Mango Ice Cream Telugu Recipe with step by step instructions. English Version.
చిన్నప్పుడు వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్లు విపరీతంగా తినేవాళ్ళం.ఇంట్లో పెద్ద వాళ్ళు మరీ ఎక్కువ తినొద్దు వేడి చేస్తుంది అని చెప్పినా కూడా వినేవాళ్ళం కాదు.కానీ ఇప్పుడెందుకో అసలు మామిడిపండ్లు తినాలనిపించడమే లేదు.నాదే కాదు దాదాపు అందరి పరిస్థితీ ఇలాగే ఉంటుంది.ఇప్పుడు మార్కెట్లో దొరికే పండ్ల రుచి అలా ఏడ్చింది మరి.పండ్లు రంగే కానీ రుచి ఏమాత్రం ఉండవు.చిన్నప్పుడు ఎంత తియ్యని మామిడి పండ్లు దొరికేవి.అవి ఎంత చక్కని సువాసన వచ్చేవి?
ఇప్పుడు నా బాధంతా ఏంటంటే మా అమ్మాయి నోరు తెరిచి “అమ్మా! సమ్మర్ కదా మాంగో ఐస్ క్రీమ్ చేసి పెట్టవా” అని అడిగింది.సరే అని మార్కెట్ నుండి కొన్ని రసాలు కొన్ని బంగినపల్లి తెప్పించాను.రసాలేమో పులుపు.బంగినపల్లేమో అసలు ఏ టేస్టు లేవు.అందుకే మళ్ళీ చచ్చినట్లు సూపర్ మార్కెట్ కి వెళ్లి మాంగో పల్ప్ తీసుకొచ్చి ఐస్ క్రీం చేశాను.పల్ప్ టేస్ట్ సూపర్ గా ఉంది.ఐస్ క్రీం ఇంకా సూపర్ గా ఉంది.
నేను ఈ మాంగో ఐస్ క్రీమ్ కోసం అల్ఫాన్సో మామిడిపళ్ళ పల్ప్ ఉపయోగించాను.కానీ మీరు మీకు నచ్చిన లేదా అందుబాటులో ఉన్న ఏదైనా మాంగో పల్ప్ వాడ వచ్చు.అసలు అదృష్టం కొద్దీ మంచి మామిడి పండ్లు దొరికితే మీరే ఇంట్లో మామిడికాయ గుజ్జు తయారు చేసుకోవచ్చు.బంగినపల్లి, రసాలు ఏవైనా పర్వాలేదు కానీ తియ్యగా ఉంటే చాలు.నేను ఈ ఐస్ క్రీమ్ లో ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉపయోగించలేదు.మామిడి పల్ప్ మంచి ఫ్లేవర్ ఉంది కాబట్టి వేయలేదు.అందుకే మీరు వెనిల్లా ఎసెన్స్ ని కచ్చితంగా వేయ నవసరం లేదు.అది జస్ట్ ఆప్షనల్ పదార్ధం మాత్రమే.
మీకు మీడియం ఫ్యాట్ క్రీమ్ దాదాపు అన్ని సూపర్ మార్కెట్ లలో దొరుకుతుంది.క్రీమ్ ను మరీ ఎక్కువ సేపు విప్ చేయ కూడదు.క్రీమ్ ను ఒక రెండు నిమిషాలు తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేశాక ఒక రెండు నిమిషాలు, మామిడికాయ గుజ్జు వేశాక ఇంకో రెండు నిమిషాలు కలిపితే సరిపోతుంది.మరీ ఎక్కువగా కలిపితే మిశ్రమం నురుగులా మారిపోయి తేలికయిపోతుంది.తర్వాత మీరు డీప్ ఫ్రిజ్ లో పెట్టినా మిశ్రమం లో నురుగు రూపంలో ఉన్న గాలి బుడగల వల్ల అది గడ్డ కట్టదు.అందుకే మిశ్రమాన్ని మరీ ఎక్కువగా కలపకూడదు.
మిశ్రమాన్ని ఫ్రీజర్ లో పెట్టాక ప్రతీ రెండు గంటలకోసారి కలుపుతుండాలి.ఇలా చేయడం వల్ల ఐస్ క్రీమ్ నీళ్లు గడ్డ కట్టినట్లు కాకుండా చక్కగా క్రీమీ గా ఉంటుంది.సర్వ్ చేసే ముందు ఐస్ క్రీమ్ స్కూప్ ను మామూలు నీళ్లలో ముంచి స్కూప్ అవుట్ చేయాలి.ఇలా చేయడం వల్ల గడ్డ కట్టిన ఐస్ క్రీమ్ తేలిగ్గా స్కూప్ అవుట్ అవుతుంది.ఐస్ క్రీమ్ అలా ఉట్టిగా కాకుండా కాస్త దోరగా రోస్ట్ చేసిన నట్స్ ఇంకా చాకోలెట్ సిరప్ తో టాపింగ్ చేసి ఇస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది.ఎంతో తేలికైన మరియు రుచి కరమైన ఈ మాంగో ఐస్ క్రీమ్ రెసిపీ ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Pineapple Fruit Punch Recipe in Telugu
Maramarala Mixture Recipe in Telugu
White Sauce Pasta Recipe in Telugu
Malai Laddu Recipe in Telugu
Leftover Bread Pancake Recipe in Telugu
Bread Pizza Recipe in Telugu
Bounty Chocolates Recipe in Telugu
Click here for the English Version of this Recipe
- 250 గ్రాములు పండిన మామిడి కాయ గుజ్జు
- 200 గ్రాములు క్రీమ్ మీడియం ఫాట్
- 200 గ్రాములు స్వీట్ కండెన్స్డ్ మిల్క్
- 1 చుక్క వెనిల్లా అస్సెన్స్ ( ఆప్షనల్)
- ¼ కప్పు నట్స్ ముక్కలు డ్రై రోస్ట్ చేసినవి
- క్రీమ్ ను ఒక గిన్నెలోకి తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు విప్ చేయాలి.
- అందులోనే స్వీట్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి ఇంకో రెండు నిమిషాలు విప్ చేయాలి.
- తర్వాత మామిడికాయ గుజ్జు వేసి మళ్ళీ రెండు నిమిషాలు బాగా కలిసేలా విప్ చేయాలి.
- ఆ మిశ్రమాన్ని ఒక ఫ్రీజర్ సేఫ్ కంటైనర్ లోకి తీసుకొని ఫ్రీజర్ లో 8 నుండి 10 గంటల పాటు ఉంచాలి.
- ప్రతి 2 గంటలకు ఒకసారి కలుపుతుండాలి.
- సర్వ్ చేసే ముందు స్కూప్ ను ఒకసారి మామూలు నీళ్ళలో ముంచి ఐస్ క్రీమ్ ను సర్వింగ్ బౌల్స్ లోకి స్కూప్ అవుట్ చేసుకోవాలి.
- పైన కొద్దిగా రోస్ట్ చేసిన నట్స్ తరుగు చల్లి సర్వ్ చేయాలి.
Mango Ice Cream Telugu Recipe Video
Leave a Reply