మనలో చాలా మందిని బాధించే సమస్య అధిక బరువు. పెరగడమైతే తేలికే కానీ తగ్గాలనుకుంటేనే మహా కష్టం.అందరూ బరువు తగ్గడానికి నానా కష్టాలు పడుతుంటారు. కానీ తగ్గలేక దిగులు పడుతుంటారు. సరే! ఇదంతా పక్కన పెడితే అసలు మనం బరువు ఎందుకు పెరుగుతామో తెలుసుకోవడమనేది చాలా అవసరం. పుట్టగానే అయితే బరువు ఉండము కదా. పెరిగే క్రమంలో మన శరీరం లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కొందరు ఎప్పటికీ ఒకలానే ఉంటారు. కొంతమంది ఓ మాదిరి బరువుతో ఉంటారు. మరి కొంతమంది విపరీతంగా లావయిపోతుంటారు. పైగా తమ ప్రమేయం లేకుండానే అంత బరువు ఎలా పెరిగామా అని వాపోతుంటారు.
అందరు బాగా గుర్తుపెట్టు కావాల్సింది, అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే “మనం ఏమి తింటామో అదే మనం“. మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానాలే మన బరువును నియంత్రిస్తుంటాయి. పొద్దున్న లేచిన దగ్గర నుండి అడ్డమైన చెత్తంతా పొట్టలో వేస్తుంటాం. ఆ చెత్తనంతా అరిగించడానికి మన శరీరం ఎంత కష్టపడాల్సి వస్తుందో తెలుసా? కోపం వస్తే ఒక్కోసారి మన అమ్మయినా సహనం కోల్పోయి కఠినంగా ప్రవర్తిస్తుందేమో కానీ మన శరీరం మాత్రం తనకు ఓపిక ఉన్నంత వరకు సహనంగా భరిస్తుంది. ఇక ఓపిక లేనప్పుడు మాత్రమే తన బాధను జబ్బుల రూపంలో బయట పెడుతుంది.
కొద్దిగా టాపిక్ పక్కదారి పడుతున్నట్లు అనిపించినా మీకు కొన్ని విషయాలు తప్పక చెప్పాలి. ఎందుకంటే సమస్య ఏంటో తెలుసుకోవడం కన్నా అసలు సమస్య యొక్క మూలం ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకు మనిషి జన్మ లభించడమే చాలా గొప్ప విషయం. మనిషి బాగా తెలివిగా ఆలోచించగలడు. అనుకుంది చేయగలడు. మిగిలిన జీవరాసులకి వేటికి ఆ అవకాశం లేదు. మరి మనకున్న ఈ గొప్ప అవకాశాన్ని మనం ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటున్నాము?
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమెందుకు? అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు తిని ఒళ్లు పెరిగాక బాధ పడడమెందుకు? బరువు పెరగడానికి తిండి తినడమే కారణమని చెప్పలేము. రకరకాల కారణాలు ఉండొచ్చు. థైరాయిడ్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు, కొన్ని రకాల మందుల వాడకం వల్ల, నిద్రలేమి వల్ల, శారీరిక శ్రమ తక్కువగా ఉండడం వల్ల, అధికంగా తినడం వల్ల ఇలా కారణం ఏదైనా కావొచ్చు. వీటిలో మీ బరువు పెరగడానికి కి కారణం ఏమిటో ముందు తెలుసుకోవాలి.
అధిక బరువున్న వారిలో 90 శాతం మంది కచ్చితంగా పరిమితి లేని తిండి వల్లే అంత బరువు పెరుగుతారు. మిగతా 10 శాతం వివిధ శారీరిక సమస్యల వల్ల బరువు పెరుగుతారు. ఆ శారీరిక సమస్యలు కూడా పరోక్షంగా ఆహారపు అలవాట్ల మీద, జీవన శైలి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనం తినే ఆహారాన్ని సరి చేసుకుంటే 100 శాతం అధిక బరువు సమస్యని అధిగమించవచ్చు.
బరువు తగ్గాలనుకునే వారికి కావాల్సింది గట్టి పట్టుదల, స్వయం నియంత్రణ, ఓపిక, సహనం.సంవత్సరాల తరబడి పెంచిన శరీరం ఒక్క రోజులో తగ్గిపోవాలంటే సాధ్యం కాదు కదా. అందుకే మీరు అనుకున్న బరువుకి చేరే వరకు పట్టుదలతో, సహనం తో ఉండాలి.
బరువు తగ్గడానికి ఒక క్రమ పద్దతిని అనుసరించాలి. ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు ఆదరా బాదరాగా డైట్ లు, ఎక్సర్సైజులు చేయడం సరి కాదు.ఒక క్రమ పద్దతిలో బరువు తగ్గాలనుకునే వారు పాటించాల్సిన నియమాలేంటో తరవాతి పోస్ట్ లో చదవగలరు.
మీకు ఉపయోగపడే ఇంకొన్ని అధిక బరువుకి సంబంధించిన పోస్ట్లు