మన అందరి బాల్యం, యవ్వనం ఎన్నో తీపి జ్ఞాపకాలతో లేదా చేదు అనుభవాలతో నిండి ఉంటుంది.కానీ మనం అందులోని తీపి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ మిగతా జీవితాన్ని మెల్లిగా వెళ్ళదీస్తాము.ఆ జ్ఞాపకం ఒక ప్రదేశం, వ్యక్తి, సంఘటన ఇలా ఏదైనా కావొచ్చు.ఆ జ్ఞాపకాలతో కూడిన ప్రదేశాలను, వ్యక్తులను ఒక్కసారి మళ్లీ చూస్తే బాగుండుననిపిస్తుంది.
నాకూ అలానే అనిపిస్తుంటుంది.నా జ్ఞాపకాలలో వ్యక్తుల కన్నా ఎక్కువగా ప్రదేశాలే ఉన్నాయి.ఏ కాస్త ఖాళీ సమయం చిక్కినా, నా మధుర జ్ఞాపకాలను చాపలుగా పరచి వాటి మీద మా అమ్మాయని, నా భర్తని కూర్చోబెట్టి ఎంచక్కా Aladin carpet మీద వెళ్లినట్టు గాల్లో తేలుతూ అక్కడికి వెళ్లిపోవాలనిపిస్తుంది.
మా పెళ్ళవక ముందే మా ఆయనకి కొన్ని షరతులు పెట్టాను.తను వాటికి ఒప్పుకున్నాకే పెళ్ళి చేసుకున్నాను.అవేంటంటే నాకు నా జీవితం మొత్తంలో ఒక్క రోజు కూడా అన్నంలోకి నెయ్యి కానీ, స్నానానికి వేడి నీళ్ళు కానీ(చాలా సిల్లీ షరతులు కదా! 🙂 ) ఎట్టి పరిస్తితులలోనూ మిస్ కాకూడదు.ఇంకా నేను చిన్నప్పుడు ఉండి వచ్చిన ప్రతీ ప్లేస్ కి నన్ను మళ్ళీ తీసుకెళ్ళాలి అని.తను సరే అన్నారు.అన్నట్లుగానే మాట నిలబెట్టుకున్నాడు.మా ఆయనతో ఒకటే ప్రాబ్లం ఏదైనా కావాలని అసలు అడగనే కూడదు.ఒకవేళ అడిగామా అంటే అది కచ్చితంగా చేసే తీరుతారు.అడిగిన నేనే స్వయంగా వద్దు అన్నా వినిపించుకోరు.అదో రకం శాడిజం.ఏం చేస్తాం.అందుకే ఒక్కోసారి ఏదైనా అడగాలనిపించినా మానుకుంటాను.ఎందుకంటే తర్వాత నాకు “వద్దులే అనే” ఆప్షన్ అసలు ఎట్టి పరిస్తితులలోనూ ఉండదు.తను మాటిచ్చినట్లే నన్ను విడతల వారిగా నేను చిన్నప్పుడు ఉండి వచ్చిన ఒక్కో ప్లేస్ కి తీసుకెళ్తూ వస్తున్నారు.అన్ని చోట్లకి ఎంతో ఉత్సాహంతో వెళ్లాను.కానీ వెళ్ళాక నా ఉత్సాహం అంతా నీరుకారిపోయింది.
నా స్వానుభవంతో నాకు ఒక విషయం బాగా బోధపడింది.అదేంటంటే నాటి తీపి జ్ఞాపకాలని నేటి వాస్తవాలుగా చూడాలనుకుంటే చివరకు మనకు మిగిలేది చేదేనని.ఉదాహరణకి కొన్ని.
మొదటి ఉదాహరణ
నాడు శ్రీశైలం- 2001
అప్పుడు నేను డిగ్రీ చదివే రోజులు.అది అక్టోబర్ మాసం.ఇంకా నాలుగు రోజులలో దసరా సెలవులు మొదలవుతాయనగా మా స్నేహితులందరం గెట్ టు గెదర్ ప్లాన్ చేసుకున్నాం.అప్పుడే మా నాన్న శ్రీశైలం నుండి పాల్వంచ వచ్చారు.నాన్న అప్పట్లో శ్రీశైలం Power Project లో Busducts Erection work చేస్తుండేవారు.”రేపే మనం శ్రీశైలం వెళ్తున్నాం”బయలుదేరమన్నారు.నాకు నా friends ని, సరదాలని వదిలి అక్కడికి వెళ్ళడం ఏ మాత్రం ఇష్టం లేదు.అదే మా parents కి చెప్పాను.కాదు రావలసిన్దేనని పట్టు బట్టారు.ఎలాగోలా తప్పించుకుందామని “సెలవుల తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి, క్లాసెస్ మానేస్తే principal ఊరుకోరని చెప్పాను.వెంటనే మా principal కి ఫోన్ చేసి అడిగితే అయన “దానిదేముంది శుభ్రంగా వెళ్ళిరండి”అన్నారు. అడగ్గానే పర్మిషన్ ఇచ్చినందుకు నేను ఆయన్ని తెగ తిట్టుకున్నాను.
ఆ మరుసటి రోజు బయలుదేరక తప్పింది కాదు.ప్రయాణం దారిలో నేను ఎవ్వరితోను ఒక్క మాట కూడా మాట్లాడలేదు.వెళ్లేసరికి రాత్రయింది.వెళ్ళగానే స్నానం చేశాను. ఎంత బ్రతిమాలినా అన్నం తినకుండా కోపంతో అలిగి అలసి నిద్రపోయాను.ఎవరో చిన్నగా పిలుస్తున్నట్టు అనిపించడంతో మెల్లగా కళ్ళు తెరిచాను.ఎదురుగా మా నాన్న.కోపంతో తల అటు తిప్పుకొని పడుకున్నాను.నన్ను నిద్ర లేవమన్నారు మా నాన్న.నేను అసలు మాట్లాడలేదు,కదల్లేదు.”అమ్మా! లేమ్మా” అని అయన బ్రతిమాలుతూనే ఉన్నారు.ఒక పావు గంట తరవాత విసుగొచ్చి నేనే ఇక తప్పదన్నట్లుగా లేచి మా నాన్న ఇచ్చిన బ్రష్ ని విసురుగా లాక్కొని brush చేసుకొని వచ్చాను.”ఈయన చాదస్తం కాకపోతే అక్కని, అమ్మని లేపకుండా నన్నొక్కదాన్నే ఇలా ఎందుకు torture చేస్తున్నాడా” అని అనుకున్నాను. ” వెళ్దాం పద” అన్నారు.”ఎక్కడికి” అని కూడా అడగాలనిపించక చెప్పులేసుకొని వెంట బయలుదేరాను.కనీసం టైం ఎంతయిందో కూడా చూసుకోలేదు.
చిన్నప్పుడు ఎప్పుడో ఊహ తెలీని వయసులో ఒకసారి అక్కడికి వెళ్ళాను.అందుకే నాకు అసలు ఆ ఊరు ఎలా ఉంటుందో తెలీదు.అసలైతే కంపెనీ వారు మాకు ఇచ్చిన ఇల్లు Domalapenta(Oh! God ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారో) లో ఉంది.కానీ దేవీ నవరాత్రులు ముగిసేవరకు అక్కడే(గుడికి దగ్గరగా) ఉండాలన్న ఉద్దేశ్యంతో శ్రీశైలంలో 10 రోజులకి cottage అద్దెకు తీసుకున్నారు.
నేను నడుస్తున్నాను.బయట ఇంకా చీకటిగానే ఉంది.బాగా చలిగా కూడా ఉంది.ఎక్కడి నుండో మెల్లిగా “ఓం నమః శివాయ ” అని మంత్రోచ్చారణ(చాంటింగ్) వినిపిస్తుంది.అది వింటుంటే ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది.ఒక మూడు నిమిషాలు నడిచేసరికి ఒక రోడ్డు అడ్డంగా వచ్చింది.దాని మీదకు ఎక్కి కుడి వైపుకి తిరిగితే అది ఎంతో విశాలంగా,పొడవుగా అనిపిచింది.స్ట్రీట్ లైట్ ల కాంతిలో ఆ వీధి ఎంతో శుభ్రంగా అనిపిచింది. స్ట్రీట్ లైట్ల కింద మంచు పొగ లాగ దట్టంగా కనిపిస్తుంది.రోడ్డుకి ఇరువైపులా అక్కడక్కడా వరుసగా పెద్ద పెద్ద రావి చెట్లు,వాటి కింద కూర్చోడానికి వీలుగా సిమెంట్ గట్లు గుండ్రంగా కట్టబడి ఉన్నాయి.వాటి మీద అక్కడక్కడా కొంత మంది దుప్పటి ముసుగుదన్ని పడుకుని ఉన్నారు.రోడ్డు మీద నేను, నాన్న తప్ప వేరెవరు లేరు.ఒక నిమిషం నడిచి ముందుకు వెళ్లేసరికి అక్కడ “ఓం నమః శివాయ ” ఇంకా కొంచెం పెద్దగా వినపడుతుంది.అక్కడ చెట్టుకి లౌడ్ స్పీకర్ కనిపించింది.అక్కడ నాన్న ఆగి, ఎడమవైపు వైపుకి చూపి “లోపలికి పద” అన్నారు. అక్కడ నాకు ఒక గేటు లేని పెద్ద ద్వారం కనిపించింది.ద్వారానికి పక్కనే ఉన్న చిన్న కొట్టు కం STD booth లోని వ్యక్తి మా నాన్నకి నమస్కారం చేసి “మీ అమ్మాయా!సర్”అని అడిగాడు.మా నాన్న కూడా ప్రతి నమస్కారం చేసి “అవును” అన్నారు.
గేటు లోపలకి వెళ్ళగానే అక్కడ నాపరాళ్ళతో వేసిన బెంచీలు కనిపించాయి.అక్కడ ఉన్న బిల్డింగ్ మీద “కాంటీన్ 1 ” అని రాసి ఉంది.లోపల హడావిడిగా తిరుగుతున్న మనుషులు,ఇంకా గిన్నెల శబ్దాలు వినిపించాయి.”బహుశా ఇవాల్టి టిఫిన్ లు, భోజనాల తయారికి సిద్దం చేసుకుంటున్నారేమో” అనుకునున్నాను. మా నాన్న నా వైపుకి తిరిగి “నేను కాసేపట్లో వస్తాను.నువ్వు ఇక్కడే ఉండు,ఉంటావుగా?”అని వెళ్ళిపోయారు. ఒంటరిగా కూర్చోడానికి లోపల భయంగా ఉన్నా, మాట్లాడితే నా బెట్టు సడలిపోతుందని “ఎక్కడికి” అని కూడా అడగలేదు.ఆయన వెళ్ళిపోయారు.చుట్టూ చూసాను.ఇంకా చీకటి గానే ఉంది.ఎక్కడి నుండో తియ్యని పరిమళం నా నాసికను తాకింది.ఎడమవైపుకి చూస్తే అక్కడ చెట్లు కనిపించాయి.వాటి పూలు కొన్ని బెంచిలపైన రాలి పడి ఉన్నాయి.వాటి తాలూకు సుగంధం అది.కాసేపు అటు ఇటు చూసి ఏం తోచక బెంచి మీద తలానించుకొని పడుకున్నాను.ఇంకా “ఓం నమః శివాయ” చాంటింగ్ మైకు లోనుండి వినిపిస్తూనే ఉంది.అది వింటూ ఎప్పుడు నిద్ర పట్టేసిందో నాకే తెలీదు.
అప్పటిదాకా శివ నామ స్మరణ కి అలవాటుపడిన నా చెవికి ఏదో వేరే పెద్ద శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి లేచాను.చీకటి స్థానంలో సన్నని వెలుగు వచ్చింది.ఆ వచ్చేది drum ఇంకా bell శబ్దం.అది కూడా మైకులోనుండే వస్తుంది.ఆ శబ్దానికి నా శరీరం అదురుతున్నట్లుగా అనిపించింది.కాని అది నాకెంతో నచ్చింది.అప్పటివరకు విన్న శివనామ శబ్దం మనసుకు ప్రశాంతతనిస్తే, ఇప్పుడు విన వస్తున్న drum అండ్ bell శబ్దం ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించే విధంగా ఉంది. ఒక రెండు మూడు నిముషాలు ఆ శబ్దం వచ్చింది.అది ఆగగానే నా దృష్టి మైకు కట్టబడిన రావి చెట్టు మీద పడింది.ఒక పెద్ద,ఎంతో అందమైన రామచిలుకల గుంపు ఉంది. అవి అరుస్తూ ఎగురుతూ మళ్ళీ చెట్టు మీద వాలుతున్నాయి.అదే సమయంలో మంచు కూడా తుంపరలుగా మీద కురుస్తుంది.
మా నాన్న తిరిగొచ్చారు.అయన గుడిలోకి సుప్రభాత సేవకి వెళ్లి వచ్చారని నుదుటి మీద తిలకం,విభూతి చూస్తే అర్ధం అవుతుంది. ఈలోపు కాంటీన్ లోపల నుండి సర్వర్ బయటకి వచ్చి రెండు ఫిల్టర్ కాఫీ గ్లాసులు అక్కడ పెట్టి, నాతో పలకరింపుగా నవ్వాడు.గ్లాసు తీసుకొని ఒక చిన్న గుటక వేశాను.కాఫీ ఎంతో రుచిగా ఉంది.వేడి వేడి కమ్మని కాఫీ, అందమైన రామచిలుకలు, కమ్మని పూల పరిమళం, చల్లని ఆ మంచు తుంపరలు, అది చూడడానికి రెండు కళ్ళు మాత్రం నిజంగా సరిపోవు.ఆ ఆనందం అనుభవించడానికి నిజంగా ఒక్క జన్మ మాత్రం సరిపోదు.ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేని సహజానందం అది.
ఆ క్షణాన నా friends ని, నా ఎగ్జామ్స్ ని, నా గెట్ టు గెదర్ పార్టీ ని అన్నిటినీ పూర్తిగా మర్చిపోయాను.నేను బెట్టుగా ఉండాలన్న విషయం కూడా మర్చిపోయాను.ఉత్సాహంగా మా నాన్నతో మాట్లాడడం మొదలు పెట్టాను.గత సంవత్సర కాలంగా నాన్న రోజూ ఈ టైం కి గుడికి వెళ్ళి తర్వాత అక్కడ ఫిల్టర్ కాఫీ తాగి వెళతానని చెప్పారు.
ఇక దేవీ నవరాత్రులు ముగిసేవరకు అక్కడే ఉండిపోయాము.రోజూ పొద్దున్నే నాన్నతో వాకింగ్ కి వెళ్లి కాంటీన్ 1 లో ఫిల్టర్ కాఫీ తాగడం, సాయంత్రం అక్కా నేను గుడికి వెళ్ళిపోయి వెనుక అమ్మవారి గుడి దగ్గర కూర్చోవడం చేసేవాళ్ళం.ఇప్పటిలా అప్పుడు గుడికి అంత సెక్యూరిటీ ఉండేది కాదు.ఇప్పటితో పోలిస్తే అప్పుడు భక్తుల తాకిడి కుడా చాలా తక్కువగా ఉండేది.అందుకే మా ఇష్టం వచ్చినప్పుడల్లా గుడికి వెళ్ళిపోయేవాళ్ళం.ఒక్కోసారి వెనక ద్వారం నుండి కూడా వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ వెనుక అమ్మవారి గుడిలో పెద్ద అయ్యగారు, వారి భార్య వుండేవారు.బహుశా వారు అరవ వారనుకుంటా.వారివురిని చూస్తే ఆదిదంపతుల్లా చక్కగా చూడ ముచ్చటగా ఉండేవారు.అయ్యగారి భార్య అక్కడికి వచ్చే ఆడపిల్లలని, వారి అమ్మలను కమ్మగా పలకరించేవారు.బొట్టు పెద్దగా లేకపోయినా, చేతులకు గాజులు లేకపోయినా చెడామాడా తిట్టేసేవారు.నేతితో చేసిన రవ్వ కేసరి, గుగ్గిళ్ళు, పులిహోర ప్రసాదాలు ఆకుల్లో పెట్టి ఇచ్చేవారు.
ఇక సాయంత్రం ఊరేగింపు సమయానికి ముందే గుడిలో నుండి బయటకు వచ్చి, తొందరగా వెళ్లి స్నానం చేసి వచ్చి మళ్ళీ కాంటీన్ 1 రోడ్ లో దేవతామూర్తుల దివ్య మంగళ స్వరూపం కళ్ళారా చూడడానికి సిమెంట్ చప్టా మీద ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళం.ఊరేగింపు కన్నా ముందే టాంకర్ తో రోడ్లన్నీ తడిపేవారు.తర్వాత ఊరేగింపు ముగిసేవరకు ఉండి రూమ్ కి బయలుదేలేవారం.దారి మధ్యలో అపూర్వ మెస్ కి వెళ్లి అక్కడ raspberry ఐస్ క్రీమ్ తిని, ఆ మెస్ పక్కనే ఉన్న ఇంకో హోటల్ లో పునుగులు కానీ బజ్జీలు కానీ తిని రూమ్ కి వెళ్ళిపోయేవాళ్ళం.ఇదే మా దినచర్య.
తర్వాత చాలాసార్లు శ్రీశైలం వెళ్ళాం.ఎప్పుడు వెళ్ళినా ఇదే పని.దోమలపెంట లో ఉంటే మాత్రం నాన్న డామ్ మీదకు, ప్రాజెక్ట్ హాస్టల్ కి లేకపోతే పవర్ హౌస్ కి తీసుకెళ్ళేవారు.శ్రీశైలం అయితే అచ్చు ఏదో సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ లా అందంగా ఉండేది.రోడ్ లు చాలా శుభ్రంగా ఉండేవి.గంగ సదన్, శివ సదన్ అప్పుడే కట్టడం పూర్తయింది.అవి కూడా ఎంతో అందంగా రిసార్ట్ లా ఉండేవి.అక్కడున్నన్ని రోజులు హాయిగా ఊరంతా తిరిగి వచ్చేవాళ్ళం.మొత్తం మీద ఆ అనుభూతి ఎన్నటికి మరువలేనిది.
తర్వాత 2002
పెళ్ళయిన కొద్ది రోజుల తర్వాత మా ఆయనకు శ్రీశైలం గురించి రకరకాలుగా వర్ణించి చెప్పి తనని కూడా చలికాలంలోనే తీసుకెళ్ళాను.అదే మంచు తుంపరలు, అదే కాంటీన్ 1, అవే చిలుకలు, అవే అందమైన రోడ్లు ఏ మార్పు లేదు.తను కూడా అచ్చు నాలానే అనుభూతి చెందాడు.ఎప్పటికి మర్చిపోలేనన్నాడు.
మళ్ళీ 2004
మా అమ్మాయికి చెవులు కుట్టించడానికి కుటుంబం అందరం కలిసి వెళ్లాము.అప్పుడు చూస్తే పొరపాటున దారి తప్పి వేరే ఊరు వెళ్ళామేమో అనిపించింది.రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, చెత్త చెదారం, ఉమ్ములతో నిండి ఉన్నాయి.గుడికి సెక్యూరిటీ ఏర్పాటు చేసారు.గంగా సదన్ మరియు గౌరీ సదన్ మెయింటెనెన్స్ లేక సగం కళ తగ్గినట్లుగా అనిపించాయి.బయట లాన్ లో గడ్డి కూడా ఎగుడు దిగుడుగా ఉంది.చాలా హోటల్స్ కూడా వెలిశాయి.సాయంత్రం అందరం పాతాళగంగ దారిలో ఉన్న పార్క్ కి వెళితే అక్కడ గడ్డిలో చించి పారేసిన కండోమ్ కవర్స్, ఆల్కహాల్ బాటిల్స్ కనిపించాయి.ఎందుకో మనసు వికలమైంది.తర్వాత చాలా రోజుల వరకు ఎందుకో ఇంక శ్రీశైలం వెళ్ళాలనిపించలేదు.ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళినా అక్కడ ఎక్కువసేపు ఉండకుండా దర్శనం అయిన వెంటనే దోమలపెంట కి వచ్చేసే వాళ్ళం.
నేడు 2016
మొన్న డిసెంబర్ లో వెళ్ళినప్పుడు పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా అనిపించింది.బహుశా రాబోయే శివరాత్రి కోసం అనుకుంటా చాలా మరమ్మత్తులు చేస్తున్నారు.రోడ్లు ఇంకా అపరిశుభ్రంగా తయారయ్యాయి.ఏదో అభివృద్ధి చెందుతున్న మహానగరంలా కొత్తగా లెఖ్ఖలేనన్ని భవంతులు కడుతున్నారు.పచ్చటి చెట్ల మధ్య ఉండవలసిన దేవస్థానం ఇలా కాంక్రీట్ చెట్ల మధ్య ఉండడం నాకెందుకో చాలా అసహజంగా అనిపించింది.
పాత అనుభూతిని స్మరించుకుంటూ వెళ్ళిన ప్రతిసారీ మాకు చేదు అనుభవమే మిగిలింది.
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-2
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-3
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-4
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-5
Leave a Reply