Onion Murukulu Recipe with step by step instructions.English Version.
నాకు పిండివంటలంటే చాలా ఇష్టం.ఏంటి వండడం అనుకుంటున్నారా? కాదండీ, తినడమంటే ఇష్టం అని చెప్తున్నాను.అన్నం తినడమైనా మానేస్తాను గానీ చిరుతిళ్ళు లేకుండా మాత్రం ఉండలేను.కానీ మా అమ్మాయి నాకు పూర్తి విరుద్దం.అసలు చిరుతిండ్ల జోలికే పోదు.నూనెలో వేయించినవి, పంచాదార పాకంలో వేసినవి అసలు ముట్టుకోదు.పైగా “ఎందుకమ్మా ఎప్పుడూ చూసినా పిండి మర ఆడించినట్లు అలా నములుతూనే ఉంటావు.తినీ తినీ నోరు అలసిపోయి ఉంటుంది.నోటికి కాస్త రెస్ట్ ఇవ్వరాదూ” అంటుంది.నాకు దాన్ని చూస్తే ఒళ్ళు మండిపోతుంది.అసలు నేనేమి తింటే తనకెందుకంటా?అది ఒక పెద్ద తేడా ఫెలో.ఇలా అన్నానని మా అమ్మాయికి మాత్రం చెప్పకండి ప్లీజ్.విడ్డూరం కాకపోతే చిరుతిండ్లు అంటే ఇష్టం లేనివారు అసలెవరైనా ఉంటారా చెప్పండి?
పిండివంటలు నేను ఎక్కువగా బయట స్వీట్ షాప్ లోనే కొంటూ ఉంటాను.నెలకి కనీసం రెండుసార్లయినా వెళ్లి తెచ్చుకుంటాను.ఒకవేళ ఇంట్లో తినడానికి చిరుతిండ్లు ఏమి లేకపోతే వేయించిన పల్లీలు బెల్లం తినేస్తాను.మా ఆయనైతే “నా సంపాదనంతా నీకు పల్లీలు కొనడానికే సరిపోతుంది తల్లీ” అంటుంటారు.మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్లు పెద్ద పెద్ద క్యాన్లలో పంచదార లడ్డూలు, చెక్కలు, జంతికలు, కారప్పూస, బూంది, నేతి అరిసెలు, మైసూర్ పాక్, నెయ్యి, జీడిపప్పు పెట్టి పంపేవారు.అవి తినీ తినీ నేను ఎంత లావయ్యనంటే, మా స్కూల్ రిక్షా అబ్బాయి రోడ్ మీద ఎత్తు రాగానే నన్ను రిక్షా దిగి తోయమనేవాడు.మిగతా పిల్లలంతా నవ్వేవారు.నేను చాలా హర్ట్ అయ్యేదాన్ని.ఆ రిక్షా అతని పేరు గుగులోత్ లాక్య.ఇప్పటికీ నాకు బాగా గుర్తు.తర్వాత ఎప్పుడో 9 వ తరగతిలో ఉన్నపుడు ఒకసారి బాగా జ్వరం వచ్చి ఒక పది రోజులు అసలు తిండే ముట్టుకోలేదు.దెబ్బకి సన్నబడిపోయాను.అలా కరిగింది నా భారీ శరీరంలోని కొవ్వు.
ఇక ఈ recipe విషయానికొస్తే, ఇది బయట అన్ని స్వీట్ షాపుల్లో దొరుకుతుందని నేననుకోను.ఎందుకంటే నేనెప్పుడూ కొనే దుకాణంలో తప్ప ఇంకెక్కడా చూడలేదు.అందుకే అసలు ఇది అందరికి తెలుసో లేదో, బ్లాగ్ లో పోస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని ట్రై చేసాను.మొదటిసారి చేసినపుడు కింద ఇచ్చిన ingredients తో పాటు సెనగపిండి కూడా వేశాను.అవి తినగానే మా ఆయన “ఉల్లిపాయ పకోడీలను జంతికల్లా చేసుకొని తిన్నట్లుంది” అని అన్నారు.నాకూ అలానే అనిపించింది.అందుకే రెండవసారి చేసేటప్పుడు శెనగపిండి వేయకుండా చేశాను.ఈసారి బాగా కుదిరాయి.అచ్చు షాప్ లో కొన్న మాదిరే ఉన్నాయి.
ఈ జంతికల తయారీ కోసం మీరు పిండి కలుపుకునేటప్పుడు ఉల్లిపాయ గుజ్జుతోనే కలుపుకోవాలి.పిండి సరిగ్గా కలవడానికి కావలసినంత ఉల్లిపాయ గుజ్జు చేసుకోవాలి.ఒకవేళ గుజ్జు కొద్దిగా తక్కువైతే కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవచ్చు.కానీ పిండి మాత్రం గట్టిగా ఉండాలి.పొరబాటున కూడా జారుగా చేసుకోకూడదు.అలా చేస్తే మురుకుల గిద్దలో వేసి వత్తేటప్పుడు పిండి ముక్కలు ముక్కలుగా పడిపోతుంది.ఉల్లిపాయ వేయడం వల్ల ఇవి కొంచెం నూనె ఎక్కువగానే పీల్చుకుంటాయి.కాబట్టి నునేలో నుండి బయటకు తీయగానే పేపర్ నాప్కిన్ మీద వేస్తే నూనెను పీల్చేసుకుంటుంది.ఎంతో రుచికరమైన ఈ వంటకాన్ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Bread Pizza recipe in Telugu
Bounty Chocolate Recipe in Telugu
Strawberry Rava laddoo Recipe in Telugu
Vegetable Cutlet Recipe in Telugu
Biscuit Cake Recipe in Telugu
Saggubiyyam Punugulu Recipe inTelugu
Click here for English Version of this Recipe.
- 2 కప్పులు బియ్యం పిండి
- ½ కప్పు పొట్టు లేని మినుములు
- 250 గ్రాములు ఉల్లిపాయ పేస్ట్
- 40 గ్రాములు వెన్న
- 2 tsp ఉప్పు
- 1 tbsp కారం
- 1 tbsp వాము
- సరిపడా నీళ్ళు
- డీప్ ఫ్రై కి సరిపడా నూనె
- మినుముల్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఉల్లిపాయల్ని కూడా మిక్సీలో వేసి మెత్తని గుజ్జుగా చేసుకోవాలి.
- ఒక వెడల్పాటి పాత్రలో బియ్యం పిండి, మినప పిండి, తగినంత ఉప్పు, సోడా ఉప్పు, కారం, వాము, వెన్న వేసి కలపాలి.
- తరవాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలిపాలి.అవసరమైతే కొద్దిగా నీళ్ళు జల్లి కలపొచ్చు.కానీ పిండి మాత్రం గట్టిగా ఉండేటట్లు చూసుకోవాలి.
- పిండిలో తేమ పోకుండా ఉండడానికి పైన కొద్దిగా నూనె రాసి మూత పెట్టి ఉంచాలి.
- ఒక బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
- నూనె కాగాక ఒక చిన్న పిండి ముద్ద వేసి చూడాలి.అది వెంటనే నూనె పైకి తేలితే నూనె సరిగ్గా కాగినట్లు లెక్క.
- మురుకుల గిద్దను పిండితో నింపి, గుండ్రంగా తిప్పుతూ నూనెలో ఒత్తుకోవాలి.
- రెండు వైపులా తిప్పుతూ చక్కని బంగారు వర్ణం లోకి వచ్చేవరకు వేయించుకొని పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.
Onion Murukulu Recipe Video
[embedyt] https://www.youtube.com/watch?v=vUjY9Q7LUsA[/embedyt]
Leave a Reply