Ariselu Sweet Telugu Recipe with step by step instructions.English Version.
అరిశెలు సంక్రాంతి పండుగకు వండుకునే ఒక సంప్రదాయ వంటకం.ఈ అరిసెలను ఎక్కువగా ఆంధ్రా మరియు తెలంగాణా లోని కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగకు తప్పక వండుతారు.ఇలా సంక్రాంతికే వండడానికి ఒక కారణం ఉంది.సంక్రాంతి అంటే తెలుగు వారికి పెద్ద పండుగ.పండిన ధాన్యం చేతికి వచ్చే సమయం.అందరి గాదెలు కొత్త ధాన్యం తో నిండి కళకళ లాడుతుంటాయి.కొత్త బియ్యం తేమగా ఉండి పచ్చిగా ఉంటుంది కాబట్టి వాటిని మామూలుగా వండుకుని తింటే కడుపులో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.ఇలా అరిసెల రూపంలో వండుకోవడం వల్ల ఆ సమస్య ఉండదని మన పూర్వీకులు ఇలా చేసుకునేవారు.
మా అమ్మమ్మ గారు ప్రతి సంక్రాంతికి అన్ని పిండి వంటలు చేసి పంపేవారు.అమ్మమ్మ గారు పోయాక అమ్మ చేసి పెట్టేవారు.అమ్మ కూడా చనిపోయినప్పటి నుండి నేను స్వీట్ షాప్ లో కొంటుంటాను.ఒక్కోసారి బాగుంటాయి.ఒక్కోసారి చాలా గట్టిగా ఉంటాయి.ఎంత గట్టిగా ఉంటాయంటే తిన్నాక నా దవడ ఎముకలు పక్కకు కదిలాయా అన్నంత.తిన్నంత సేపు నన్ను నేను లెదర్ బూటు కొరుకుతూ ఉన్న కుక్కలా ఊహించుకుంటాను :).ఇక లాభం లేదని నేనే నేర్చుకుని వండడం మొదలు పెట్టాను.
అరిశెలు చక్కగా రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
1.బియ్యాన్ని రాత్రంతా వీలయితే ఒక రోజంతా నానబెట్టాలి.
2.ఒకవేళ కుదిరితే బియ్యం పిండిని ఇంట్లో కాకుండా మిల్లులో మర పట్టించడం మంచిది.పిండి బాగా మెత్తగా నలిగి అరిశెలు కూడా మృదువుగా వస్తాయి.
3.ఎప్పుడూ అవసరమైన దాని కన్నా ఎక్కువ పిండిని ఉంచుకోవాలి.ఒకవేళ అనుకోకుండా బెల్లం పాకం ఎక్కువైతే కాస్త బియ్యం పిండి వేసి సరిచేయవచ్చు.
4.బెల్లం పాకం చేసేటప్పుడు బెల్లం తురుములో నీళ్ళు చాలా కొద్దిగా మాత్రమే పోయాలి.ఎక్కువగా పోస్తే పాకం పల్చగా అయ్యి అదంతా ఆవిరి అయ్యే వరకు కలుపుతూనే ఉండాల్సొస్తుంది.
5.అరిసెల పిండి చపాతీ పిండిలా గట్టిగా అయ్యే వరకు బెల్లం పాకం లో బియ్యం పిండి వేసి కలుపుతూనే ఉండాలి.ఒక వేళ పిండి కాస్త పలుచగా కానీ జారుగా కానీ ఉన్నా అరిశెలు విపరీతంగా నూనె పీలుస్తాయి.అంతే కాకుండా వేయించాక బాగా గట్టిగా అవుతాయి.అందుకే పిండిలో ఎక్కువ తేమ లేకుండా చూసుకోవాలి.
6.మీడియం ఫ్లేమ్ మీద ఉడికించడం వల్ల పై భాగమే కాకుండా లోపల కూడా చక్కగా ఉడుకుతుంది.
7.బెల్లం పాకం లో నెయ్యి గానీ నూనె గానీ వేసి చేస్తే, అరిసెల పిండి కలిపాక ఆ నెయ్యి పిండిని అన్ని అరిసెలను వేయించే లోపు పొడిబారకుండా కాపాడుతుంది.అంతే కాకుండా పిండి లో కలిసి ఉన్న నెయ్యి వేయించేటప్పుడు బయటి నుండి వచ్చే నూనెను పీల్చ నివ్వ కుండా చేస్తుంది.
8.చివరి చిట్కా-అరిసెలను నూనె లోకి జార విడిచే టప్పుడు, తిప్పేటప్పుడు ఇంకా వేయించాక నూనె పిండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.పొరబాటున నూనె మీద చిందే అవకాశం ఉంది.
అరిసెలను రెండు వారాల వరకు నిలవ చేసుకోవచ్చు.ఆ తర్వాత కూడా ఉంటాయి కానీ కొద్దిగా ముక్క వాసన వచ్చే అవకాశం ఉంది.అందుకే ఫ్రెష్ గా ఉన్నప్పుడే లాగించేయండి.ఒక్కసారే ఎక్కువ చేసుకోకుండా అప్పుడప్పుడు కొద్దిగా చేసుకోవడం మంచిది.ఈ రుచికరమైన అరిసెలను మీరు కూడా తయారు చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Dry Fruit Bobbatlu Recipe in Telugu
Strawberry Rava Laddu Recipe in Telugu
Dry Fruit Laddu Recipe in Telugu
Saggubiyyam Payasam Recipe in Telugu
Poornam Boorelu Recipe in Telugu
Banana Balls Recipe in Telugu
Sorakaya Halwa Recipe in Telugu
Flax Seeds Laddu Recipe in Telugu
Click here for the English Version of this Recipe.
- 600 గ్రాములు బియ్యం
- 300 గ్రాములు బెల్లం
- 40 నుండి 50 ml నీళ్ళు సుమారుగా
- ½ tsp ఏలకుల పొడి
- 1 లేదా 2 tbsp నువ్వులు
- ½ కప్పు నెయ్యి
- నూనె డీప్ ఫ్రై కి సరిపడా
-
బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి.
-
ఉదయాన్నే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి జల్లెడలో వేసి నీళ్ళు మొత్తం పూర్తిగా కారిపోయే వరకు ఉంచాలి.
-
బియ్యాన్ని కొద్ది కొద్దిగా చిన్న మిక్సీ జార్ లో వేసి బాగా మెత్తగా పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
-
ఓకే గిన్నెలో బెల్లం తరుము వేసి పొయ్యి మీద ఉంచాలి.
-
40 నుండి 50 ml నీళ్ళు పోసి బెల్లాన్ని కరిగించాలి.
-
ఇప్పుడు కరిగిన బెల్లం నీళ్ళను హై ఫ్లేమ్ మీద ఉంచి బుడగలు వచ్చే వరకు లేదా మరగడం మొదలయ్యే వరకు కాయాలి.
-
ఒక సారి మరగడం మొదలవ గానే పాకాన్ని అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి.
-
ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో పాకం వేస్తే అది కరిగి పోకుండా అలానే ఉన్నా లేదా వేళ్ళతో దగ్గరగా అన్నప్పుడు ఉండలా తయారయినా పాకం సరిగ్గా తయారయినట్లు లెక్క.
-
ఇప్పుడు స్టవ్ ను సిమ్ లోకి తిప్పి, నెయ్యి మరియు ఏలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ కట్టేసి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి.
-
పాకం తయారు చేసిన గిన్నె మీద జల్లెడ ఉంచి అందులో నుండి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ జల్లించి
-
పిండిని కలుపుతుండాలి.
-
అలా అది చపాతీ పిండిలా గట్టిగా తయారయ్యే వరకు బియ్యం పిండి వేసి కలుపుతూ ఉండాలి.
-
మీడియం సెగ మీద నూనె ని వేడి చేయాలి.
-
ఈలోపు అరిసెంత వెడల్పు ఉన్న డబ్బా మూత ఒకటి తీసుకొని దాని మీద ప్లాస్టిక్ షీట్ పెట్టి చేతి వేళ్ళకి ఇంకా ఆ ప్లాస్టిక్ షీట్ కి నెయ్యి రాయాలి.
-
చేతి నిండా అరిసెల పిండి ని తీసుకొని గుండ్రంగా చేయాలి.
-
ఇప్పుడు దానిని ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి చక్కగా గుండ్రంగా కింద ఉన్న మూత అంచుల దాకా తట్టాలి.
-
నువ్వుల అరిసెల కోసం పిండిని తట్టే ముందు ఉండలకు నువ్వులను అద్ది అప్పుడు తట్టాలి.
-
అలా తట్టిన అరిసెలను మెల్లగా నూనెలోకి జారవిడవాలి.నూనెలో వేయగానే అది మునిగి పోతుంది. కాబట్టి అది పైకి తేలే వరకు కదపకుండా ఆగాలి.
-
పైకి తేలాక ఒక నిమిషం ఆగి అప్పుడు మెల్లగా రెండో వైపుకి తిప్పాలి. రెండు వైపులా తిప్పుతూ సమంగా బంగారు రంగు లోకి మారే వరకు వేయించాలి.
-
నూనె లో నుండి బయటకి తీశాక రెండు గరిటెల మధ్యన ఉంచి నూనంతా కారిపోయే వరకు గట్టిగా నొక్కాలి.
Ariselu Sweet Telugu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=QLK-HF8YLJ0[/embedyt]
geeta says
very nice airticle and recipes
BINDU says
Thank you…
Thirumala Venkatakumar kadali says
Very good mam nice Recipie