Maatamanti

Homemade Biryani Masala Telugu Recipe-బిర్యానీ మసాలా తయారీ

Homemade Biryani masala Telugu Recipe With step by step instructions.English Version. 

బిర్యానీ రుచి మనం వేసే మసాలా మరియు చికెన్ లో మనం కలిపే మిగతా పదార్ధాల కొలత ను బట్టి ఉంటుంది.అన్ని సరిగ్గా వేస్తే రుచి బాగుంటుంది.అయితే బిర్యానీ మసాలా ఎంత ఎక్కువ వేస్తే అంత రుచి అనుకోకూడదు.ముందు కొద్దిగా వేసి చికెన్ ముక్కలకు పట్టించాక మారినేడ్ ను కొద్దిగా టేస్ట్ చేయాలి.అప్పుడే మీకు బిర్యానీ తింటునట్లుగా అనిపిస్తుంది(కాకపొతే ఉడికించనిది).ఒక వేళ మీకు బిర్యానీ రుచి తగలక పొతే మాత్రం ఏది తక్కువ పడిందో చూసుకొని సరి చేసుకోవాలి.

కొన్ని రోజుల క్రితం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకరు వాళ్ళబ్బాయి బర్త్ డే పార్టీ కి మమ్మల్ని ఆహ్వానించారు.మేము వారికి సహాయ పడవచ్చని  కాస్త ముందే బయలుదేరి వెళ్ళాము. వెళ్లేసరికి వాళ్ళు చికెన్ బిర్యానీ చేయడానికి రెడీ అవుతున్నారు(ఇంటి పక్కనే ఉండే ఒక ముస్లిం ఆంటీ సహాయంతో).కానీ ఆ ఆంటీ అప్పటికి ఇంకా రాలేదు.సరే అదేదో నేనే చేస్తానని చెప్పాను.ముందు బిర్యానీ మసాలా తయారు చేశాను.తర్వాత చికెన్ పీసెస్ ను మారినేట్ చేసే టైం లో ఆంటీ వచ్చారు.బిర్యానీ మసాలా వేస్తుంటే “ఏంటి అది ” అని అడిగారు. “బిర్యానీ మసాలా” అని చెప్పాను.అప్పుడు ఆ ఆంటీ “మేము మసాలాలు పౌడర్  ఏమి వేయము.అన్ని మసాలా దినుసుల్ని మారినేషన్ లో డైరెక్ట్ గా వేసేస్తాము” అని చెప్పారు. “సరే నువ్వెలా చేస్తావో అలాగే కానీ చూద్దాం” అన్నారు.

తనేమో బిర్యానీ చేయడం లో ఎక్స్పర్ట్.నాకేమో కొద్దిగా కొత్త.అనవసరంగా చేస్తానన్నాను.ఇప్పుడెలా రా దేవుడా అనుకున్నాను.పైగా ఒకరిద్దరికి కాదు ఏకంగా పాతిక మందికి వండాలి.ఎలాగోలా ఫినిష్ చేశాను.వండాక ముందు ఆ ఆంటీ కే పెట్టారు.అప్పుడైతే తను నాకు Ratatouille సినిమా లో Anton Ego లా అనిపించారు.ఆవిడ కూడా బిర్యానీ నోట్లో పెట్టుకోగానే ఒక్క సెకను ఆగి “చాలా బాగుంది” అన్నారు.అప్పుడు గానీ నా మనసు శాంతించలేదు.

సరే ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే బిర్యానీ మసాలా గురించి.మా అత్త గారింట్లో కూడా వాళ్ళు కూరల్లో మసాలా వేసుకోరు.జస్ట్ ఆ మసాలా దినుసుల్ని మాత్రమే డైరెక్ట్ గా  వేస్తారు.దీన్ని బట్టి నేను గ్రహించింది ఏంటంటే నాన్ వెజ్ రెగ్యులర్ గా తీసుకునే అలవాటు ఉన్నవారు ఎక్కువగా మసాలాల్ని ఉపయోగించరు.ఎందుకంటే మసాలాలు ఆరోగ్యానికి మంచివి కావు కాబట్టి.మా అత్తగారింట్లో అయితే రోజూ నాన్ వెజ్ ఉంటుంది.మా అత్తగారు మాంసాన్ని కూరగాయలతో కలిపి మామూలు వెజ్ కర్రీ లా వండేస్తారు.

తర్వాత ఒకసారి మా ఇంట్లో చేసుకున్నపుడు మసాలా వేయకుండా ఒట్టి దినుసులు మాత్రమే వేసి బిర్యాని చేశాను.మైల్డ్ ఫ్లేవర్ తో బాగానే ఉంది కానీ కొద్దిగా నీచు వాసన అనిపించింది.సరే ఇక ఈ రెసిపీ విషయానికొస్తే మసాలా తయారు చేసేటప్పుడు ఘాటు ఎక్కువగా ఉన్న దినుసుల్ని తక్కువగా వేయాలి.జాజికాయ అన్నింటికన్నా ఘాటు ఎక్కువగా ఉంటుంది.అందుకే అది తక్కువ వేయాలి.తయారు చేసిన పొడిని గాలి చొరబడని డబ్బాలో కి మార్చి స్టోర్ చేసుకోవాలి.ఒకే సారి ఎక్కువ తయారు చేసుకోవడం కంటే కొద్ది కొద్దిగా తయారు చేయడం మంచింది.ఎక్కువ రోజులు నిల్వ ఉన్న కొద్దీ అందులోని ఫ్లేవర్ పోతుంది.ఇంట్లో తయారు చేసుకున్న మసాలాతో బిర్యానీ చేస్తే మరింత రుచిగా ఉంటుంది.సో ఒకసారి ఈ మసాలా రెసిపీ ని  మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Bamboo Chicken Biryani Recipe in Telugu
Kothimeera Kodi Pulao recipe in Telugu
Chicken Biryani Recipe in Telugu
Ulavacharu Biryani Recipe in Telugu
Mutton Biryani Recipe in Telugu
Fish Biryani Recipe in Telugu
Prawns Biryani Recipe in Telugu
Prawns Pulao Recipe in Telugu

Click here for the English Version of the Recipe

Homemade Biryani Masala Telugu Recipe
Prep Time
15 mins
 
Author: బిందు
Ingredients
  • ¼ కప్పులేదా 4 tbsp ధనియాలు
  • 2 దాల్చిన చెక్కలు (అంగుళం పొడుగువి)
  • 10 లవంగాలు
  • 10 ఏలకులు
  • నల్ల ఏలకులు
  • 1 tbsp షాజీరా
  • ½ tbsp మిరియాలు
  • 1 tbsp ఎండు దానిమ్మ గింజలు/అనార్ దానా
  • ½ ముక్క జాజికాయ
  • 2 జాపత్రి
  • 2 మరాఠీ మొగ్గలు
  • 5 గ్రాములు బిర్యానీ పూలు
  • బిర్యానీ ఆకులు
  • 2 అనాస పువ్వులు
Instructions
  1. పెనాన్ని సన్నని సెగ మీద వేడి చేయాలి.
  2. అందులో ముందుగా బిర్యానీ పూలు మరియు బిర్యానీ ఆకులు వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. తర్వాత మిగిలిన మసాలా దినుసులు కూడా వేసి చక్కని సువాసన వచ్చే వరకు సన్నని సెగ మీద వేయించాలి
  4. అన్నింటినీ కాసేపు చల్లార నివ్వాలి.
  5. తర్వాత మిక్సిలో కి తీసుకొని మెత్తని పొడి కొట్టుకోవాలి.
  6. ఆ పొడిని ఒక గాలి చొర బడని, మూత బిగుతుగా ఉన్న డబ్బాలోకి తీసి స్టోర్ చేసుకోవాలి.

Homemade Biryani Masala Telugu Recipe Video

Related Post

Please Share this post if you like