ్చిన్నం) అయి గ్లూకోజ్ గా మారగానే దానిని శరీరం లోని మన కణజాలంలోకి చేరవేయడానికి ఇన్సులిన్ సహాయపడుతుంది అంతే కాకుండా అవసరానికి మించి ఉన్న చక్కర ను నియంత్రించడానికి సహకరిస్తుంది. మనం తిన్న ప్రతీసారీ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయినా లేదా చాలా తక్కువగా ఉత్పత్తి అయినా చాలా ప్రమాదం. దీని వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల మనం పిండిపదార్ధాలు/కార్బోహైడ్రేట్స్ గణనీయంగా తగ్గించి కేవలం ఎక్కువ కొవ్వు /ఫ్యాట్ మరియు తగినంత ప్రోటీన్స్ మాత్రమే తీసుకుంటే అప్పుడు ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. కీటో డైట్ లో మనం శరీరానికి కొవ్వు ను ఇవ్వడం ద్వారా శక్తిని ఇవ్వడం అలవాటు చేయడం వల్ల మన శరీరం లో పేరుకు పోయి ఉన్న కొవ్వు క్రమంగా తగ్గుతుంది.
కీటో డైట్ ను కూడా ఏదో ఇష్టం వచ్చినట్లు కాకుండా ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతారు. Dr.Eric Berg గారు చెప్పిన ప్రిన్సిపుల్ ప్రకారం, ” మనం బరువు తగ్గితే ఆరోగ్యంగా మారతామనుకుంటాము కానీ ముందు మనం ఆరోగ్యం గా ఉంటేనే బరువు తగ్గుతాము“. ఇది మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత త్వరగా ఫలితాలను సాధించగలుగుతాము. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనం ఆరోగ్య కరమైన మరియు అన్ని పోషకాలు ఉన్న ఆహారం తినడం ప్రారంభించాలి. కీటో డైట్ లో కూడా ఎంత పడితే అంత ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఆకలి అనిపించినప్పుడు మాత్రమే అవసరమైనంత పోషక విలువలతో కూడిన ఆహరం తీసుకోవడం అనేది చాలా అవసరం.
కీటో డైట్ ఒక్కటి చేస్తే సరిపోతుందా త్వరగా బరువు తగ్గిపోతామా? అంటే కాదు. ఎందుకంటే మీరు కీటో డైట్ లో శరీరానికి కొవ్వు నుండి శక్తిని విడుదల చేసే విధంగా అలవాటు చేసి అలా రోజూ కొవ్వుని ఇస్తూ పోతే ఆ రోజు అవసరానికి మీరు ఇచ్చిన ఆ కొవ్వునే వాడుకుంటుంది. మరి మీ శరీరంలో పేరుకు పోయి ఉన్న కొవ్వును ఎప్పుడు వాడుకుంటుంది? మీరు దానికి ఆ అవకాశం ఇస్తేనే కదా! అందువల్ల మీరు కీటో డైట్ తో పాటుగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా తప్పని సరిగా చేయాలి. ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక డైట్ కాదు. అది ఒక ఆహార శైలి లేదా అలవాటు. ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ లో మీరు సాధ్యమైనంత ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండాలి. అప్పుడు శరీరం తన అవసరాలకు కావాల్సిన శక్తిని మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నుండి తీసుకుంటుంది. ఆ విధంగా మనం బరువు తగ్గుతాము.
సరే ఇప్పుడు మీకు కీటో డైట్ అంటే ఏంటో కాస్త అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. తర్వాత అసలు కీటో డైట్ ను ఎలా ప్రారంభించాలి? అనేది మీరు తెలుసుకోవాలి. ఈ లింక్ ను క్లిక్ చేసి తప్పకుండా దాని గురించి చదవండి.