నేను మొన్నీమధ్య ఒక సినిమా చూశాను. నేను ఈ పోస్ట్ లో చెప్పాలి అనుకున్నది చెప్పే ముందు ఒక సినిమా గురించి మాట్లాడం సముచితంగా ఉంటుంది అనిపించింది. ఆ సినిమాలో కత్తులు, తుపాకులు లేవు, అసభ్య ద్వంద్వార్థపు పదజాలం లేదు, గొడవలు లేవు, ఎత్తుగడలు, పన్నాగాలు లేవు, హింస లేదు, ద్వేషం లేదు, పగ లేదు, హారర్ లేదు అయినా ఆ సినిమా కథ మా గుండెల్ని పిండేసే విధంగా బాధించింది. చూస్తున్నంత సేపు ఏదో తెలీని భయం, ఆందోళన కలిగాయి.
మొన్నీ మధ్య ఆహా లో తెలుగులో రీలీజ్ అయిన అండ్ ది ఆస్కార్ గోస్ టూ సినిమా చూశాను. ఇది ఒక మలయాళ సినిమా కి తెలుగు డబ్బింగు చిత్రం. కథ లో పెద్ద హంగులు, ఆర్భాటాలు, హడావిడి ఉండవు. ఎంతో సున్నితంగా సాగుతుంది కథ.
ఈ చిత్ర కథానాయకుడు గా టోవినో థామస్(Tovino Thomas) నటించారు. ఈ సినిమా లో టోవినో థామస్ కి చిన్నప్పటి నుండి మంచి దర్శకుడు అవ్వాలని ఆశయం ఉంటుంది. స్వంత ఊరిని వదిలి వేరే ఊరిలో ఉంటూ కథలు రాసుకుంటూ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. చివరికి ఒక మంచి కథ తయారు చేసుకుంటాడు. ఆ కథ తన గ్రామంలో నే నివసిస్తున్న ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి యదార్ధ జీవిత కథ. తన వాటా ఆస్థిని తాకట్టు పెట్టి సినిమాను తానే నిర్మించి, దర్శకత్వం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. కథను ఒక ప్రముఖ నటుడికి మరియు సినిమాటోగ్రాఫర్ కు వివరించగా వాళ్లకు నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకుంటారు.
చిత్రం మొదలు పెట్టిన దగ్గర నుండి అన్నీ కష్టాలే. డబ్బు అయిపోతుంది. డబ్బు ఇవ్వకపోతే ఎవరూ పనిచేయమంటారు. అయినా నానా కష్ఠాలు పడి సినిమా ను పూర్తి చేస్తాడు. ఇక్కడ నేను రెండు లైన్లలో సింపుల్ గా పూర్తిచేస్తాడు ని చెప్పాను. కానీ అతను సినిమా తీసేటప్పుడు పడే కష్టం చూస్తుంటే కష్టం విలువ తెలిసిన ప్రతి ఒక్కరి గుండె చెరువవుతుంది. అతను బాగా టెన్షన్ పడుతున్నా పైకి మాత్రం నిబ్బరంగా, ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తాడు. ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వుతో ఉంటాడు. అతని పరిస్థితిని చూస్తున్న మనం మాత్రం అలా ఉండలేము.
చివరికి ఎలాగోలా సినిమా పూర్తిచేస్తాడు. సినిమా విడుదల అవుతుంది. మంచి పేరు తెచ్చుకుంటుంది. రెండు జాతీయ అవార్డులు కూడా వస్తాయి. అప్పులన్నీ తీరిపోతాయి. అప్పుడు “హమ్మయ్యా!” అనిపిస్తుంది మనకు. “ఇదేంటీ కథ ఇంత త్వరగా సుఖాంతమైంది. సినిమా అయిపోయిందా” అని రిమోట్ తో ప్లే బార్ మీద నొక్కి చూశాను. ఇంకా సగం ఉంది. ఎప్పుడైనా ఏదైనా సినిమా బాగుంటే అరే అప్పుడే అయిపోయిందా ఇంకొంచెం ఉంటే బాగుణ్ణు కదా అనిపిస్తుంది. ఈ సినిమా మాత్రం అలా అనిపించలేదు. అతను సంతోషంగా ఉన్నాడు కదా ఇక అక్కడితో అయిపోతే బాగుండు అనిపించింది. సినిమా ఇంకా ఉంది అంటే ఎందుకో కాస్త భయం కలిగింది.
ఆ తర్వాత ఆస్కార్ కోసం మన దేశం నుండి పంపే చిత్రాల్లో ఈ సినిమాను రికమెండ్ చేస్తారు. ఆస్కార్ కి నామినేట్ అవ్వాలి అంటే ప్రచారం కోసం చాలా ఖర్చు పెట్టాలి అని తెలుసుకుంటాడు. తనకు ఇష్టం లేకపోయినా అందరి సలహా మీద మళ్ళీ మొత్తం తాకట్టు పెడతాడు. ఇక ఆ తర్వాత అతనికి ఆస్కార్ వస్తుందా లేదా తాకట్టు పెట్టిన ఆస్తుల్ని మళ్ళీ తిరిగి సంపాదిస్తాడా లేదా అనేది మిగిలిన సినిమా.
ఈ సినిమా నన్ను అంతగా ఎందుకు బాధించింది అంటే, ప్రతీ మనిషికీ ఏదైనా బాధని కానీ, కష్టాన్ని కానీ ఎదుర్కునే టోలరెన్స్ పుట్టుకతోనే సహజంగా ఉంటుంది. కొందరికి అది ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్న వారికి అతి చిన్న కష్టం కూడా భయం, బాధా కలిగిస్తాయి. ఒకప్పుడు అతి బాధాకరమైన కష్ఠాలు పడిన మాకు tolerance లెవెల్స్ కాస్త ఎక్కువే అని చెప్పుకోవాలి. కానీ ప్రతీ దానికి ఒక saturation పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మా tolerance లెవెల్స్ ఒక saturation పాయింట్ కి వచ్చేశాయి. ఇప్పటికీ కొన్ని చాలా ఇబ్బంది పెట్టే కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు కష్టాల్ని భరించడం కష్టంగా ఉంది. మా కష్టం సంగతి అటుంచితే కనీసం సినిమాలో కష్ఠాన్ని కూడా చూడలేకపోయాము.
ఈ సినిమా లో హీరో ఎంత సహృదయుడు అంటే, ఎవరినీ ఒక్క మాట అనడు, అందరితో చాలా అణకువగా ఉంటాడు. నేషనల్ అవార్డు వచ్చాక కూడా అంతే ఉంటాడు. కపటం, కుళ్ళు, ద్వేషం, స్వార్ధం, కోపం ఏమాత్రం కొంచెం కూడా లేని వ్యక్తి అతను. అలాంటి గుణాలేవి లేని ఒక వ్యక్తిని ఈ సమాజం బ్రతకనిస్తుందా? సినిమా తీస్తున్నప్పుడు అతని దగ్గర మేనేజర్ గా చేస్తున్న వ్యక్తి మోసం చేస్తున్నాడు తెలిసి కూడా అతనిని ఒక్క మాట కూడా అనడు. సినిమా హిట్ అయింది “పోయింది సంపాందించుకున్నాడు” అని తెలుసుకున్న కొందరు ఊరి వారు అతను చల్లగా ఉంటే చూసి ఓర్వలేక “నీ కథనే సినిమాగా తీసి సంపాదించుకున్నాడు.వెళ్లి డబ్బు అడుగు అని అతన్ని(ఎవరి జీవితాన్ని హీరో కథా మూలంగా తీసుకున్నాడో ఆ గ్రామస్తుడ్ని) ఎక్కేస్తారు.
ఇలా విసిగించేవారు ఎంత మంది ఉన్నారో అంతకంటే ఎక్కువ అతనికి స్వార్ధం కించిత్తయినా లేకుండా అడుగడుగునా సహాయ పడేవారు కూడా ఉంటారు. అసలు వారు లేకపోతే అతను ఆ సినిమాను పూర్తిచేయాగిలిగే వాడే కాదేమో. సహాయం కావాలి అని అతను ఎవ్వరినీ నోరు తెరిచి పొరబాటున కూడా అడగడు. ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు అడగకుండానే అతనికి సమయానికి నిస్వార్ధంగా సహాయం చేస్తుంటారు. అలాంటి ప్రతి సన్నివేశం మన హృదయాన్ని ద్రవింప చేస్తుంది.
ఎంతటి కష్టంలో ఉన్నా కూడా మనం మంచిగా ఉంటే, మంచిగా ఆలోచిస్తే మన చుట్టూ ఉండేవారు కూడా అలానే ఉంటారు. అందుకు నా జీవితమే ఉదాహరణ. నేను ఇంతకు ముందు నా గత పోస్ట్ లో మేము ఎన్ని కష్టాలు పడి ఈ స్థితి కి వచ్చిందీ రాశాను. నేను ఆ పోస్ట్ లో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి గురించి చెప్పాను కానీ మాకు తోడుగా నిలబడిన వారి గురించి గురించి చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను.
సాధారణంగా ఎవరైనా మనిషి కష్టంలో ఉంటే వారి జోలికి ఎవరూ పోరు. వెళితే ఎక్కడ ఆర్ధిక సహాయం అడుగుతారోనన్న భయంతో. కానీ మమ్మల్ని మా ఇంటి చుట్టు పక్కల(అపార్ట్మెంట్ వారు), మా స్నేహితులు చాలా ఆదరించారు, ప్రేమించారు. మేము ఎప్పుడూ ఎవరి దగ్గరా డబ్బు కోసం చేయి చాచింది లేదు. అడగము అని వారందరికీ తెలుసు. ఎక్కడ వారి మీద వచ్చి పడతామో అన్న భయం లేకుండా అందరూ మాతో చాలా బాగుండేవారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, మా అపార్ట్మెంట్ లోని 48 ఫ్లాట్స్ లలో ఉండేవారంతా. అసలు మా అమ్మాయిని నేను ఆడించిందే నాకు గుర్తు లేదు. పొద్దున్న దానికి పాలు తాగించే లోపే ఎవరో ఒకరు వచ్చి తలుపుకొట్టి మా అమ్మాయి కోసం వచ్చేవారు. ఎత్తుకుని వారింటికి తీసుకెళ్లేవారు. మధ్యలో అది టాయిలెట్ పోస్తే ఇంటికి వచ్చి డ్రాయర్లు అడిగి తీసుకెళ్లేవారు కానీ తనని తీసుకొచ్చి నాకిచ్చేవారు కాదు. ఇచ్చేస్తే మళ్ళీ నేను తనని ఇంట్లోనే ఉంచేసుకుంటాను అని. ఆ తడిచిన డ్రాయర్లు కూడా వాళింట్లోనే ఉతికి ఆరేసుకునే వారు. ఒక్కోసారి ఆ తీసుకెళ్లిన వాళ్ళింట్లో నుండి ఇంకొక ఇంటి వారు వచ్చి తీసుకెళ్ళపోయేవారు. నేను తెచ్చుకుందాము అంటే చివరికి పొద్దున్న నా దగ్గర నుండి తీసుకెళ్లిన వారి ఇంట్లో కాకుండా వేరే ఇంకొకరి ఇంట్లో ఉండేది. మా అమ్మాయిని అంతగా అందరూ విపరీతంగా తమ స్వంత బిడ్డలా గారాబం చేసేవారు. వినాయక చవితి వేడుకలప్పుడు మా అమ్మాయి(అప్పుడే నిల్చోవడం కొద్దిగా నడవడం వచ్చింది) స్టేజి ఎక్కి జస్ట్ చిన్నగా కొంచెం కదిలినందుకే తనేదో పెద్ద డాన్స్ చేసినట్లు అందరూ పెద్ద పెద్దగా ఈలలు, కేకలు వేసేవారు. దాని మొదటి పుట్టిన రోజుకి మేమేమి చేశామో నాకు గుర్తులేదు. వాళ్ళు మాత్రం మా ప్రమేయం లేకుండా వారే బెలూన్, రిబ్బన్ అలంకరణలు చేశారు. వాళ్ళే camcorder తెచ్చుకుని వీడియోలు తీశారు. అది ప్రేమ కాదు, పిచ్చి అని చెప్పాలి.
ఇప్పటికీ మేము వెళ్ళితే వారు మా మీద చూపించే ప్రేమ అనిర్వచనీయం. ఇప్పుడు అక్కడ చాలా మంది లేరు. చోటు, దేశాలు మారిపోయారు. అక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కువగా ఎవరితోనూ రాసుకుని పూసుకుని మాట్లాడింది లేదు. ఒక్కసారి కూడా ఎవరింటికీ వెళ్లిందీ లేదు. అసలు అవసరమైతే తప్ప గడప దాటేదాన్ని కాదు. మనం బాగున్నప్పుడు ఎవరితోనైనా కలివిడిగా ఉండొచ్చు కానీ పరిస్థితి బాగోనప్పుడు మన హద్దుల్లో మనం ఉంటేనే మనకు గౌరవం అని నేను భావిస్తాను. నేను ఎక్కువగా బయటకు రాను ఎవరితోనూ కలవను అని తెలిసినా అందరూ చాలా బాగా పలకరించేవారు. అది నా హద్దుల్లో నేను ఉండడం వల్ల నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. తర్వాత ఎప్పుడైనా అక్కడికి వెళ్తే అసలు ఎవరింటికి వెళ్లాలో తేలిక తిక మక పడేవాళ్ళము. అందరూ మా ఇంటికి అంటే మా ఇంటికి రమ్మని పిలిచేవారు.
ఇప్పుడు మాకు సహాయం చేసిన వారి గురించి చెప్తాను. మా ఇంటి ఓనర్. ఆయన, ఆయన భార్య గవర్నమెంట్ ఉద్యోగస్తులు. చాలా నీతిపరులు. లోన్ లో ఇల్లు కొనుక్కుని ఆ కొత్త ఇంటిని మాకు అద్దెకు ఇచ్చారు. 1100sqft. 2300rs అద్దె. అద్దెకు తీసుకున్నప్పుడు మా ఆర్ధిక స్థితి బాగానే ఉండేది. ఆ తర్వాత మేము ఒకరి చేతిలో మోసపోయి ఉన్న ఫళాన మొత్తం పోగొట్టుకున్నాము. అందువల్ల కనీసం అద్దె కట్ట లేని పరిస్థితి వచ్చింది. ఎందుకో తెలీదు కానీ ఆయన మమ్మల్ని ఎప్పుడూ అద్దె అడిగింది లేదు. మేము ఇచ్చినప్పుడు తీసుకునేవారు. అలా అని వారికి డబ్బు అవసరం లేదు అని కాదు. ఉన్నా కూడా మమ్మల్ని ఎందుకో అడిగేవారు కాదు. తర్వాత వారికి మొత్తం ఒక్క నెల కూడా బాకీ లేకుండా అద్దె కట్టేశాము.
కొన్ని నెలల పాటు జీతం లేకుండా మా ఇంట్లో పనిచేసిన మస్తానమ్మ. తనూ పొరబాటున కూడా అడగలేదు. డబ్బు ఇవ్వడం లేదు కదా పని ఇష్టం వచ్చినట్లు చేసేది కాదు. చాలా ప్రేమగా చేసేది. ఇక మా పరిస్థితి తెలిసి నా భర్తకి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి. ఇంతకు ముందు పోస్ట్ లో చెప్పాను కదా. ఆయన మార్వాడీ అనీ. బిస్కెట్స్ కి అచ్చులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉందీ అనీ. అందులో నా భర్తకి ఉద్యోగం కల్పించారు. వారు కూడా మేముండే అపార్ట్మెంట్స్ లోనే ఉండేవారు. మీకు తెలుసు కదా మార్వాడీలు డబ్బు విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటారో. 5 పైసలు కూడా లెక్క చూసుకుంటారు. ఒక్కోసారి 1 రూపాయే కదా అని మనం వదిలేస్తాము. ఆ ఒక్క రూపాయి ఉంటేనే కానీ 99 వంద అవ్వదు అని వాళ్ళు అనుకుంటారు. అలా ఆలోచిస్తారు కాబట్టే వాళ్ళు ఎప్పుడూ ధనికులుగా ఉంటారు. తనఖా లేకుండా రూపాయి కూడా ఎవ్వరికీ ఇవ్వరు. అలాంటిది ఆయన నా భర్తకు చదువుకోవడానికి జీతం నుండి అడ్వాన్స్ గా కొంత డబ్బు ఇచ్చారు. తర్వాత అందరికీ చెల్లించాల్సిన డబ్బు ఇచ్చేశాము.
మా ఇంటి యజమాని(ఆయనకు మేము కష్టాల్లో ఉన్న విషయం తెలీదు. ఆయన సిటీ లో ఎక్కడో చాలా దూరంలో ఉండేవారు. మాకు పెద్దగా పరిచయం కూడా లేదు. వారు మమ్మల్ని అద్దె అడగకుండా వారికి తెలీకుండానే మాకు సహాయం చేస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలీదు). ఇంట్లో పనిచేసే మస్తానమ్మ, నా భర్తకు ఉద్యోగం ఇచ్చిన మార్వాడీ ఆయన, మా ఆర్ధిక పరిస్థితిని అస్సలు పట్టించుకోకుండా, మా మీద గుసగుసలాడుతూ అనవసరంగా చెవులు కొరుక్కోకుండా మా మీద ఎనలేనంత ప్రేమ చూపిన మా అపార్ట్మెంట్ వాసులు, వీళ్లంతా నిస్వార్ధంగా మాతో ప్రేమగా ఉన్నారు. మేము ఏనాడూ వారిని ఏదీ అడిగింది లేదు. వారు మా పరిస్థితిని అర్ధం చేసుకుని, మా మీద ప్రేమ చూపించి వాళ్లకి తెలీకుండానే వారు మాకు జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహకరించారు. రక్తసంబంధం లేకపోతేనేం వీళ్ళు కదా బంధువులంటే, వీరు కదా శ్రేయోభిలాషులంటే.
నా బోసి మెడ, చేతులూ చూసి కూడా నన్ను ఎప్పుడూ ఎవరూ ప్రశ్నించలేదు. ‘ఏమైంది’ అని మాటలతో గుచ్చి గుచ్చి చంపలేదు. వాళ్ళు పేరంటానికి, చిన్న చిన్న ఫంక్షన్స్ కి పిలిస్తే వెళ్లేదాన్ని. నా ఒంటి మీద సరైన నగలు, బట్టలు లేవు కదా అందరూ చిన్న చూపు చూస్తారు అన్న ఆలోచన, భయం, ఆత్మనూన్యతాభావం నాకు లేవు. అసలు పక్కవారు ఎలా ఉన్నారో వారి మెడలో ఏమేమి ఉన్నాయో చూడాలని కానీ, తెలుసుకోవాలని కానీ నాకు ఎప్పుడూ ఆసక్తి లేదు. అది నాకు అసలొక విషయమే కాదు. విచిత్రంగా నేను వెళ్లిన ఫంక్షన్ లో కూడా నన్ను ఎవరు చులకనగా కానీ తేలిగ్గా కానీ చూడలేదు ఎప్పుడూ. నేను కాకుండా వేరే ఎవరైనా అయితే అనేవారేమో తెలీదు. అది కేవలం నా ప్రవర్తన వల్ల నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను.
మనం ఆలోచించే విధానం, మన ప్రవర్తన రిచ్ గా(హుందాగా) ఉంటే మన శరీరంపై సహజంగా ఆ రిచ్ నెస్ అనేది ప్రతిబింబిస్తుంది. అది ఏడువారాల నగలేసుకున్నా, ఎనిమిది వారాల బట్టలేసుకున్నా రాని రిచ్ నెస్. ఇతరులతో మనం మాట్లాడే ప్రతీ మాటా విలువైనదిగా ఉండాలి, ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన కళ్ళు మాట్లాడాలి, నోరు చూస్తుండాలి అంతే.
నేను చూసిన ఆ సినిమా లో హీరో కి అందరూ తోడుగా నిలబడడం చూసి మాకు మా జీవితం గుర్తుకువచ్చింది. ఆర్ధిక సహాయం కన్నా నైతిక సహాయం చాలా గొప్పది.
ఎవరైనా మనకి సహాయం చేయకపోయినా పర్లేదు. ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. ప్రేమించకపోయినా పర్లేదు హింసించకుండా ఉంటే అంతే చాలు కదా. మనం మన మనసులో కపటం, ద్వేషం, అసూయ లేకుండా మంచిగా ఆలోచించ గలిగితే మన చుట్టూ ఉండే పరిస్థితులు, వ్యక్తులు కూడా మనకు అనుకూలంగా మారతారు అనడానికి నేను పైన చెప్పినవారంతా నిదర్శనం.