మలయాళం సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే వెతుక్కుని మరీ చూస్తుంటాను. పెద్ద పెద్ద భారీ సెట్ లు ఉండవు. ఫారెన్ లొకేషన్స్ లో పాటలు ఉండవు. మేకప్ లు ఉండవు. పంచ్ డైలాగులు ఉండవు. పెట్టి కొడితే గాల్లో పది గింగిరాలు తిరిగి నేల మీద పడి మళ్ళీ బంతిలా గాల్లోకి లేచి ఇంకో పది గింగిరాలు తిరిగే సీన్లు ఉండవు. మనలాంటి ఒక సాధారణ మనిషి జీవితాల నుండి తీసుకున్న సాధారణ లౌకిక విషయాలనే సినిమా కథ గా తీసుకుంటారు. ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే వారి సినిమాల్లో సాధారణ సంభాషణలే కథ. అది నాకు నచ్చుతుంది.
మన తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మన తెలుగు సినిమా వారు కూడా ఇలాంటి సినిమాలు చక్కగా, అందంగా తీయగలరు. మాములు సినిమాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఇలాంటి సినిమాలు తీయవచ్చు. ప్రొడ్యూసర్స్ కి నిర్మాణ వ్యయ భారం తగ్గుతుంది. ఇంకా ఎక్కువ సినిమాలు తీయగలుగుతారు. చాలా మందికి ఉపాధి లభిస్తుంది. foreign లో తీసే రెండు పాటలకు అయ్యే ఖర్చుతో ఇక్కడ ఒక చిన్న సినిమా తీయొచ్చేమో బహుశా.
నిన్న Amazon Prime లో “The Great Indian Kitchen” అనే మలయాళ సినిమా చూశాను. చూసే ముందు కొంచెం కథా సారాంశం ఉంటే చదివాను. సరే ఏదైనా సరే చూద్దాము ని ముగ్గురం కూర్చుని చూశాము. క్లుప్తంగా కథ ఏంటంటే, కొత్తగా పెళ్లి అయిన ఒక అమ్మాయి అత్తవారి ఇంట్లో అడుగు పెడుతుంది. అక్కడ వాళ్ళ అలవాట్లు, ఆచారాలు తనకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అత్తగారు, మామగారు చాలా మంచివారు తనని బాగా చూసుకుంటున్నారు కనుక వాటికి అలవాటు పడడానికి ప్రయత్నిస్తుంది. అత్తగారు కూడా కోడలు కదా అని ఆ అమ్మాయికి ఇంటి పనులన్నీ అప్పజెప్పేయకుండా ఎప్పటిలా తానే చేసుకుంటూ ఉంటుంది. కోడలు అత్తగారికి పనుల్లో సహాయం చేస్తుంటుంది.
ఒకసారి అత్తగారికి ఊరు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఇంటి పనుల భారం అంతా కొత్త కోడలి నెత్తి మీద పడుతుంది. ఎలా చేసినా నవ్వుతూనే ఏదో వంకలు పెడుతూ ఉంటారు భర్తా, మామగార్లు. అయినా సహనంగా భరిస్తుంది. అతి కష్టంగా ఉన్న ఇంటి పనులను తానొక్కటే చేస్తుంటుంది. తను చేస్తున్న పనికి ఏమాత్రం విలువ లేకపోవడం సహించలేకపోతుంది. స్త్రీ బహిష్టు సమయంలో వారి ఆచారాలకు ఆశ్చర్య పోతుంది. అయినా సర్దుకుపోతుంది. చివరికి ఇక సహించలేక ఏమి చేస్తుంది అనేది ఆ సినిమా కథ.
సినిమా సగం వరకు ఒకే రకం సీన్లని మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూపిస్తుంటారు. ఆ కష్టం తెలిసిన వారికి, నిజంగా అనుభవించిన వారికి, రిపీట్ అవుతున్న సీన్లని చూసి విసుగు రాదు. పైగా అసహ్యం, కోపం, అసహనం కలుగుతుంటాయి. ఎలాగైనా ఆ ఇంట్లో వారికి బుద్ధి చెప్పాలి అనిపిస్తుంది. ఈ సినిమా ను మొదట Netflix, prime వారు తీసుకోవడానికి నిరాకరించారు అట. తరువాత Neestream అనే దాంట్లో వేశాక దానికి ప్రేక్షకుల నుండి వచ్చిన ప్రతిస్పందన చూసి amazon prime వారు తీసుకున్నారు.
సినిమా లో అసలు కథే లేదు. ఒక కాన్సెప్ట్ మాత్రమే ఉంది. అయితేనేమి ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసే విధంగా ఉంటుంది. ఇప్పటికీ మన సమాజంలో సాంప్రదాయం పేరిట కొన్ని దురాచారాలు ఉన్నాయి. బహిష్టు సమయంలో స్త్రీ ని అంటరాని వారుగా చూసి ఒక గదిలో నుండి బయటకు రానివ్వకుండా ఏదో జైల్లో కరుడుగట్టిన ఖైదీకి ఇచ్చినట్లు ఆహారం ఇస్తూ ఉంటారు. ఇది చాలా చాలా మూర్ఖత్వం, అవివేకం, అన్యాయం.
అప్పటి దాకా మన శరీరంలోనే ఉన్న రక్తం సడన్ గా చెడ్డది ఎందుకు అయిపోతుంది. ఆ స్త్రీ అంటరానిది ఎందుకవుతుంది? మన జ్ఞానేంద్రియాలైన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం నుండి ఎలా అయితే విసర్జితాలు వస్తాయో అది కూడా అంతే. నిజంగా అంతే. మన శరీరం విసర్జించే అన్ని వ్యర్ధాల కన్నా మన మనసు విసర్జించే మకిలి పట్టిన వ్యర్ధమైన ఆలోచనలను అశుద్ధమైనవిగా, మైల గా నేను భావిస్తాను.
మన పూర్వీకులు చాలా చాలా గొప్పవారు. అప్పుడు వారు ఏర్పరచిన ఆచార, సాంప్రదాయాలకు ప్రతిదానికి ఒక నిగూఢమైన కారణం, అర్ధం ఉంటుంది. ఇది నిజం. నేరుగా ఇలా చేయండి, చేస్తే మంచిది అని చెప్తే మన కోడి మెదళ్లకు ఎక్కదు, అర్ధం కాదు కాబట్టి, పాటించరు కాబట్టి ప్రతిదీ ఏదో ఒక భయం కల్పించి పాటించేలా చేసేవారు. అలాంటి వాటిల్లో ఈ స్త్రీని బహిష్టు సమయంలో వేరు పరచడం ఒకటి.
పూర్వకాలంలో అన్నీ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందువల్ల ఇంట్లోని స్త్రీలందరికీ పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు అంతులేని పని ఉండేది. పూజా పునస్కారాలు, నోములు వ్రతాలు, వంటా వార్పులు లాంటివి అన్నీ భారీగా ఉండేవి. ఇప్పుడు కేవలం పండుగ రోజు మాత్రమే మనం పాటించే పూజా విధానాల్ని అప్పుడు ప్రతీ రోజూ పాటించేవారు. పూజకు కావాల్సిన ఏర్పాట్లు, అంటే ముందుగా పూజ గదిని శుభ్రపరచడం, చమురు, మకిలి పట్టిన పూజా సామాగ్రిని రోజూ తోమడం, పూజ గదిని అలంకరించడం, రకరకాల నైవేద్యాలు తయారు చేయడం, తర్వాత పూజ చేయడం ఇలాంటివన్నీ ఉండేవి. ఇవన్నీ చాలా శ్రమ తో కూడుకున్న పనులు. అప్పట్లో మిక్సీలు, వాషింగ్ మిషన్లు లేవు. కష్టపడి చేసుకోవాలి. పెద్ద పెద్ద వాకిళ్లు ఊడవాలి.
ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న శానిటరీ పాడ్స్ ఆ కాలంలో ఉండేవి కాదు. బట్టను వాడేవారు. అది ఏమాత్రం సౌకర్యంగా ఉండదు. పైగా బహిష్టు సమయంలో స్త్రీ శారీరకంగా మరియు మానసికంగా చాలా బలహీనంగా ఉంటుంది. పొత్తికడుపు భాగం, క్రింద జఘన భాగం అంతా తీవ్రమైన నొప్పితో ఉంటుంది. ఒక వారం ముందు నుండే ప్రవర్తనా ధోరణిలో, ఆలోచనా ధోరణి లో అకస్మాత్తుగా, వారి ప్రమేయం లేకుండానే మార్పు వచ్చేస్తుంది. చాలా చిన్న విషయాలకే బాధపడుతుంటారు. అతి చిన్న విషయాలకే కోప్పడుతుంటారు. ఇది వారు కావాలని చేసేది కాదు. వారికి తెలీకుండానే జరిగేది.
ఇవన్నీ మన పూర్వీకులు గమనించి ఉంటారు. ఇంటిని సమర్ధవంతగా నడిపించే స్త్రీకి బాగోనప్పుడు, ఆమెను ఇంకా కష్టపెట్టకూడదు, నెలసరి సమయంలో అయినా ఆమెకు తగిన విశ్రాంతిని కల్పించాలి అన్న మంచి ఉద్దేశ్యంతో మన పూర్వీకులు “స్త్రీ బహిష్టు సమయంలో దేవుని తాకరాదు, ఇంటి లోపల వస్తువుల్ని, మనుషుల్ని తాకరాదు, వంట గదిలోకి వెళ్ళకూడదు, భర్తకు దూరంగా ఉండాలి” ఇలాంటి నియమాలు పెట్టి ఉంటారు. పైగా ఇవన్నీ చేస్తే మహా పాపం, శాపం అని భయపెట్టారు. అలా భయపెట్టి ఆ స్త్రీని ఓ పక్కన కూర్చోపెట్టకపోతే, ఇంట్లోని మిగతా ఆడవారు, మగవారు, పిల్లలు ఆమెని ఆ స్థితిలో కూడా రోజూలానే పని చేసి పెట్టాలి అని ఆశిస్తారు, అధికారం చెలాయిస్తారు. కానీ అది కాలక్రమేణా వక్రీకరణ చెంది మూర్ఖత్వానికి పరాకాష్టగా మారింది. ఇంత చెప్పాను కదా…అయినా నేను కూడా అదే పాటిస్తాను. మిగిలిన అన్నీ పనులు చేసుకుంటాను కానీ దేవుడి జోలికి పోను. దైవం అంటే పవిత్రం, నిజం, స్వచ్ఛం. నెలసరి సమయంలో మనం ఎంత శుభ్రత పాటించినా ఎంతో కొంత క్రిములు లాంటివి చేరి అశుద్ధంగా మారుతుంది మన దేహం. అలాంటప్పుడు పూజకి వెళ్లడం కూడదు. మురికి చేతుల్ని మన ఒంటి మీద బట్టలకు వేసి తుడుచుకోము కదా!… చిరిగిపోయే బట్టలకే అంత విలువ ఇచ్చినప్పుడు స్వచ్ఛతకి ప్రతిరూపమైన ఆ భగవంతునికి ఇంకెంత విలువనివ్వాలి? అని నేను ఆలోచిస్తాను. అందుకే వెళ్లను. కేవలం నెలసరి ఉండే స్త్రీలే కాదు, ఇతరులకు చెడు తలపెట్టే వారు, ఇతరుల్ని తమ మాటలతో, చేష్టలతో హింసించి బాధపెట్టే ప్రతి ఒక్కరూ దేవుడ్ని తాకుటకు అనర్హులు.
ఒక వ్యక్తి ఒక విషయాన్ని రెండో వ్యక్తికి ఒకలా(సరిగ్గా,నిజంగా,మంచిగా,ఉపయోగపడేలా) చెప్తే, అది మూడో వ్యక్తి దగ్గరకు చేరే సరికి కాస్త వంగుతుంది, నాలుగో వారి దగ్గరకి వెళ్లే సరికి ఇంకాస్త వంగుతుంది. చివరికి విషయం విరిగి వెయ్యి ముక్కలవుతుంది. ఆ విరిగిన ముక్కల్ని ఏరుకున్న కొందరు మహానుభావులు వారికి దొరికిన ముక్కే నిజమైన ముక్క గా భావించి దానికి ఇంకాస్త సొంత పైత్యం జోడించి మరికొంతమందిని ప్రభావితం చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే ఇలాంటి వారి వల్లే సమాజం లో మంచి కోసం రూపొందిచబడ్డ కొన్ని ఆచారాలు దురాచారాలుగా మారిపోయాయి. ఎవరు ఎక్కువగా ప్రభావితం(influence) చేయగలిగితే వారి ఆచారాలు ఎక్కువ కాలం ఉంటాయి.
అలా ప్రభావితం చేసే వారు ఉండడం వల్లనే వైదిక, బౌద్ద, జైన వంటి మతాలు వాటిని ఒక సదుద్దేశ్యంతో ప్రారంభించిన వారి ప్రమేయం లేకుండానే ముక్కలుగా విడిపోయాయి లేదా పరివర్తనం చెందాయి. మనిషి దృక్కోణం లో(ఆలోచించే విధానంలో) తేడాల వల్లే ఇది సంభవిస్తుంది. అంటే దీనిని ఒక విధంగా Perspective Distortion అనొచ్చేమో.
శ్రీ ఎం.వి రమణా రెడ్డి గారు రాసిన టూకీగా ప్రపంచ చరిత్ర పుస్తకంలో ఆయన అసలు ఈ ఆచారాలు, సాంప్రదాయాలు ఎలా ఉద్భవించాయో సహేతుకంగా చెప్పారు. కొన్ని రోజుల పాటు సాక్షి న్యూస్ పేపర్ లో ఆయన రచనను కొద్ది కొద్దిగా ప్రచురించారు. రేడియో లో కూడా ధారావాహికగా చెప్పారు. అలాగే శ్రీ అమీష్ త్రిపాఠి గారు రాసిన పుస్తకాల్లో కూడా దేవుళ్లు ఎందుకు దేవుళ్లుగా పిలవబడతారో నాస్తికులకు కూడా అంగీకరించాలి అనిపించేలా చక్కని తర్కంతో అలోచించి సహేతుకంగా రాస్తారు.
16 వ శతాబ్దంలో నికోలస్ కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని(Heliocentric Theory) ప్రతిపాదించి నిరూపించేవరకు, అప్పటిదాకా క్రీస్తు పూర్వం 4 వ శతాబ్దం నుండి అరిస్టాటిల్ నమ్ముతున్న భూకేంద్రక సిద్ధాంతాన్నే(Geocentric Theory) అందరూ నమ్మేవారు. నికోలస్ నిరూపించాక కూడా పాతదే నమ్మారు. అంటే ఆ కాలంలో ప్రజలు “మన విశ్వానికి భూమి కేంద్రంగా(సెంటర్ లో) ఉంటుంది” అని నమ్మేవారు. పైగా భూమి కాదు సూర్యుడు కేంద్రంగా ఉంది అని చెప్పినా కోపర్నికస్ ను ఎవరూ నమ్మలేదు. అప్పట్లో ఉన్న మత గ్రంధాలనే ప్రగాఢంగా నమ్మారు. నికోలస్ కోపర్నికస్ నమ్మిన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని(Heliocentric Theory ని) గెలీలియో తర్వాత శాస్త్రీయ ఆధారాలతో ధృవీకరించారు. అయినా ఎవరూ వినలేదు. వినకపోగా మతాధికారులు గెలీలియో నోరు నొక్కేసి అది బయటకు వెల్లడి చేయకూడదు అని అతనితో ప్రమాణం చేయించుకున్నారు. చివరికి ఆ నిజాన్ని దాచలేక ఒక గ్రంథం రూపంలో బయట పెట్టిన గెలీలియో ను బంధించి యావజ్జీవ శిక్ష విధించారు.
క్రీస్తు పూర్వం 3 (BC) వ శతాబ్దంలోనే అరిస్టార్కస్ అనే ఖగోళ శాస్త్రవేత్త సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అలానే మన భారత దేశ ఖగోళ శాస్త్రవేత్త “ఆర్యభట్టు” కూడా సూర్యకేంద్రక సిద్ధాంతాన్నే నమ్మినట్లు ఆయిన కట్టిన లెక్కల వల్ల తెలుస్తుంది అట. అంటే ఎప్పుడో ప్రతిపాదించబడిన నిజాన్ని నిజంగా నిజం అని నమ్మించడానికి ఇన్ని వందల ఏళ్ళు పట్టింది అన్నమాట. అబద్దాన్ని(ఇక్కడ అబద్దం అనే కన్నా నిజం కాని దాన్ని అంటే సంబద్దంగా ఉంటుందేమో) లేదా నిజం కాని దాన్ని నమ్మించడానికి కొద్ది సమయం పడితే, నిజాన్ని నిజం అని నమ్మించి ఆచరింపచేయడానికి కొన్ని వందల ఏళ్ళు పడుతుంది అన్నమాట. ఎంత విచిత్రం కదా! ఎంత దౌర్భాగ్యం కదా! ప్రపంచంలో ఎక్కువమంది మంది ఏది నమ్మితే అదే నిజం గా మారిపోతుంది. నిజమైన నిజంతో అసలు మనిషికి సంబంధం లేదేమో, అవసరంలేదేమో కదా!
సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ మనిషి సృష్టించినవే. మనిషే సృష్టించి వాటిని దేవుడు చెప్పినట్లుగా అన్నీ ఆయన మీదకు తోసేస్తారు. ఆయా కాలాలను, సమయాలను, పరిస్థితులను బట్టి మనిషిని హద్దు మీరకుండా కట్టడిలో, క్రమశిక్షణలో ఉంచడానికి పూజ్యనీయులైన మన పూర్వీకులు మంచి ఆలోచనతో ఏర్పరచినవే ఇవన్నీను. ఏదో ఒక భయం లేదా కట్టుబాటు లేకపోతే మనిషిలో విశృంఖలత్వం పెరిగిపోతుంది అన్న భావనతో లేదా భయంతో ఏర్పరచినవే సాంప్రదాయాలు, ఆచారాలు.
నేను సాంప్రదాయ వ్యతిరేకిని ఏమాత్రం కాదు. మన సాంప్రదాయాన్ని నేను చాలా చాలా ప్రేమిస్తాను, గౌరవిస్తాను. కాకపోతే ఒకటే తేడా .కొంతమంది సాంప్రదాయాల్ని మూస ధోరణిలో ఎందుకు? ఏమిటి? అనేది ఆలోచించకుండా పాటిస్తారు లేదా అనుకరిస్తారు. నేను మన పెద్ద వారు చెప్పిన ప్రతీ దానికి వెనుక నిగూడార్థం(అంతర్లీనంగా దాగి ఉన్న అర్ధం లేదా కారణం) ఏమై ఉంటుందా అని తార్కికంగా అలోచించి పాటిస్తాను.
కొన్ని నేను ఇంకొక దగ్గర చదివి తెలుసుకున్నవీ, కొన్ని నేను అలోచించి అర్ధం చేసుకున్నవీ ఇలా ఉన్నాయి.
ఉదయం, సాయంత్రం తప్పకుండా ఇంట్లో మరియు గుమ్మం ముందు దీపం పెట్టాలి అంటారు. ఒకప్పుడు ఇప్పటిలా కరెంటు సౌకర్యం ఉండేది కాదు. వెలుతురు లేకపోతే కనిపించదు అని అలా చెప్పేవారు. ఇప్పుడు కరెంటు సౌకర్యం ఉన్నా కూడా అలా పెట్టడం లో తప్పు లేదు. అలా పెట్టడం వల్ల రోజూ ఒకే సమయానికి ఒక పని చేయడం వల్ల మనలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. బహుశా వారు ఈ నియమం పెట్టడానికి ఇది కూడా కారణం అయి ఉండొచ్చు. పైగా దీపం వెలిగించినప్పుడు దీప కాంతిని చూస్తే మన మనసు ఉత్తేజితం అవుతుంది.
రాత్రిళ్లు ఊడవకూడదు ఊడిస్తే లక్ష్మి పోతుంది: నిజమే కదా మరి ఆ కాలంలో గుడ్డి దీపాల వెలుతురులో ఇల్లు ఊడిస్తే, ఏదో చిన్న బంగారపు ముక్క అంటే చెవి పోగు, శీల లాంటివి పొరబాటున కిందపడితే చూసుకోకుండా ఊడ్చి పారేస్తాము కదా. విలువైనవేమైనా ఉంటే చూసుకోకుండా ఊడ్చేస్తాము అని అలా చెప్పి ఉంటారు.
శివుడు అమృతాన్ని పంచి గరళాన్ని గొంతులో దాచుకున్నాడు మాటకు అసలు అర్ధం మనం సంతోషాన్ని అందరికీ పంచాలి. విషతుల్యమైన చెడుని లేదా రహస్యాన్ని మాత్రం ఎవరికీ పంచకుండా గొంతులోనే ఆపేయాలి. బయటకు రానీయకూడదు అని అర్ధం.
కూరలు ముందు వడ్డించి తర్వాత అన్నం వడ్డించాలి: ఇలా చేయడం వల్ల పళ్లెంలో వడ్డించిన కూరని బట్టి మనం ఎంత అన్నం వడ్డించుకోవచ్చో ముందుగానే తెలుస్తుంది. అందరికీ అన్నీ కూరలు నచ్చవు కదా. ముందే అన్నం ఎక్కువ పెట్టేస్తే, తరువాత కూర నచ్చకపోతే అన్నం వృథా అవుతుంది కదా అందుకని అలా చెప్పి ఉంటారు. అంతే కాకుండా ముందుగా మన పళ్లెంలో వడ్డించిన కూరల రంగు, వాసన చూడగానే మనలోని ఆకలి ఉత్తేజితం అవుతుంది. ఈ విషయమై ఇంకొక నమ్మకం కూడా ఉంది. ఒకరి ఇంట్లో మృత్యువు సంభవించినప్పుడు పెద్ద ఖర్మ చేసిన రోజు ముందు అన్నం వడ్డించి ఆ తర్వాత కూరలు వడ్డిస్తారు అట. దీనిలోని కారణం లేదా తర్కం నాకు తెలీదు.
ఆరు దాటితే చెట్టు మీద చేయి వేయకూడదు. అది చెట్లు నిదురించే సమయం అంటారు. చీకటి పడే సమయానికి చెట్ల మీద పురుగూ, పుట్రా చేరతాయి. పొరబాటున చూసుకోకుండా వాటిని ముట్టుకుంటే కుట్టొచ్చు అని అలా చెప్పేవారు.
“జుట్టు విరబోసుకుని ఊరు దాటితే దయ్యం పడుతుంది. తలకు నూనె రాసుకోకుండా ఊరు దాటకూడదు” అని మా నాయనమ్మ ఇప్పటికీ చెప్తుంది. నాకు భరించలేని తలనొప్పి వస్తే తప్ప నేను జుట్టును వదిలేయను. మన పెద్దవారు అలా చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. స్త్రీ యొక్క కొన్ని రకాల జుట్టు అలంకరణలు మగవారినే కాదు స్త్రీలను కూడా ఆకర్షించే విధంగా ఉంటాయి. “ఊరు దాటి వెళ్ళేటప్పుడు ఆ జుట్టును చూసి ఎవరైనా ఆకర్షితులవ్వొచ్చు. అనవసరంగా ఒకరి చూపులు మన మీద నిలిచేంత ఆకర్షణీయంగా అనవసరమైన సమయంలో, అనువుకాని స్థలంలో చేసుకోకూడదు” అని చెప్ప ప్రయత్నించి ఉంటారు. మా అమ్మాయి అప్పుడప్పుడు జుట్టు వదిలేస్తే నాకు భరించలేని కోపం వస్తుంది. శుభ్రంగా తలకు నూనె రాసుకుని గట్టిగా జడ అల్లుకోమని చెప్తూ ఉంటాను. నేను చెప్పేది దెయ్యం పడుతుంది అని కాదు. ఇల్లంతా జుట్టు రాలి పడుతుంది అనీ, ఇంకా సగం సమయం ముఖం మీద పడిన జుట్టుని వెనక్కు నెట్టుకొవడానికే వృధా అవుతుంది అని అలా తిడతాను.
వర్షాకాలం మొదలు మళ్ళీ వసంత ఋతువు వచ్చే వరకు వాతావరణం మబ్బుగా, చలిగా ఉండడం వల్ల మనం మందకొడిగా, నిస్తేజంగా మారిపోతాము అని వర్ష ఋతువు మొదలుకుని ప్రతీ నెలా రకరకాల పండుగలు, వ్రతాలు ఏర్పాటు చేశారు. దీనివల్ల వల్ల మనలో నిస్తేజం తగ్గి ఉత్తేజం కలుగుతుంది. స్త్రీలకు వరలక్ష్మీ వ్రతం, మగవారికి అయ్యప్ప స్వామి దీక్ష, వినాయక చవితి, దసరా, దీపావళి ఇలా ప్రతీ నెలా ఏదో ఒకటి ఉంటుంది. ఇది ఒకసారి నేను ఒక పేపర్ లో చదివాను.
ఇక ఆడవారి అయిదవతనానికి ప్రతీక అని చెప్పే తాళిబొట్టు గురించి చెప్తాను. నా యూట్యూబ్ వీడియోస్ లో ఒకటి రెండింటిలో నేను మంగళ సూత్రం వేసుకోలేదు. ఆ వీడియో చూసిన ఒకరిద్దరు మగవారు “మంగళ సూత్రం బరువయ్యిందా” అని ఒకరు, “మీరు మెడలో సూత్రం వేసుకోకపోవడం బాలేదు” అని ఒకరు రాశారు. ఇంకొకరేమో వ్యంగంగా “మీ భర్త చనిపోయారనుకున్నాను” అని రాశారు. మొదటి ఇద్దరేమో కానీ మూడో వ్యక్తి నా ముందు ఉంటే చెంప ఛెళ్ళు మనిపించేదాన్ని. ఇది కొంతమంది మగవాళ్లలో పేరుకుపోయిన కరుడుగట్టిన భావాలకు ప్రతీక అన్నమాట. వారి తప్పు లేదు..వారు ఏమి వింటూ చూస్తూ పెరిగారో అదే మాట్లాడతారు. నేను తాళి వేసుకోవడానికి వ్యతిరేకిని కాదు. నాకు అప్పుడప్పుడు నా శరీరం మీద భరించలేని దద్దుర్లు వస్తాయి. అలాంటి సమయంలో నేను తేలికపాటి దుస్తులు ధరించి, గొలుసులు, నగలు లాంటివి వేసుకోను. అది మాత్రమే కారణం. ఇదేమి వారికి తెలీదు కదా! నిజం చెప్పాలి అంటే నేను వేసుకునే దుస్తులు కాస్త మోడరన్ గా ఉంటాయి కానీ నా ఆలోచనలు పాత చింతకాయ పచ్చడిలా ఉంటాయి. నా వీడియోస్ ను రెగ్యులర్ గా చూసే ఒకాయన “ఏమీ అనుకోకండి.మిమ్మల్ని చూస్తే “Oh baby” సినిమా గుర్తుకొస్తుంది” అని రాశారు. ఎందుకంటే నేను వేసుకునే దుస్తులకీ, మాట్లాడే పాత కాలం మాటలకూ పొంతన ఉండదు కదా! అందుకు ఆయన అలా అని ఉంటారు.
తాళి వేసుకుంటే నేను మంచిదాన్ని, వేసుకోకపోతే చెడ్డదాన్ని అనేనా అర్ధం. అంటే బట్టలు, నగలు, వస్తువులు కాకుండా నా వ్యక్తిత్వానికి, నా చదువుకు, నా జ్ఞానానికి, నా సంస్కారానికి ఎటువంటి విలువ లేదా?. సరే సాంప్రదాయాన్ని పాటించాలి, నిలబెట్టాలి అనుకుందాము. సాంప్రదాయాన్ని పాటించే బాధ్యత కేవలం స్త్రీల మీద మాత్రమే ఉందా? మగవారికి లేదా? ఎంత మంది మగవారు మన అచ్చ తెలుగు సంప్రదాయం ప్రకారం రోజూ ఆఫీసులకి పంచె. చొక్కా, కండువా వేసుకుని వెళ్తున్నారు? ప్యాంటు షర్ట్ వేసుకుంటే మన తెలుగు సాంప్రదాయం మంటగలిసి పోవడం లేదా? నేను స్త్రీ వాదిని కాదు. నన్ను అన్నది మగవారు కాబట్టి ఇలాంటి ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది.
ఒకప్పుడు పూర్వకాలంలో మనలాంటి నాగరికత ఉండేది కాదు. కొన్ని రకాల తెగల్లో విశృంఖలత్వం ఉండేది. కట్టుబాట్లు, ఆచారాలు ఉండేవి కావు. . ఒక తెగ పురుషులు వచ్చి అన్యాయంగా ఇంకొక తెగ స్త్రీలను ఎత్తుకెళ్లి పోవడం, బలాత్కరించడం చేసేవారు. కండబలం, ధైర్యం ఉన్నవారు వెళ్లి, అవతలి తెగ వారితో పోరాడి మళ్ళీ ఆ స్త్రీని తిరిగి తెచ్చుకునే వారు. లేని పక్షాన నిస్సహాయంగా చూస్తూ ఉండేవారు. తర్వాత స్త్రీలకు మంత్రించిన తాయెత్తుల్లాంటివి కట్టడం మొదలు పెట్టారు. దురాలోచన తో వచ్చిన ఇతర తెగల పురుషులు వాటిని చూసి భయపడి ఆ స్త్రీల జోలికి వెళ్లడం మానేశారు. అప్పుడు ఆ తాడుకి ఉన్న విశిష్టతను తెలుసుకున్నారు. కాలక్రమేణా అది మంగళసూత్రం గా రూపాంతరం చెంది ప్రాముఖ్యత, విలువ సంతరించుకున్నాయి. “ఒక స్త్రీ లేదా అమ్మాయి మెడలో మంగళ సూత్రం ఉంది అంటే ఆమె ఇంకొకరికి చెందినది, వారిని తాకరాదు, తప్పుగా చూడరాదు” అని తనని చూసే ఇతర మగవారికి తెలియాలని సృష్టించబడ్డ సాంప్రదాయమే తాళి.
ఎందుకు సృష్టించబడ్డా ఇప్పటికీ తాళి స్త్రీ కి ఒక అందమైన హుందాతనాన్ని ఇస్తుంది. చూడగానే “అమ్మ కదా! ” అనే ఒకలాంటి మర్యాద పూర్వకమైన భావనను కలుగచేస్తుంది. అందుకు నేను దానిని ధరిస్తాను. నా భర్త మీద ప్రేమతో ధరిస్తాను. అంతేకానీ ఇంకొకరు ఏమనుకుంటారోనని భయపడి మాత్రం ధరించను. మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం మనం ధరించే ప్రతీ ఆభరణానికి ఒక శాస్త్రీయత ఉంది. అది అందరికీ అర్ధమయ్యేలా చెప్పి పాటింప చేయాలి కానీ, అది ఉంటే భర్త ఉన్నట్లు, లేకపోతే చనిపోయినట్లు ఇలాంటివి చెప్పడం సరికాదు. నిజం గా మన ఆచారాల్ని పాటించాలి అంటే సతీ సహగమనం, బాల్య వివాహం ఇవి కూడా పాటించాలి కదా! ఎందుకు ఆపేశారు? ఎందుకంటే అవి అమానుషం కాబట్టి.
చివరిగా నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటీ అంటే, ఏ ఆచారమైనా, సాంప్రదాయమైనా మనిషి వ్యక్తిత్వాన్ని, ఆలోచనను ఇనుమడింపచేసే విధంగా ఉండాలి. మానవాళికి ఉపయోగపడేలా ఉండాలి. సాంప్రదాయాలు, ఆచారాలు భయపెట్టేవిగా, బలవంత పెట్టేలా ఉండకూడదు. ఏది చేసినా ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చేయాలి. మనం మన సాంప్రదాయాల్ని ఇష్టంతో, ప్రేమతో కాపాడాలి. భయంతో, ఎవరేమి అనుకుంటారో ఏంటో అని కాదు. సాంప్రదాయాల్ని అనుకరించి ఆచరించిన దానికన్నా, అర్ధం చేసుకుని ఆచరిస్తే మంచిది.
Sathish Reddy says
Yes you always correct Bindu Akka acca I have an idea why you not trying making one movie story why not try it is my wish I want to produce the movie my budget was 40 lacs this is a reality because I have so many confidence levels with your lovable thoughts thank you so much Akka
Bhanu says
U r correct bindu
నళిని says
Bindu నిన్ను చూస్తూఉంటే చాలా గర్వాంగా ఉంది
సమాజాన్ని ఇంతగా ఆలోచింపచేసే నీ భావాలు మరియు నీ ఆలోచనలు నీమీద గౌరవాన్ని పెంచేస్తున్నాయి బిందు.
ఏమి మాట్లాడాలో అర్ధం కావడంలేదు…..
ఆ బిందునే ఈ బిందు నా అనిపిస్తుంది …..
నిజంగా చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే….
nagarani says
Hello bindu garu great explanation
BINDU says
Hello andi Thank you so much
haritha says
Social media valla naku jarigina melu mimmalni kalavadam..motham chadivanu andi chala bagunnay me opinions vatiki me explaination
sowjanya says
Really too good content Bindu garu.
I like ur thoughts..
Shirisha says
Nennu kuda elane alochana chesthanu akka, Naa alochana correct Ke ani Ni matalu Chadivake telisindi tq akka
Veena says
Hello Bindu Garu!
I watch your videos on YouTube frequently. I’m in awe for your involvement with nature and lifestyle.
I have a request to you Bindu garu. I’m a supplier of Herbal sanitary pads. They are completely biodegradable,ecofriendly and Chemical free. Above all they are India made. If you wish I can furnish more details about the pads. Could you please create awareness about these pads in your videos??
It will be helpful to a large number of women who are using the commercial pads without knowing the sideeffects.