Site icon Maatamanti

Andhra Mango Pickle Recipe-ఆంధ్రా ఆవకాయ పచ్చడి తయారీ విధానం

andhra mango pickle recipe

Andhra Mango Pickle Recipe with step by step instructions.English Versionandhra mango pickle recipe

రోజూ తిన్నవే మళ్ళీ మళ్ళీ తింటుంటే బోర్ కొడుతుంది.ఒక్కోసారి తిండి మీదే విరక్తి వస్తుంది.కానీ ఏది ఏమైనా మామిడికాయ పచ్చడి విషయంలో మాత్రం అలా జరగదు.రోజూ  తిన్నా కూడా బోర్ కొట్టదు.ఎక్కువ తింటే వేడి చేస్తుందని తెలిసి కూడా తినకుండా ఉండలేనంత రుచి.ఎప్పుడైనా వంట చేయడానికి  బద్ధకం అనిపించినపుడు అన్నం,  ముద్దపప్పు వండుతాను.వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది.ఈ పచ్చడిని వేరు వేరు ప్రాంతాలలో వివిధ రకాలుగా చేస్తారు.ఎవరు ఎలా చేసినా నాకు మాత్రం ఆంధ్రా ఆవకాయ అంటేనే ఇష్టం.ఈ పచ్చడిలో వేసే ప్రతీ పదార్ధము చాలా important.ఏ ఒక్క పదార్థం వేయకపోయినా అసలు సిసలైన టేస్ట్ ని మిస్ అవుతారు.

ఈ పచ్చడిని ఇలానే తయారు చేయాలని ఎవరు కనిపెట్టారో కానీ నిజంగా వారికి మనమంతా ఋణపడి ఉండాలి.పూర్వం ముహమ్మద్-బిన్-తుగ్లక్ పరిపాలించే కాలంలో ఐబెన్ బటూటా అనే ఒక మొరాకన్ యాత్రికుడు భారతదేశం వచ్చాడు.ఆయన తన పుస్తకంలో ఇలా వ్రాసాడు.”భారతదేశంలో చాలా మామిడి చెట్లు ఉన్నాయి.మామిడి చెట్టు కింద నిదురిస్తే జ్వరం వస్తుందని అక్కడి ప్రజల నమ్మకం.నేల రాలిన మామిడి పండ్లతో నిమ్మకాయ పచ్చడి మాదిరిగానే పచ్చడి తయారు చేసుకుని అన్నంతో పాటుగా తింటారు.” అని వ్రాసాడట.దీన్ని బట్టి ఆలోచిస్తే మామిడికాయలతో పచ్చడి పెట్టడం ఎంతో పురాతన కాలం లోనే మొదలయ్యి ఉండవచ్చు.

రోజూ ఇంట్లో పోట్లాడుకునే భార్యాభర్తలు కూడా ఈ పచ్చడి విషయానికొచ్చేసరికి ఒకటైపోతారేమో అనిపిస్తుంది.వారిలో ఒకరు కాయల్ని కొని తెస్తే ఇంకొకరు కడుగుతారు.ఇంకొకరు శుభ్రంగా తుడుస్తారు.ఒకరు ముక్కలుగా తరిగితే ఇంకొకరు పచ్చడి కలుపుతారు.చివరిగా భర్త గారు రుచి చూసి అంతా ఓకే అని చెప్తే భార్య గారు పచ్చడిని జాగ్రత్తగా జాడీలోకి సర్దేస్తారు.ఇలా ఎందుకు చెప్తున్నానంటే నేను మామిడికాయల సీజనులో మార్కెట్ కి వెళ్ళినప్పుడల్లా అక్కడ పచ్చడి కాయల్ని కొనే జంటల్ని చూస్తూ ఉంటాను.కొంతమంది అయితే మార్కెట్ కి  వచ్చేటప్పుడే నీళ్ళు, పొడి బట్ట కూడా వెంట తెచ్చుకుంటారు.కాయల్ని అక్కడే కడిగేస్తే అమ్మేవాడితోనే ముక్కలు కట్ చేయించుకోవచ్చు కదా.నాకైతే వాళ్ళని చూస్తే ఒక పెద్ద యుద్ధానికి సన్నాహాలు చేస్తునట్లు, ఒక పెద్ద కట్టడాన్ని ఎంతో శ్రద్ధగా నిర్మిస్తున్నట్లు, ఒక నవలని చాలా ఆసక్తిగా చదువుతున్నట్లు అనిపిస్తుంది.

నా చిన్నప్పుడు మా నానమ్మ పచ్చడి పెడుతుంటే పక్కనే ఉండి ఆసక్తిగా గమనించేదాన్ని.ముందుగా స్నానం చేసి అప్పుడు తయారీ మొదలు పెట్టేది.స్నానం చేయకుండా కనీసం కాయ కూడా ముట్టుకునేది కాదు.పచ్చడి పట్టడం అయిపోయాక దానిని ఒక పెద్ద పింగాణీ జాడీలోకి సర్దేసేది.దానికి శుభ్రమైన పొడి బట్టతో వాసిను కట్టేది.అలా పెట్టిన పచ్చడి సంవత్సరం వరకు అలానే తాజాగా ఉండేది.కానీ ఎంతైనా మామిడికాయ పచ్చడి తినాలంటే కొత్తల్లోనే తినాలి.

మామిడికాయ పచ్చడి పట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు

1.కొనే ముందు కాయలు గట్టిగా, పుల్లగా ఉన్నాయో  లేదో రుచి చూసి తీసుకోవాలి.లోపల మరీ పసుపు పచ్చగా ఉండే కాయల్ని తీసుకోవద్దు.

2.పచ్చడి ఎర్రగా ఉంటేనే బాగుంటుంది.నేను ఈ పచ్చడి తయారీ కోసం ఎవరెస్ట్ thikalal కారం ఉపయోగించాను.three Mangoes కారం కూడా బాగానే ఉంటుంది.కానీ మీకు ఓపిక ఉంటే మీరే ఎండుమిరపకాయలను కొని ఎండబెట్టి మర పట్టించి వాడితే ఇంకా మంచిది.

3.పచ్చడి పట్టాక ముక్కలు మునిగేంత నూనె పోయాలి.లేకపోతే పచ్చడి రంగు తొందరగా మారిపోయే అవకాశం ఉంది.ఉప్పు కూడా తగినంత వేయకపోతే బూజు పట్టే ప్రమాదం ఉంది.

4.కలపగానే రుచి చూస్తే పచ్చడి కొంచెం చేదుగా అనిపిస్తుంది.కానీ రెండు మూడు రోజులలో బాగా ఊరి అది కమ్మని రుచిగా మారుతుంది.

5.ఆవ పిండి, మెంతి పిండి కొట్టే ముందు వాటిలో మట్టి బెడ్డలున్నాయేమో చూసి ఉంటే ఏరుకోవాలి.

6.పచ్చడి పట్టడం పూర్తి అయ్యాక ఏవైనా తగ్గినట్లు అనిపిస్తే మీరు రుచికి అనుగుణంగా పదార్ధాలను అడ్జస్ట్ చేసుకోవాలి.మంచి సువాసన రావాలంటే కాసిన్ని తోలుతీసిన వెల్లుల్లి రెబ్బలను పచ్చట్లో వేస్తే సరి.

ఎంతో రుచికరమైన మరియు నోరూరించే ఈ ఆంధ్రా ఆవకాయ పచ్చడిని మీరు కూడా తయారుచేసి ఆ కమ్మని రుచిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Pandumirapakaya Pachadi Recipe in Telugu
Ulavacharu Recipe in Telugu
Cauliflower Pickle Recipe in Telugu
Andhra Chicken Fry Recipe in Telugu
Karivepaku Chicken Recipe in Telugu
Naatu kodi Pulusu in Recipe in Telugu

For the English of this Recipe Click Here.

5 from 1 vote
andhra mango pickle recipe
మామిడికాయ పచ్చడి
Prep Time
2 d
Cook Time
15 mins
Total Time
2 d 15 mins
 
Course: Side Dish
Cuisine: Andhra, Hyderabadi, Telangana
Author: బిందు
Ingredients
  • 2 ½ kg మామిడికాయ ముక్కలు
  • 500 గ్రాములు కారం
  • ¼ కప్ ఉప్పు
  • 2 tbsp పసుపు
  • 200 గ్రాములు ఆవాలు
  • 50 గ్రాములు మెంతులు
  • 300 గ్రాములు వెల్లుల్లి రెబ్బలు
  • 1 లీటరు పప్పు నూనె /పల్లీ నూనె
Instructions
మామిడికాయ ముక్కలను పచ్చడి కొరకు సిద్దం చేయుట
  1. మామిడికాయలను శుభ్రంగా కడిగి పొడి బట్టతో కొంచెం కూడా తడి లేకుండా తుడవాలి.
  2. మామిడికాయల్ని ఒక మాదిరి ముక్కలుగా కోసి, అందులో టెంకలను తీసేసి, ఆ టెంకల కింద ఉన్న సన్నని కాగితం లాంటి పొరని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
వెల్లుల్లి ముద్ద తయారు చేయుట
  1. వెల్లుల్లిపాయల నుండి రెబ్బల్ని వేరు చేసి వేళ్ళతో రుద్దుతూ అన్నింటికీ అంటేలా నూనె రాయాలి.
  2. వాటిని ఒక గంటపాటు ఎండలో పెట్టి మళ్ళీ వేళ్ళతో గట్టిగా రుద్దితే పొట్టు ఊడి వచ్చేస్తుంది.
  3. ఆ వెల్లుల్లి గబ్బాలలో ఓకే 50 గ్రాములు పక్కన ఉంచి, మిగతా వాటన్నింటిని మిక్సీలో వేసి ముద్దలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
ఆవ & మెంతి పొడి తయారీ
  1. ఆవాలలో మట్టి బెడ్డలు ఉన్నాయేమో చూసుకొని ఏరుకోవాలి.
  2. తర్వాత ఆవాల్ని సన్నని సెగ మీద చిటపటలాడడం మొదలయ్యేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. మెంతుల్ని కూడా చక్కటి వాసన వచ్చేవరకు వేయించి చల్లారేవరకు పక్కన పెట్టుకోవాలి.
  4. ఆవాల్ని, మెంతుల్ని పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
పచ్చడి తయారీ విధానం
  1. మామిడికాయలను ఒక పెద్ద వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి.
  2. పసుపు, కారం, మెంతుల పొడి, ఆవాల పొడి, వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
  3. తర్వాత సగం నూనె పోసి మళ్ళీ కలిపి, మూత పెట్టి రెండు రోజుల పాటు ఊరనివ్వాలి.మధ్య మధ్యలో కలుపుతుండాలి.
  4. రెండు రోజుల తర్వాత మిగతా సగం నూనె పోసి, మళ్ళీ ఒకసారి కలిపి
  5. జాడీలోకి మార్చుకోవాలి.

Andhra Mango Pickle Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=S_A0-k5OEiA[/embedyt]

Exit mobile version