మన దేశం లో ఈ దశాబ్ది లో ఎక్కువ ప్రాచుర్యం లోకి వచ్చిన ఆహార పదార్ధాలలో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఒకటి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంటారు. అందరు మంచిది అని చెప్తున్నారు అని వాడడం కాకుండా దాని గురించి పూర్తి అవగాహనతో, అంటే ఎలా మేలు చేస్తుంది? ఎందుకు మేలు చేస్తుంది? అని మనం తెలుసుకుని వాడడం మంచిది.
ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఆపిల్ జ్యూస్ ను కిణ్వనం లేదా ferment చేయడం ద్వారా తయారు చేస్తారు. ఆపిల్ రసానికి ఈస్ట్ ను కలపడం వలన అందులోని షుగర్స్ ఆల్కహాల్ గా మారతాయి. రెండవ సారి బాక్టీరియా తో మళ్ళీ కిణ్వనం చేయగా అది అసిటిక్ ఆసిడ్ గా మారుతుంది. ఈ అసిటిక్ ఆసిడ్ వల్ల దీనికి ఘాటైన పులుపు మరియు వగరు కలిపిన రుచి వస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఎటువంటి పోషక విలువలు ఉండవు. అంటే విటమిన్లు కానీ మినరల్స్ కానీ ఉండవు. అతి కొద్దిగా పొటాషియం ఉంటుంది. మరి ఎటువంటి పోషక విలువలు లేని ఈ ద్రావకం వల్ల మనకేంటి ఉపయోగం?
దాని ఉపయోగం ఏంటో తెలుసుకునే ముందు మన శరీరం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనిషి శరీరం లోని వివిధ భాగాలకు వివిధ రకాల pH స్థాయిలు ఉంటాయి. pH అంటే ఏమిటి? చిన్నప్పుడు మనం రసాయన శాస్త్రము లేదా కెమిస్ట్రీ లో చదువుకున్నాము. pH స్కేల్ గురించి. pH అనేది ఒక పదార్థము యొక్క ఆమ్ల/acidic మరియు క్షార/basic గుణాలను/nature తెలియచేస్తుంది. pH స్కేల్ 0 నుండి 14 వరకు ఉంటుంది. pH విలువ 7 కన్నా తక్కువ ఉంటే అది ఆమ్ల/acidic గుణము కలిగి ఉంటుంది. pH విలువ 7 కన్నా ఎక్కువ ఉంటే అది క్షార/basic గుణాన్ని కలిగి ఉంటుంది. అదే pH విలువ 7 గా ఉంటే అది తటస్థం/neutral గా ఉంటుంది. apple cider vinegar గురించి చెప్తాను అని కెమిస్ట్రీ చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా?? తప్పదు అండీ కాస్త ఓపికగా తెలుసుకోవాలి.
లాలాజలానికి, జీర్ణాశయం, చిన్న పేగులు, పెద్ద పేగులు, రక్తం ఇలా వేరు వేరు భాగాలకు వేరు వేరు స్థాయిల్లో pH ఉంటుంది. ఆ భాగాల pH స్థాయిల్లో తేడా వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకు మన జీర్ణాశయం లో ఉండే జీర్ణ రసాల pH విలువ 1.5-2.0 ల మధ్య ఉండాలి. అంటే ఆ జీర్ణ రసాలు బాగా ఆమ్ల/acidic గుణాన్ని కలిగి ఉంటాయి.దాని వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణాశయం లోకి రాగానే త్వరగా జీర్ణం అవడమే కాకుండా మన శరీరం పోషకాలను పీల్చుకుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన జీర్ణాశయం లో జీర్ణ రసాల యొక్క ఆమ్ల గుణం తగ్గిపోతుంది. దాని వల్ల అరుగుదల మందగిస్తుంది. మనం తీసుకున్న ఆహరం లోని పోషకాలను శరీరం గ్రహించడం తగ్గిస్తుంది. ఉదాహరణకు మనం తీసుకున్న ఆహారంలోని కాల్షియమ్ ను శరీరం పీల్చుకోలేకపోతే అది మన కణజాలం లోకి వెళ్లి పేరుకుపోతుంది. అప్పుడు మనకి arthritis, కళ్ళల్లో శుక్లాలు వంటి సమస్యలు వస్తాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క pH విలువ 2-3 ల మధ్య ఉంటుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగాలు
- ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ కడుపులో ఉన్న ఎంజైమ్ లను ఉత్తేజితం చేస్తుంది. దీనివల్ల జీర్ణ క్రియ ప్రక్రియలు వేగవంతం అవడమే కాకుండా మనం తీసుకున్న ప్రోటీన్ లను బ్రేక్ డౌన్ లేదా విచ్చిన్నం చేయడానికి సహకరిస్తుంది.
- చిన్న పేగులలో అవసరమైనంత ఆసిడ్స్ లేకపోతే మన శరీరానికి హాని చేసే బాక్టీరియా పెరిగి పోతుంది. మనం ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవడం ద్వారా ఆ బాక్టీరియా పెరగకుండా కాపాడుకోవచ్చు.
- మనం ఒక్కోసారి అన్ని పోషకాలు ఉన్న ఆహారం తీసుకున్నా జుట్టు రాలిపోవడం, నీరసంగా ఉండడం, గోర్ల మీద మచ్చలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దాని అర్ధం మన శరీరం మనం తీసుకునే ఆహారం నుండి పోషకాలను గ్రహించలేకపోతుంది అని అర్ధం. శరీరం పోషకాలను గ్రహించాలి అంటే జీర్ణాశయంలో ఉండే జీర్ణ రసాల pH విలువ తగినంత ఉండాలి. అంటే ఆసిడ్స్ తగిన పాళ్లల్లో ఉండాలి. అలా కాకుండా జీర్ణ రసాలు క్షార గుణాన్ని లేదా ఆల్కలీన్ తత్వాన్ని కలిగి ఉంటే మనం ఎంత మంచి ఆహరం తీసుకున్నా వృథానే. ఉదాహరణకు విటమిన్ K, విటమిన్ C, B 12 లాంటి వాటిని గ్రహించాలి అన్నా జీర్ణ రసాలలో తగినంత pH ఉండాలి. అలా ఉండాలి అంటే ACV తీసుకుంటే సరిపోతుంది.
- చాలా మందికి గ్యాస్ సమస్యతో బాధ పడుతూ ఉంటారు. కడుపుబ్బరంగా ఉండడం, వెంట వెంటనే తేన్పులు రావడం, ఉదర భాగంలో మెలిపెట్టినట్టుగా నొప్పి రావడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలకు కారణం మనం తీసుకున్న ఆహారం అరగక పోవడమే. అరగని ఆహారం పేగులలో ఉండడం వల్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. మరి ఆహారం ఎందుకు అరగలేదు అంటే ఒకటి అతి ఎక్కువగా తినేయడం వల్ల. రెండోది జీర్ణ రసాలకు మనం తీసుకున్న ఆహారాన్ని విచ్చిన్నం/బ్రేక్ డౌన్ చేసే శక్తి లేక. అంటే జీర్ణ రసాలలో తగినంత ఆసిడ్ లోకపోవడం వల్ల. అలాంటి సందర్భాలలో కూడా ACV తీసుకుంటే సమస్య తీవ్రత గణనీయంగా తగ్గుతుంది.
- చాలా మందికి acid reflux సమస్య ఉంటుంది. పుల్ల తేన్పులు రావడం అంటే ఒక్క పుల్లని ద్రవం నోట్లోకి వస్తున్నట్లు మాటి మాటికీ అనిపించడం, గుండెల్లో మంట ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన జీర్ణాశయం లో పైన ఒక వాల్వ్ ఉంటుంది అది అన్న వాహిక కు జీర్ణాశయానికి మధ్య అడ్డుగా ఉంటుంది. అసలైతే అది మూసినట్లుగా ఉండాలి.ఎప్పుడైతే తెరుచుకునే ఉంటుందో అప్పుడు కడుపులోని జీర్ణరసాలు అన్నవాహిక ద్వారా పైకి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఒక్కోసారి గుండెల్లో మంటగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం వెంటనే యాంటాసిడ్ టాబ్లెట్ లేదా ENO లాంటివి వాడుతాము దీనివల్ల తాత్కాలిక ఉపశమనమే కానీ అస్సలు ఉపయోగం ఉండదు. అలా అయినప్పుడు కొద్దిగా ఫ్రెష్ నిమ్మ రసం కానీ ACV కానీ తీసుకుంటే మెల్లిగా సమస్య తగ్గుతుంది. అసలే ఆసిడ్ అంటే మళ్ళీ ఆసిడ్ తీసుకుంటే ఇంకా సమస్య ఎక్కువవుతుంది కదా అనుకోకండి. ఆ రెండు ఆ తెరుచుకున్న వాల్వ్ మూసుకోవడానికి ఉపకరిస్తాయి. అప్పుడు ఆ సమస్య మెల్లిగా తగ్గుతుంది.
- ACV ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది. దాని వల్ల ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయాల్సిన అవసరం కూడా తక్కువ అవుతుంది. మనం మన శరీరం లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వాల్సిన అవసరాన్ని తగ్గించ గలిగితే చాలు గణనీయంగా బరువు తగ్గుతాము. లేదా శరీరం తనకు అవసరం లేని బరువును అదే వదిలించుకుంటుంది. కీటో డైట్ లో మనం చేసేది కూడా అదే ఇన్సులిన్ ను విడుదల చేయాల్సిన అవసరం లేకుండా బాగా తగ్గించడం ద్వారా బరువు తగ్గుతాము. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటో ఇంకొక పోస్ట్ లో మీకు అర్ధం అయ్యేలా రాస్తాను. అందువల్ల రోజు ACV తీసుకుంటే బరువు కూడా తగ్గుతాము.
- స్కాల్ప్ లేదా తల చర్మం యొక్క pH సరిగ్గా లేకపోవడం వల్ల అనేక జుట్టుకి సంబంధించిన సమస్యలు వస్తాయి. ACV వల్ల తల మీద ఉండే pH స్థాయిలు అదుపులోకి వచ్చి జుట్టు అందంగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. చుండ్రు వంటి సమస్యలు కూడా తాగుతాయి. మొటిమలు కూడా తగ్గుతాయి. ముఖ చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది.
- చివరిగా అది మన తెల్ల రక్త కణాలను/white blood సెల్స్ ను ఉత్తేజితం/speed up చేయడం ద్వారా మన రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాంతో పోరాడేది ఈ తెల్ల రక్త కణాలేనని మీకు తెలిసే ఉంటుంది.
ఇన్ని మంచి గుణాలు కలిగిన ఆపిల్ సైడర్ వెనిగర్ ను మనం రోజూ తీసుకోగలిగితే చాలా రకాల సమస్యల నుండి బయట పడొచ్చు. అయితే ఇది ఎప్పుడు తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవాలి. మంచి ACV ఎక్కడ దొరుకుతుంది అనేది ఇక్కడ చదవండి.
ప్రకటన : నేను పైన రాసిన ఈ వ్యాసం నిత్యం మనం వాడే ఆహారం లో ఒకటయిన ACV మరియు దాని ఉపయోగాల గురించి మీకు అవగాహన కలిగించడం కోసం మాత్రమే. ఇది వైద్యానికి సంబంధించిన సలహా మాత్రం కాదు మరియు వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా తీవ్ర సమస్య వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి తప్ప సొంత వైద్యం చేసుకోకూడదు. గమనించ గలరు.