Pepper Chicken Recipe with step by step instructions.
మామూలు చికెన్ కూర తినీ తినీ బోర్ కొట్టినపుడు ఒకసారి ఇలా పెప్పర్ తో చికెన్ వండుకుంటే బాగుంటుంది.ఎండుమిర్చి, మిరియాలు రెండు కారంగా ఉన్నా వాటి రుచిలో తేడా ఉంటుంది.మిర్చి ఘాటు వేరు, మిరియాల ఘాటు వేరు.మాంసం తో మిరియాల పొడి వేసి వండడం మనకన్నా విదేశీయులకు ఎక్కువ అలవాటు.అసలు మిరియాల కోసమే కదా వారు మన దేశానికి వచ్చింది.ఎందుకంటే మిరియాలలో సహజంగా మాంసాన్ని మెత్తబరచే గుణం కలదు.అంతే కాకుండా అది సహజంగా మాంసాహారం లో ఉండే నీచు వాసనను తొలగించి చక్కని సున్నితమైన రుచిని, పరిమళాన్ని ఇస్తుంది.
ఈ పెప్పర్ చికెన్ ఫ్రై కోసం నేను ముందుగా చికెన్ లో మిరియాలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలిపి కాసేపు నానబెట్టాను.ఇలా చేయడం వల్ల ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి బాగా పడుతుంది.అంతే కాకుండా ముక్కలు ఉడికాక గట్టిగా రబ్బర్ లా కాకుండా మెత్తగా ఉంటాయి.ఒక వేళ మీరు అచ్చంగా లెగ్ పీస్ ల తో గాని, థై(thigh) పీస్ ల తో గాని చేస్తే, అసలు చికెన్ ని ముందుగానే నానబెట్టుకోకపోయినా పర్వాలేదు.అప్పటికప్పుడు వండేయ వచ్చు.కాని చెస్ట్ పీస్ లు ఉంటే మాత్రం కాసేపు నానబెట్టి వండితేనే మంచిది.
నేను మారినేషన్ లో 1 tbsp మిరియాల పొడి, ఇంకా కూర వండేటప్పుడు 3 tsp ల మిరియాల పొడి వేసాను.కానీ పిల్లలు మనం తిన్నంత కారం తినలేరు కాబట్టి కాస్త తగ్గించి వేసుకుంటేనే మంచింది.అందుకే ముందుగానే నేను చెప్పినంత వేసేయకుండా మీ రుచికి సరిపడా వేయండి.కూర దించే ముందు కొద్దిగా నిమ్మ రసం పిండితే ఇంకా బాగుంటుంది.ఈ కూరని అన్నం ఇంకా చారు తో కలిపి వడ్డిస్తే చాలా బాగుంటుంది.లేదా చపాతీలు, నాన్ ల తో కూడా తినవచ్చు.నోరూరించే ఈ రుచికరమైన వంటకాన్ని మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
గోంగూర చికెన్ తయారు చేయడం ఎలా?
వెజిటెబుల్ కట్లెట్ తయారు చేయడం ఎలా?
సగ్గుబియ్యంతో పునుగులు చేయడం ఎలా?
for the English Version of Pepper Chicken Recipe — Click here
- 500 గ్రాములు చికెన్
- ½ tsp పసుపు
- 1 tsp ఉప్పు
- 1 tbsp మిరియాల పొడి
- ¼ కప్పు పెరుగు
- 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
- 2 రెమ్మలు కరివేపాకు
- 2 tbsp ధనియాలు
- 3 లవంగాలు
- 2 యాలుకలు
- 1 అంగుళం దాల్చినచెక్క
- 1 చిన్న ముక్క అనాస పువ్వు
- ½ tsp సోంపు
- ½ tsp గసగసాలు
- 1 tsp ఎండు కొబ్బరి పొడి
- 2 మీడియం ఉల్లిపాయలు పేస్ట్
- 4 పచ్చిమిరపకాయలు
- 1 tbsp అల్లం వెల్లుల్లి ముద్ద
- 1 tbsp మసాలా
- 2-3 tsp మిరియాల పొడి
- 1 రెమ్మ కరివేపాకు
- 10 జీడిపప్పులు దోరగా వేయించినవి
- ¼ కప్పు కొత్తిమీర
- ¼ కప్పు నూనె
శుభ్రంగా కడిగిన చికెన్ ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మిరియాల పొడి, కరివేపాకు వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
ఒక చిన్న పెనం వేడి చేసి అందులో ధనియాలు, లవంగాలు, యాలుకలు, అనాస పువ్వు, దాల్చినచెక్క, సోంపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
తర్వాత గసగసాలు, ఎందు కొబ్బరి పొడి కూడా వేసి 15 సెకన్ల పాటు వేయించాలి.
వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయల పేస్ట్ వేసి 2 నుండి 3 నిమిషాల పాటు వేయించాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కుడా వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
నానబెట్టిన చికెన్ ని వేసి ఒకసారి బాగా కలియ తిప్పి, మూత పెట్టి మాదిరి సెగ మీద 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి.
మూత తెరిచి ఒకసారి కూరని కలిపి, 1 tbsp ముందుగా చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఇంకా 2 నుండి 3 tsp ల మిరియాల పొడి వేసి మళ్ళీ కలిపి 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి.
తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు ఉడికించి స్టౌ కట్టేయాలి.
Pepper Chicken Recipe Video
[embedyt] http://www.youtube.com/watch?v=nb-9PgUiZRc[/embedyt]
Leave a Reply