Mirchi Bajji Telugu Recipe with step by step instructions.English Version.
పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఇష్టం గా లాగించేసే అద్భుతమైన ఈవెనింగ్ స్నాక్ ఐటమ్ మిరపకాయ బజ్జీలు. సాయంత్రం అయ్యేసరికి రోడ్ల మీద బోలెడు బజ్జీ బండ్లు వెలుస్తాయి. జనం వాటి చుట్టూ చేరి ఇష్టం గా తింటుంటారు. ఎంతైనా కానీ మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా బయట అలా బజ్జీల బండి దగ్గర నుంచుని తింటేనే బాగుంటుంది. కాకపొతే ఒకటే బాధ. వాళ్ళు వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడుతుంటారు.అందుకే నాకు బయట తినాలంటే భయం.
అందుకే ఎక్కువగా ఇంట్లోనే తయారు చేస్తుంటాను. అప్పుడప్పుడు బయట తింటుంటాము.బజ్జీలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తయారు చేస్తుంటారు.లోపల స్టఫింగ్ కు వాడే పదార్ధం వేరు వేరుగా ఉంటుంది.ఆంధ్రా మరియు తెలంగాణా లోని కొన్ని ప్రాంతాలలో అయితే వాము, శనగ పిండి, చింతపండు గుజ్జు కలిపి పెడుతుంటారు. కొన్ని చోట్ల అసలు మిర్చి లోపల ఏమి పెట్ట కుండానే బజ్జీలు వేసేస్తారు.
మా పొలానికి వెళ్ళే దారిలో ఒక దగ్గర బజ్జీల బండి ఉంటుంది. ఆ బండి ఆయన చాలా బాగా చేస్తారు. లోపల ఉత్తి మీఠా చట్నీ పెట్టి బజ్జీలు వేస్తాడు. అవి మాత్రం సూపర్ టేస్టీ గా ఉంటాయి. పైగా ఆయన ఫ్రెష్ ఆయిల్ తో చేస్తారు. వాడిన నూనె మళ్ళీ వాడరు. అయన చేసే మసాలా వడలు, పునుగులు కూడా బాగుంటాయి.
సరే ఇక ఈ రెసిపీ విషయానికొస్తే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బజ్జీలు బాగా వస్తాయి. బజ్జీల పిండి లో వంట సోడా మరీ ఎక్కువ వేయ కూడదు. అలా చేయడం వల్ల బజ్జీలు నూనె ఎక్కువగా పీలుస్తాయి.బజ్జీలు వేసే ముందు నూనె వేడి సరిగ్గా ఉండాలి. నూనె సరిగ్గా వేడి అయిందో లేదో తెలుసు కోవడానికి కొద్దిగా పిండి ని నూనె లోకి జార విడవాలి. పిండి వెంటనే పైకి తేలితే నూనె సరిగ్గా కాగినట్లు.
బజ్జీలను మరీ పెద్ద మంట మీద వేయించ కూడదు. అలా చేస్తే బయట తొందరగా రంగు మారిపోతాయి. ఇంకా ఎక్కువ సేపు ఉంచితే మాడిపోతాయేమో నని వెంటనే తీసేయాల్సి వస్తుంది. కానీ లోపల మాత్రం పిండి ఇంకా మిర్చి పచ్చిగానే ఉంటాయి. అందుకే ఫ్లేమ్ మీడియం హై లో ఉంచి వేయించుకోవాలి.
ఒకరు ౩ నుండి 4 బజ్జీలు తినవచ్చు. అంత కంటే ఎక్కువగా తినక పోవడమే మంచిది.స్టమక్ ప్రాబ్లెమ్స్ ఇంకా గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్య లతో బాధ పడుతున్న వారు అసలు వీటి జోలికి వెళ్ళక పోవడమే మంచిది.
బజ్జీలు ఉత్తిగా తిన్నా బాగుంటాయి. టమాటో చట్నీ, కారం పొడి లతో తింటే ఇంకా బాగుంటాయి. బజ్జీలు వేశాక పైన కాస్త నిమ్మ రసం పిండి, ఉల్లిపాయ తరుగు వేసి కారం పొడి చల్లి సర్వ్ చేస్తే సూపర్ గా ఉంటాయి.ఈ నోరూరించే వంటకాన్ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Semiya Bonda Recipe
Maramarala Mixture Recipe in Telugu
Instant Rava Vada Recipe in Telugu
Nalla Senaga Guggillu Recipe in Telugu
White Sauce Pasta Recipe in Telugu
Leftover Bread Pancake Recipe in Telugu
Banana Balls Recipe in Telugu
Vegetable Cutlets Recipe in Telugu
Saggubiyyam Punugulu Recipe in Telugu
Click here for the English Version of the Recipe
- 1 కప్పు లేదా 120 గ్రాములు శనగ పిండి
- 10 బజ్జీ మిరపకాయలు
- ¼ tsp సోడా ఉప్పు
- 2 tbsp బియ్యం పిండి
- 20 లేదా 25 గ్రాములు చింతపండు
- 2 tbsp వాము
- 1 tbsp ఆమ్ చూర్ పొడి
- ఉప్పు తగినంత
- నూనె డీప్ ఫ్రై కి సరిపడా
-
మిర్చీ లోపల మిశ్రమం తయారీ
-
వాము, శనగ పిండి, ఆమ్ చూర్ పొడి మిక్సీలో వేసి పొడి చేయాలి. ఇందులో 1 tbsp పొడిని తర్వాత పిండిలో కలపడం కోసం పక్కన ఉంచుకోవాలి.
-
చింతపండు ను రెండు నిమిషాలు ఉడికించి పేస్ట్ చేయాలి.
-
పైన చేసిన పొడిని, చింతపండు గుజ్జును, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
-
బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి సూది లేదా కత్తి సహాయంతో నిలువుగా చీలిక చేయాలి.
-
లోపల గింజలు తీసేసి, పైన తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మిర్చిలలో కూరి పక్కన పెట్టుకోవాలి.
-
ఒక పాత్రలో శనగ పిండి, బియ్యం పిండి, వంట సోడా, కొద్దిగా ఉప్పు, ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న వాము, ఆమ్ చూర్ పొడి వేసి ఒకసారి కలపాలి.
-
తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి మరీ జారుగా కాకుండా మరీ మందంగా లేకుండా పిండిని కలపాలి.
-
కడాయి లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగ నివ్వాలి.
-
నూనె కాగాక ఒక్కో మిర్చీని శనగ పిండి లో ముంచి నూనెలో జారవిడవాలి.
-
బజ్జీలు చక్కని బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.