గమనిక :నేను కమర్షియల్ గా సినిమా లకు రివ్యూ రాసే వ్యక్తిని కాను. నేను ఒక సగటు ప్రేక్షకురాలిగా ఆ సినిమా గురించి ఏమి ఫీల్ అయ్యాను, దాని నుండి ఏమి నేర్చుకున్నాను అనేది రాశాను. అందువల్ల దీనిని సమీక్ష అనే కన్నా విశ్లేషణ(Analysis) అంటే బాగుంటుంది. ఈ సినిమా అనే కాదు నేను చూసిన మరికొన్ని పాత సినిమాలు వాటి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అని కూడా ఇకముందు నాకు వీలయినప్పుడల్లా రాయాలి అనుకుంటున్నాను.
మీ అందరి లాగే నాకూ సినిమాలంటే ఇష్టం. ఒక చోట కదలకుండా ఎక్కువ సేపు కూర్చోలేను సినిమా హాల్ లో వాకింగ్ చేస్తూ సినిమా చూసే సౌలభ్యం ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది, చుట్టూరా దగ్గర దగ్గరగా జనాలు ఉంటే నాకు ఊపిరాడదు, సడన్ గా వచ్చే శబ్దాలను భరించలేను కాబట్టి సినిమా హాల్ లో సినిమాలు చాలా తక్కువ చూస్తాను. ఈ OTT platforms పుణ్యమా అని సినిమాలు ఇంట్లోనే కూర్చుని చూడగలుగుతున్నాను. ఉన్నాయి కదా అని ఏది పడితే అది చూసే అలవాటు లేదు. నాకు నచ్చే సినిమాలు కొద్దిగా వేరేగా ఉంటాయి.
ఈ మధ్య మరీ విపరీతమైన పనిలో పడిపోయి TV చూసే సమయం కూడా దొరకడం లేదు. మా ఇంటి చుట్టు పక్కల నుండి విపరీతమైన శబ్దాలు వస్తుండడంతో మొన్నో నాలుగు రోజులు వీడియోస్ చేయలేదు, కంప్యూటర్ జోలికి పోలేదు. అదే సమయంలో ఈ ఉమామేశ్వర ఉగ్రరూపస్య సినిమా Netflix లో విడుదల అయింది. శ్రావణ శుక్రవారం రోజు నేను, మా అమ్మాయి పూజ చేసుకుని తర్వాత ఈ సినిమా చూశాము. ఒక మంచి సినిమా అంటే కాసేపు ప్రేక్షకుడు తన ఉనికిని తను మర్చిపోవడం. అలా ఆ రోజు చాలా రోజుల తర్వాత నా ఉనికిని నేను మర్చిపోయేలా చేసింది ఈ సినిమా.
ఈ సినిమాకు మాతృక మలయాళ సినిమా “మహేషింటే ప్రతీకారం“. అందులో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించారు. తెలుగులో సత్యదేవ్ హీరోగా నటించారు.
కథ : హీరో మహేష్ కు అరకు లో ఒక ఫోటో స్టూడియో ఉంటుంది. తన తండ్రి ఫోటో స్టూడియో ను చూసుకుంటూ ఫోటో గ్రాఫర్ గా ఉంటాడు. ఊర్లో ఎవరికి ఫోటోలు కావాల్సినా మహేష్ స్టూడియో కే వచ్చి తీయించుకుంటారు. చిన్నప్పటి నుండి ఎవరి జోలికీ పోకుండా ఎటువంటి గొడవల్లో తలదూర్చకుండా తన పనేదో తను చూసుకునే మనస్తత్వం మహేష్ ది.
ఇలా ఉండగా ఒక రోజు మహేష్ తన ప్రమేయం లేకుండా అనుకోకుండా ఒక గొడవ సర్ది చెప్పబోయి అనవసరంగా ఊరందరి ముందు దెబ్బలు తింటాడు. మహేష్ ని కొట్టినతను అందరి ముందు అతని బట్టలు కూడా చింపేసి అవమానిస్తాడు. ఆ అవమానం భరించలేని మహేష్ తనని కొట్టిన వ్యక్తిని తిరిగి కొట్టేవరకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు.
ఒకమ్మాయి ఇతని ఫోటో స్టూడియో కి వచ్చి ఫోటో తీయించుకుంటుంది. ఫోటో చూసి ఆ అమ్మాయి “అసలు నీకు ఫోటో తీయడం వచ్చా” అని తిట్టి వెళ్ళిపోతుంది. తనని ఇంతవరకు ఎవరు అలా అనలేదు. ఈ అమ్మాయి ఎందుకిలా అంది అని మదన పడుతుంటాడు. ఆ విషయం గ్రహించిన అతని తండ్రి “మహేష్!నీ ఫోటో లో టెక్నిక్ ఉంది కానీ ఎమోషన్ లేదు అని చెప్తాడు. మహేష్ తన ప్రతీకారం తీర్చుకుంటాడా, ఫొటోస్ బాగా తీయడం నేర్చుకుంటాడా తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.
నా విశ్లేషణ : పై కథను కళ్ళతో చదివినా, చూసినా పెద్ద గొప్పగా అనిపించక పోవచ్చు. కానీ మనసుతో చూస్తే మాత్రం చాలా చాలా అద్భుతం గా ఉంటుంది. అవడానికి మలయాళ భాష నుండి గ్రహించిన చిత్రమైనా దానిని తెలుగులో తీసేటప్పుడు మన సంస్కృతి, సంప్రదాయం, ప్రాంతీయత ఏమాత్రం లోపించకుండా తీసిన దర్శకుడు వెంకటేష్ మహా గారికి నూటికి నూరు మార్కులు వేయొచ్చు. ఒక సినిమా ఒకరికి నచ్చడం, నచ్చకపోవడం అనేది వారి ఆలోచనా సరళి మీద ఆధారపడి ఉంటుంది. భాష అర్ధం కాకపోయినా నాకు మలయాళ చిత్రాలు బాగా నచ్చుతాయి ఎందుకంటే వాళ్ళు అవరసరముంటే తప్ప సినిమాల కోసం భారీ సెట్లు వేయరు. ఒక్క పాట కోసం విదేశాలకు వెళ్ళరు. హీరో హీరోయిన్ లకు దట్టంగా అంత మందాన మేకప్ లు కొట్టరు. అసలు costumes కి కూడా ఎక్కువ ఖర్చు పెట్టరు. అందుకే నాకు అవి బాగా నచ్చుతాయి. అక్కడి ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారు కాబట్టి వారు అలా తీస్తారేమో. మన ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలను ఆదరించి హిట్ చేస్తే మన వాళ్ళు కూడా తీయడానికి ముందుకు రావొచ్చేమో.
మన తెలుగులో అలా చిత్రాలు తీసే వారు చాలా తక్కువే అని చెప్పాలి. అలా ఎవరైనా తీసేవారుంటే బాగుండు అనుకున్నప్పుడు C/O కంచరపాలెం తో ముందుకు వచ్చారు దర్శకుడు వెంకటేష్ మహా. ఈ చిత్రం చూసినంతసేపు నాకు అప్పుడే అయిపోతుందా అన్న బాధ కలిగింది. ఇంకా చాలా సినిమా ఉంటే బాగుణ్ణు అనిపించింది. ఈ సినిమా నుండి నేను గ్రహించిన విషయాలు
- మహేష్ తనను కొట్టిన వ్యక్తి ని తిరిగి కొట్టే వరకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ మధ్య మధ్యలో కాళ్లకు రాళ్లు గుచ్చుకున్నప్పుడల్లా ” హే ఈ ప్రతిజ్ఞ పక్కన పెట్టేసి చెప్పులు వేసేసుకుంటే పోలా అనుకుంటుంటాడు….ఎప్పుడూ తన షాప్ ఎదురుగా కనిపించే చెప్పులు షాప్ చూసి…ఇలా చాలా సార్లు అనుకుంటాడు…ఒకసారైతే కొనడానికి కూడా బయలుదేరబోతాడు..ఇంతలో తన షాప్ కి ఒక అమ్మాయి ఫోటో కోసం వస్తే ఆగిపోతాడు. దీనిని మనం కళ్ళతో కాకుండా మనసుతో చూడగలిగితే ఒక మంచి విషయం అర్ధమవుతుంది. ఇక్కడ ప్రతీకారాన్ని ప్రతీకారం లా భావించకుండా మనం సాధించాలి అనుకున్న గోల్ గా భావిస్తే మధ్యలో మనల్ని మన గోల్ వరకు రీచ్ అవకుండా ఆపడానికి ఒకటి కాదు రెండు కాదు వందల కష్టాల రాళ్లు కాళ్లకు గుచ్చుకుంటాయి. నడిచి ముందుకు వెళ్లలేనంత ఇబ్బంది పెడతాయి. కష్టాలు వచ్చాయి కదా అని మనం తలపెట్టిన లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేయకూడదు. మనల్ని మన లక్ష్యం నుండి బయటకు లాగడానికి వంద బలహీనతలు చుట్టుముడతాయి. అప్పుడు మనకున్న ఒక్క బలాన్ని ఆయుధంగా చేసుకుని ఆ బలహీనతల్ని తరిమేయాలి. ఆ ఒక్క బలమే మానసిక స్థైర్యం. ఎప్పుడైతే మన బలహీనతల బలం కన్నా మన బలం యొక్క బలం ఎక్కువగా ఉంటుందో అప్పుడు మన లక్ష్యాన్ని తప్పక సాధిస్తాము.
- మహేష్ తన ఫోటో స్టూడియో కి ఫోటో దిగడానికి వచ్చిన ప్రతీ వ్యక్తిని ఒకే మూసతో ఫోటోలు తీస్తుంటాడు. కానీ ఒకరోజు ఆ అమ్మాయి వచ్చి మహేష్ తీసిన ఫోటోని తిట్టడం వల్ల తన లోపం తెలుసుకుంటాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మనల్ని విమర్శించేవారు లేకపోతే మనం జీవితంలో ఎదగలేము. డబ్బు సంపాదన లో పడి ఏదో మూస ధోరణి లో పడి పోతుంటే అసలు మన బ్రతుకు కు ఒక భావం, మనసుకి భావుకత ఎక్కడ ఉంటుంది. భావుకత అంటే ఏంటో తెలియాలి అంటే మన చుట్టూ ఏమి జరుగుతుందో పరిశీలించాలి, గమనించాలి వీలైతే ఆస్వాదించాలి. ఆస్వాదించగలిగినప్పుడే మనలోని భావుకత బయట పడుతుంది. అప్పుడు మన బ్రతుకుకి ఒక భావం ఏర్పడుతుంది.
- మహేష్ అనుకోకుండా తన ప్రమేయం లేకుండానే ఒక గొడవలో ఇరుక్కుంటాడు. అసలా గొడవకు కారణం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎక్కడో విదేశంలో ఉన్న ఇద్దరి భార్యా భర్తల మధ్య సమన్వయ లోపం వల్ల అసలు వారికెటువంటి సంబంధం లేని మహేష్ ఇక్కడ గొడవలో ఇరుక్కుంటాడు. అదెలా? అంటారా. ఎక్కడో చైనా లో పుట్టిన కరోనా వల్ల ప్రపంచమంతా ప్రళయం రాలేదా. ఇదీ అంతే. ఆ గొడవ కు కారణం ఒక చైన్ రియాక్షన్ లా ఉంటుంది. అదెలా వస్తుందో తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే. “మనం ఎవరికీ చెడు చేయట్లేదు కదా ఇంట్లో ఎలా ఉంటే ఏంటి” అని అనుకుంటుంటాము. కానీ అది చాలా తప్పు. మన ప్రవర్తన ఇంట్లో కూడా సరిగ్గా ఉండాలి. ఉదాహరణకు ఒక భార్య తన భర్తను సూటి పోటీ మాటల్తో హింసించింది అనుకోండి. భర్త తన భార్య మీద కోపాన్ని బయట ఎవరో వేరే వారి మీద చూపిస్తాడు. అదే కోపంతో ఆ వ్యక్తి ఇంకొకరిని హింసించే అవకాశం ఉంది. అలా మనకు తెలీకుండానే మనం ఇంకొకరి బాధకి, వేదనకీ కారణం అవుతాము. అందువల్ల మన ప్రవర్తన ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
మహానటి సినిమా తర్వాత మళ్ళీ నాకు అంతగా నచ్చిన సినిమా ఇదే. ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించిన విజయ ప్రవీణ పరుచూరి అమెరికాలో డాక్టర్ గా చేస్తూ కూడా మన తెలుగు సినిమాల మీద ఉన్న మక్కువతో దీని నిర్మాణం లో భాగం పంచుకున్నారు. ప్రవీణ గారు మీ అందరికీ తెలిసే ఉంటారు. తను కంచరపాలెం సినిమాలో వేశ్య పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్లకు మేకప్ ఉండదు. అందువల్ల వాళ్ళు నాకు చాలా అందంగా అనిపించారు. రెండవ హీరోయిన్ పేరు రూప. తను కూడా డాక్టర్ అట. ఫ్లాష్ మోబ్ డాన్సు చాలా బాగా చేసింది. హీరో సత్యదేవ్ చాలా చక్కగా నటించారు. ఇక సీనియర్ నరేష్ గారైతే సూపర్. చక్కగా అక్కడి ప్రాంతీయ వ్యక్తిలా నటించి బాగా ఆకట్టుకున్నారు. ఆయన అక్కడి ప్రాంతీయ మాండలీకంలో చక్కగా మాట్లాడారు. ఉదాహరణకు వైజాగ్ జిల్లా వాసులు “చెప్పేశారు” అనే మాటని కొద్దిగా కురచగా చేసి “చెప్శారు” అంటారు. అది ఆయన అచ్చు అలానే ఉచ్ఛరించారు.
తర్వాత సంగీతం గురించి చెప్పాలి. ఇందులో 3 పాటలు ఉంటాయి. “నింగి చుట్టే మేఘం ఎరుగదా లోకం గుట్టు, మునిలా మెదలదు నీమీదొట్టు” అనే పాటను పాటల రచయిత విశ్వ బాగా రాశారు. ఆ పాటను విజయ్ ఏసుదాస్ గారు ఇంకా బాగా పాడారు. ఆ పాటని విన్న ప్రతిసారీ నాకు తన్మయంతో ఒళ్ళు పులకరిస్తుంది. కళ్ళల్లో నీళ్లూరుతాయి. అంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట. అలాగే “రేపవలు వేకనుల నిన్నే చూస్తున్నా” అనే పాట కూడా చాలా బాగుంది. 90 లలో వచ్చిన ద్వందార్ధపు పాటలు తప్పక వినాల్సి వచ్చినప్పుడు విసుగు వచ్చేది. మళ్ళీ ఇప్పటి పాటల రచయితలు చక్కని సాహిత్యంతో పాటలు చాలా అందంగా రాస్తున్నారు. అది ఒక మంచి పరిణామం. దీనికి మలయాళ సంగీత దర్శకుడు బిజిబల్ సంగీతం సమకూర్చారు. వీలయితే ఈ సినిమాను మీరు కూడా చూడండి. ఇలాంటి మంచి సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని అలాగే ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి మరింతమంది దర్శకులు ముందుకు రావాలని ఆశిస్తున్నాను.