నేను
నేను రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. లీలగా రైలు కూత వినిపిస్తుంది. అక్కడ ఒక వరుస పట్టాలు మాత్రమే వున్నాయి. అంటే రైలు నా వెనుకే వస్తుందన్నమాట. దగ్గరగా వచ్చినప్పుడు జరగొచ్చులే అనుకున్నాను.
ఎందుకో అలా నడవడం నాకు భలే సరదాగా వుంది.ఏదో పెద్ద సాహసం చేస్తున్నానన్న ఫీలింగుతో హీరోలా ప్యాంటు జేబులో చేతులు వుంచి ముందుకు నడుస్తున్నాను.ఒక నిమిషం తర్వాత శబ్దం చాలా దగ్గరగా వినబడింది. వెనక్కి తిరిగి చూశాను.రైలు అప్పుడే మలుపు తిరుగుతుంది. వచ్చేస్తుంది అది ముందుకి ఉరుకుతూ …..ఇక తప్పుకుందామని కాలు పక్కకి వేయబోయాను కాని అడుగు పడలేదు.మళ్ళీ ప్రయత్నించాను కాని అడుగు పట్టాలు దాటి పడడం లేదు.శబ్దం మరింత దగ్గరగా వినబడుతోంది…కనీసం ఒక వంద మీటర్ల దూరం కూడా లేదేమో.ఇక చేసేది లేక తిన్నగా పట్టాల మీదే పరుగు లంకించుకున్నాను.
రైలు దగ్గరికి వచ్చేస్తోంది.గుండె జారి కాళ్ళలోకి వచ్చిందా అన్నట్లుగా వుంది.చెమటలు ధారగా కారుతున్నాయి.ఒంట్లోని శక్తినంతా కూడదీసుకొని పరిగెడుతున్నాను.50 మీటర్లు…అప్పుడు అర్ధమైంది ఇక పరిగెత్తడం దండగని.అయిపోయింది అంతా అయిపోయింది నా జీవితం ఇంత దారుణంగా ముగుస్తుందనుకోలేదు. అసలు ఈ పట్టాల మీదకి రాకుండా వుండుంటే ఎంత బాగుందేది. ఇప్పుడనుకుని ఏం లాభం. 25 మీటర్లు…చివరిగా ఒక్కసారి (భయంతో మొదటిసారి) దేవుణ్ణి తలచుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాను.10 మీటర్లు..5 మీటర్లు.. ఊపిరి బిగపట్టాను.రైలు మైనస్ 10 మీటర్ల దూరానికి వెళ్ళింది.నా శరీరం రెండుగా విడిపోయింది.తల ఒక వైపు ,మొండెం ఒక వైపు.బాధతో విల విలా కొట్టుకుంటుంది నా దేహం.ఇంత బాధని నా శరీరం బ్రతికి వున్నపుడు అనుభవించలేదు. నరకయాతన.. చావంటే మోక్షం కదా!మరి నాకెందుకీ భయంకరమైన బాధ. నావాళ్ళెవరూ నా కోసం రాలేదే. నేను ప్రేమించే నా భార్యాబిడ్డలు ఏరి?నన్ను ప్రాణంగా ప్రేమించే నా ప్రాణస్నేహితులు ఏరి?నావాళ్ళంతా ఏరి?ఒక్కరూ రాలేదేంటి?నా బాధ ఎవరికీ పట్టదా?ఈ బాధ భరించలేకుండా ఉన్నాను.
“ఏవండీ….ఏవండీ…అబ్బా!లేవండీ ఏమిటీ పిచ్చి కలవరింతలు?ఏమైంది ఇవాళ మీకు?” అంటూ ఎవరో భుజం మీద గట్టిగా తడుతున్నారు.చటుక్కున కళ్ళు తెరిచాను.ఎదురుగా దేవతలా అంత పెద్ద బొట్టుతో నా భార్య.”ఏంటీ నేను చనిపోలేదా?నిజంగా చనిపోలేదా” అనుకుంటూ నా శరీరాన్ని తడుముకున్నాను.నేనింకా బ్రతికే వున్నానని తెలిసే సరికి పట్టలేని సంతోషం కలిగింది.అనందంతో నా భార్యని పట్టుకుని గట్టిగా ఊపేస్తూ “నేను బ్రతికే వున్నాను.ఇంకా బ్రతికే వున్నాను “అన్నాను.
“ఆ ఆ బ్రతికే ఉన్నారు.మీరూ బ్రతికే వున్నారు, మీ పిచ్చి చేష్టలు చూడడానికి నేనూ బ్రతికే ఉన్నాను, అయినా ఏమైంది మీకు? ఒళ్ళంతా ఆ చెమటలు ఏంటి? ఏదైనా పీడకల గాని వచ్చిందా ఏంటి?ముందు మీరు లేచి తలారా స్నానం చేసి రండి.దిష్టి తీసి పారేస్తాను”అంది.
గది గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి “ఇవాళ మీకు కోర్టులో ఏదో పని వుంది.తొందరగా వెళ్ళాలి అన్నారు కదా. గుర్తుందా”అంటూ వెళ్ళింది.అవును నిజమే నేను కోర్టుకి వెళ్ళాలి కదూ అంటూ గబగబా స్నానాల గది వైపుకి పరుగులు తీసాను.అన్నీ ముగించుకుని తయారయి ఒకసారి అద్దం ముందు నిలబడి చూసుకున్నాను.నా మిత్రుడికి సహాయం చేయడానికి వెళ్తున్నందుకు ఒకింత గర్వంగా ఉంది.నాకు నేను అందంగా పెద్ద హీరోలా అనిపించాను.ఈలోపే అది వచ్చి అద్దం పక్కన నిలబడి వెక్కిరింపుగా ఓ నవ్వు నవ్వింది.దాన్ని చూడగానే నా ముఖంలో నవ్వు కాస్తా మాయం అయింది. నాకు దాన్ని చూస్తేనే ఒళ్ళు మండిపోతోంది. ఒక్క నిమిషంలో నా హుషారంతా అవిరైపోయింది.
ఈలోపే “ఏవండీ టిఫిన్ రెడీ! త్వరగా రండీ” అన్న నా భార్య పిలుపుతో మొహం తిప్పుకుని అటుగా వెళ్ళాను.త్వరగా టిఫిన్ పని ముగించుకుని నా భార్యతో “వెళ్ళొస్తాను.జాగ్రత్త అసలే దొంగవెధవలు ఎక్కువైయ్యారు తలుపులేసుకో.సాయంత్రం తొందరగా వచ్చేస్తాను” అని చెప్పి గేటు వైపుకి నడిచాను.
నాకన్నా ముందే అది వెళ్ళి అక్కడ రెడీగా వుంది. “అబ్బా !మాంచి శకునం ఇక నే వెళ్ళే పని అయినట్లే”అనుకున్నాను.అది కూడా నాతోనే వస్తుందని అర్ధమయింది.పళ్ళు పటపటా కొరికాను.అది నాతో రావడం నాకేమాత్రం ఇష్టం లేదు.కాని వద్దు అని చెప్పలేని నిస్సహాయత.గత ముప్ఫై యేళ్ళుగా ఇదే తంతు.ఎందుకో అంతలోనే మా నాన్న మీద పట్టలేని కోపం వచ్చింది.కానీ చనిపోయిన వారి మీద కోపగించుకోకూడదని తమాయించుకున్నాను.ముసలాడు పోయేవాడు పోక దీన్ని నాకు అంటగట్టి పోయాడు.ఒక్క మాట కూడా మట్లాడలేకపోయినా చూపులతోనే నా మీద పెత్తనం వెలగబెడుతోంది.దీని వల్ల నేను పడే బాధ కనీసం నా భార్యకి కూడా చెప్పుకోలేను.నేను చచ్చేవరకు నా భార్యనైనా భరిస్తానో లేదో తెలియదు కాని దీన్ని మాత్రం భరించాల్సిందే.
కోర్టుకి ఇంటి నుండి ఒక కి లోమీటరు దూరం కూడా లేదు. అందుకే నా మిత్రుడు ఉదయాన్నే తీసుకెళ్ళడానికి వస్తానన్నా వద్దని వారించి తిన్నగా కోర్టుకే రమ్మన్నాను.వాడు నన్ను రమ్మని చెప్పిన సమయానికన్నా కాస్తా ముందుగానే బయలుదేరాను పైగా పెద్ద దూరం కూడా లేదు కాబట్టి కాలినడకనే వెళ్ళడం ప్రారంభించాను.
అది కూడా నాతో పాటే నడక సాగించింది.తనవైపు చూడడం నాకు బొత్తిగా ఇష్టం లేనట్లుగా అటూ ఇటూ పోయేవారిని చూసుకుంటూ నడుస్తున్నాను.కాని తను మాత్రం నన్నే చూస్తుంది.నా వైపు మాత్రమే చూస్తుంది.అది నాకు ఇబ్బందిగా వుంది.నేను తన కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నాను.
ఇక నేనే ఉండబట్టలేక “ఇందాకటి నుండి చూస్తున్నాను ,ఏంటి నన్నే చూస్తున్నావు?” అన్నాను.”ఎందుకు చూస్తున్నానో నీకు తెలీదా” అన్నట్లుందా చూపు. “మిత్రుడికి సహాయం చెయ్యడం కూడా తప్పేనా” అన్నాను.”కాని తప్పు చేసిన వారికి సహాయం చేయడం తప్పు కాదా?” అవతలినుండి. “వాడు చేసింది తప్పా సరా దాంతో నాకు సంబంధం లేదు. ఎలాంటివాడయినా స్నేహితుడంటే స్నేహితుడే.” సమర్ధించుకున్నాను.”అవునా!” అన్నట్లు వ్యంగ్యమైన చూపు.
చేతులు రావడం లేదు కాని లేకపోతే దాన్ని పీక పిసికి చంపాలన్నంత కోపంగా వుంది.అంతలోనే కోర్టుకు చేరుకున్నాము.నా మిత్రుడు అప్పటికే నా కోసం ఎదురుచూస్తున్నాడు.దూరం నుండే నన్ను చూసి పలకరింపుగా చెయ్యి ఊపాడు.నేనూ ఊపాను. నేను ప్రక్కకు తిరిగి “ఇప్పుడే చెప్తున్నా విను.ఇప్పటి వరకు నన్ను పీడించింది చాలు.ఇక నాతో రాకు.నన్ను విసిగించకు.నా పని నన్ను చేసుకోని.నువ్వు లోపలికి వచ్చావంటే నా మీద ఒట్టే” అని చెప్పి ఇక తన వైపు కూడా చూడకుండా ముందుకు వెళ్ళాను.
మిత్రుడితో మాట్లాడుతూ కోర్టు ఆవరణలోకి ప్రవేశించాను.నా జీవితంలో మొదటిసారి కోర్టుకి వెళ్ళాను. అప్పటికే జనాలతో కిటకిటలాడుతుంది. ఇంకా సమయం ఉండడంతో నా మిత్రుడు నేను కబుర్లలో పడ్డాము. ఈలోపు మావాడి తరపు వకీలు వచ్చి ధైర్యంగా వుండు గెలుపు మనదే అని నా మిత్రునికి భరోసా ఇచ్చాడు.
కాసేపటికి జడ్జీ గారు వచ్చారు. లోపలికి వెళ్ళాం. అక్కడ లోపల సినిమాల్లో చూపించినట్లుగా లేదు. ఏదో పాడుబడిన భూతాల కొంపలా వుంది.అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. జడ్జి గారు ఒక్కో కేసు పరిశీలిస్తున్నారు. మా వంతు వచ్చింది.జడ్జిగారు ఒకటి రెండు నిమిషాలు తన ముందు వున్న పేపర్లు చూసి తర్వాత మా లాయరు వైపు చూస్తూ “దీనికి మీ వివరణ ఏంటి” అన్నాడు.లాయరు తన వాదన వినిపించి చివరకు “అందుకు బలమైన సాక్ష్యం మా దగ్గరుంది” అన్నాడు. ప్రవేశ పెట్టమన్నాడు జడ్జి.
నా మిత్రుడు ,లాయరూ ఇద్దరూ ఒకేసారి నా వైపు చూశారు. ఆ మూలగా నిలబడ్డ నేను జడ్జి గారి ముందుకు వచ్చాను.నువ్వు చెప్పాలనుకున్నది చెప్పమన్నారు.ఏదో చెప్పాలనుకున్నాను కాని ఎందుకో నోరు పెగలడం లేదు.గొంతుకి ఏదో అడ్డు పడినట్లుగా ఉంది.నాకు అంతా అయోమయంగా వుంది. జడ్జి నన్ను రెట్టించి అడిగారు.నేను మాట్లాడలేకపోతున్నాను.నన్ను చూసి అంతా నవ్వుతున్నారు.నేను జనాల వైపుకి తిరిగాను.తొందరగా కానీవయ్యా బాబు ఇంకా మేమంతా వున్నాం అన్నట్లుగా వున్నాయి చూపులు.”ఏంటయ్యా లాయరూ!నీ సాక్షి మాట్లాడడేంటి మూగోడా?” విసుక్కున్నాడు జడ్జి.లాయరు నా వైపు గుడ్లు మిటకరించి చూస్తున్నాడు.నేను జడ్జి వైపు తల తిప్పబోతూ చూశాను.అక్కడ మూల నిలబడి నన్నే చూస్తుంది “ఊ! కానీ చెప్పు” అన్నట్లు తలూపింది.అంటే నేను రావొద్దని చెప్పినా వచ్చిందన్న మాట. నేను జడ్జి వైపు తిరిగి చెప్పాల్సింది చెప్పి బయటికి వచ్చేశాను.నా స్నేహితుడు లాయరు కూడా బయటికి వచ్చారు.నా స్నేహితుడు పట్టలేని ఆగ్రహంతో ఊగిపోతూ భయంకరంగా తిడుతున్నాడు. నాకు ఏమి వినపడడం లేదు.కాని వాడు అలా ప్రవర్తిస్తున్నందుకు బాధ కలిగింది.నా కళ్ళు వర్షిస్తున్నాయి.నేను మెల్లగా నడుస్తున్నాను.నా చేతికి ఏదో చల్లని స్పర్శ తగిలింది.చటుక్కున పక్కకి తిరిగాను అది ఎంతో ఆప్యాయంగా నా వైపు చూసింది.నా స్నేహితుడి వైపు తలతిప్పి తనని చూపిస్తూ మళ్ళీ నావైపు చూసింది.”తప్పైనా సరైనా అతను నా స్నేహితుడే అన్నావు? అతను కూడా నీలాగే అనుకుంటే బాగుండేదేమో!” అన్నట్లు వుందా చూపు. నేను “అవును ” అన్నట్లుగా కనురెప్పలు మూసి తెరిచాను. నేను నా స్నేహితుడికి అన్యాయం చేశానేమో అని నాలో ఏ మూలో ఉన్న ఆ కొద్దిపాటి అపరాధ భావం పోయింది.ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది.మనసంతా హాయిగా ఉంది. నన్ను తప్పు చేయనీకుండా మరోసారి కాపాడినందుకు కృతఙతా భావంతో చూశాను.అది తన చేతిలో నా చేతిని మరింత గట్టిగా బిగించింది. “నీకు నేనున్నాను!నీ జీవితాంతం నీకు తోడుగా వుంటాను” అన్న భరోసా ఆ స్పర్శలో ఉంది.
అవునండోయ్! ఇంతకీ అదెవరో చెప్పడం మర్చిపోయాను కదండీ.నాకు ఊహ తెలిసినప్పటినుండి నాతోనే వుంది,నేను మరణించే వరకు నాతోనే వుంటుంది అది నా “అంతరాత్మ”.అవునండీ మా నాన్న నాకంటగట్టిన నా ప్రియమైన శత్రువు అదే.ఆయన పోతూ “బాబూ!ఈ లోకంలో అందరూ తప్పులు చేస్తారు. నీ తప్పు వల్ల నువ్వు మాత్రమే బాధ పడితే పర్వాలేదు.కాని నీ తప్పు ఎదుటి వ్యక్తి బాధకి కారణం అయితే నీకు ఎప్పటికీ క్షమాపణ అనేది ఉండదు.ఒకవేళ ఆ వ్యక్తే నిన్ను క్షమించినా భగవంతుని దగ్గర నీకు క్షమాపణ దొరకదు.చిన్న తప్పులు పెద్ద తప్పులు అంటూ ఏమీ వుండవు.తప్పంటే తప్పే.నిజాయితీగా జీవించాలి.అది ఎవరి మెప్పు కోసమో కాదు.నీ ఆత్మతృప్తి కోసం.నువ్వు చేసే ప్రతీ తప్పుకీ ఈ లోకంలో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం రాకపోవచ్చు.ఒకవేళ చెప్పాల్సొచ్చినా తప్పించుకోవచ్చు.కాని నీ అంతరాత్మకు నువ్వు సమాధానం చెప్పగలవా?నువ్వు తప్పు చేసిన ప్రతిసారీ నీ అంతరాత్మ నిన్ను వేధిస్తూనే వుంటుంది. నిజయితీగా బ్రతకడంలో ఉన్న ఆనందం తప్పులు చేస్తున్నప్పుడు ఉండదు.కనీసం తను చేసింది తప్పే అని తన అంతరాత్మ ముందైనా ఒప్పుకోని వాడసలు మనిషే కాదు.వయసులో వున్నంత కాలం చేసే తప్పులు తప్పులుగా అనిపించవు.వయసుడిగి కాళ్ళూ చేతులు కదలని స్థితిలో,దేవుడి దగ్గరకి వెళ్ళి సమాధానం చెప్పాలన్న భయంతో, అప్పుడు మనం చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకి వస్తాయి.అప్పుడు ఆ స్థితిలో మనిషి పడే వేదన భయంకరం.అలా తప్పులు చేసి చివరికి వేదన అనుభవించే కన్నా ముందే సరిగ్గా వుండొచ్చు కదా.
అందుకే చెప్తున్నాను ఎప్పుడూ తప్పు చేయకు.నువ్వు నీ అంతరాత్మతో స్నేహం చేయి.నువ్వు పొరపాటు చేస్తున్నానన్న అనుమానం వచ్చిన ప్రతీ సారి దానిని అడుగు.అప్పుడు నీకు సరైన సమాధానం దొరుకుతుంది.”అని నా దగ్గర మాట తీసుకున్నాడు.నేనెప్పుడూ ఆయన మాట దాటలేదు.
ఈరోజు ఉదయాన్నే నా కొచ్చింది పీడకలే అయినా “నువ్వు చేయబోతుంది తప్పు” అని నన్ను నా అంతరాత్మ కల రూపంలో హెచ్చరించిందన్నమాట.ఆ రైలు పట్టాల మీద నడవడం నేనెంచుకున్న తప్పు మార్గం.ఆ రైలు నే చేసే తప్పు వెనకే ఉన్న తప్పించుకోలేని పెద్ద శిక్ష.ఆ రైలు కూత అంతరాత్మ రూపంలో ఒక హెచ్చరిక.హెచ్చరించిన వెంటనే దారి మార్చకపోవడం నా మూర్ఖత్వం. ఎంత ప్రయత్నించినా అడుగు పట్టాలు దాటి పడకపోవడం అంటే ,ఒకసారి తప్పు మార్గం ఎంచుకున్నాక ఇక ఎంత ప్రయత్నించినా పరిస్థితులు బయటపడనీయవు. చెమటలు కక్కుతూ పట్టాల మీద పరిగెత్తడం శిక్ష నుండి తప్పించుకోడం కోసం నేను చేసే వృధా ప్రయాస.ఇక పరిగెత్తడం దండగని తెలుసుకొని అక్కడే ఆగి నిల్చొని భయంతో మొదటి సారి దేవుణ్ణి తలచుకోవడం అంటే అప్పుడు చేసిన తప్పేంటో తెలుసుకుని మారి దేవుడ్ని ప్రార్ధించడం.రైలు నా మీద నుండి దాటి వెళ్ళడం అంటే చేయాల్సినవన్నీ చేసేసి చివరికి మారినా శిక్ష తప్పదు అని అర్ధం.ఇంక నేను అంత బాధలో వుండగా నా భార్యాబిడ్డలూ, నా స్నేహితులు ఎవరూ రాకపోవడం అంటే అందరూ బ్రతికి వుండగా అనందాల్ని పంచుకునే వారే కాని,నా శిక్షలో ఎవరు భాగం పంచుకోరు,ఎవరూ బాధపడరు.
ఇలా తప్పుచేయబోతున్న ప్రతిసారీ నేను నా అంతరాత్మతో వాదిస్తాను,గొడవపడతాను.కానీ గెలుపెప్పుడూ నా “అంతరాత్మదే”.
Sasikala Kilaru says
I really love the vision the real conscience truth.I really love the way you presented the essay like a professional analyst and writer.You have a crtic in you it helps others and warns about life.
BINDU says
Thank you so much, Sasi… 🙂