Site icon Maatamanti

Beetroot Poori Telugu Recipe-బీట్ రూట్ పూరీ తయారీ

Beetroot Poori telugu recipe

Beetroot Poori Telugu Recipe with step by step instructions.English Version.

బీట్ రూట్ లో చాలా పోషక విలువలుంటాయి.కానీ తినాలంటేనే కొద్దిగా కష్టం అనిపిస్తుంది.అలవాటయితే పర్వాలేదు కానీ ప్రతీ దానికి వంకలు పెట్టేవారికి ఇది నోట్లోకి వెళ్లాలంటే కాస్త కష్టమే.ఇక పిల్లల సంగతి అయితే చెప్పనక్కర లేదు.పచ్చి కూరగాయ ముక్కలు తినేవారు ఏ కొద్ది మందో ఉంటారు.అలాంటి వారికి నేరుగా కాకుండా ఇలా ఏదో ఒక రుచికరమైన దాంట్లో కి తోసేసి వండి పెడితే వాళ్ళే కిమ్మనకుండా తింటారు.

నేనైతే వారంలో ఒక రోజు బీట్ రూట్ పులావ్ ఇంకో రోజు బీట్ రూట్ ఫ్రై ఖచ్చితంగా చేస్తాను.రెండూ సూపర్ టేస్టీ గా ఉంటాయి.అయితే బీట్ రూట్ పూరీని మాత్రం అప్పుడప్పుడు మాత్రమే చేస్తుంటాను.పూరీ అయితే నూనె లో డీప్ ఫ్రై చేయాలి కదా పోషక విలువలు పోతాయేమోనని ఎక్కువ గా చేయను.వేయించడం కన్నా ఉడికించడం మేలు కదా.మన నోటి దాకా వచ్ఛే సరికి కనీసం కొన్ని పోషక విలువలన్నా మిగిలి ఉంటాయి.

ఇక ఈ రెసిపీ విషయానికొస్తే పిండి జాగ్రత్తగా కలుపుకోవాలి.బీట్ రూట్ జ్యూస్ ఏమాత్రం ఎక్కువైనా పిండి జారుగా ఉండి పూరీలు వత్థడం కష్టమవుతుంది.అందుకే జ్యూస్ కొద్దీ కొద్దిగా పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి.పిండిని గట్టిగా కలపకపోతే ఎక్కువ నూనె పీల్చడమే కాకుండా పొంగవు.పైగా గట్టిగా బిస్కెట్లలా తయారవుతాయి.నూనె బాగా వేడెక్కాక మాత్రమే పూరీలను నూనెలో జార విడవాలి.పూరీ పైకి తేలగానే అట్లకాడ తో మెల్లగా నొక్కుతూ ఉండాలీ.ఇలా చేయడం వల్ల పూరీ బాగా పొంగుతుంది.వేడి వేడి పూరీలతో పూరీ కూర వేసి వడ్డిస్తే చాలా బాగుంటుంది.పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.ఈ టేస్టీ రెసిపీ ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Andhra Hotel Style Poori Curry Recipe in Telugu
Palli Chutney Recipe in Telugu
Palli Karam Dosa Recipe in Telugu
Instant Rava Vada Recipe in Telugu
Pesara Molakalto Pesarattu Recipe in Telugu
Ulli Karam Dosa Recipe in Telugu

Click here for the English Version of this Recipe

YOUTUBE  లో మా తెలుగు రెసిపీ వీడియోస్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Beetroot Poori Telugu Recipe
Prep Time
40 mins
Cook Time
20 mins
Total Time
1 hr
 
Course: Breakfast
Cuisine: Andhra, Hyderabadi, Indian
Author: బిందు
Ingredients
జ్యూస్ కొరకు
  • 250 నుండి 300 గ్రాములు బీట్ రూట్ ముక్కలు
  • 300 నుండి 350 ml నీళ్ళు
పిండి కొరకు
  • 1 ½ లేదా 2 కప్పులు గోధుమ పిండి
  • ఉప్పు తగినంత
  • 3 నుండి 4 tbsp నూనె
  • ¼ కప్పు కొత్తిమీర
పూరీ కొరకు
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా
Instructions
బీట్ రూట్ జ్యూస్ తయారు చేయుట
  1. చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న బీట్ రూట్ ను మిక్సీలో వేసి నీళ్ళు పోసి జ్యూస్ వచ్చే వరకు తిప్పాలి.
  2. తర్వాత రసాన్ని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
పూరీ పిండి తయారు చేయుట
  1. ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి తీసుకోవాలి.
  2. అందులో ఉప్పు, నూనె, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.
  3. తర్వాత కొద్ది కొద్దిగా బీట్ రూట్ రసాన్ని పోస్తూ పిండిని గట్టిగా కలపాలి.
  4. కలిపిన పిండికి కొద్దిగా నూనె రాసి కవర్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టాలి.
పూరీలు ఒత్తుట
  1. నానబెట్టిన పూరీ పిండిని సమాన భాగాలుగా విభజించుకోవాలి.
  2. వాటిని గుండ్రని ఉండలుగా చేసి తర్వాత గారెల షేప్ లో ఒత్తాలి.
  3. అప్పడాల కర్రతో పూరీలను వత్తాలి.కనీసం 2 నుండి 3 మిల్లీమీటర్ల మందం ఉండేలా చూసుకోవాలి.
పూరీలను వేయించుట
  1. ఒక కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
  2. నూనె వేడెక్కాక పూరీలను ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా నునెలోకి జారవిడవాలి.
  3. పూరీ పైకి తేలే వరకు ఆగి తర్వాత మెల్లిగా అట్లకాడ తో నొక్కుతుండాలి.
  4. ఇలా చేయడం వల్ల పూరీ చక్కగా పొంగుతుంది.
  5. ఇలా అన్ని పూరీలు వేశాక వేడి వేడి గా పూరీ కూరతో కలిపి వడ్డించాలి.

Beetroot Poori Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=CSKSK7oJARc[/embedyt]

 

Exit mobile version