ఉదాహరణ 5
నేను పైన చెప్పాను కదా తర్వాత ఒరిస్సా వెళ్ళిపోయామని.ఒరిస్సా లో కొన్ని రోజులు కటక్ లో ఉన్నాము.అక్కడ తులసీ పూర్ లో TV టవర్ కట్టే కాంట్రాక్టు మా నాన్న పనిచేసే కంపెనీ వారికి వస్తే వాళ్ళు మా నాన్నను అక్కడ సైట్ ఇంఛార్జ్ గా వేశారు.తర్వాత మా నాన్నను అప్పర్ కొలాబ్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల బరినిపుట్ కి వెళ్ళిపోయాము.బరినిపుట్ Jeypore నుండి మహా అయితే ఒక 5 నుండి 6 km దూరం ఉంటుందేమో.నన్ను అక్కను Jeypore లోని Red woods స్కూల్ లో జాయిన్(2nd క్లాస్) చేశారు.అక్కడ తెలుగు బదులు ఒరియా ఫస్ట్ లాంగ్వేజ్ గా ఉండేది.కష్టం అనిపించేది.రోజు Bariniput నుండి Jeypore కి స్కూల్ వాన్ లో వెళ్లే వాళ్ళం.
ఆ స్కూల్ ప్రిన్సిపాల్ స్కూల్ లోనే స్మోక్ చేసేవారు.ఆయన భార్య ఆయనకి రెండో భార్య.ఆవిడ పేరు రోజీ మిస్.సూర్యకాంతం గారు కొన్ని సినిమాలలో స్లీవ్ లెస్ బ్లౌజ్ ఇంకా బాబ్ హెయిర్ తో కనిపిస్తారు కదా!అదుగో అచ్ఛు అలానే ఉండేది ప్రిన్సిపాల్ గారి భార్య.ఆయన మొదటి భార్య కి ఒక కూతురు ఉండేది.ఆ అమ్మాయి కూడా ఆ స్కూల్ లోనే చదివేది.తన పేరు Melony.ముట్టుకుంటే కాదు గాలి తగిలితేనే మాసిపోయేంత సుకుమారి.చాలా అందంగా కూడా ఉంటుంది.చాలా మంచి అమ్మాయి పైగా మృదు స్వభావి.ఎందుకో తెలీదు కానీ రోజీ మిస్ రోజు ఉదయం స్కూల్ కి రాగానే కారణం ఉన్నా లేకపోయినా Melony అక్కని ఫాట్ మని కొట్టేవారు.బెల్ట్ తో కూడా కొట్టేది.ఆమె ఒళ్ళంతా ఎర్రని వాతలు తేలేవి.నాకైతే ఆ రాక్షసిని కూడా అలానే ఎవరైనా కొడితే బాగుండు అనిపించేది.ప్రిన్సిపాల్ గారు కూడా అక్కని కొడుతుంటే సిగరెట్ కాలుస్తూ చూసేవారు తప్ప ఆపేవారు కాదు.
ఇంక మేము ఉండే కాలనీ ఇంకా ప్లేస్ గురించి చెప్పాలి.అది ఒక అద్భుతం.నాకు తెలిసిన భూతల స్వర్గం అంటే అదే.మా కాలనీ రోడ్డు పక్కనే ఉన్న ఒక చిన్న లోయలో ఉండేది.కాలనీ లో ఇళ్ళు apartments లా కట్టారు.మేము ఉండేది గ్రౌండ్ flour లో.ఇంటి ముందు ఒక గ్రౌండ్ ఉండేది.అక్కడ పిల్లలమంతా ఆడుకునేవాళ్ళం.మా ఇంటి వెనుక 20 అడుగుల దూరం నుండి కను చూపు మేరకు వరి పొలాలు ఉండేవి.ఇంటి ముందు కన్నా వెనుక అంటే నాకు చాలా ఇష్టం.అమ్మ వర్షా కాలంలో ఇంటి వెనుక కారం బంతి విత్తనాలు చల్లేది.వాటినే కొన్ని చోట్ల తురక బంతి అని కూడా అంటారు.ఇక చలి కాలం వచ్చే సరికి అవి పెద్దవయి పూలు విరగ బూసేవి.ఇంటి వెనుక ఎర్ర తివాచి వేసినట్లు ఉండేది.తలుపు తీయగానే వందల కొద్దీ బంతి చెట్లు.ఆ వెనుకే వరి పొలాలు.పైగా మంచు కప్పినట్లు ఉండే వాతావరణం.ఇంటి వెనుక బంతి తోటలో కూర్చో బెట్టి అమ్మ నా తలకు నూనె రాసి జడలు వేసేది.అక్కడే అన్నం కూడా తినిపించేది.
ఇక నేనెప్పుడూ మర్చిపోలేని వ్యక్తి గురు.గురు కి అప్పుడు సుమారు 40 నుండి 45 సంవత్సరాల వయసు ఉండేదేమో బహుశా.గురు పెద్ద మెంటల్ కేస్.ఏదో రెండు మాటలన్నాడని కన్న తండ్రినే పీక పిసికి చంపేశాడు.మా ఇంటి వెనుక ఒక రెండు గదులున్న గుడిసెలో ఉండేవాడు.ఆయనకి ఇద్దరు భార్యలు.ఇద్దరు చెరో గదిలో ఉండేవారు.మా ఇంటి వెనుక ఉన్న పొలం ఆయనదే.వాళ్ళు స్థానిక గిరిజనులు.ఆయన భార్యలు ఇద్దరు బ్లౌజ్ లేకుండా చీర ధరించేవారు.అక్కడి గిరిజన స్త్రీలంతా అలానే తయారవుతారు.కొప్పు ముడి కూడా వెనక్కి కాకుండా పక్కకి పెట్టుకునేవారు.గురు ఇంకా ఆయన ఇద్దరు భార్యలు నన్ను చాలా గారాబం చేసేవారు.నాకు కూడా వాళ్లంటే చాలా ఇష్టం.నేనెప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్లి కాస్త సమయం గడిపేదాన్ని.ఇక వర్షా కాలం లో అయితే వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ పొలంలో వరి నాట్లు వేసేదాన్ని.అలసట తెలీకుండా ఉండడానికి వారు ఒరియాలో పాటలు పాడుతూ నాట్లు వేసేవారు.ఇక వాళ్ళ వంటలైతే విచిత్రంగా ఉండేవి.కారం లేకుండా ఉట్టి ఉల్లి కాడలతో కూర చేసేవారు.బెండ కాయలు కోసి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టి కొద్దిగా ఉప్పు వేసి కూర ఉండేవారు.ఇక గురు అయితే రోజు సాయంత్రం విపరీతంగా తాగి తూలుతూ ఇంటికి వెళ్ళేవాడు.అప్పుడు మాత్రం తనంటే భయం వేసేది.
ఇక అక్క నేను మా ఇంటి ముందు ఉన్న సిట్ అవుట్ లో కూర్చుని సాయంత్రం 5.30 గంటల నుండి ఆ రోజు తెలుగు న్యూస్ పేపర్ కోసం ఎదురు చూస్తూ కూర్చునే వాళ్ళం.ఎందుకంటే రోజూ పొద్దున్న రావాల్సిన పేపర్ మాకు అక్కడ సుమారు రాత్రి 7 గంటలకు వచ్చేది.పేజీ 3 లో కుడి వైపు కింద corner లో రోజూ కథ ఇచ్చేవాళ్ళు.అది ఒక నెల వరకు కంటిన్యూ అయి తర్వాత మళ్ళీ కొత్త కథ వచ్చేది.ఆ కదా కార్టూన్ బొమ్మలతో ఉండేది.దానికోసమే మేము అంతలా ఎదురు చూసేవాళ్ళం.పేపర్ రాగానే అక్క చదివి నాకు వినిపించేది.చదవగానే అరె అప్పుడే అయిపోయిందా!నెక్స్ట్ ఏం జరుగుతుందో అని అనుకునేవాళ్లం.
ఇక అక్కడ కాలనీ లో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు.ఒకరు పద్మ ఇంకొకరు చింటూ.పద్మ వాళ్ళు తెలుగు వాళ్ళే.చింటూ మాత్రం ఒరియా అమ్మాయి.చింటూ వాళ్ళ ఇంట్లో ఒక మాట్లాడే చిలుక ఉండేది.అది ఎప్పుడూ “చింటూ, చింటూ, చింటూ…” అని అరుస్తూ ఉండేది.చింటూ వాళ్లకి ఒక చాలా పెద్ద భారీ సైజులో చాలా ఎత్తుగా ఉన్న ఆంబోతు ఉండేది.అది అంటే ఆ కాలనీ లో అందరికి హడల్.ఒక ఆదివారం మధ్యాహ్నం కాలనీ లో అందరూ సుష్టుగా భోంచేసి నిద్రపోతున్నారు.అప్పుడు అక్క నేను హాల్లో కూర్చొని ఆడుకుంటున్నాము.నేనేందుకో ఆట మధ్యలో లేచి ఇంటి బయటికి వచ్చాను.అప్పుడు అక్కడ బయట గ్రౌండ్ లో దృశ్యం చూసి నా గుండె ఆగినంత పనయింది.చింటూ వాళ్ళ ఆంబోతు ఎద్దు ఉంది కదా అది రెండు సంవత్సరాల వయసున్న చిన్న పిల్లవాడిని తన రెండు కొమ్ములతో పైకి లేపుతుంది మళ్ళీ కిందికి విసిరి కొడుతుంది.పక్కనే సుమారు 3 ఇయర్స్ వయసు ఉన్న ఆ పిల్లవాడి అన్న కూడా ఉన్నాడు.కానీ వాడెందుకో ఏమి స్పందించకుండా సినిమా చూసినట్లు చూస్తున్నాడు.నేనెళ్ళి మా అక్కను పిలిచుకొచ్చి చూపించాను.అక్క ఒక్క సెకను కూడా వేస్ట్ చేయకుండా మా అమ్మా నాన్నల్ని నిద్ర లేపింది.వాళ్ళు కంగారుగా బయటకు వచ్చి పెద్ద పెద్దగా కేకలు పెట్టారు.అప్పుడు కాలనీ లో అందరు బయటకు వచ్చారు.కానీ ఎవరూ ఆ బాబుని కాపాడే సాహసం చేయలేదు.ఎందుకంటే దాని దగ్గరకు వెళ్తే చావు తప్పదని అక్కడున్న అందరికీ తెలుసు.ఆ ఆంబోతు గారి ట్రాక్ రికార్డు గురుంచి బాగా తెలుసు.అది చింటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాట తప్ప ఎవరి మాట వినదు.ఆ బాబు కానిస్టేబుల్ గారి కొడుకు.చివరకి కానిస్టేబుల్ గారు బయటకు వచ్చారు పెద్ద బాన పొట్ట తో.ఆయనకీ అదంటే భయమే కానీ తండ్రి కదా అందుకే ప్రాణాలకు తెగించి మరీ ముందుకు వెళ్ళాడు.ఆయన్ని కూడా సునాయాసంగా ఎత్తి విసిరి పారేసింది.చివరికి చింటూ వాళ్ళ నాన్న అమ్మ వచ్చి దాన్ని అడ్డుకున్నారు.వాళ్ళు రాగానే కామ్ గా గుడ్ బాయ్ లా అసలేమీ తెలీనట్టు తను చాలా ఇన్నోసెంట్ అన్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోయింది.ఈ సంఘటన తర్వాత కాలనీ వాళ్ళు పంచాయితీ పెట్టి ఆ ఆంబోతును ఇంకెప్పుడూ కాలనీ లో ఫ్రీ గా వదిలేయ కూడదనీ ఒక వేళ వచ్చినా దాని యజమానుల పర్యవేక్షణలోనే ఉండాలని తీర్మానించారు.ఆంబోతు గారు అనవసరంగా తన స్వేచ్ఛను కోల్పోయారు :(.
ఇక్కడ నా గురించిన విషయం ఒకటి చెప్పాలి.ఇది నన్ను అత్యంతగా గిల్టీ ఫీల్ చేసిన సంఘటన.చింటూ, పద్మ, నేను, మా అక్క కాలనీ గ్రౌండ్ లో ఎప్పుడూ తొక్కుడు బిళ్ళ ఆడుకునే వాళ్ళం.ఒక రోజు అలానే ఆడుకుంటున్నాము.ఆ రోజు చింటూ తీసుకు వచ్చిన తొక్కుడు బిళ్ళ సాఫ్ట్ గా బ్లూ కలర్ లో చాలా అందంగా ఉంది.ఆ రోజు చింటూ, పద్మ ఒక జట్టుగా నేను, అక్క ఒక జట్టుగా వేరే వేరే గళ్ళు గీసుకొని ఆడుకుంటున్నాము.చింటూని తన తొక్కుడు బిళ్ళని ఒకసారి ఆడుకొని ఇస్తాను నాకివ్వవా అని అడిగాను.తను ఇవ్వనంది.మళ్ళీ అడిగాను.అస్సలివ్వనంది.పైగా బాగా విసుక్కుంది.నేను హర్ట్ అయ్యాను.కాసేపయ్యాక మా అక్క ఆట ఆపేసి వెళ్ళిపోయింది.పద్మ కూడా వెళ్ళిపోయింది.ఇక మిగిలింది నేను చింటూనే.మేమిద్దరం ఆడడం మొదలు పెట్టాము.ఆటలో భాగంగా తను అటు తిరిగి తొక్కుడు బిళ్ళను వెనక్కు విసిరేసింది.చింటూ వెనక్కి తిరిగి చూసే లోపు నేను ఆ తొక్కుడు బిళ్ళని తీసుకొని వేగంగా ఇంటికి వచ్చేసి హాల్లో ఉన్న చిన్న డబ్బాలో పెట్టాను.వెనక్కు తిరిగి చూసుకున్న చింటూ కి నేను కనిపించక పోవడంతో నేరుగా మా ఇంటికి వచ్చేసింది.”ఎందుకు పారిపోయావు?నా తొక్కుడు బిళ్ళ తీసుకున్నావు కదా!ఇచ్చేయి” అని అడిగింది.నేనేమో “నేను తీసుకోలేదు.అసలు మా ఇంట్లోనే లేదు కావాలంటే చూడు ” అని నేను దాచి పెట్టిన పెట్టెనే కనిపించీ కనిపించకుండా ఓపెన్ చూపించాను.ఏమనుకుందో ఏమో తాను వెళ్ళిపోయింది.కానీ నాకెందుకో చాలా అనీజీ గా నా మీద నాకే అసహ్యం గా అనిపించింది.దొంగతనం చెయ్యాలన్నది నా ఉద్దేశ్యం కాదు.ఒక్కసారి ఇవ్వమంటే ఇవ్వకుండా నన్ను తిట్టిందని నా కోపం.అందుకే తీసుకొచ్చేశాను.చింటూ వెళ్ళిపోయాక నేను ఆ రాయిని మళ్ళీ తనకి దొరికే విధంగా ఎప్పుడూ తాను కూర్చునే దగ్గర పెట్టేశాను.తర్వాత రోజు ఆడుకోవడానికి వచ్చినప్పుడు తను దానిని చూసి తీసుకుంది కూడా.ఆ విషయం నాకు తప్ప ఇప్పటికీ ఎవరికీ తెలీదు.ఇప్పుడు మీకే చెప్తున్నాను.నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక దొంగతనం.చేసిన పాపం చెప్తే పోతుందంటారు.కానీ నా దృష్టిలో అయితే పోదు.ఒక్క సారి తప్పు చేస్తే చేసినట్లే.నేను చేసింది చాలా తప్పని వెంటనే అంత చిన్న వయసులోనే నా అంతట నేనే రియలైజ్ అయ్యాను.ఇక అలాటి తప్పు మరెప్పుడూ చేయలేదు.
ఇంకో విషయం చెప్పాలి మీకు.ఆ సమయం లో “ఓ స్త్రీ రేపురా!” పుకారు ఉండేది.ఎవరో ఒక స్త్రీ వస్తుందని, ఇంటి తలుపు తడుతుందని, తెరవకపోతే ఇంటి మీద రక్తం తో కలిపిన బియ్యం వేసి శపించి వెళ్తుందని ఇంకా ఏంటేంటో రకరకాలుగా తమకు తోచిన కథలు చెప్పేవారు.అందరి గుమ్మాల మీద “ఓ స్త్రీ రేపురా!” అని రాసి ఎర్రని చేతి అచ్చు వేసేవారు.ఇక రాత్రి ఏడు దాటితే ఇళ్లలో నుండి బయటకి వచ్చేవారు కాదు.మా అమ్మ అసలిలాంటివి నమ్మేవారు కాదు.”అమ్మా! ఆ దెయ్యం వస్తుందేమో అమ్మా” అంటే “రానీయ్ చూద్దాం” అనేది నవ్వుతూ.అవి ఒట్టి పుకార్లు అసలు నమ్మొద్దు అని చెప్పేది అమ్మ.
వారానికి ఒకసారి కూరగాయల కోసం Jeypore లోని మార్కెట్ కు వెళ్ళేవాళ్ళం.ఆ మార్కెట్ లో పుట్ట గొడుగుల్ని చిన్న చిన్న కుప్పలుగా పోసి రూపాయకి ఒక కుప్ప చొప్పున అమ్మేవారు.ఒరిస్సా లో ఉన్నప్పుడు వారానికి కనీసం రెండుసార్లయినా పుట్టగొడుగుల కూర తినేవాళ్ళం.అవి ఎక్కడ పడితే అక్కడ మొలిచేవి.చెట్ల మొదళ్ళ లో మొలిచేవి.అడవిలో మొలచిన వాటినే కోసుకొచ్చి మార్కెట్ లో అమ్మేవారు.అంతేకానీ అవేమి ప్రత్యేకించి పండించినవి కావు.సహజంగా మొలిచినవి కాబట్టి వాటితో చేసిన కూర రుచి చాలా అద్భుతంగా ఉండేది.
Jeypore లో జగన్నాథ స్వామి రథోత్సవం జరిగేది.అది చూడడానికి ఎక్కడెక్కడి నుండో వేల కొద్దీ జనాలు వచ్చే వారు.స్వామి రథం చాలా పెద్దగా ఉండేది.రోడ్లంతా క్రిక్కిరిసి పోయి ఉండేవి.ఇక రథాన్ని పెద్ద పెద్ద లావైన తాళ్లతో లాగేవారు.ఇక ఆ లాగేవారైతే బూతులు మాటలు పెద్దగా అంటూ లాగే వారు.అదేం పద్ధతో మరి :-O.ఇక ఒరిస్సా లో ఉండగా నేను సందర్శించిన ప్రాంతాలు కోణార్క్ సూర్య దేవాలయం, కోరాపుట్ జిల్లాలో ఉన్న అద్భుతమైన జలపాతాలు, అందమైన అడవి, నందన్ కానన్ జూ.ఆంధ్రా నుండి బరినిపుట్ రావాలంటే రోడ్డు మార్గం లో ప్రమాదకరమైన ఘాట్ రోడ్ ఉంటుంది.అసలు ఆ రోడ్ లో బస్సు లో వెళ్తుంటే నరకం లా ఉండేది.ఎంతో భయం వేసేది.బస్సు కొండ మీద మలుపు తిరిగే తప్పుడల్లా ఇదే నా బతుకులో “ఆఖరి మలుపు” అనుకునేదాన్ని :).కానీ ట్రైన్ రూట్ మాత్రం సూపర్ గా ఉండేది.సుమారు ఒక 60 టన్నెల్స్ ఉండేవి ఆ రూట్ లో.ట్రైన్ ఆ టన్నెల్స్ నుండి వెళ్ళేటప్పుడు చీకటి గా అయిపోయి భలే గమ్మత్తుగా అనిపించేది.మేము ఆ టన్నెల్స్ ని లెక్క పెట్టేవాళ్ళం.ఆ టన్నెల్స్ ఉన్న రూట్ లోనే ట్రైన్ ని కాసేపు ఆపేసేవారు.అప్పుడు స్థానిక గిరిజనులు అడవి లోనుండి బయటకి వచ్చి ట్రైన్ ఎక్కి వారు అడవిలో కోసుకొచ్చిన ఉసిరికాయలు అమ్మేవారు.పెద్ద 25 కేజీల బస్తా 10 నుండి 15 రూపాయలకి అమ్మేవారు.ట్రైన్ జర్నీ మాత్రం భలే ఉండేది.
ఇన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో నా మనసును నింపిన ఒడిశా ను కూడా ఒక సారి తప్పక విజిట్ చేయాలనుకున్నాను.కానీ ఇంతకు ముందు అన్ని ప్లేస్ లను మళ్ళీ విజిట్ చేసి చేదు జ్ఞాపకాలు మిగుల్చుకున్నాను.అందుకే కనీసం ఈ జ్ఞాపకాన్నైనా పదిలంగా దాచుకుందామని ఒరిస్సా వెళ్లే ఆలోచనను మానుకున్నాను.కానీ బాగా ఆలోచిస్తే నాకొకటి అనిపించింది.మారింది అక్కడ ప్రదేశాలు, ఇంకా మనుషులు కాదు నా మనసేమోనని.అది కొంత వరకు నిజమే.నా చిన్నప్పుడు ఎక్కడా ఇప్పుడున్నన్ని పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు లేవు.నా చిన్నతనమంతా ఎక్కువగా అటవీ ప్రాంతాలలోనే గడిచింది.పెద్దయ్యాక సిటీ లో గడపడం పచ్చటి ప్రాంతాలకు దూరమవడం వల్ల సహజంగా ప్రకృతి ప్రేమికురాలినైన నేను ఎక్కువగా నా బాల్యాన్ని తలచుకుంటూ అక్కడ ప్రదేశాలని ఇంకా అందంగా ఊహించుకోవడం వల్ల నా ఊహ లకి వాస్తవానికి పొత్తు కుదరక పోవడంతో నే ఈ గోలంతా 🙂 నా బాధంతా.
ఇప్పుడు నా జ్ఞాపకాల గురించి ఇన్ని విషయాలు చేప్పాను కదా! నాకు లానే మీలో ఎవరికైనా ఇలానే అనిపిస్తే తప్పక కామెంట్ సెక్షన్ లో తెలియ చేయండి.
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-1
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-2
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-3
నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-4
Vineela says
మీతో పాటు మేము కూడా ఆ ప్రదేశాల్లో విహరించాం.ఎంతో చక్కగా వర్ణించారు
BINDU says
Thank you, వినీల గారు …. 🙂