ఎటువంటి వంట పాత్రలు వాడితే మన ఆరోగ్యానికి మంచిది?? ఈ ప్రశ్న ఒక 5 లేదా 6 సంవత్సరాల ముందు ఎవరైనా అడిగితే కాస్త ఎగాదిగా చూసేవారేమో. కానీ ఇప్పుడు కాదు. ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ అందుబాటులో ఉండడం వల్ల ఇంతకు ముందు తో పోలిస్తే ఇప్పుడు జనాలలో విషయ అవగాహన కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. మనకు అవసరమైనవి అవసరం లేనివి చాలా విషయాలు తెలుసుకుంటున్నాము.
మనం సాధారణంగా మన ఇళ్లల్లో ఎక్కువగా వంటకు వాడే పాత్రలు అల్యూమినియం, నాన్ స్టిక్, స్టీల్ అని చెప్పొచ్చు. ఈ మూడింటిలో కూడా అల్యూమినియం ఎక్కువగా వాడుతున్నారు. అయితే అల్యూమినియం పాత్రలలో చేసిన వంట ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు. ఇప్పటిదాకా మన అమ్మలు, అమ్మమ్మలు అందరూ వాడిందీ, ఇప్పటికీ చాలా మంది వాడుతున్నదీ మరి అదే కదా. కొన్ని సంవత్సరాలకు ముందు లేని ఈ గోల ఇప్పుడెందుకు మొదలైంది?
ఇప్పుడు మన వంటకు అనువైన పాత్రలేంటో చూద్దాము
అల్యూమినియం
అందరికీ అందుబాటు ధరలో ఉండేది అంటే ఒక్క అల్యూమినియం మాత్రమే. ధరలు అధికంగా ఉండడం వల్ల అందరూ కాస్ట్ ఐరన్ లాంటివి కొనాలి అంటే కొనలేకపోవచ్చు. అలా కొనుక్కోలేకపోతే ఏమి బాధపడనవసరం లేదు. మాములుగా అల్యూమినియం పాత్రలలోనే వండుకోవచ్చు. కాకపోతే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే అల్యూమినియం లో వండుకున్నా ఏమి కాదు. పుల్లని పదార్ధాలు అల్యూమినియం లో వండకూడదు. చింతపండు, నిమ్మకాయ, టమాటో, గోంగూర, మామిడికాయ, చింతచిగురు, చుక్కకూర లాంటివి వీటిల్లో వేసి వండినప్పుడు ఆహారంలోకి అల్యూమినియం అధికంగా విడుదల అవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే అప్పటివరకు కాస్త రంగు మారినట్లుగా పాతదిగా ఉన్న అల్యూమినియం గిన్నె లో పుల్లని పదార్ధాలు వేసి వండాక తళ తళా మెరుస్తూ కనిపిస్తుంది. ఆ పులుపు అల్యూమినియం ను తినడం వల్ల అలా అవుతుంది. పుల్లనివి కాకుండా మిగిలిన ఎటువంటి వైనా వండుకోవచ్చు. కానీ ఏ కూర అయినా వండిన వెంటనే వేరే స్టీల్ పాత్రలోకి మార్చేసుకోవాలి. అప్పుడు అల్యూమినియం పాత్రలు వాడినా ఏమి కాదు.
చాలా మంది అల్యూమినియం మంచిది కాదు అని తెలవగానే ముందు పాత్రల గురించే ఆలోచిస్తారు. కానీ వాటి గురించి అంతగా భయపడనవసరం లేదు. నిజంగా అల్యూమినియమే మీ సమస్య అయితే ముందు మీరు ఫోకస్ పెట్టాల్సింది అల్యూమినియం పాత్రల మీద కాదు బ్యూటీ ప్రొడక్ట్స్మీ/కాస్మొటిక్స్ మీద మరియు మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్ధాల మీద. బేకింగ్ పౌడర్, ఇన్స్టంట్ కేక్ మిక్స్ లు , టూత్ పేస్ట్, టేబుల్ సాల్ట్ లలో, మనం తీసుకునే వాక్సిన్ లలో, పిల్లలకు ఇచ్చే ఫార్ములా ఫుడ్ లో కూడా అల్యూమినియం ఉంటుంది.
హార్డ్ ఆనోడైజ్డ్ పాత్రలు(Hard Anodized cookware)
వీటిని అల్యూమినియం కు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. పైగా తక్కువ ధరల్లోనే దొరుకుతాయి. ఇవి కూడా అల్యూమినియం పాత్రలే కానీ వాటిని ఎలక్ట్రో కెమికల్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. అల్యూమినియం ను సుల్ఫ్యూరిక్ ఆమ్లము లో ముంచి లో ఎలక్ట్రిక్ ఛార్జ్ ని ప్రసరించడం వల్ల అల్యూమినియం పాత్రల మీద ఒక నల్లని లేయర్ లా ఏర్పడుతుంది. ఇది విడిగా వేసే కోటింగ్ కాదు. అల్యూమినియమే నల్లగా గట్టిగా పైన ఒక నాన్ స్టిక్ లేయర్ లా మారిపోతుంది. అంటే వేరే పొరలా కాకుండా కలిసిపోయి ఉంటుంది. ఇవి దాదాపు వజ్రమంత గట్టిగా ఉంటాయి. అందువల్ల ఈ పాత్రలు అస్సలు పాడవవు. ఎంత కాలమయినా అలానే ఉంటాయి. మాములు అల్యూమినియం పాత్రలలో వండితే కలిగే దుష్పరిణామాలు ఇందులో ఉండవు. మనం వండుకునే ఆహారంలోకి అల్యూమినియం దాదాపు విడుదల కాదు అనే చెప్పొచ్చు. ఇందులో పుల్లని కూరలు కూడా వండుకోవచ్చు.
చూడడనికి ఒక నాన్ స్టిక్ లా అనిపించినా కాస్త హై ఫ్లేమ్ మీద వండినప్పుడు ఆహారం అడుగంటుతుంది. అడుగంటకుండా ఉండడానికి నీరు లేదా నూనె ఎక్కువ వాడాల్సి ఉంటుంది. వీటిని డిష్ వాషర్ లో పెట్టకూడదు. చేత్తో కడగాలి. మెటల్ గరిటె వాడినా ఏమి కాదు. ఏది ఏమైనా వండిన వెంటనే ఆహారాన్ని స్టీల్ లేదా గాజు గిన్నెలోకి మార్చేసుకోవడం మంచిది. నేను వాడుతున్న హార్డ్ ఆనోడైజ్డ్ పాత్రల లింక్ లు కింద ఇస్తున్నాను చూడండి.
Teflon కోటెడ్ నాన్ -స్టిక్ పాత్రలు
ఇవి వచ్చిన కొత్తల్లో అందరు వీటిని వాడడానికి చాలా ఆసక్తి చూపించారు. నూనె తక్కువగా వాడొచ్చు అని. అయితే ఈ పాత్రలలో ఆహారం వండడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటిలో హానికారకమైన కెమికల్స్ తో తయారు చేస్తారు. లోపల అల్యూమినియం ఉంటుంది పైన టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది. వీటిని హై ఫ్లేమ్ మీద పెట్టి అస్సలు వండకూడదు. అలా వండినప్పుడు విడుదలయ్యే పొగ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ పొగ ని పీల్చినప్పుడు పెంపుడు పక్షులు చనిపోయినట్లు గమనించారు. వీటిని సరిగ్గా వాడకుండా మెటల్ స్క్రబ్బర్ ఉపయోగించి కడగడం మెటల్ గరిటెలు వాడడం వల్ల క్రమేపీ ఈ పాత్రల మీద ఉన్న టెఫ్లాన్ కోటింగ్ పొట్టులా ఊడిపోతూ ఉంటుంది. అలా ఊడిపోతున్నపుడు వాటిల్లో ఆహారం వండితే అది ఆహారం లో కలిసి చాలా రకాల వ్యాధులకు దారితీస్తుంది. అందువల్ల టెఫ్లాన్ కోటింగ్ ఉన్న నాన్-స్టిక్ పాత్రల్ని వండడం పూర్తిగా మానేయాలి. నా దగ్గర నేను వాడుతున్నవి ఒక రెండు ఉన్నాయి. అయినా నేను వాటి లింక్స్ ఇక్కడ ఇవ్వను. దయచేసి టెఫ్లాన్ కోటింగ్ నాన్ స్టిక్ పాత్రల్ని వాడకండి. ఇప్పుడు మీ ఇంట్లో కోటింగ్ ఊడిపోయిన టెఫ్లాన్ పాత్రలు ఉంటే వాటిని వెంటనే వాడడం ఆపేయండి.
సిరామిక్ కోటెడ్ నాన్ -స్టిక్ పాత్రలు
Teflon కోటెడ్ నాన్ స్టిక్ పాత్రలకు విరుద్ధంగా ఇవి మంచివి. వీటిలో ఆహారం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు. అయితే కొనేటప్పుడు చవకగా వస్తుంది కదా అని ఏది పడితే అది కొనకుండా PFOA, లెడ్, కాడ్మియం free అని రాసి ఉన్న సిరామిక్ నాన్ స్టిక్ కోటెడ్ పాత్రల్ని మాత్రమే కొనుక్కోవాలి. వీటిని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకోవాలి. మెటల్ స్క్రబ్బర్ తో రుద్ది కడగకూడదు. మెటల్ గరిటెలు వాడకూడదు. హై ఫ్లేమ్ మీద వండకూడదు. లో లేదా మీడియం మంట మీద మాత్రమే ఆహారాన్ని వండాలి. ఇవి డిష్ వాషర్ సేఫ్ కూడా. అందువల్ల సరిగ్గా వాడగలిగితే సిరామిక్ కోటెడ్ నాన్ స్టిక్ పాత్రల్ని వాడొచ్చు. నేను ఇప్పుడు వాడుతున్న సిరామిక్ పాత్రల వివరాలు ఇస్తున్నాను చూడండి.
స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు
వంటకు ఈ పాత్రల్ని నిస్సందేహంగా వాడవచ్చు. మాములు స్టీల్ కాకుండా స్టెయిన్ స్టీల్ పాత్రల్ని మాత్రమే వాడాలి. అడుగు మందంగా ఉన్న పాత్రల్ని ఉపయోగిస్తే ఆహారం అడుగంటకుండా ఉంటుంది. నాకు MEYER బ్రాండ్ వారు వారి స్టెయిన్ లెస్ స్టీల్ పాన్ ని రివ్యూ చేయమని పంపారు. అది వాడే వరకు నాకు స్టైన్ లెస్ స్టీల్ లో వంట అంటే కాస్త అనుమానం ఉండేది ఆహారం అడుగంటుతుందేమోనని. కానీ ఒకసారి అది వాడి చూశాక ఎంత బాగుంటుంది ని తెలిసింది. అసలు నేను ఈ పోస్ట్ రాయడానికి కారణం నేను ఒక వీడియో లో ఉపయోగించిన స్టీల్ పాన్ చూసి నన్ను చాలా మంది వంట పాత్రల గురించి ఒక వీడియో చేయమని అడిగారు.
స్టెయిన్ స్టీల్ కూడా నాన్ రియాక్టీవ్ మెటీరియల్ అవడం వల్ల మన ఆహారంలోని పోషకాలు నశించి పోకుండా ఉంటాయి. స్టీల్ పాత్రల్లో వండిన ఆహారాన్ని వేరే గిన్నెలోకి మార్చాల్సిన అవసరం కూడా లేదు. మెటల్ గరిటె కూడా వాడొచ్చు. డిష్ వాషర్ లో కూడా పెట్టవచ్చు. నేను ఇప్పుడు ఇంట్లో వాడుతున్న స్టీల్ వంట పాత్రల వివరాలు ఇక్కడ ఇస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు వాడుతున్న ప్రెషర్ కుక్కర్ హార్డ్ అనోడైజ్డ్ కుక్కర్. దాని స్థానంలో ఒక స్టీల్ ప్రెషర్ కుక్కర్ కొనాలి అనుకుంటున్నాను. దాని వివరాలు కూడా ఇస్తున్నాను చూడండి.
కాస్ట్ ఐరన్ పాత్రలు
ఎప్పుడైతే అల్యూమినియం పాత్రలు మంచివి కాదు అని తెలుసుకున్నారో అప్పుడు జనాలు ఎక్కువ మొగ్గు చూపడం మొదలు పెట్టింది కాస్ట్ ఐరన్ పాత్రల మీదే అని చెప్పొచ్చు. వీటిలో ఆహారం వండితే అందులోకి ఐరన్ విడుదల అవుతుంది. అది మన శరీరానికి మంచిది. అయితే అల్యూమినియం పాత్రలతో పోలిస్తే వీటిని వాడడం అంత సులభం కాదు. ప్రారంభంలో కాస్త తికమకగా ఇబ్బందిగా ఉంటుంది. తరువాత అలవాటు అయిపోతుంది. ఇవి చాలా బరువుగా ఉంటాయి. మెల్లిగా వేడెక్కుతాయి. మెల్లగా చల్లబడతాయి. కాస్ట్ ఐరన్ లో ఆహారం మన ఆరోగ్యానికి మంచిదే అయినా పుల్లని పదార్ధాలు మాత్రం వీటిల్లో వండకూడదు. చింతపండు పులుసు వేసి చేసేవి అస్సలు వండకూడదు. చింత చిగురు, పాలకూర, చుక్కకూర, గోంగూర, నిమ్మకాయ, వినెగర్, మామిడికాయ లాంటివి ఈ పాత్రలలో వండకూడదు. అలా వండితే అవి ఆహారంలోకి ఎక్కువ ఐరన్ విడుదల అయ్యేలా చేస్తాయి.
మన శరీరానికి అవసరమైన ఐరన్ కంటే ఎక్కువ తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల పుల్లని పదార్ధాలు వీటిల్లో వండకూడదు. టమాటో లాంటివి ఒక మూడు లేదా నాలుగు నెలల పాటు రెగ్యులర్ గా వాడాక, అంటే కాస్ట్ ఐరన్ పాత్రలు సరిగ్గా సీసోనింగ్ అయ్యాయి అని అనిపించాక అప్పుడు వండుకోవచ్చు. కాస్ట్ ఐరన్ పాత్రలలో వండిన ఆహారం వెంటనే తినేస్తే పర్లేదు. లేదు ఎక్కువ సమయం పడుతుంది అనుకున్నప్పుడు వెంటనే వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలి. వండిన ఆహారాన్ని ఎక్కువ సేపు కాస్ట్ ఐరన్ పాత్రలలో నిల్వ ఉంచకూడదు. ప్రస్తుతము నేను వాడుతున్న కాస్ట్ ఐరన్ పాత్రల లింక్ లు మీకు కింద ఇచ్చాను చూడండి.
ఎనామెల్ కోటెడ్ కాస్ట్ ఐరన్ పాత్రలు
కాస్ట్ ఐరన్ కోటెడ్ ఎనామెల్ వంట పాత్రలు కూడా మంచివి. వాటిలో మనం ఆహారం వండుకోవడం వల్ల మనకు ఎటువంటి హాని కలగదు. మాములు కాస్ట్ ఐరన్ వంట పాత్రలలో మనం పుల్లని పదార్థలు వండకూడదు. అదే ఎనామెల్ కోటెడ్ కాస్ట్ ఐరన్ పాత్రలలో పుల్లని పదార్ధాలు కూడా వండుకోవచ్చు. ఎనామెల్ కోటింగ్ వల్ల అది నాన్ -స్టిక్ లా పనిచేస్తుంది. ఇంకా లోపల ఉన్న ఆహార పదార్ధం తో రియాక్ట్ అవ్వదు. అందువల్ల మనం వండిన ఆహారంలోని పోషక విలువలు అలాగే ఉంటాయి. ఇందులో దమ్ బిర్యానీ, పప్పుచారు, సాంబారు, చేపల పులుసు లాంటివి కూడా చేసుకోవచ్చు. అయితే వీటిని కడిగేటప్పుడు పౌడర్ డిటర్జెంట్ కాకుండా విమ్ లాంటి లిక్విడ్ డిటర్జెంట్ మాత్రమే వాడాలి. స్పాంజ్ స్క్రబ్బర్ ఉపయోగించి తోమాలి. స్టీల్ గరిటెలు ఉపయోగించి కలపకూడదు. చెక్క, నైలాన్, లేదా సిలికాన్ గరిటెలు మాత్రమే వాడాలి.
ఐరన్ పాత్రలు
ఐరన్ పాత్రలు కూడా కాస్ట్ ఐరన్ లా వంటకు మంచివే. ఇంతకు ముందు అంటే చాలా పాత కాలం నుండి ఇంకా ఇప్పటికీ చాలా మంది ఇళ్లల్లో దోశెలు వేయడానికి ఇనుప పెనాల్ని వాడుతూ ఉంటారు. వాటిని దోశెలు వేశాక కడగకుండా అలానే ఉంచేస్తారు. మరుసటి రోజు దోశెలు వేసేటప్పుడు కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ చెక్కతో పెనం మీద రుద్దేవారు. ఇది seasoning అని అప్పుడు మనకు తెలీదు. దోశెలు పెనానికి అతుక్కుపోకుండా చేసే ఒక ప్రక్రియ అది.
మాములు ఇనుప పాత్రలు కూడా మన ఆహారంలోకి ఐరన్ ను విడుదల చేస్తాయి. కాస్ట్ ఐరన్ ను ఎలా వాడుతామో వీటిని కూడా అలానే వాడాలి. వీటిని కూడా seasoning చేయాలి. కాకపోతే కాస్ట్ ఐరన్ కి దీనికి ఉన్న తేడా ఏంటి అంటే అవి స్లో కుకింగ్ కి వాడతారు. వీటిని త్వరగా వండటానికి వాడతారు. ఇవి త్వరగా వేడెక్కుతాయి. అందువల్ల మనం అక్కడే ఉండి కూరని కలపవలసి వస్తూ ఉంటుంది. లేకపోతే ఆహారం అడుగంటే అవకాశం ఉంది. మీరు గమనిస్తే వీటిని ఎక్కువగా కేటరింగ్ సర్వీస్ చేసేవారు లేదా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అల్యూమినియం కి ప్రత్యామ్నాయం గా వీటిని వాడవచ్చు. ఇవి కూడా అతి తక్కువ ధరలో దొరుకుతాయి. కేవలం ఆన్లైన్ లోనో లేదా షాపుల్లోనో కాకుండా అక్కడక్కడా రోడ్ మీద కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు వీటిని. మీకు వీలయితే ఒక పెనం మరియు ఒక చిన్న కడాయి కొని పెట్టుకుంటే మంచిది. ఇవి కాస్ట్ ఐరన్ తో పోలిస్తే కాస్త బరువు తక్కువగా ఉంటాయి. వాడడం కూడా సులువే. ఈ కింద ఇచ్చిన లింక్స్ మీకు రిఫరెన్స్ కోసం మాత్రమే ఇచ్చాను. నేను వీడియో లో చూపించినవి ఒక షాప్ లో కొన్నాను.
మట్టి పాత్రలు
ఇవి కూడా లోహంతో చేసిన పాత్రలు వినియోగంలోకి వచ్చే ముందు మన పూర్వీకులు వాడేవారు. వీటిని వాడడం లోహ పాత్రలతో పోలిస్తే కష్టం అవడం వల్ల, ఎక్కువ కాలం మన్నిక లేకపోవడం వల్ల క్రమేపీ వీటి వినియోగం తగ్గింది. అయితే వీటి విలువ తెలిసిన వారు, కాస్త ఆరోగ్య స్పృహ ఉన్నవారు, పాత పద్ధతులకు విలువ నిచ్చేవారు వీటిని మళ్ళీ వాడడం మొదలు పెట్టారు. వీటిలో వండిన ఆరోగ్యం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో వండితే మన ఆహారంలోని పోషక విలువలు నశించకుండా ఉంటాయి. అయితే మీరు వీటిని కొనుక్కోవాలి అనుకుంటే నున్నగా మెరుస్తున్నట్లు గా ఉన్న మట్టి పాత్రలను కాకుండా బరకగా రంగు తక్కువగా అంటే చూడడానికి డల్ గా అనిపించే మట్టి పాత్రల్ని మాత్రమే తీసుకోవాలి. ఈ మట్టి పాత్రల ను ఎలా ఎంచుకోవాలి??. మనకు బయట దొరికే అన్ని మట్టి పాత్రలు మంచివేనా??అసలు వీటిని ఎలా వాడాలి అనేది నేను మీకు వేరొక పోస్ట్ లో విపులంగా చెప్తాను. నేను మీకు వీడియో లో చూపించిన మట్టి పాత్రలు నేను అమెజాన్ లో కొనలేదు. బయట విడిగా రోడ్ మీద కొన్నాను. ఈ కింద ఇచ్చిన లింక్స్ మీకు రిఫరెన్స్ కొరకు మాత్రమే. మట్టి పాత్రలు కూడా ఆన్లైన్ లో కాకుండా బయట నేరుగా చూసి కొనుక్కోవడం మంచిది.
సోప్ స్టోన్ లేదా రాతి చిప్ప
మన పూర్వీకులు ఉపయోగించిన వంట పాత్రలలో ఇది కూడా ఒకటి. ప్రకృతిలో సహజంగా లభించే రాయితో తయారు చేసిన వంట పాత్రలు ఈ రాతి చిప్పలు. వీటిలో వండిన ఎంతో రుచిగా ఉండడమే కాకుండా వండిన ఆహారంలో పోషక విలువలు నశించకుండా కాపాడుతుంది. దీనిని గ్యాస్ స్టవ్ మీద కూడా ఉపయోగించవచ్చు. స్టవ్ కట్టేసిన తర్వాత కూడా ఉడుకుతూ ఉంటుంది కాసేపు. చాలా వండిన ఆహారం వేడిగా ఉంటుంది. అయితే ఇందులో వేపుడు లేదా ఇగురు కూరలు లాంటివి కాకుండా పులుసు కూరలు, పప్పు చారు, రసం వంటివి ఇంకా అన్నం కూడా వండుకోవచ్చు. దీనిని ఎలా వాడాలి ఏంటి అనేది నేను మరొక పోస్ట్ లో చెప్తాను. నేను ఈ కింద ఇచ్చిన లింక్ కేవలం మీకు రిఫరెన్స్ కోసం మాత్రమే ఇచ్చాను. ఇలాంటి వాటిని ఆన్లైన్ లో కొనడం కన్నా బయట నేరుగా కొనుక్కుంటే మంచిది.
గ్లాస్ వంట పాత్రలు
గ్లాస్ వంట పాత్రలేంటా అని ఆశ్చర్య పోతున్నారా. అవునండీ గ్లాస్ పాత్రల్ని కూడా వంటకు వినియోగించవచ్చు. అయితే మాములు గ్లాస్ కాదు. బోరోసిల్ లో ఒక రకం గ్లాస్ ను గ్యాస్ స్టౌ మీద కూడా పెట్టి వండుకునే విధంగా అందుబాటులో ఉన్నాయి. వీటిని ఫ్లేమ్ ప్రూఫ్ గ్లాస్ కుక్ వేర్ అంటారు. అయితే నేను ఒక చిన్న ఫ్లేమ్ ప్రూఫ్ బౌల్స్ కొన్నాను. అవి డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెడితే పగలలేదు. కానీ అవి చాలా చిన్నగా ఉండడం వల్ల స్టౌ మీద పెట్టడం కుదరలేదు. తర్వాత ఒకసారి హైదరాబాద్ లో ఉన్న q -mart కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో రకమైన గాజు వంట పాత్రల్ని చూశాను. అవి చాలా అందంగా ట్రాన్సపరెంట్ గా ఉన్నాయి. అవి ఫ్లేమ్ ప్రూఫ్ కూడా.
అయితే అసలు ఆ మెటీరియల్ ఏంటి అని ఆరా తీస్తే అవి స్పేస్ లో కి పంపించే స్పేస్ షటిల్స్ కోసం వాడే పైరో సిరామిక్ పదార్ధంతో తయారు చేసినవి అని తెలుసుకున్నాను. మొదట ఫ్రాన్స్ దేశంలో వీటిని తయారు చేసి తర్వాత అమెరికా దేశంలో కూడా వీటిని బాగా ఉపయోగించడం మొదలు పెట్టారు. ఇప్పుడు మన దేశం లో దొరికే ఈ పాత్రలు మనం అక్కడి నుండి దిగుమతి చేసుకున్నవే. అంతరిక్షంలో ఉండే వేడిని భరించేలా ఆ గాజు పదార్ధం ఉంటుంది. 850 డిగ్రీ సెంట్రిగ్రేడ్ ఉష్ణోగ్రత ను కూడా తట్టుకోగలవు ఈ వంట పాత్రలు. అందువల్ల వీటిని ఒవేన్ లో, మైక్రోవేవ్ ఒవేన్ లో, హాలోజెన్ ఒవేన్ లో , గ్యాస్ స్టవ్ మీద, ఫ్రీజర్ లో కూడా పెట్టి ఉపయోగించవచ్చు. డిష్ వాషర్ లో కూడా వాడవచ్చు.
వీటిలో వండిన ఆహారం ఆ పాత్ర మెటీరియల్ తో రియాక్ట్ కాకపోవడం వల్ల ఆహరం లోని పోషకాలు మనకు పూర్తిగా అందుతాయి. అందువల్ల ఏ విధంగా చూసినా కూడా మనకు ఇలాంటి గాజు వంట పత్రాలు ఆరోగ్యానికి మంచివే. అయితే వీటి ధర కాస్త ఎక్కువే. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లా భావించి కొనుక్కో గలిగితే బెటర్. మెటీరియల్ చాలా దృఢంగా ఉంటుంది కదా కింద పడేసినా ఏమీ కాదు అనే నిర్లక్ష్యం ఉండకూడదు. గాజు కాబట్టి జాగ్రత్తగా వాడాలి. ఇందులో అన్ని రకాల ఇండియన్ కూరలు వండుకోవచ్చు. బిర్యానీ లాంటివి కూడా చేసుకోవచ్చు.
వీటిలో ఏదో ఒక రకం వంట పాత్రలే కాకుండా రెండు మూడు రకాల వంట పాత్రలు ఉంటే మన అవసరాన్ని బట్టి మనం వాటిని వాడుకుంటూ ఉండవచ్చు. నేను యూట్యూబ్ లో చూపించిన కొన్ని పాత్రల్ని నేను ఫిల్మ్ నగర్ రోడ్ no.12 ఉన్న Essential Traditions అనే కేరళ షాప్ లో కొన్నాను. ఆ షాప్ వీడియో కూడా తీశాను. ఆయా వీడియో కూడా యూట్యూబ్ లో పోస్ట్ చేశాను. ఆ వీడియో కింద పెడుతున్నాను చూడండి.