Maatamanti

Chicken Tikka Pulao Recipe – చికెన్ టిక్కా మసాలా పులావు తయారీ విధానం

Chicken Tikka Pulao Recipe with step by step instructions.English Version.

నేను చికెన్ టిక్కా recipe ని తరచుగా చేస్తుంటాను.ఏంటండి?నేను ఏది చెప్తే అది నమ్మేస్తారా?అసలు నిజమేంటంటే నేను చికెన్ టిక్కా ని తరచుగా హోటల్ నుండి తెప్పించుకుంటాను.అంగారా కబాబ్స్ ఆన్ చార్కోల్ హోటల్ చికెన్ టిక్కా అంటే నాకు చాలా ఇష్టం.కనీసం వారంలో రెండు రోజులైనా సరే అది మా డిన్నర్ లో ఉండాల్సిందే.కానీ ఇక నుండి హోటల్ ఫుడ్ మానేయాలని మా ఆయన నాతో బలవంతంగా ఒట్టు పెట్టించారు.అదే నా నూతన సంవత్సర తీర్మానం.హోటల్ ఫుడ్ మానేసి ఇప్పటికి రెండున్నర నెలలు అయింది.పోయిన వారం నా స్నేహితురాలు ప్రశాంతి వాళ్ళబ్బాయి పుట్టినరోజు వేడుకకు  హోటల్ కు ఆహ్వానించింది.ఆ రోజు మాత్రం శుభ్రంగా నాకు నచ్చినవన్నీ లాగించేసాను.అందుకు నా ప్రియమైన స్నేహితురాలికి ధన్యవాదములు.మరీ అచ్చ తెలుగు ఎక్కువైపోయింది కదూ.కనీసం ఈ విధంగానైన మన మాతృభాషని వాడే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది.

ఈ మధ్య మాత్రం ఈ వంటకాన్ని నేనే స్వయంగా చేయడం ప్రారంభించాను.ఇంతకుముందు ముందు కూడా చేసేదాన్ని కానీ మా పొలం దగ్గరకు వెళ్ళినపుడు మాత్రమే చేసేదాన్ని.అక్కడైతే చక్కగా charcoal గ్రిల్ వాడుకోవచ్చు.అదే ఇంట్లో అయితే బాగా పొగ వస్తుంది కాబట్టి వాడలేము.నాకు ఓవెన్ లో చేయడం ఇష్టం లేదు.ఎంతైనా ఓవెన్ లో బొగ్గుల మీద కాల్చిన రుచి రాదు కదండీ.అందుకే నేను ఆ చక్కని smokey flavor కొరకు గ్యాస్ స్టవ్ మంట మీద కాలుస్తాను.

ఈ వంటకాన్ని తయారు చేయడానికి నేను బోన్ లెస్  చికెన్ thigh ముక్కల్ని వాడాను.అందుకే వండాక ముక్కలు ఎంతో మెత్తగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేట్లుగా ఉన్నాయి.thigh pieces ని ఎక్కువ సేపు మారినేట్ చేయవలసిన అవసరం లేదు.కాని చెస్ట్ ముక్కల్నైతే కనీసం 2 నుండి 3 గంటల పాటు నానబెట్టాలి.లేకపోతే ముందే కలిపేసుకొని రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచినా బాగుంటుంది.చికెన్ ముక్కల్ని మంట మీద కాల్చేటపుడు మరీ ఎక్కువగా మాడ్చకుండా అన్ని వైపులా తిప్పుతూ కాల్చాలి.అప్పుడు ముక్కలకు కాస్త పొగ వాసన అంటుకుని మంచి రుచిగా మారతాయి.మొత్తం కాకుండా కాస్త అంచుల మీద మాడేలాగ కాల్చుకోవాలి.ఎక్కువగా కాలిస్తే చికెన్ ముక్కలలో సహజంగా ఉండే తడి ఆవిరైపోయి ముక్కలు గట్టిగా, నమలడానికి వీలులేకుండా మారతాయి.

చికెన్ టిక్కా ముక్కల్ని స్టార్టర్ లా ఉట్టిగా తినేయొచ్చు లేదా టిక్కా మసాలా తయారు చేసి నాన్స్ తో గానీ రోటీ లతో గానీ తినవచ్చు.నేను కొంచెం వైవిధ్యంగా ఉంటుందని chicken tikka pulao recipe చేసాను.అసలైతే నేను పులావు లో ఎప్పుడూ పసుపు వేయను.కానీ చూడడానికి అందంగా ఉంటుందని వేసాను.చికెన్ ముక్కలు ఎర్రగా ఉన్నాయి కదా కాంబినేషన్ బాగుంటుందని వేసాను.ఇంకా నేను ఎప్పుడు పులావు చేసినా యాలుకలు&సోంపు పొడిని 1 tsp వేస్తాను.ఇలా చేయడం వల్ల మంచి సువాసన వస్తుంది.ఎందుకంటే ఈ రెండు దినుసుల్లో సువాసన మాత్రమే ఉంటుంది.మిగతా మసాలా సుగంధద్రవ్యములలో మంచి వాసనతో పాటు ఘాటు కూడా ఉంటుంది.

మీరు ఇదే వంటకాన్ని ఇదే పద్ధతిలో పనీర్ తో కూడా తయారు చేసుకోవచ్చు.అది కూడా చాలా రుచిగా ఉంటుంది.ఎంతో రుచికరమైన ఈ వంటకాన్ని మీరు కుడా చేసి ఆ రుచిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Gongura Chicken recipe in Telugu
Chicken Liver Fry in Telugu
Andhra Miriyala Chicken in Telugu
Fish Biryani recipe in Telugu
Prawns Biryani in Telugu

Click here for the English Version of this Recipe

చికెన్ టిక్కా మసాలా పులావు-chicken tikka pulao recipe
Prep Time
1 hr
Cook Time
1 hr
Total Time
2 hrs
 
Course: Main Course
Cuisine: Indian
Author: బిందు
Ingredients
మారినేషన్ కొరకు
  • 300 గ్రాములు బోన్ లెస్ చికెన్
  • 1 tsp ఉప్పు
  • 1 tsp మిరియాల పొడి
  • 1 tsp గరం మసాలా
  • 1 tbsp కారం
  • 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్టు
  • ½ నిమ్మకాయ
  • ½ కప్పు పెరుగు
  • ¼ tsp ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్
పులావు కొరకు
  • 300 గ్రాములు బాస్మతి బియ్యం
  • 1 మీడియం ఉల్లిపాయ సన్నగా నిలువుగా తరిగినది
  • 2 పచ్చిమిరపకాయలు
  • 1 tsp ఉప్పు
  • ½ tsp పసుపు
  • 1 tsp పులావు మసాలా
  • 1 tsp అల్లం వెల్లుల్లి ముద్ద
  • 2 tsp నెయ్యి
  • 3 యాలుకలు
  • 1 tsp సోంపు
  • 3 tbsp నూనె
  • 450 ml నీళ్ళు
  • ¼ కప్పు పుదీనా ఆకులు
  • 1 tsp గరం మసాలా దినుసులు అన్ని కలిపి
టిక్కా మసాలా కొరకు
  • 3 tbsp నూనె
  • 1/3 కప్ ఉల్లిపాయ ముక్కలు
  • 1/3 కప్ క్యాప్సికం ముక్కలు
  • 1 tsp కారం
  • ½ tsp అల్లం వెల్లుల్లి ముద్ద
  • 1 tsp ఉప్పు
  • ½ tsp గరం మసాలా
  • 1/3 కప్ టమాటో గుజ్జు
  • 1/8 కప్ తరిగిన కొత్తిమీర
Instructions
చికెన్ ను మారినేట్ చేయుట
  1. శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  2. అందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, అర చెక్క నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలపాలి.
  3. ఈ కలిపిన మిశ్రమాన్ని thigh ముక్కలైతే ఒక గంటసేపు లేదా చెస్ట్ పీస్ లైతే 2 నుండి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి.
పులావు తయారు చేయుట
  1. ముందుగా ఒక అరగంట పాటు బాస్మతి బియ్యాన్ని నానబెట్టాలి.వందే ముందు 2 నుండి 3 సార్లు కడగాలి.
  2. యాలుకలు మరియు సోంపును ఒక నిమిషం పాటు వేపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  3. ఒక పాత్రలో నెయ్యి ఇంకా నూనెలను వేసి వేడి చేసాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కొద్దిగా రంగు మారేవరకు వేయించుకోవాలి.
  4. పసుపు, పులావు మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఒకసారి కలపాలి.
  5. తరువాత నీళ్ళు పోసి మరిగే వరకు వేడిచేయాలి.
  6. నీళ్ళు మరగడం మొదలవగానే నానబెట్టి కడిగిన బాస్మతి బియ్యం వేసి అందులో పుదీనా ఆకులు, ముందుగా చేసి పెట్టుకున్న యాలుకలు సోంపు పొడిని వేసి బాగా కలిపి ఒక ఉడుకు రానివ్వాలి.
  7. ఉడకడం మొదలవగానే సిమ్ లోకి తిప్పి మూత పెట్టి అన్నం సరిగ్గా తయారయ్యేవరకు ఉడికించాలి.
టమాటో గుజ్జు తయారీ
  1. రెండు టమాటో లను బాగా కడిగి నిలువు గాట్లు పెట్టాలి.
  2. మరిగే నీటిలో వేసి 2 నుండి 3 నిమిషాలు ఉడికించాలి.
  3. తర్వాత వాటి మీద తొక్క తీసేసి చల్లారాక మిక్సీలో వేసి రుబ్బాలి.
చికెన్ టిక్కా మసాలా తయారీ
  1. ఒక పెనంలో 3 tbsp ల నూనె వేడిచేసి అందులో నానబెట్టుకున్న చికెన్ ను వేయాలి.
  2. బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 7 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతుండాలి.
  3. తర్వాత పెనంలో నుండి చికెన్ ముక్కలను వేరు చేసి పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు పెనంలో ఉన్న గ్రేవీ లో తగినంత ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉడికించిన టొమాటోల గుజ్జు వేసి కలిపి చిక్కబడేవరకు ఉడికించాలి.
  5. ఈలోపుగా ఒక skewer లేదా సీకుకి చికెన్ ముక్కల్ని గుచ్చి గ్యాస్ స్టవ్ మంట మీద అన్ని వైపులా తిప్పుతూ కాల్చాలి.
  6. మరీ మాడ్చినట్లు కాకుండా, కొద్దిగా పొగ వాసన అంటేలా ఇంకా అంచులు కొద్దిగా మాడ్చినట్లుగా కాల్చాలి.
  7. అలా కాల్చిన ముక్కల్ని చిక్కబడిన గ్రేవీ లో వేసి 2 నుండి 3 నిమిషాలు చక్కగా కలుపుతూ ఉడికించాలి.
  8. కొత్తిమీర వేసి దించేసుకోవాలి.
  9. పులావ్ అన్నాన్ని చికెన్ టిక్కా మసాలాని రెండిటిని బాగా కలిపి సర్వ్ చేయాలి.

Chicken Tikka Pulao Recipe Video

 

Related Post

Please Share this post if you like