Site icon Maatamanti

స్వార్ధం మంచిదా? చెడ్డదా?ముందు మనం బాగుండాలి అనుకోవడం స్వార్ధమా?

స్వార్ధం

అందరికీ నమస్కారము. నేను మొన్న ఒక వీడియో లో నేను కొత్తగా కొనుక్కుని చదువుతున్న పుస్తకాల గురించి చెప్పాను. అందులో అయాన్ రాండ్ రాసిన “The Fountain Head” అనే పుస్తకం చదువుతున్నాను అని చెప్పాను. అందులో రామ్ గోపాల్ వర్మ గారు రాసిన ముందు మాటలో రెండు పేరాలు చదివి వినిపించాను. అవి నాకు నచ్చాయి అని చెప్పాను. అందులో ఒక పేరా ” ప్రతి ఫిలాసఫీ ఇతరుల కోసం బతకాలి అని అరచి గీ పెడుతుంటే, అయాన్ రాండ్ ఒక్కతే నీ కోసం, నీ స్వార్ధం కోసం బ్రతుకు అని చెప్పింది. నీ స్వార్ధంతో, నీ లాభం కోసం నువ్వు కోసం పనిచేసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్ గా ఇతరులు కూడా లాభ పడతారు. అంతే కానీ కేవలం ఇతరుల కోసం బతికితే నీ బ్రతుకు వల్లకాడైపోతుంది. అది నీకు, ఆ ఇతరులకు కూడా ప్రయోజనం ఉండదు” అని చెప్పింది అని వర్మ గారు రాశారు.

ఇప్పుడు ఆ పేరా నాకు నచ్చిందీ  నన్ను ఆకట్టుకుందీ  అంటే నేను  నా జీవితాన్ని ఆ పంక్తికి అన్వయించుకుని చూసినట్లే కదా అర్ధం. అంటే స్వార్ధంతో ఉండడం తప్పు కాదు అని నేను భావిస్తున్నట్లే కదా అర్ధం. స్వార్ధం తో ఉండేవారిని చెడ్డవారిగా చూస్తుంది ఈ లోకం.అంటే నేను కూడా చెడ్డదాన్నే కదా. ఈ స్వార్ధం మంచిదా? చెడ్డదా?మనం బాగుండాలి అనుకోవడం స్వార్ధమా?

ఈ విషయమై నేను ఆ పుస్తకం మొత్తం చదివాక మాట్లాడాలి అనుకున్నాను.ఇప్పటికి 75 పేజీలు మాత్రమే చదివాను. ఒకరు నాకు ఇంస్టాగ్రామ్ లో ఒక కామెంట్ పెట్టారు. అది చదివాక స్వార్ధం గురించి అయాన్ రాండ్, రామ్ గోపాల్ వర్మ గార్లు ఏమి ఆలోచిస్తున్నారు అని తెలుసుకుని ఆ తర్వాత  చెప్తే నేను చెప్పేది వాళ్ళ perspective లో ఉంటుంది. అందుకే అది పూర్తిగా చదవక ముందే స్వార్ధం అనే మాటకు నా perspective ఏంటి అనేది మీతో చెప్పాలి అనుకున్నాను. నేను రాసింది చదివిన తర్వాత నా perspective ప్రభావం మీ మీద ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను. జీవితంలో రకరకాల మనుషుల్ని వారి స్వభావాల్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొంతమందిని చూస్తే ఎలా ఉండాలో తెలుస్తుంది. కొంతమందిని చూస్తే ఎలా ఉండకూడదో తెలుస్తుంది. చెడ్డ వారు అని పిలవబడే వారు కూడా చెడ్డ వారు కాదు అండీ. మనం మంచివారమైతే పాజిటివ్ గా ఆలోచించాలి. పాజిటివ్ గా ఆలోచించడం మన స్వభావం అయితే “చెడ్డవారు అని పిలవబడేవారు వాళ్లకు తెలీకుండానే మనకు ఎలా ఉండకూడదో తెలియచేసి సహాయపడుతుంటారు” అని తెలుసుకుని జీవితంలో ఎలా ఉండకూడదో చెప్పినందుకు వారికి కృతజ్ఞతలు మనసులోనే తెలియచేసుకుంటాము.

నన్ను ఒక ఉదాహరణగా వివరిస్తూ నా స్వార్ధం మంచిదో చెడ్డదో చూద్దాం.  నా జీవితం నాకు చాలా చాలా చెప్పింది. ఎన్నో నేర్పింది. ఓడిపోవడం నేర్పింది. పోరాడడం నేర్పింది. గెలవడం నేర్పింది, సహనం నేర్పింది. మంచిగా ఆలోచించడం నేర్పింది. ప్రేమించడం నేర్పింది. సహాయ పడడం నేర్పింది, గౌరవించడం నేర్పింది, అర్ధం చేసుకోవడం నేర్పింది. అందుకే నా జీవితానికి నేను ఇచ్చిన మర్యాదని  ఏ పురాణానికి, ఇతిహాసానికి ఇవ్వలేను. ఒకవేళ ముందు అవి చదివాక నా జీవితం గడిచి ఉంటే ఆ గౌరవం బహుశా వాటికే ఇచ్చేదాన్నేమో!

‘వాస్తవానికి(factకి )’ ఎప్పుడూ ‘ఒకే స్వరూపం’ ఉంటుంది. కానీ మనిషి చూసే దృక్కోణం(Perspective) వేరుగా ఉండడం వల్ల వాస్తవ స్వరూపం మారిపోతుంది. ఎవరు ఏది ఆలోచిస్తే అదే వారికి వాస్తవంలా అనిపిస్తుంది.

అయాన్ రాండ్ పుస్తకం చూసి వర్మ గారు దాన్ని ఆయన ఎలా తీసుకున్నారో అది ఆయన ఆలోచించే విధానం లేదా దృక్కోణం మీద ఆధారపడి ఉంటుంది. అదే పుస్తకాన్ని నేను చదివాక నేను ఎలా తీసుకుంటాను అర్ధం చేసుకుంటాను అనేది నా ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుంది.  అందరూ ఒకేలా ఆలోచిస్తే అసలీ లోకంలో ఇన్ని బాధలుండవు కదా.

ఇక స్వార్ధం గురించి ఆ వీడియో లో నేనన్న మాటలకు నా వివరణ. 21 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్న మేము హైదరాబాద్ కు వచ్చాము. నా పెళ్లి వెనుక పెద్ద ప్రేమ కథ అంటూ ఏమి లేదు. సింపుల్ గా చెప్పాలి అంటే ఆ టైమ్ లో మాకు తెలిసిన కుటుంబాల్లో అప్పుడు  పెళ్లీడు వచ్చిన వారు ఉన్నారు. వారికి అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అదేంటో విచిత్రంగా దాదాపు అందరి పెళ్ళిళ్ళూ పెటాకులు అయ్యాయి. అంత ఖర్చు లు పెట్టి అమెరికా సంబంధాలు అనీ అదనీ ఇదనీ చేస్తే ఆ తల్లిదండ్రులకు చివరకు దుఃఖమే మిగిలింది. ఎందుకో అది చూసి నాకు బాగా భయం కలిగింది . ఎవరో తెలియని వ్యక్తిని చేసుకోవడానికి భయపడ్డాను. తెలిసిన వ్యక్తిని చేసుకుంటే జీవితం బాగుంటుంది అని చేసుకున్నాము అంతే.

కేవలం డిగ్రీ చదువు. అప్పట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంతగా లేవు. ఏమి చేయాలో తెలీదు. పెద్దల అభీష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకున్న కారణాన ఎవరి సహాయ సహకారాలు మాకు అందలేదు. అందుకు వారిని మేము అస్సలు నిందించలేము. అలాంటి ఆలోచనే లేదు. మన కర్మలకు మనము మాత్రమే బాధ్యులము అని నేను, నా భర్త నమ్ముతాము. ఎండకి ఎండాము, వానకి తడిచాము(నేను గర్భవతిగా ఉన్నప్పుడు నెలలు నిండాక ఒక రోజు హాస్పిటల్ కి వెళ్తుంటే దారి మధ్యలో రోడ్ మీద బండి ఆగిపోతే అక్కడ నిల్చోడానికి షెల్టర్ కూడా లేని ప్లేస్ లో ఉన్నప్పుడు చాలా పెద్ద వర్షం. బండి ని ఎలా అయినా స్టార్ట్ చేయాలి అని అటూ ఇటూ పిచ్చి వాడిలా బండిని నెడుతూ పరిగెడుతున్నారు నా భర్త. ఒక పక్క నేను తడిచి పోతున్నాను అని నా భర్త, ఇంకోపక్క తను అలా బండిని పట్టుకు అటు ఇటూ పరిగెడుతుంటే నేను, ఇద్దరం కంటికి ధారగా ఏడుస్తున్నాము . కానీ వర్షం తో కలిసిన కన్నీళ్లకు ఉనికి ఉండదు కదా. ఇది రాస్తుంటే ఇప్పుడు కూడా నా కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి.)

కొన్ని కారణాల లేదా మా అమాయకత్వం వల్ల ఉన్న కొంచెము అకస్మాత్తుగా పోగుట్టుకున్నాము. గాజులు లేవు, మంగళ సూత్రం లేదు.  కనీసం రెండు పూటలా కూర అన్నం తినడానికి కూడా లేక కొన్ని నెలల తరబడి పచ్చడి మెతుకులు తిన్నాము.

నా  బిడ్డ కు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు విపరీతంగా జ్వరం వచ్చింది. 106 డిగ్రీలు. హాస్పిటల్ ఫీజు 30 రూపాయలు. అవి కూడా ఆ రోజున లేవు. బిడ్డ ఒంటి మీద బట్టలు తీసేసి చల్లగా ఉన్న గచ్చు మీద పడుకో బెట్టి తడి బట్ట పెట్టాను. బిడ్డ శరీరం కింద ఉన్న గచ్చు, మీద కప్పిన తువ్వాలు వేడిగా మారుతున్నాయి కానీ తన ఒళ్ళు చల్ల బడడం లేదు. తల్లిగా నా బాధ చెప్పనలవి కానిది. ఆ రోజున చెప్పుకోవడానికి కూడా నాకు ఎవ్వరూ లేరు.

దేవుడా ఇక నీదే భారం. నీకు ఏది చేయాలి అనిపిస్తే అది చేయి అని అనుకున్నాను. మా మీద అత్యంత అభిమానం తో అప్పటికే 6 నెలల నుండి జీతం తీసుకోకుండా మా ఇంట్లో పనిచేస్తుంది మస్తానమ్మ(తనకు మొదటి నుండి మా గురించి తెలుసు. మస్తానమ్మ పెద్ద కూతురు సైదా వయసు 15 ఏళ్ళు. మరగుజ్జు పైగా గూని కూడా ఉండడం వల్ల ఆ పాపని అందరూ బడిలో గేలి చేసేవారు. ఆత్మ నూన్యతా భావంతో స్కూల్ కి వెళ్లడం మానేసింది అనీ, ఎవరితోనూ మాట్లాడదనీ చెప్పింది మస్తానమ్మ. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. పాపం మనసు ఎంత కష్ట పెట్టుకుని ఉంటుంది కదా అని నేను రోజూ నా దగ్గరకు పంపమని చెప్పాను. అలా రోజూ మా ఇంటికి వచ్చేది. చదువు చెప్పేదాన్ని. “నీకున్న శారీరక వైకల్యం ఒక వైకల్యం కాదు. నిన్ను గేలి చేసిన వారికీ, వారిని అలా పెంచిన వారికీ మానసిక వైకల్యం. దాన్ని మాత్రమే వైకల్యం అంటారు” అని చెప్పేదాన్ని. తన బిడ్డను చూసుకుంటున్నాను అన్న అభిమానం మస్తానమ్మకు ఉండేది ). మస్తానమ్మ సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చింది. నేను అప్పటికి ఏడవడం కూడా మానేసి అలా శూన్యం లోకి చూస్తూ కూర్చున్నాను. నన్ను భయపడవద్దు అని చెప్పి దిష్టి తీసింది. నేను అలాంటివి నమ్మను. చేతిలో డబ్బు లేనప్పుడు నమ్మకాలను నమ్మే ఓపిక ఉండదు. అందుకే “వద్దు” అనలేదు. చిత్రంగా కాసేపటికే పాప జ్వరం తగ్గు ముఖం పట్టింది.

మేము పడిన కష్టాల్లో ఇవి కేవలం మచ్చు తునకలు మాత్రమే. చిన్నప్పటి నుండి ఇద్దరం రిచ్ గా, అతి గారాబంగా పెరిగి అప్పుడు అష్టకష్టాలు పడుతున్న సమయంలో మెల్లిగా కొందరు బంధువుల తాకిడి మొదలైంది. రేపు ఎలా గడుస్తుందో తేలీక తెల్లవారుతుంది అంటేనే భయపడుతున్న సమయంలో ఒక బంధువు ఇంటికి వస్తే అసలు వాళ్లకి ఎలా మర్యాదలు చేయాలి? ఏమి పెట్టాలి? ఎక్కడి నుండి తెచ్చి పెట్టాలి? మాకు అప్పు ఎవరు ఇస్తారు? అసలక్కడ మాకెవరు తెలుసు? నా బిడ్డకు ఆరోగ్యకరమైన తిండి కూడా పెట్టే స్థితిలో లేని నేను బంధువులకు పంచభక్ష్య పరమాన్నాలు ఎక్కడ నుండి తేను?(కొన్ని భక్తి సినిమాల్లో కన్నబిడ్డ తలకాయ నూరి పచ్చడి చేసి మరీ పెట్టడం చూశాను. అలా నేను చేయలేను కదా)

బతుకుతో పోరాడలేక బతకాలా, చావాలా అని ఆలోచించే దశ లో ఉన్న మేము , 23 ఏళ్ల వయసులో ఉన్న మేము నిజంగా ఆ హింసని భరించగలమా ? అసలు మేమెలా బ్రతకాలి? మంచి ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలి? సరిగ్గా చూసుకోలేనప్పుడు అసలు పిల్లల్ని కననే కూడదు. కంటే గాలికి వదలనే కూడదు. వదిలి దేశానికీ, భూమికి భారమయ్యేలా చేయకూడదు. ఒక మంచి పౌరురాలిగా తీర్చి దిద్దాలి. అంటే మంచి చదువు, సంస్కారం, జ్ఞానం ఇవ్వాలి. అవి ఇవ్వాలి అంటే ముందు మేము మా జీవితాన్ని అర్ధం చేసుకోవాలి. బాగా చదువుకోవాలి. జ్ఞానం సంపాదించుకోవాలి. ఇలాంటివి ఆలోచించుకోవాల్సిన సమయంలో మాకు ఈ చెత్త TV సీరియల్ గొడవలేంటి?

మాకు ఫోన్ చేసి ఒక్కసారి కూడా మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నెక్స్ట్ ఏమి చేయబోతున్నారు? ఇది చేస్తే బాగుంటుంది? అది చదువుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది? అసలు టెన్షన్ పడకండి ఇలాంటి మాటలతో ధైర్యం చెప్పాల్సిన వారు.వాళ్ళకేమి చేశావు? వీళ్ళకేమి చేశావు? అని మాటలతో హింసిస్తుంటే మా ఇద్దరి హృదయాలు ఎంత గాయపడి ఉంటాయి? ఎంత నరకం అనుభవించి ఉంటాము?

ఇది చాలదన్నట్టు మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చూశాము చూశాము చూశాము. ఒక రోజు మా ఇద్దరికీ ఒకే ఆలోచన వచ్చింది. “అసలు మనం ఎవరి గురించి గొడవ పడుతున్నాము? దేని గురించి గొడవ పడుతున్నాము? గొడవలు ఎందుకు వస్తున్నాయి? నీ ప్రవర్తన వల్ల నాకు ఇబ్బంది లేదు. నా ప్రవర్తన వల్ల నీకు ఇబ్బంది లేదు. మరీ గొడవలు ఎక్కడ నుండి వస్తున్నాయి? కారణం మూడో వ్యక్తి అని గ్రహించగానే ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా we just need to delete everybody from our life అనుకున్నాము. మమ్మల్ని జీవితంలో ఎదగ నివ్వకపోగా అడుగడుగునా మా జీవితానికి అడ్డు వచ్చి అతః పాతాళానికి తొక్కేస్తున్న ప్రతి ఒక్కరినీ నిర్మొహమాటంగా మా జీవితాల్లో నుండి తీసేయాల్సి వచ్చింది .  ఇది అస్సలు ఏమాత్రం అంత తేలిక కాదు. ఇలా చేయాలి అంటే ధైర్యమైనా ఉండాలి లేదా పిచ్చయినా ఉండాలి. మాకు రెండూ ఉన్నాయి. దాన్నే పిచ్చి ధైర్యం అంటారు. ఒకసారి వారిని కాదు అనుకుంటే మాకు భవిష్యత్తులో ఎటువంటి ఆర్ధిక సహాయం ఉండదు అని మాకు తెలుసు. ఆ కోపం లో వారు మాకు ఏది ఇవ్వరు అని కూడా తెలుసు. కానీ మాకు కావాల్సింది డబ్బు కాదు. కేవలం ‘మనశాంతి’ మాత్రమే.

అప్పుడు మొదలైంది మా అసలు జీవితం. తను బిస్కెస్ట్స్ పైన అచ్చులు ముద్రిస్తారు కదా! ఆ అచ్చులు తయారు చేసే కంపెనీ లో అకౌంట్స్ చూసుకునే వారు. నన్ను .NET, Oracle  కంప్యూటర్ కోర్స్ లో చేర్చారు నా భర్త. రోజూ ఆటో లేదా బస్సు అంటే డబ్బులు అయిపోతాయి అని తనే నన్ను దింపి రెండు గంటల సేపు నా క్లాస్ అయిపోయే వరకు అక్కడ వేచి ఉండి నన్ను ఇంట్లో దింపి తర్వాత తను కంపెనీ కి వెళ్లేవారు.(ఆ వేచి ఉన్న సమయంలో నా భర్త అక్కడ రోడ్ మీద తిరుగుతున్న రకరకాల వ్యక్తుల్ని గమనించేవారు. రోడ్ మీద డిక్షనరీలు అమ్ముకునే అబ్బాయి నుండి ఆటో డ్రైవర్ల దాకా అందరితో మాట్లాడేవారు. వారి జీవితాల్లోని కష్టాలు తెలుసుకున్నారు. చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో ఉన్నాయి. మా జీవితంలో ప్రతి రోజూ మాకొక పాఠమే) ఆ కంపెనీ యజమాని మార్వాడి ఆయన. ఒక ఉద్యోగి అనేవాడు యజమాని చెప్పిన పని చేయడమే కాకుండా యజమాని ఖర్చు తగ్గించ గలగాలి. నా భర్తకి పొదుపు బాగా అలవాటు. ఆ లక్షణమే ఆ యజమానిని ఆకర్షింప చేసింది. ఆయన నా భర్త చదువుకోవడానికి అడ్వాన్సుగా కొంత డబ్బు ఇచ్చారు. అప్పుడు తను software కోర్స్ లో చేరి నేర్చుకున్నారు. కొన్ని నెలల పాటు ఇంటికి కూడా రాకుండా ఇన్స్టిట్యూట్ లో స్నేహితులతో పాటు కష్టపడి బాగా శ్రద్ధగా నేర్చుకున్నారు. అదే ఇన్స్టిట్యూట్ కి ముంబై నుండి Citi Bank కంపెనీ వారు interviews పెట్టినప్పుడు అందులో నా భర్త సెలెక్ట్ అయ్యారు. జీవితంలో మొదటి సారి భయం లేని ఉద్యోగం. కానీ  నన్నూ, పాపనీ వదిలి వెళ్ళిపోవాలి. నేను “వద్దు” అన్నాను. తను ఒకటే అన్నారు ” రేపు నా బిడ్డ పెద్దగా అయ్యాక తన స్కూల్ అప్లికేషన్ లో తండ్రి occupation కాలమ్ వచ్చినప్పుడు తన చేయి ఒక్క సెకను అయినా ఆగకుండా ఉండాలి అంటే ఇది తప్పదు. నువ్వు నన్ను వెళ్లనివ్వాలి” అన్నారు. “సరే” అన్నాను.

తను అక్కడకు వెళ్ళాక మళ్ళీ వచ్చి నన్ను P.G లో జాయిన్ చేశారు. Msc Information Technology చదువుకున్నాను. ఆ తర్వాత గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఏమేమో చదువుకున్నాను. చదువుకుంటూనే ఉన్నాను. నా జీవితాంతం చదువుకుంటాను. ఇది మాత్రమే మా స్వార్ధం. ఈ స్వార్ధం మంచిదా? చెడ్డదా ?

నేను చదువుకుంటుంటే కొందరు “నీ చదువు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదు” అన్నారు. “పెద్ద నువ్వొక్కదానివే చదువుకుంటున్నట్టు లోకంలో” అన్నారు. “మీరు స్వార్ధ పరులు అన్నారు” నన్ను నా భర్తని. మేము అసలు పట్టించు కోలేదు, బాధపడలేదు. అసలు వాళ్ళ గురించే ఆలోచించడం మానేశాము. ఎప్పుడూ ఎవరి గురించి నెగటివ్ గా  కూడా ఆలోచించలేదు. వాళ్ళు అలా ప్రవర్తించడానికి వాళ్ళు పెరిగిన వాతావరణం కారణం అయి ఉండొచ్చు అని విశ్లేషించుకున్నాము. ఎవరి మీద మాకు కోపం, ద్వేషం అస్సలు ఉండదు.  మేమంటే మాకు ఇష్టం అంతే. నేను చదువుకుంటాను అని అడిగిన ప్రతిసారీ నా భర్త ఎందుకు అని కానీ, అది చదువుకుంటే తర్వాత ఎంత సంపాదించవచ్చు ? ఇలాంటి లెక్కలు ఎన్నడూ వేసుకోకుండా నేను అడిగిన ప్రతిదీ చదివించారు. నాకు తెలీకుండానే తను నా భర్త స్థానం లో నుండి తండ్రి స్థానంలోకి ఎప్పుడో  వెళ్ళిపోయారు.

ఒక భర్త అనేవాడు తన పూర్తి ప్రేమను, సమయాన్ని, సహకారాన్ని భార్యకు అందించడం వల్ల ఆ ఇల్లాలు తృప్తి చెందుతుంది. అప్పుడు తన మనసు పరిపూర్ణంగా ఉంటుంది. స్వచ్చముగా పాలలా ఉంటుంది. భర్త ప్రేమని పూర్తిగా పొందిన ఒక స్త్రీ, భర్త తరపు వారిని, తన తరపు వారిని తన మన బేధాలు లేకుండా చూడగలుగుతుంది. అలాంటి ఒక స్త్రీ పెంచిన బిడ్డలు పద్దతిగా, చక్కని సంస్కారంతో పెరిగి పెద్దవారవుతారు. వారిలో ప్రేమ భావం ఏర్పడుతుంది , సేవా తత్పరత సహజంగా అబ్బుతుంది.

ఒక భార్య తన పూర్తి ప్రేమను, సమయాన్ని, సహకారాన్ని భర్తకు అందిచడం, భర్త మాటకు గౌరవం, విలువ నివ్వడం వల్ల ఆ భర్త బయట తను ఉద్యోగం లో స్నేహితులతో చక్కగా స్వార్ధం లేకుండా ఉండ గలుగుతాడు. తప్పటడుగులు వేయకుండా గృహస్తు ధర్మానికి కట్టుబడి ఉంటాడు. తన మనసు, ఇల్లు నిండుగా అందంగా ఉంది కాబట్టి ఇతరులు కూడా అలా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. తనకు చేతనైనంత ఇతరులకు సహాయం చేస్తాడు. అది చూసి తన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.

ఇలా ఉంటే మమ్మల్ని కొందరు “స్వార్ధ పరులు అన్నారు. మీరు-మీరు బాగుంటే సరిపోతుందా? ఎవరూ అక్కర్లేదా” అన్నారు. మంచిగా ఉండి, మంచిగా అలోచించి, ఒకలాంటి positive aura తో ఉండే ప్రతి ఒక్కరూ మా జీవితంలోకి ఎల్లప్పుడూ ఆహ్వానితులే. అలా కాకుండా మనసంతా చెత్త, కుళ్ళు నింపుకున్న వారొచ్చి మా జీవితంలో చొరబడాలి అని ప్రయత్నిస్తే మేము స్వార్ధ పరులమే అని అనిపించుకోవడానికి ఏమాత్రం బాధ పడము.

మేము మాకు నచ్చినట్లు ఉన్నాము కాబట్టి ఇవాళ జీవితం లో పైకి ఎదిగాము. చక్కని లోక జ్ఞానాన్ని నేర్చుకున్నాము. చేసే ప్రతి పనిలో పర్ఫెక్ట్ గా ఉండడం నేర్చుకున్నాము. ఒక 100 మందికి అయినా తిండి పెట్టే స్థితిలో ఉన్నాము.పెడుతున్నాము. చక్కగా వ్యవసాయం చేస్తూ ఓ పది మందికి  ఉపాధి కల్పించగలుగుతున్నాము. నేను కనీసం ఒక్కసారి కూడా చెప్పలేదు నా కూతురుకి ” అమ్మా ఎవరైనా పెద్దవారు, ముసలి వారు కనిపిస్తే చాలా బాగా చూసుకోవాలి” అని. తనకు అస్సలు తెలీని పెద్ద వయసు వారు కనిపించినా నా కూతురు వాళ్ల దగ్గరకు ఉన్న ఫళంగా ఆసరాగా వెళ్ళిపోతుంది. వాళ్లని ముద్దు చేస్తుంది. కావాలనే కొంచెం చిలిపిగా, కొంచెం పెంకిగా మాట్లాడి విసిగిస్తుంది. ఆ కాస్త సమయంలో అన్నా వారు వాళ్ళ మనసులో ఏ మూలనో ఉన్న బాధని పక్కన పెట్టేస్తారు. తామూ చిన్న పిల్లలమే అన్నట్లు పోట్లాడతారు. తనకు జుట్టు పెంచుకోవడం అస్సలు ఏమాత్రం ఇష్టం లేకపోయినా కాన్సర్ పేషెంట్స్ కోసం జుట్టు జాగ్రతగా పెంచుకుని మరీ ఇచ్చింది. ఇది చాలా చిన్న విషయమే కావొచ్చు. కానీ నా కూతురుకి అలాంటి ఆలోచన వచ్చినందుకు చాలా చాలా సంతోషం కలిగింది.

ఇదంతా నేను ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను. నాకు ఇష్టం కూడా లేదు. కానీ ఒక్కోసారి మనం కొన్ని విన్నప్పుడు చూసినప్పుడు అనుకోకుండా మనం ఆలోచించే తీరులో అద్భుతమైన మార్పు సహజంగా దాని అంతట అదే కలుగుతుంది. ఏమో ఇలా చెప్తే ఒక్కరు తమ ఆలోచించే తీరుని లేదా దృఖ్పథాన్ని అనలైజ్ చేసుకుంటారు కదా. it might bring a huge change in thier lives కదా అనిపించింది. నా మాటలు ఒక ఉత్ప్రేరకంలా అదే అండీ catalyst లా పనిచేయొచ్చేమో అని నా భావన.

అప్పుడు మేము ‘స్వార్ధంతో’ ముందు మా కోసం మేము బతకాలి అనుకున్నాము కాబట్టే ఇవాళ మా కూతురికి ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వగలిగాము. ఇప్పుడు చెప్పండి స్వార్ధం మంచిదా? కాదా? మా స్వార్ధానికి అర్ధం ఇది. ముందు మనం బాగుండాలి. అప్పుడే ఇంకొకరికి ఏదైనా చేయగలుగుతాము. ” అసలే రోగి మళ్ళీ ఇంకో రోగికి తాను సేవ చేయగలడా?”. ముందు తాను ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంకొకరికి సేవ చేయగలిగేది. అలాగే ముందు మనం, మన కుటుంబం బాగుండాలి. మనం బాగుంటే తప్పకుండా మన చుట్టూ ఉండే వారు కూడా బాగుంటారు.

పురాణ పుస్తకాలూ, కొన్ని తత్వాలు చదివిన వారు స్వార్ధంతో ఉండాలి అనే మాటను సమర్ధించలేకపోవచ్చు. దానికి కారణం వారు దాన్ని అర్ధం చేసుకున్న విధానం. పర్లేదు ఎవరు దేన్నీ ఎలా అర్ధం చేసుకున్నా ఎవరికీ హాని కలుగ చేయకుండా వారి జీవితం వారు జీవిస్తే మంచిగా ఉంటుంది. కానీ ప్రతీ మనిషికి ఒకటి మాత్రం చాలా చాలా ముఖ్యం సానుకూల దృఖ్పథం అదే అండీ positive thinking  చాలా ముఖ్యం. అది భగవద్గీత, రామాయణ, మహాభారతాలు ఇంకేదైనా గ్రంధాలు చదివితే వచ్చేది కాదు. లౌకిక జీవనములో సాధన, అభ్యాసం తో నేర్చుకోవాల్సింది.

ఉదాహరణకు నాకు రాసిన కామెంట్స్ లో ఒకరిద్దరు రామ్ గోపాల్ వర్మ ఒక pervert అని sick అని రాశారు. వారిని negative thinking ఉన్నవారు అని నేను అనలేను. పోనీ పాజిటివ్ గా ఆలోచించలేని వారు అంటాను… అలాంటివారు అతని గురించి అలా ఆలోచిస్తారు. పాజిటివ్ thinking సాధన చేస్తున్నాను అని చెప్పుకుంటున్న నేను ఇలా ఆలోచించడానికి ప్రయత్నిస్తాను   ” అసలు ముందు అతని గురించి నేను ఆలోచించను. ఏదైనా విన్నా చూసినా నాకు, నా పక్కనున్న వారికి అపకారం కలగనంత వరకు విని వదిలేస్తాను కానీ దాని గురించి కొంత టైమ్ తీసుకుని పని గట్టుకుని అతను చెడ్డవాడు, ఇతను మంచివాడు అని నా అభిప్రాయాన్ని ఇంకొకరి మీద రుద్దే ప్రయత్నం చేయను. వర్మ ఎలాంటివాడైతే నాకు ఎందుకు? అసలు నా జీవితం తో అతనికెటువంటి సంబంధం లేదు కదా. అలాంటివారి గురించి నేనెందుకు ఆలోచించాలి అనుకుంటాను. ఒకవేళ  తప్పక ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే ” తను మంచో చెడ్డో మనకెందుకు తను ఒక సినిమా తీస్తే కనీసం ఒక వెయ్యి మందికి ఉపాధి దొరుకుతుంది కదా. చెడ్డ అని మనం తిట్టుకుంటున్న వ్యక్తి తనకు తెలీకుండానే ఒక 1000 మందికి జీవనాధారం అయ్యాడు కదా. నేను అతనంత చేయలేకపోయాను కదా. కాబట్టి అతనిని తప్పు బట్టే అర్హత మనకు లేదు అనుకుంటాను.

ఆధ్యాత్మికత, తత్త్వం ఈ రెండు మన జీవితంలో లేకపోయినా పర్లేదు. ఆధ్యాత్మికత, తత్త్వ బోధ అర్ధం చేసుకుని సానుకూల దృఖ్పథంతో ముందుకు వెళ్ళాలి అనుకునే వారికి లోకంలో ఎటు చూసినా మంచి మాత్రమే కనిపిస్తుంది. వారి కంటికి కనిపించిన ప్రతీ చిన్న విషయంలో మంచిని మాత్రమే వెతుక్కునే ప్రయత్నం చేస్తారు హంసలాగా. ఒక వేళ చెడు కనిపించినా కాకిలా దాని జోలికి పోయి పొడుస్తూ అనవసరంగా సమయం వృథా చేసుకోరు. అలా వెళ్లారు అంటే వారికి తత్త్వం, ఆధ్యాత్మికత రెండూ బోధపడనట్లే. చదివిన తత్త్వం బోధపడకపోతే అది కడుపులో జీర్ణం కాని అన్నంతో సమానం. కక్కాల్సిందే. తన మీద తను కక్కుకుంటే పర్లేదు ఇతరుల మీద కక్కితేనే భరించలేని బాధ.

ఈ వ్యాసం లో నా చివరి మాట, నా మాటగా చెప్పాలి అనుకున్నది ఇతరులకి ఏ మాత్రం హాని చేయని మన స్వార్ధం, స్వార్ధమైనా పర్లేదు మంచిదే అని నా భావన. ఇవి నేనెటువంటి పుస్తకాల నుండి ఆధ్యాత్మిక గ్రంథాల నుండి అరువు తెచ్చుకున్న మాటలు కావు. నా జీవితం నుండి నేను నేర్చుకున్న పాఠాలు.

Exit mobile version