ఉదాహరణ 2
నా చిన్నప్పుడు మేము పాల్వంచ లో మా నాన్న పనిచేసే ప్రైవేటు కంపెనీ కి చెందిన ఒక చిన్న, 10 ఇళ్ళు మాత్రమే ఉండే కాలనీ లో ఉండేవాళ్ళం.ఆ కాలనీ ఎంతో అందంగా, అద్భుతంగా ఉండేది.దాదాపు పది ఎకరాలలో కాలనీ ఉండేది.కానీ 3 ఎకరాలలో మాత్రమే ఇళ్ళు ఉండేవి.కాలనీ చుట్టూ fencing ఉండేది. తూర్పు వైపు ఫెన్సింగ్ ను ఆనుకుని వరుసగా పెద్ద పెద్ద నేరేడు చెట్లు ఉండేవి.ఉత్తరం వైపు రోడ్డు కి ఆనుకొని కాలనీ గేటు ఉండేది.అది చాలా పెద్ద గేటు.దాదాపు 20 అడుగుల వెడల్పు,12 అడుగుల ఎత్తు ఉంటుంది.గేటుకి ఆధారంగా రెండు వైపులా గేటు ఎత్తు సిమెంట్ దిమ్మెలు ఉంటాయి.గేటుకి ఎడమ వైపు పెద్ద నాగమల్లి చెట్టు ఉండేది.నేను రోజు గేటు మీద నుండి ఎడమ వైపు సిమెంట్ దిమ్మె మీదకు ఎక్కి అక్కడ కుర్చునేదాన్ని. నాగమల్లి చెట్టు కొమ్మలు ఆ ఎడమ పిల్లర్ మీద పడుతుండేవి.ఇక పూలయితే చేతికే అందేవి.వాటిని చూస్తూ ఎంతో ఆనందించేదాన్ని.
గేటు లో నుండి లోపలకు రాగానే ఇరువైపులా పున్నాగ పూల చెట్లు ఉండేవి.కాలనీ అంతా ఎక్కడ చూసినా సన్నజాజి, విరజాజి, మల్లె చెట్లు.ఉత్తరం వైపు ఫెన్సింగ్ లో ఇళ్ళు ఉన్న వరకు అశోక చెట్లు ఫెన్సింగ్ ను ఆనుకుని ఉండేవి.ఇక మిగిలిన ఫెన్సింగ్ అంతా గోరింటాకు చెట్లే.పెద్ద గాలి వర్షం వచ్చినప్పుడు అశోక చెట్లు బాగా కిందకు వంగేవి.భయం వేసేది.3 ఎకరాలలో ఇళ్ళు ఉంటే మిగిలిన ఏడెకరాలలో మామిడి తోట ఇండేది.అందులో మా ఇంటి వైపు నానుకొని జామ తోట ఉండేది.జామ కాయలు చెట్టు మీదే కూర్చుని తినేవాళ్ళం కోతుల్లాగా.ఇక కాలనీ నిండా పాములే.కనీసం వారంలో ఒక్క పామైనా కనపడేది.
మా అమ్మ అయితే అన్ని కూరగాయ మొక్కలు పెట్టేది.ఒక్క కూర అరటికాయలు, గుమ్మడి కాయలు తప్ప దాదాపు అన్ని కూరగాయలు మా ఇంట్లోనే పండించేవాళ్ళం.కూరగాయలు అందరికీ పంచేవాళ్ళం.సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుండి దాదాపు రాత్రి 8 గంటల వరకు ఆడుకునేవాళ్ళం కాలనీ లోని పిల్లలమంతా.రాత్రి పున్నాగ పూలు రాలి నేల మీద పడేవి.కమ్మని ఆ పూల సువాసన ఎంతో ఆద్భుతంగా ఉండేది.దారం లేకుండానే ఆ రాలిన పూలతో ఒకదానితో ఒకటి జడ అల్లినట్టుగా అల్లుతూ మాలలు కట్టేవాళ్ళం.నేను చిన్నప్పటి నుండే విపరీతమైన ప్రకృతి ప్రేమికురాలిని.అందుకే “దేవుడా!జీవితాంతం నేను ఈ కాలనీ లోనే ఉండేలా చెయ్యి స్వామీ” అని ఎప్పుడూ అనుకునేదాన్ని.కానీ ఆ కాలనీ లో మేము 4 సంవత్సరాలు మాత్రమే ఉన్నాము.నా 4 నుండి 7 వ తరగతి వరకు.తర్వాత మా నాన్నకి అప్పర్ సీలేరు కి ట్రాన్స్ ఫర్ అవడం వల్ల మేము మా స్కూల్ కి దగ్గరగా ఇల్లు మారిపోవాల్సి వచ్చింది.
కానీ ఆ కాలనీ ని అస్సలు మర్చిపోలేక పోయాను.తర్వాత మళ్ళీ వెళ్ళడానికి చాలా సార్లు ట్రై చేశాను.కానీ వీలుపడలేదు.అప్పటికే దాని గురించి మా ఆయనకీ మా అమ్మాయికి ఎన్ని సార్లు చెప్పి ఉంటానో లెక్కే లేదు.వర్చ్యువల్ టూర్ కి కూడా వెళ్లి వచ్చారు వాళ్ళిద్దరూ.పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత మా ఆయన తో కలిసి వెళ్లాను.చెప్పలేనంత ఆనందంతో క్రిందికి దిగిన నాకు ఎండిపోయిన చెట్లు, గేటు ఎదురుగా బక్కచిక్కి డొక్కలు బయట పడ్డ చిన్న కుక్క పిల్ల, పాడుబడి పోయిన కాలనీ కనిపించింది.ఇంకా పూర్తిగా లోపలి వెళ్ళకుండానే గేటు లోంచే వెనక్కి తిరిగి వచ్చేశాను కళావిహీనంగా మారిన నా పాత జ్ఞాపకాన్ని చూడలేక.చాలా బాధ పడ్డాను.అనవసరంగా వెళ్లి తప్పు చేశానేమో అనిపించింది.నా ప్రమేయం లేకుండానే నా పాత జ్ఞాపకం స్థానంలో కొత్త నిజం వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంది.
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-1
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-3
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-4
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-5