Gongura chicken curry recipe with step by step instructions.
ఆంధ్రా ప్రాంతానికి చెందిన పాపులర్ చికెన్ వంటకాలలో గోంగూర చికెన్ కూడా ఒకటి.దీనిని ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.అంత రుచిగా ఉంటుంది ఈ కూర.ఇదే కాకుండా గోంగూర మటన్, గోంగూర రొయ్యలు కూడా పాపులర్ వంటకాలే.గోంగూర దొరికే మాసంలో కనీసం పక్షానికి ఒకసారైనా మా ఇంట్లో ఈ కూర తప్పకుండా ఉంటుంది.ఇంట్లో చేసుకో లేకపోతే కనీసం కర్రీ పాయింట్ నుంచి అయినా తెచ్చుకుంటూ ఉంటాము.కాకపోతే కర్రీ పాయింట్ వాళ్ళు కొంచెం నూనె ఎక్కువగా వాడతారు.అదే నాకు నచ్చదు.
ఈ మధ్య ఒక కర్రీ పాయింట్ లో కూర తెచ్చుకుందామని వెళ్ళినపుడు, అక్కడ గోంగూర మటన్ చూసాను.టేస్ట్ కి కొద్దిగా ఇవ్వమని అడిగి రుచి చూసాను.చాలా బాగుంది.కాని ఇంట్లో నేను చేసే కూరకి వాళ్ల కూరకి తేడా ఉందనిపించింది.అందుకే ఎలా చేస్తారో recipe అడిగి తెలుసుకున్నాను.వాళ్ళు గోంగూరని,ఉల్లిపాయల్ని,జీడి పప్పుల్ని కలిపి కొద్దిగా నూనెలో వేపి, వాటిని మిక్సీలో వేసి పేస్టు లా చేసి, పూర్తిగా ఉడికిన చికెన్లో కలిపి కొద్ది సేపు ముక్కలకి పట్టే వరకు ఉడికిస్తామని చెప్పారు.నేను కుడా అచ్చు అలానే చేసాను.చాలా బాగా కుదిరింది.
నేనయితే ఇంతకుముందు గోంగూరని వేపకుండానే, గ్రైండ్ చేయకుండానే పూర్తిగా ఉడికిన చికెన్ లో కలిపి వండేదాన్ని.ఇంకా జీడిపప్పు కుడా వేసేదాన్ని కాదు.తెల్ల గోంగూర అంత పులుపుగా ఉండదు కాబట్టి ఎర్ర గోంగూర ఉపయోగించి ఈ కూర వండితే రుచిగా ఉంటుంది.ఈ కూరలో గరం మసాలా వేయకుండా ఉల్లిపాయల్ని వేయించేటపుడు 4 లవంగాలు, 2 యాలుకలు, 1 అంగుళం దాల్చినచెక్క వేస్తే సరిపోతుంది.రోజు విడిచి రోజు మాంసాహారం తినే అలవాటు ఉన్నవారు కూరలు ఇలానే చేస్తారు.ఎందుకంటే మసాలాలు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా.అదే కూరలో గరం మసాలా దినుసులని నేరుగా వేస్తే, వాటి సువాసన కూరకు పడుతుంది.ఇంకా తినేటప్పుడు వాటిని తీసి పారేస్తాం కాబట్టి మసాలా ప్రభావం కూడా మన మీద ఉండదు.ఎంతో రుచికరమైన ఈ Gongura Chicken curry ని మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను.
you may also like
సగ్గుబియ్యంతో పునుగులు చేయడం ఎలా?
వెజిటెబుల్ కట్లెట్ తయారు చేయడం ఎలా?
క్యాలిఫ్లవర్ పచ్చడి తయారు చేయడం ఎలా?
బంగాళాదుంప వేపుడు
ఉలవచారు ఇంట్లోనే తయారు చేయడం ఎలా?
For the English version of this recipe — Click here
- 150 గ్రాములు గోంగూర
- 1 మీడియం ఉల్లిపాయ
- 3-4 పచ్చిమిరపకాయలు
- ¼ కప్పు వేయించిన జీడిపప్పు
- 600 గ్రాములు చికెన్
- 200 గ్రాములు ఉల్లిపాయ తరుగు
- 2 పచ్చిమిరపకాయలు
- 1 రెమ్మ కరివేపాకు
- 2 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1 tsp ఉప్పు
- ½ tsp పసుపు
- 2 tsp కారం
- 1 tsp ధనియాల పొడి
- ½ tsp గరం మసాలా
- 1/3 కప్పు వేయించిన జీడిపప్పు
- 5- 6 tbsp నూనె
- 2 tsp ల నునెని వేడి చేసి అందులో ¼ కప్పు జీడిపప్పు వేసి దోరగా వేయించాలి.
- కడాయిలో 3 tsp ల నూనె వేడి చేసి అందులో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, గోంగూర వేసి వేయించాలి.
- గోంగూర ఆకులు ముడుచుకుపోయి రంగు మారేవరకు వేయించి స్టౌ కట్టేయాలి.
- వాటిని కాసేపు ఆరనిచ్చి మిక్సీ లో గోంగూర,వేయించిన జీడిపప్పు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఒక బాణలిలో 5 నుండి 6 tbsp ల నూనె వేడి చేయాలి.
- అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు ఉడికించాలి.
- తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
- చికెన్ కూడా వేసి, ఒకసారి బాగా కలిపి, మీడియం హీట్ మీద 5 నుండి 7 నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించాలి.
- తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
- మూత పెట్టి 3 వంతులు ఉడికేవరకు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
- చికెన్ 3 వంతులు ఉడికిన తర్వాత అందులో గోంగూర పేస్ట్, గరం మసాలా వేసి కలపాలి.
- మూత పెట్టి సన్నని సెగ మీద 5 నుండి 7 నిమిషాలు ఉడికించి స్టౌ కట్టేయాలి.
Gongura Chicken Curry recipe Video
[embedyt] http://www.youtube.com/watch?v=au1jLhjjRfY[/embedyt]
sasikala says
hai.. your recipes are too good. by profession i am a clinical nutritionist. the way u cook and recipes are nice.. especially flaxseed laddoo, gongura chicken, jowar dosa, beetroot puri and so many other recipes are healthy home style. i definitly follow and i will let my patients to visit ur blog. and forgot to mention the way u r preparing masala powders are too good as those are fresh and will be no preservatives. thank you for ur recipes.
BINDU says
Thank you soooooooo much SasiKala garu….