Maatamanti

Poornam Boorelu Telugu Recipe-పూర్ణం బూరెలు తయారీ?

Poornam Boorelu Telugu Recipe with step by step instructions.English Version.

పూర్ణాలను మన తెలుగు వారు ఎక్కువగా పండుగ పర్వ దినాలలో లేదా ఇంట్లో ఏదైనా వేడుక సందర్భాలలో తయారు చేస్తుంటారు.వీటి రుచి అమోఘం.మా అమ్మ పూర్ణాలు చాలా బాగా తయారు చేసేవారు.నాకు తను చేసిన పూర్ణాలంటేనే ఇష్టం.ఎందుకంటే తను పూర్ణాల మధ్య పెట్టే పిండిలో జీడిపప్పు, బాదంపప్పు, పల్లీలు, ఎండు కొబ్బరి వేసి చేసేవారు.అవి మరింత రుచిగా ఉండేవి.

ఎప్పుడు వీటిని తయారు చేసినా మా అమ్మగార్ని తలుచుకుంటాను.ఇప్పుడు తను లేరు.అందుకే ఎవరైనా అమ్మ పెట్టినప్పుడే నాకదొద్దు ఇదొద్దు అని పేచీ పెట్టకుండా అన్నీ తినేయాలి.ఎందుకంటే తర్వాత మనకి బ్రతిమలాడి తినిపించేవారు కానీ, మనకి నచ్చినవి చేసిపెట్టేవారు కానీ ఎవరూ ఉండరు.ఆ అధ్బుతమైన అమ్మ ప్రేమ, కమ్మని రుచి కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి.

ఇక ఈ recipe విషయానికొస్తే, అప్పుడే కొత్తగా వంట నేర్చుకునేవారు దీన్ని తయారు చేయాలంటే కొద్దిగా కష్టమే.వేయించేటప్పుడు లోపలి పిండి బయటకు రాకుండా చూసుకోవాలి.అలా వచ్చిందంటే నూనె మొత్తం పాడయిపోతుంది.అందుకే లోపలి స్టఫ్ గట్టిగా చేసుకోవాలి.పైన పిండిని మరీ జారుగా లేదా మరీ గట్టిగా లేకుండా మధ్యస్తంగా ఉండేటట్లుగా చూసుకోవాలి.కొన్ని ప్రాంతాల వారు  పైన పిండికి అచ్చంగా మైదా పిండి ని ఉపయోగిస్తారు.అవి వేడిగా ఉన్నప్పుడు బాగున్నా ఆరిపోయాక సాగినట్లుగా అయిపోతాయి.అందుకే మినప పిండి ని ఉపయోగించడమే మంచిది.నేను కూడా కొద్దిగా(2 tbsp) మైదా పిండిని మినప పిండి లో కలిపాను.ఇలా చేయడం వల్ల పూర్ణాలు వేయించేటప్పుడు అసలు విడిపోవు.

వేడి వేడి పూర్ణాలలో కాస్త కాచిన నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.సాధారణ వాతవరణంలో ఇవి 1 1/2 రోజుల వరకు నిలవ ఉంటాయి.కానీ వేడి ఎక్కువగా ఉంటే మాత్రం త్వరగా పాడయిపోతాయి.నేనైతే మిగిలిన వాటిని ఫ్రిజ్ లో పెట్టేసుకొని తినే ముందు ఒక 5 నుండి 10 సెకన్ల పాటు ఓవెన్ లో ఉంచి తింటాను.ఓవెన్ లో నుండి తీయగానే త్వరపడి తినకూడదు.ఎందుకంటే లోపల చాలా వేడిగా అయిపోతుంది.చూసుకాకపోతే నోరు కాలడం ఖాయం.ఎంతో రుచికరమైన ఈ పూర్ణాలు recipe ని మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Banana Balls Telugu Recipe
Sorakaya Halwa Telugu Recipe
Nalla Senaga Guggillu Telugu Recipe
Parle-G Biscuit Cake Telugu Recipe
Chicken Shawarma Recipe in Telugu

Click Here for the English Version of this Recipe

5 from 1 vote
Poornam Boorelu Telugu Recipe
Prep Time
1 hr
Cook Time
1 hr
Total Time
2 hrs
 
Course: Dessert, Main Course
Cuisine: Andhra, South Indian, Telangana
Author: బిందు
Ingredients
నానబెట్టడానికి కావలసినవి
  • ½ కప్పు మినపప్పు
  • ¾ కప్పు బియ్యం
  • నీళ్ళు తగినంత
పిండి కొరకు
  • 1 కప్ నానబెట్టిన మినపప్పు మరియు బియ్యం
  • ½ tsp ఉప్పు
  • ½ లేదా 1/3 కప్పు నీళ్ళు
  • 2 tbsp మైదా పిండి
  • ¼ tsp వంట సోడా
ఫిల్లింగ్ కొరకు
  • 1 కప్పు లేదా 200 గ్రాములు పచ్చి సెనగ పప్పు
  • 1 కప్పు బెల్లం + ½ కప్పు(ఒక వేళ మీరు డ్రై ఫ్రూట్స్ వాడితే)
  • ½ tsp యాలకుల పొడి
  • 2 లేదా 3 tbsp నెయ్యి
  • 3 కప్పులు లేదా 750 ml నీళ్ళు
  • 10 బాదం పప్పులు
  • 10 జీడిపప్పులు
  • 10 పిస్తా పప్పులు
  • 2 tbsp పల్లీలు
  • ¼ కప్పు ఎండు కొబ్బరి పొడి
ఇతరములు
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా
Instructions
పిండి తయారు చేయుట
  1. మినపప్పు మరియు బియ్యం కలిపి ఒక రాత్రంతా లేదా 4 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి.
  2. రుబ్బే ముందు 2 నుండి 3 సార్లు శుభ్రంగా కడగాలి.
  3. పప్పు ని బియ్యాన్ని మిక్సీలో కి తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మరీ గారెల పిండిలా గట్టిగా లేదా దోసెల పిండిలా మరీ జారుగా కాకుండా మధ్యస్థంగా రుబ్బుకోవాలి.అంటే పిండి కొద్దిగానే జారుగా ఉండాలి.
  4. రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 2 tbsp ల మైదా పిండి కొద్దిగా సోడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
పప్పును ఉడికించుట
  1. పచ్చి సెనగ పప్పును రెండు మూడు సార్లు కడిగి 3 కప్పుల నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఒక ఉడుకు వచ్చే వరకు వండాలి.
  2. ఉడకడం మొదలవ్వగానే సెగ కాస్త తగ్గించి పప్పు సరిగా ఉడికే వరకు మరిగించాలి.
  3. పప్పు మెత్తగా పేస్ట్ లా కాకుండా పప్పుగానే ఉండాలి.కానీ పప్పుని ని రెండు వేళ్ళతో నొక్కి నప్పుడు అది నలిగేట్లుగా ఉడికించాలి.
  4. తర్వాత పొయ్యి కట్టేసి పప్పు లో నీళ్ళు వడకట్టేయాలి.
ఫిల్లింగ్ కొరకు
  1. జీడి పప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు మరియు పల్లీలను వేయించి మిక్సీలో వేసి పొడి కొట్టుకోవాలి.
  2. ఉడికించి పెట్టుకున్న పచ్చి సెనగ పప్పు ని కూడా పొడి ల చేసి పక్కన పెట్టుకోవాలి.
  3. ఒక బాణలిలో రుబ్బిన పచ్చి సెనగ పప్పు, బెల్లం, జీడి, బాదం, పిస్తా&పల్లీ పప్పుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బెల్లం కరికే వరకు కలపాలి.
  4. ఒక్క సారి బెల్లం కరగడం మొదలవగానే యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి గట్టిగా హల్వా లా అయ్యే వరకు కలుపుతుండాలి.
  5. పొయ్యి కట్టేసి బాణలి ని పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆరనివ్వాలి.
పూర్ణాలు తయారు చేయుట
  1. ఫిల్లింగ్ స్టఫ్ నిమ్మకాయంత పరిమాణంలో సమానంగా ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి.
  2. ముందుగా చేసి పెట్టుకున్న మినప మరియు బియ్యం పిండిలో ఆ ఉండలను వేయాలి.
  3. ఆ ఉండలకు పిండి సరిగ్గా అంటేలా చూసుకోవాలి.ఎక్కడా లోపలి పిండి బయటికి కనపడకూడదు.
  4. ఇలా చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో వేసి చక్కని బంగారు వర్ణం వచ్చే వరకు వేయించాలి.
  5. వేయించిన వాటిని పేపర్ నాప్‌కిన్ లోకి తీసుకోవాలి.
Recipe Notes

పూర్ణాలను తుంపి కొద్దిగా కరిగిన నెయ్యి వేసి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి.

Poornam Boorelu Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=ZsBBfE8FrZI[/embedyt]

Related Post

Please Share this post if you like