Ulavacharu Chicken Biryani Telugu Recipe with step by step instructions.English Version.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరియు దక్షిణ భారత దేశం లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న బిర్యానీ వంటకం అంటే ఈ ఉలవచారు చికెన్ బిర్యానీనే.రుచి లో ఏమాత్రం రాజీ లేకుండా అద్భుతంగా ఉంటుందీ వంటకం.మామూలు బిర్యానీ కి సైడ్ డిష్ గా ఖట్టా ఇంకా రైతా ఇచ్చినట్లుగా ఈ బిర్యానికి ఉలవచారునే సైడ్ డిష్ గా ఇస్తుంటారు.బిర్యానీ వండేప్పుడు చికెన్ లో కొంత ఉలవచారు వేస్తారు మళ్ళీ సైడ్ డిష్ గా కూడా వడ్డిస్తుంటారు.
కొన్ని సంవత్సరాల క్రిందట ఒక సారి నేను విజయవాడ బందర్ రోడ్ లో వెళుతున్నప్పుడు ఫస్ట్ టైమ్ నేను స్వీట్ మాజిక్ రెస్టారంట్ బయట ఉన్న బానర్ మీద ‘ఉలచారుబిర్యానీ‘ అని రాసి ఉండడం చూశాను.పొరబాటున ఉలవచారు కి మరియు బిర్యానీ కి మధ్య కామా పెట్టడం మర్చి పోయారేమో లేకపోతే మరీ విడ్డూరంగా ఉలవచారు తో బిర్యానీ ఏంటి అనుకున్నాను మనసులో.తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళినప్పుడు మూడు నాలుగు చోట్ల అలానే రాసి ఉండడం గమనించి మా ఆయనతో అంటే తను “నీకు తెలీదా ఇప్పుడు ఇదే చాలా పాపులర్.ఈ సారి టేస్ట్ చేద్దాం లే” అన్నారు.స్వీట్ మాజిక్ కి వెళ్లి ఆర్డర్ చేశాము.ఆ రోజు నా husband చాలా బాగుంది అని చెప్పినా కూడా నేను తినలేదు.ఎందుకో ఆ కాంబినేషన్ ని నేను ఇష్టపడ లేదు.కొన్ని రోజుల తర్వాత నేను హైదరాబాద్ లో ఫస్ట్ టైం టేస్ట్ చేశాను.ఒక food blogger గా అన్ని రుచి చూడాలి కాబట్టి.తినగానే సూపర్ గా నచ్చింది.అరె! అనవసరంగా ఇన్ని రోజులు ఈ అద్భుతమైన టేస్ట్ ని మిస్ అయ్యానే అనుకున్నాను.ఇక అప్పుడు మొదలు ఇప్పటి వరకు ఎవరు తిననంతగా తినుంటానేమో నేను.
కింద ఉన్న video లో నేను ఉలవచారు ను సగం ఉడికిన చికెన్ లో వేసి కలపకుండా దాని మీదే సగం ఉడికిన అన్నం వేశాను.అసలైతే చికెన్ తో ఉలవచారు వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించి అప్పుడు పైన అన్నం వేయాలి.నేను అలా ఎందుకు వేయలేదంటే చికెన్ లో ఉలవచారు కలిపేస్తే అది నల్లగా అయిపోయి ఫొటోస్ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది.ఫొటోస్ లో detail మిస్ అయి నల్లగా వస్తుంది rice.అందుకే కలప లేదు.కానీ మీరు మాత్రం ఉలవచారు చికెన్ లో వేసాక బాగా కలిపి ఒక 5 నిమిషాలు సన్నని సెగ మీద ఉడికించి అప్పుడు పైన అన్నం వేసి వండుకోంది.అప్పుడు ఉలవచారు చికెన్ కూ బాగా పట్టి బాగా టేస్ట్ వస్తుంది.ఈ అద్భుతమైన ఉలవచారు బిర్యానీ recipe ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Mutton Biryani Telugu Recipe
Mutton Dalcha Telugu Recipe
Chicken Tikka Pulao Recipe in Telugu
Hyderabadi Prawns Biryani Telugu Recipe
Fish Biryani Telugu Recipe
Natukodi Pulusu Telugu Recipe
Click here for the English Version of this recipe.
Chicken Biryani recipe made with Horse gram soup or Ulavacharu or Kollu rasam
- 5 యాలుకలు
- 5 లవంగాలు
- 3 దాల్చినచెక్క అంగుళం పొడవు
- 1 జాపత్రి
- ¼ ముక్క జాజికాయ
- 2 మరాఠి మొగ్గలు
- 1 tbsp బిర్యానీ పూలు
- 1 అనాస పువ్వు
- 1 tbsp సోంపు
- 1 tbsp షాజీర
- 1 kg చికెన్
- 500 గ్రాములు పెరుగు
- 2 tbsp అల్లం వెల్లుల్లి పేస్టు
- ½ tsp పసుపు
- 2 లేదా 3 tbsp కారం
- ఉప్పు తగినంత
- 3 లేదా 4 tsp బిర్యానీ మసాలా
- 3 లేదా 4 పచ్చిమిరపకాయలు
- ½ కప్పు కొత్తిమీర
- ½ కప్పు పుదీనా
- 40 లేదా 50 గ్రాములు వేయించిన ఉల్లిపాయలు
- 1 నిమ్మకాయ
- 2 tbsp నెయ్యి
- 60 ml నూనె
- 600 గ్రాములు బాస్మతి రైస్
- 3 లీటర్లు నీళ్ళు
- అన్ని గరం మసాలా దినుసులు కలిపి కొద్దిగా
- ఉప్పు తగినంత
- 2 tbsp నూనె
- ¼ కప్పు పుదీనా
- 250 ml లేదా 300 ml ఉలవచారు
- ½ కప్పు పుదీనా
- 10 గ్రాములు వేయించిన ఉల్లిపాయలు
- 1 tbsp నెయ్యి
- ఒక చిన్న పెనంలో ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ పూలు, షాజీర, సోంపు, మరాఠీ మొగ్గ వేసి దోరగా వేయించి మిక్సీలో మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ లో పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా కలపాలి.
- పెరుగు, నూనె, నెయ్యి వేసి మళ్ళీ కలపాలి.
- తర్వాత పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, పుదీనా , వేయించిన ఉల్లిపాయలు వేసి, నిమ్మకాయ రసం కూడా పిండాలి.
- కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలా కలిపి ఒక గంట పాటు నానబెట్టాలి.
- 600 గ్రాములు బియ్యం గిన్నెలోకి తీసుకొని నీళ్ళు పోసి అరగంట సేపు నానబెట్టాలి.
- వండే ముందు రెండు మూడు సార్లు కడిగి వాడాలి.
- బిర్యానీ వండాలనుకున్న గిన్నెలో అడుగున కొద్దిగా నూనె పోసి మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ను వేయాలి.
- ఆ గిన్నెను అల్యూమినియం ఫాయిల్ తో సరిగ్గా మూయాలి.పైన మూత కూడా పెట్టి 15 నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించాలి.
- తర్వాత పొయ్యి సిమ్ లో పెట్టాలి.
- ఒక మందపాటి పాత్రలో సుమారు 3 లీటర్ల నీళ్ళు పోయాలి.
- ఆ నీళ్ళలో అన్ని గరం మసాలా దినుసులు, పుదీనా ఆకులు, ఉప్పు, నూనె వేసి మరిగే వరకు కాగనివ్వాలి.
- నీళ్ళు మరగడం మొదలవ గానే అందులో నానబెట్టిన బియ్యం వేయాలి.
- బియ్యం వేయగానే నీళ్ళు మరగడం ఆగిపోతుంది అందుకే మళ్ళీ ఒక ఉడుకు వచ్చే వరకు వండాలి.
- ఉడకడం మొదలైన దగ్గర నుండి ఒక 3 నిమిషాల పాటు ఉంచి తర్వాత స్టవ్ కట్టేసి వెంటనే నీటిని వార్చేయాలి.
- ఇంతకుముందు చికెన్ మీద పెట్టుకున్న అల్యూమినియం ఫాయిల్ ను జాగ్రత్తగా తీసి పక్కన పెట్టి సన్నటి సెగ మీద ఉడుకుతున్న కూరను ఒకసారి కలిపి అందులో ఉలవచారు కూడా వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి.
- తర్వాత ఉలవచారు చికెన్ మీద సగం ఉడికిన అన్నం వేసి సమంగా పరచుకునేట్లుగా సర్దాలి.
- అన్నం మీద కొన్ని పుదీనా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు వేయాలి.
- ఆ పాత్రను మళ్ళీ అల్యూమినియం ఫాయిల్ తో మూసి మూత కూడా పెట్టి సిమ్ లో 15 నిమిషాలు ఉడికించి స్టవ్ కట్టేయాలి.
- స్టవ్ కట్టేయగానే మూత తెరవకుండా ఒక 15 నుండి 30 నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత వడ్డించాలి.
Ulavacharu Chicken Biryani Telugu Recipe Video
[embedyt] http://www.youtube.com/watch?v=6MeQrhYyuzc[/embedyt]
Leave a Reply