బరువు తగ్గడం అంటే ఏదో ఆదరాబాదరాగా డైట్ లు, ఎక్సర్సైజులు మొదలు పెట్టడం కాదు. ముందు మీరు మానసికంగా సిద్దం కావాలి. ఒక వారం రోజులు సమయం తీసుకొని పక్కా ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. మీ శరీర తత్వానికి సరిపడే మార్గం ఎంచుకోవాలి. ఈ మధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ డ్రింక్ తాగితే మూడు రోజుల్లో 10 కేజీలు తగ్గుతారు ఇంకోటేదో తింటే వారంలో 20 కేజీలు తగ్గుతారు లాంటివి చాలా ఎక్కువగా చూస్తున్నాము.ఇవేవి నిజాలు కావు. మీరు త్వరగా బరువు తగ్గ వచ్చు అనే ఉద్దేశ్యంతో అలాంటి వాటిని గుడ్డిగా నమ్మవద్దు. సులువైన మార్గాలు వెతుక్కోవడానికి ప్రయత్నించవద్దు.అసలలాంటి పక్కదారి పట్టించే వీడియోస్ ఎందుకు పెడతారో నాకు నిజంగా అర్ధం కాదు.
“కష్టపడకుండా ఏది రాదు. కష్టపడకుండా వచ్చిందేది ఎక్కువ కాలం నిలబడదు”.ఇది మీకు తెలుసనుకుంటున్నాను. ప్రతీ మనిషికి తనదైన వేలి ముద్రలున్నట్లుగానే తనదైన శరీర తత్త్వం ఉంటుంది. అందుకే ఎవరి శరీర తత్వానికి సరిపడే బరువు తగ్గే మార్గం వాళ్ళు తెలుసుకోవాలి.ఉదాహరణకు, స్కిప్పింగ్ చేస్తే మీ నడుము భాగంలో ఉన్న కొవ్వు తొందరగా కరిగిపోతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి.పైన భాగం సన్నగా ఉండి క్రింద భాగం కొద్దిగా లావుగా ఓ మాదిరి బరువు ఉండే వారు దీన్ని సునాయాసంగా చేయగలరు. అదే ఒక తొంభయ్యో వందో కేజీలు ఉండే వారు స్కిప్పింగ్ చేయగలరా? ఒకవేళ ఎలాగొలా చేసినా పైన శరీరం బరువంతా మోకాళ్ళు మరియు పాదాల మీద పడి అక్కడి ఎముకలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
బరువు తగ్గాలని కచ్చితంగా నిర్ణయించుకున్నాక మీరు తప్పకుండా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి.వాటిని నేను కింద పాయింట్ల రూపంలో ఇస్తాను.వీటిలో ప్రతీ ఒక్కటి మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.మీరు ఈ నియమాలన్నింటిని ఎలా పాటిస్తారన్న దాని మీదే మీరేంటో తెలుస్తుంది.చపల చిత్తంతో ఉంటారా లేదా దృఢ చిత్తంతో ఉంటారా అనేది తెలిసి పోతుంది. ఇది మీకు మీరు పెట్టుకునే ఒక పరీక్ష లాంటిది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఒక దీక్ష లాంటింది.
1.మీరు అనుకున్న బరువు తగ్గే వరకు ఎన్ని అవాంతరాలొచ్చినా ఎట్టి పరిస్టితులలోనూ మీ ప్రయత్నాన్ని ఆపకూడదు.
2.బయటి ఆహారం పూర్తిగా మానేయాలి.కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే వారైతే వారంలో కనీసం రెండు సార్లైనా టీమ్ లంచ్ అని డిన్నర్ అని రకరకాల హోటల్స్ లో రకరకాలుగా తింటుంటారు తాగుతుంటారు.వెళ్ళకుండా ఉండడం కుదరదు కాబట్టి వెళ్ళండి.కానీ అక్కడ ఉన్న ఆహార పదార్ధాలలో మీకు సరిపడేవి(మీరు రాసుకున్న ప్రణాళిక లో ఉన్న ఆహారం) మాత్రమే తినాలి.”అరేయ్! ఈ ఒక్క రోజు కి తినొచ్చు కదరా, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావ్” అని పక్కనున్న మీ స్నేహితులు మిమ్మల్ని తినమని విపరీతంగా ఎంకరేజ్ చేస్తుంటారు.కానీ మీరు ఎంకరేజ్ అవ్వొద్దు.మీ హితం కోరే వారే మీ స్నేహితులు.
౩.మద్యపానం, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, స్వీట్లు, బర్గర్లు, పిజ్జాలు, స్ట్రీట్ ఫుడ్స్ వంటి వాటి జోలికి అస్సలు పోకూడదు.
4.విందు వినోదాల్లో పాల్గొనాల్సి వస్తే వెళ్ళండి కాని అక్కడి ఆహారాలేవి పొరబాటున కూడా తీసుకోకండి.ఎవరేమనుకున్నా, తినాల్సిందేనని ఒత్తిడి చేసినా తీసుకోవద్దు.“వద్దు” అని నిర్మొహమాటంగా చెప్పగలిగి ఉండాలి.తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు అని ఆలోచించడం కంటే అసలు బరువు తగ్గే ప్రయత్నం మానేయడమే బెటర్.
5.తప్పదు అనుకుంటే తప్ప వేరే ఊరు వెళ్లొద్దు. ఒకవేళ వెళ్ళారంటే దాదాపు 90 శాతం మీరు పైన చెప్పిన 4 నియమాల్ని తప్పే అవకాశం ఉంది.
6.ఇది అన్నింటికన్నా ముఖ్యమైనది “రుచి నోటికి మాత్రమే కడుపుకి కాదు” అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.మనం ఆకలి కన్నా ఎక్కువ రుచికి లొంగిపోయి తింటాము.ఆకలి కడుపుకి సంబంధించినది.రుచి నోటికి సంబంధించినది. మాట్లాడేటప్పుడే కాదు తినేటప్పుడు కూడా కాస్త నోటిని అదుపులో పెట్టుకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది.
ఈ పైన చెప్పిన నియమాలన్నింటికి కట్టుబడి ఉండగలను అనుకుంటే నా తర్వాతి ఆర్టికల్ చదవండి. 60 కేజీలు ఉండే నేను సంవత్సరం పాటు యాంగ్జయిటి కి, నిద్ర లేమికి సంబంధించిన మందులు వాడడం వల్ల ఎక్కువగా ఏమి తినకపోయినా( చాలా తక్కువగా తింటున్నా) 80 కేజీ లకు పెరిగి పోయాను. కష్టపడి ఇప్పుడు 65 కేజీలకు తగ్గాను. పైన చెప్పిన నియమాలను నేను పాటించాను కాబట్టి మీకు చెప్పే అర్హత ఉందని భావిస్తున్నాను.
తర్వాతి పోస్ట్ లో ప్రణాళిక ను ఎలా సిద్ధం చేసుకోవాలో చెప్తాను.
మీకు ఉపయోగపడే ఇంకొన్ని అధిక బరువుకి సంబంధించిన పోస్ట్లు