ఉదాహరణ 4
నేను పుట్టిన దగ్గర నుండి నాకు 3 సంవత్సరాలు వయసు వచ్చే వరకు మేము నాగార్జున సాగర్ హిల్ కాలనీ లో ఉండేవాళ్ళం.నాకు గుర్తున్నంత వరకు నేను మా అమ్మతో కన్నా ఎక్కువ మా పని మనిషి జయ లక్ష్మి తో లేదా పక్కింటి లక్ష్మి ఆంటీ వాళ్ళింట్లో ఎక్కువగా ఉండేదాన్ని.జయ లక్ష్మి కి నేనంటే బాగా ఇష్టం.విపరీతంగా గారాబం చేసేది.ముద్దొచ్చి నప్పుడల్లా నా బుగ్గలు కొరికేది.నేను నాకు వచ్చిన భాషలోనే ఏదో తిట్టేదాన్ని నొప్పి వల్ల.ఇక మా పక్కింటి లక్ష్మి ఆంటీ.విపరీతంగా లావుంటారు.చాలా మంచి ఆవిడ.వాళ్లకి పెళ్ళయి చాలా సంవత్సరాలైనా పిల్లలు కలగ లేదు.అందుకే నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళి ఎప్పుడూ తనతోనే ఉంచుకునేది.లక్ష్మి ఆంటీ వాళ్ల హస్బెండ్ కి నేను స్టూల్ వేసు కొని వీపు రుద్దేదాన్ని ఆయన స్నానం చేసేటప్పుడు.వాళ్ళు నన్ను చాలా మురిపెంగా చూసేవాళ్ళు.నా ముక్కు లావుగా ఉంటుందని “ఒసేయ్! బండ ముక్కు దానా” అని అంటుండే వారు.
తర్వాత మేము నాగర్జున సాగర్ నుండి ఒరిస్సా వెళ్ళిపోయాము.ఇదంతా నాకు పెద్దయ్యాక అమ్మ చెప్పింది.లక్ష్మి ఆంటీ కి పిల్లలు లేరు.అందుకే నిన్ను బాగా చూసుకునే వారని.నాకు అవన్నీ తెలియక పోయినా ఆంటీ నన్ను చాలా బాగా చూసుకునే వారని మాత్రం తెలుసు.అందుకే తనని తర్వాత ఎలా అయినా ఒక్కసారి చూడాలని బాగా అనిపించేది.మా ఆయన ముంబై లో ఉన్నప్పుడు ఒకసారి అనుకోకుండా అమ్మా నాన్న లతో కలిసి నాగార్జునసాగర్ సాగర్ వెళ్ళాం.ఇంకా లక్ష్మి ఆంటీ వాళ్ళు అదే ఇంట్లో ఉంటున్నారు.నేను ఎంతో ఆత్రుతతో వెళ్లాను.ఆంటీ ఇప్పుడు ఎలా ఉన్నారో అసలు గుర్తు పడతారో లేదో అని.
అమ్మా నాన్న వాళ్ళని దాక్కోమని తలుపు తీయగానే నేనే ఎదురు నిలబడ్డాను.ఆవిడ నన్ను గుర్తు పట్టలేదు.”ఎవరమ్మా” అని అడిగింది.” గుర్తు పట్టండి చూద్దాం” అన్నాను.”పోనీ కనీసం ఈ ముక్కు చూసి అయినా గుర్తు తెచ్చుకోండి” అన్నాను.వెంటనే స్ట్రైక్ అయినట్లు “ఓహ్!బిందు నా” అన్నారు.అందర్నీ లోపలకి రమ్మన్నారు.కానీ ఎందుకో నాలో ఉన్న ఎక్సైట్ మెంట్ తనలో కనపడలేదు.ఆమె చాలా మామూలుగా ఉన్నారు.చాలా రోజుల తర్వాత నన్ను చూసిన ఆనందం ఏమి కనిపించలేదు.నేను చాలా ఫీల్ అయ్యాను.ఇప్పటి దాకా నా ఊహల్లో ఉన్న ఆమె రూపం, ఆమె ప్రేమ అంతా ఇప్పటి సంఘటనతో తుడుచిపెట్టుకు పోయాయి.అనవసరంగా వెళ్ళాననిపించింది.
ఆంటీ ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారంట.మేము వెళ్లక ముందు రెండు రోజుల ముందే అంకుల్ ని హైదరాబాద్ నుండి ఇంటికి తీసుకు వచ్చారంట.ఆయనకి బై పాస్ సర్జరీ అయింది.అందుకే ఆవిడ అలా డల్ గా ఉన్నారనుకుంటా.నేను నా వైపు నుండి ఆలోచిస్తున్నాను కాబట్టి ఆమెప్రవర్తన నాకు బాధ అనిపించింది.కానీ ఆవిడ వైపు నుండి ఆలోచిస్తే కొన్ని బాధల్లో ఉన్నపుడు ఫీలింగ్స్ express చేసే అంత ఓపిక ఉండదు అనిపించింది.బహుశా నేను వెళ్ళిన టైమింగ్ కరెక్ట్ కాదనుకుంటా.ఏది ఏమైనా ఎంతో ఆశతో ఆంటీ కలుద్దామని వెళ్ళిన నాకు చేదు అనుభవమే మిగిలింది.
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-1
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-2
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-3
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-5
Leave a Reply