Site icon Maatamanti

ప్రకృతి మనకు ఏమి నేర్పిస్తుంది?

నిరంతరం ఎడతెగని పనులతో నిండిపోయింది జీవితం. సమయం, సందర్భం అనేవి లేవు. పగలు, రాత్రి లేదు. అంతులేని, ఆపలేని పనులతో, ఆలోచనలతో అలసిపోతున్న నా మనసుకు, శరీరానికి కాస్త విశ్రాంతి కావాలనిపించింది. మొన్న  పొలానికి వెళ్ళినప్పుడు ఏది ఏమయినా ఓ మూడు రోజులు నాకు నచ్చినట్లుగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను. కెమెరా ముట్టుకోలేదు, కంప్యూటర్ ని మర్చిపోయాను, ఫోన్ అలవాటు నాకు ఎటూ లేదు. అక్కడ TV కూడా లేదు. చెప్తే నమ్మరేమో కానీ, ఆ మూడు రోజులు నేనెంత ప్రశాంతంగా  ఉన్నానంటే అసలది మాటల్లో చెప్పలేను. అలారం లేదు అయినా 5.30 కు మెలకువ వచ్చింది. కానీ బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే బయట ఇంకా చీకటిగానే ఉంది. అలా మంచం మీదే ఆలోచిస్తూ పడుకున్నాను.

ఉదయం 6 గంటలకు గిన్నె కోడి పిల్లలు అరిచాయి. ” అమ్మా! మేము నిద్ర లేచాము. బయటకు రా” అని. వాటి అరుపులో నాకు ఆ భావం స్పష్టంగా వినిపించింది. వెళ్లి తలుపు తీశాను. కొద్దిగా తెలవారింది. చిక్కుడు పందిరి మీద కూర్చున్న గిన్నె కోడి పిల్లలు నన్ను చూడగానే గాల్లో ఎగురుకుంటూ వచ్చి నా ముందు వాలిపోయాయి. స్కూల్ వదిలిపెట్టగానే పిల్లలు గేట్ దగ్గర ఉన్న అమ్మను చూసి ఎలా పరిగెత్తుకు వస్తారో అలా వచ్చి  నా చుట్టూ తిరుగుతున్నాయి. నూకలు వేశాను తినడం మొదలు పెట్టాయి. నేను చీపురు పట్టుకుని ఇంటి చుట్టూరా ఊడవడం మొదలు పెట్టగానే ఆ నూక తినడం ఆపేసి నాతో పాటే తిరుగుతున్నాయి. అసలు నేను వాటికోసం ఏమి చేశాను? అప్పుడప్పుడూ కాస్త నూకలే కదా వేసేది. అయినా ఎంత ప్రేమ వాటికి? పైగా అక్కడ నేను రోజూ వాటితో ఉండను. అప్పుడప్పుడూ వెళ్ళినా ఎంత గుర్తు పెట్టుకున్నాయి?

వాటికి ఎటువంటి బాధ్యతలూ లేవు, నచ్చినప్పుడు తింటాయి తర్వాత రాళ్ల మీదకు, అట్ట పెట్టెల మీదకు, ఇంటి మీదకు ఎగిరి రెక్కలు శుభ్రం చేసుకుంటూ కూర్చుంటాయి. నేను ఎప్పుడూ ఉండాలి అని కోరుకునే ప్లేస్ లో అవి స్వేచ్ఛగా, ఆనందంగా తిరుగుతుంటే కాస్త జెలసీ గా కూడా అనిపించింది.

నేను కానీ, మా అక్క కానీ చిన్నప్పుడు ఎప్పుడైనా సౌకర్యంగా మంచిగా సోఫా లో settled గా  కూర్చుంటే చచ్చామన్నమాటే. “ఒకవేళ మీరు అరగంట కన్నా ఎక్కువ సేపు TV చూడాలి అనుకుంటే నిల్చుని చూడమని” మా నాన్న చెప్పేవారు. “గంట కంటే ఎక్కువ చూడాలి అనుకుంటే చేతులు కాళ్ళు డ్రిల్ చేస్తున్నట్లు కదుపుతూ చూడాలి” అని చెప్పేవారు. నాన్న మమ్మల్ని ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు. కానీ ఒకే మాటను మళ్ళీ మళ్ళీ చెప్తుంటే వినలేక చచ్చినట్లు పాటించే వాళ్ళము. ఎక్కువ సేపు కూర్చుంటే నడుము దగ్గర కొవ్వు పేరుకుపోతుంది అని అలా చెప్పేవారు. ఇక అమ్మ కథే వేరు. తను exercise కు బానిస. ప్రతీ రోజూ ఉదయం  ప్రాణాయామము, రెండు పూటలా చిన్న తేలిక పాటి ఏరోబిక్స్, గంట వాకింగ్ చేసేది. నాకు తెలిసి తను exercise చేయని రోజు ఉంది అంటే అది తను చనిపోయిన రోజు మాత్రమే. “చూపులు కలసిన శుభవేళ” సినిమా లో సుత్తి వీరభద్రరావు గారి టైపన్నమాట. ఒకవేళ అనుకోకుండా ఒక చిన్న 10 అడుగుల స్థలమే ఉన్నా అక్కడ కూడా వాకింగ్ చేసేది అమ్మ. ఆ అలవాటే నాకూ  వచ్చింది.

ఇంతకు ముందు నేను exercise చేయని రోజు అంటూ లేదు. నాకు exercise అంటే ప్రాణం. ఇంకా చెప్పాలి అంటే వ్యసనం. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్  ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను కూర్చోమని చెప్తే నాకు అసలు ఇష్టం ఉండదు. “నన్ను కూర్చోమని చెప్పకండి” అని చెప్తాను. అక్కడ వాళ్ళ ఇళ్లల్లో కూడా వాకింగ్ చేస్తూనే మాట్లాడతాను. వాళ్ళ పిల్లలు కూడా నాతో పాటు  అటూ ఇటూ నడుస్తారు. ఇప్పటికీ ఇంట్లో TV చూడాలి అనుకుంటే నడుస్తూనో, డంబెల్స్ చేస్తూనో మాత్రమే చూస్తాను. కూర్చుని చూడను. మా ఇంతకు ముందు ఇంట్లో అయితే ఒక చిన్నపాటి gym కూడా ఏర్పాటు చేసుకున్నాను. నా డెలివరీ తర్వాత 75 నుండి 53 కి ఒకసారి… తర్వాత అమ్మ చనిపోయాక డిప్రెషన్ లో 85 పెరిగి నుండి 65 కి ఒకసారి తగ్గాను. ఇప్పుడు మళ్ళీ 68-69-70 మధ్యలో  ఉంటున్నాను. నా సమస్యల్లా ఒకటే. అది  నిద్ర లేమి. నిద్ర లేమి వల్ల మెటబాలిజం నెమ్మదిస్తుంది. నిద్రలేమి వల్ల cortisol ఎక్కువగా విడుదల అవుతుంది. దాని వల్ల కండరాలు(muscles) తగ్గి, శరీరంలో కొవ్వు(fat) నిల్వ శాతం పెరుగుతూ వస్తుంది. నిద్ర లేమి తప్ప నా అలవాట్లలో, నా క్రమ శిక్షణలో, జీవన శైలిలో ఎటువంటి లోపమూ లేదు. ఆహారం, వ్యాయామం అన్నీ ఒక క్రమ పద్దతిలో చేస్తాను. ఈ మధ్యే ఎప్పుడైనా పని మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వరుసగా కొన్ని రోజులు వ్యాయామం చేయడం కుదరడం లేదు. ఒకప్పుడు నిద్ర లేమి డిప్రెషన్ వల్ల అయితే ఇప్పుడు నిద్ర లేమి అతి పని వల్ల. ఒక్కోసారి కదలకుండా కొన్ని గంటల పాటు కంప్యూటర్ ముందు కూర్చోవాల్సి వస్తుంది. చిన్నప్పుడు నాన్న చెప్పిన రూల్ ఇక్కడ అమలు చేయలేకపోతున్నాను.  అరగంట కన్నా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవాల్సి వస్తే లేచి నిలబడి పని చేసుకోలేను కదా.

మొన్న పొలానికి వెళ్ళినప్పుడు ఈ పనులన్నీ ఒక 3 రోజులు పక్కన పెట్టేశాను. రాత్రి 8.30 గంటలకే నిద్ర వచ్చేసింది. ఉదయం 5.30 గంటలకు మెలకువ వచ్చింది. ఆ మూడు రోజులు వేరే ఏ పనులు పెట్టుకోకుండా ఇంటి పనులు మాత్రమే చేసుకుని కంటి నిండా తృప్తిగా నిద్రపోయాను. ఇంటికొచ్చాక చూసుకుంటే 1.1కేజీల బరువు తగ్గాను. నాకు బరువు తగ్గించుకోటం చాలా తేలికయిన పని. రెండు సార్లు బరువు పెరిగి తగ్గిన నాకు అది పెద్ద విషయం కాదు.  కనీసం ఒక 5 నుండి 10 మంది కలిసి చేయాల్సిన పనిని నేనొక్కదాన్నే చేయాల్సి రావడం వల్ల అస్సలు ఏమాత్రం  సమయం, తీరిక  దొరకదు. కనీసం ఒక ఇద్దరినైనా జాబ్ లో పెట్టుకోమని మా తమ్ముడు ఎప్పుడూ చెప్తుంటాడు. కానీ నేను అందుకు తగను. ఏదో ఒక సందర్భంలో మన కింద పనిచేసే వారిని అవసరమైనప్పుడు మనం తిట్టాల్సి వస్తుంది. అలా నేను అస్సలు తిట్టలేను. అందుకే పెట్టుకోలేను. ఇక్కడ తిట్టడం తప్పు కాదు. అవసరమైనప్పుడు గట్టిగా మాట్లాడలేకపోవడం అనేది ఒక అసమర్ధత. అదే కాకుండా ఇంకో కారణం కూడా ఉంది. మనం ఒక పనిని కేవలం డబ్బు కోసం మాత్రమే చేయడం వేరు. పనితో పాటు భావోద్వేగాల్ని కలగలిపి చేయడం వేరు. డబ్బుని, భావోద్వేగాల్ని కావాలనుకున్నా కలపలేము, వద్దనుకున్నా విడదీయలేము.  ఇప్పుడు ఈ పోస్ట్ ను ఇంకొకరికి చెప్పి డబ్బిచ్చి రాయమంటే అందులో నేను చెప్పాలి అనుకున్న  soul ఉండదు, ఆ ఫీల్ రాదు.

అక్కడ పొలంలో ఉదయాన్నే చక్కగా వంగి ఊడ్చి, కళ్ళాపి చల్లి ముగ్గేస్తుంటే శరీరం అంతా తేలిగ్గా ఉంటుంది.  కొబ్బరి తురమాడానికి  మా తాత గారు, నాయనమ్మ ల దగ్గర తీసుకున్న పాతకాలం నాటి కొబ్బరి కోరు వాడాను. మసాలా పొడి కొట్టడానికి చిన్న రోలు, పచ్చడికి, పిండి రుబ్బడానికి పెద్ద రోలు వాడాను. మిక్సీ లేదు. పచ్చడి మా అమ్మాయి నూరింది. నూరిన తర్వాత అదే రోట్లో కాస్త వేడి అన్నం, నెయ్యి వేసుకుని కలుపుకుని తిన్నది. అలా తిన్నప్పుడు తను తినే ఆ ముద్దను ఆస్వాదించడం చూశాను. “దేవుడా చాలా చాలా థాంక్స్.  ఏదో ఇవ్వలేదని నిన్ను ఎప్పుడూ నిందించను.  ఇంకేవేవో ఇవ్వమని నిన్ను బాధించను. అడగకుండానే  చిన్న చిన్న విషయాల్ని కూడా గొప్పగా ఆస్వాదించే మనసు మాకు కానుకగా ఇచ్చావు. నాకిది చాలు.” అని నా మనసులో మనస్ఫూర్తిగా అనుకున్నాను. అక్కడికి వెళ్ళగానే మా అమ్మాయి చక్కగా ఓ పల్లెటూరి అమ్మాయిలా అడగకుండానే అమ్మకు గిన్నెలు తోమి పెట్టడం, కూరలు తరిగి పెట్టడం లాంటివి చేస్తుంటే సంతోషంగా ఉంటుంది.

ఒక పక్క సిటీ లో ఆధునిక టెక్నాలజీ ని వాడుతూ జీవనం గడిపే మేము  మరో పక్క కనీస సౌకర్యం లేని చోట ఉంటున్నాము. ఇదెలా సాధ్యం? ఇందులో ఏది నిజం? ఈ ప్రశ్న నన్ను కామెంట్స్ లో  అప్పుడప్పుడూ కొంతమంది అడుగుతూ ఉంటారు. రెండూ నిజమే. కానీ చెప్పాలి అంటే నాకు ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా అక్కడ గడపడమే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అక్కడ ఒకటే గదిలో ముగ్గురం ఉండాలి. ఒకరు స్నానానికి వెళ్ళాలి అంటే మిగిలిన ఇద్దరు బయట కూర్చోవాలి. ఇంట్లో ఉన్న ట్యాప్ గిన్నెలు తోముకోవడానికి పనికి రాదు. మేము పడుకునే మంచం మీద ఒక వైపు మాత్రమే పరుపు ఉంది ఇంకోవైపు పాత సోఫా లోని  కుషన్స్ తీసి పరుపులా పేర్చాము. ఇంకా ప్లేస్ మిగిలితే అక్కడ ఏవో పాత దుప్పట్లు అవి వేసి నింపి పరుపులా చేసుకున్నాము. దాని మీద పడుకోవడం కన్నా కింద పడుకోవడం నయం. ఆ పరుపు మీద పడుకుంటే నడుము,వీపు  నొప్పి. కానీ కింద పడుకోవాలి అంటే ధైర్యం చాలదు. ఎప్పటికీ అక్కడ ఆ ఇంట్లో అలానే ఉంటుంది అని కాదు. అవసరమైనప్పుడు అన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కానీ ఈ లోపు ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండ గలమా లేదా అనేది తెలుసుకున్నాము.

ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంట్లోకి ఏదో పురుగు పుట్రా దూరుతూ ఉంటాయి. ఒకసారేమో కప్ప తల చూసి పాము అనుకుని బాగా భయపడ్డాము. అది ఎగిరే కప్ప. ఎప్పుడు వెళ్ళినా అవి ఇంట్లో రెండు మూడు ఉంటాయి. వాటిని బయటకు వెళ్లగొట్టేసరికి మా తల ప్రాణం తోకలోకి వచ్చినట్లవుతుంది. అంతకుముందు ఎలుకలు. 5-6 దాక ఉండేవి.  లైట్ కట్టేయగానే మా మీదకు ఎక్కి పాకేవి.. మా అమ్మాయి నేను పెద్దగా కేకలు పెట్టేవాళ్ళము.. రాత్రంతా ఒక్క సెకను నిద్రపోతే ఒట్టు. ఒకరోజేమో ఇంట్లోకి సాల్మండెర్ వచ్చింది. తేలు, కాళ్ళ జెర్రులు ఇవి సాధారణం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.  ఆ మధ్య ఒక వీడియో లో “ఎటువంటి పాత్రలు వంటకు మంచివి? ఏవి మంచివి కావు” అని సుమారు అరగంట ఆపకుండా ఉపన్యాసం ఇచ్చిన నేను, అక్కడ పొలంలో అల్యూమినియం వాడతాను, పాత ప్లాస్టిక్ గిన్నెలు వాడతాను. కావాలంటే ఒక్క నిమిషంలో ఇవన్నీ పక్కన పెట్టేసి అన్నీ కొత్తవి తెచ్చుకోగలను. కానీ నేను అలా చేయను. అవి కూడా వాడతాను.

బాధ్యతలు తీరాక మా భవిష్యత్తు జీవితం అక్కడే గడపాలి.  అక్కడ అతి శుభ్రం తో బాధ పడే నేను ఇక్కడ నేను పేడ పట్టుకోగలనా లేదా, ఈగలు ముసిరే చోట ఉండగలనా? లేదా? పరీక్షించుకోవాలి.  పేడ, మట్టి, మురికి వీటి మీద నాకు ఎప్పుడూ అసహ్యం లేదు. నాకు వచ్చే ఎలర్జీ ల వల్ల కలిగిన భయం మాత్రమే నన్ను ఇప్పటివరకూ వాటికి దూరం చేసింది.  కానీ నాకు ఆ ఎలర్జీ అలాంటి వాటిని ముట్టుకున్న ప్రతీ సారి రాదు. ఈ మధ్య అప్పుడప్పుడు మాత్రమే వస్తూ పోతుంటుంది చుట్టంలా.

మొన్న ఒకరిద్దరు నాకు కామెంట్స్ లో “ఎందుకు ఆ అల్యూమినియం గిన్నె వాడుతున్నావు. తీసి పారేయి” అని రాశారు. అది చదివి నాలో నేను చిన్నగా, అభావంగా నవ్వుకున్నాను.  మనం తేలిగ్గా విసిరిపారేయ గలిగిన అల్యూమినియం గిన్నెలోనే ఇప్పటికీ కొన్ని కోట్ల మంది వండుకుని తింటున్నారు. ఒకవేళ అవి పక్కన పడేసి వేరేవి కొనుక్కునే స్థోమత నాకు లేకపోతే అవే వాడేదాన్ని కదా. అలా భావించుకునే ఇప్పటికీ అవి వాడుతున్నాను. అంతదాకా ఎందుకు మా అమ్మ, అమ్మమ్మలు కూడా వాటిలోనే వండేవారు.  ఇప్పటికీ అవి వాడుతున్న మా తాతగారు, నానమ్మ ఇద్దరూ 88 ఏళ్ళ వయసులో వారి పని వారు చేసుకునేంత దిట్టంగా ఉన్నారు.  అల్యూమినియం గిన్నెల్ని చూసి భయపడే చాలా మందికి తెలియంది ఏంటంటే మనం ఆ గిన్నెల్లో వండితే మన శరీరంలో కి చేరే అల్యూమినియం కన్నా మనం వాడే సౌందర్య ఉత్పత్తులు, కొన్ని రకాల మెడిసిన్స్, వాక్సిన్ లు , canned ఫుడ్, టాప్ వాటర్ ఇలాంటి వాటి నుండి మనకు తెలీకుండానే మన ఒంట్లోకి చేరే అల్యూమినియం ఎక్కువ.

నాకు ఎంత వరకు వీలయితే అంతవరకు అతి సాధారణంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అలా ఉండగలమా? లేదా? అనేది ఎప్పటికప్పుడు  పరీక్షించుకుంటుంటాను. మా నాన్న గారికి ఎప్పుడూ మనసులో చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటుంటాను.  నా చిన్నప్పుడు నాన్నని డ్రెస్ కానీ, చెప్పులు కానీ కొనివ్వమని అడిగితే అడిగిన దానికన్నా ఎక్కువే కొనిచ్చేవారు. కానీ కొనిచ్చే ముందు కనీసం ఒక గంట సేపు నాతో మాట్లాడేవారు. ” అమ్మా! జీవితంలో ఎప్పుడూ బట్టలకు, వస్తువులకు, నగలకు  విలువ ఇవ్వకు. వాటిని చూసుకుని ‘అదే నువ్వు’ అనుకుని భ్రమపడకు, గర్వపడకు. “నీ వేషధారణ(attire) నీ గుర్తింపు(identity) కాకూడదు. నీ గుర్తింపే(identity) నీ వేషధారణ(attire) కావాలి” అని చెప్పేవారు. “రేపు నువ్వు ఎంత  సౌకర్యవంతమైన జీవితం జీవిస్తున్నా ఎప్పుడూ నిన్ను నువ్వు ఒక సామాన్యురాలిగానే భావించు. అలా చేస్తే మనలో గర్వం, అహంకారం లాంటివి పెరగవు.” అని చెప్పేవారు. ఆ వయసులో ఆయన మాటలు చాలా చిరాకు కలిగించేవి. కానీ పెద్దయ్యాక కానీ అవి అమృత వాక్కులని అర్ధం కాలేదు. అందుకే నాలో ఎప్పుడూ చాటుగా ఒక సాధారణ సగటు మనిషి జీవిస్తూ ఉంటుంది. నాన్న చెప్పిన ఆ మాటలే పెద్దయ్యాక ఎంత కష్టాన్నయినా సహనంగా ఎదుర్కునే ధైర్యాన్ని ఇచ్చాయి.

“ఇంత చెప్పిన దానివి మరి నువ్వు నీ వీడియోస్ లో పాత చిరిగిపోయిన బట్టలు అయితే వేసుకోవు కదా” అని మీరడగవచ్చు. పెళ్ళికి ముందు మా అమ్మానాన్నల మాటలు నన్ను ఎంత ప్రభావితం చేశాయో  పెళ్లి తర్వాత నా భర్త మాటలు కూడా అంతే  ప్రభావితం చేశాయి.  “మనం మన ఇంట్లో వారికి కాకుండా బయట మూడో వ్యక్తికి కనిపించేటప్పుడు టాప్ టు బాటమ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే ఇక్కడ అందంగా, అధికాలంకరణతో ఆకర్షించే విధంగా ఉండాలి అని కాదు. బట్టలు కొత్తవా, పాతవా అని కాదు. మన వేషధారణ చూసినప్పుడు ఒక హుందాతనం కనపడాలి, ఒక శుభ్రత కనపడాలి, ఒక పర్ఫెక్షన్ కనపడాలి. మనం అవతలి వ్యక్తితో నోరు తెరిచి మాట్లాడే లోపు మన వేషధారణ వారితో మాట్లాడేస్తుంది.” ఇది సచిన్ నాకు, మా అమ్మాయికి ఎప్పుడూ చెప్పే మాట. ఒక్కోసారి సచిన్ మాట్లాడుతుంటే రాయడం రాని తత్వవేత్త లా అనిపిస్తారు. తనకు పుస్తకాలు చదివే అలవాటు అస్సలు లేదు.  ఒక్కోసారి తను చెప్పే ప్రతీ మాట ఒక అద్భుతంలా అనిపిస్తుంది నాకు. కనీసం తను మాట్లాడుతుంది ఫిలాసఫీ అని కూడా తనకు తెలీదు.

నా పెళ్లయిన దగ్గర నుండి నా బట్టలు నేను స్వయంగా సెలెక్ట్ చేసుకున్న సందర్భాలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. నేను వేసుకునే ప్రతీ దుస్తులు, చెప్పులతో సహా అన్నీ మా ఆయన సెలెక్ట్ చేసేవే. నేనేది సెలెక్ట్ చేసుకోను. చేసుకోవాలి అన్న ఆలోచన కూడా నాకు రాదు. అది నాకు టైమ్ వేస్ట్ తో సమానం. సింపుల్ గా ఆయన కొనిచ్చినవి వేసుకుంటాను అంతే. నన్ను దాదాపు అన్ని వీడియోస్ లో నేను వేసుకునే దుస్తుల గురించిన వివరాలు అడుగుతుంటారు. కానీ ఎందుకో నాకు బట్టల గురించి, నగల గురించి మాట్లాడడం రాదు. నిజంగా రాదు. బట్టలకు ఎక్కువ విలువ ఇవ్వకుండా అటు తండ్రి మాటను పాటిస్తూ అదే సమయంలో వేషధారణ సరిగ్గా ఉండాలి అని చెప్పే భర్త మాటను పాటించడం నాకు సంతోషాన్ని కలుగచేస్తుంది.

మనిషన్నాక ఏదో ఒక సందర్భంలో గర్వం, నేను గొప్ప అనే భావనలు కలుగుతాయి. ఇక్కడ మళ్ళీ మా అమ్మా నాన్నలకు థాంక్స్ చెప్పుకోవాలి. “వేరొకరితో ఒక్క మాట నీ గురించి నువ్వు గొప్ప చెప్పుకున్నా, నిన్ను చూసుకుని నువ్వు గర్వపడినా వేల అగుడులు దిగజారినట్లు” అని చెప్పేవారు నాన్న. అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు పొరబాటున ఎక్కడైనా సూచాయిగా అయినా గొప్పలు, బడాయిలు  చెప్తున్నట్లు ఉంటుందేమోనని చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతాను. ఇది ఎదుటివారిని ఇంప్రెస్ చేయడానికి కాదు. నాకు నేను దిగజారినట్లు అనిపించకుండా ఉండడానికి. నాకు  ఎప్పుడైనా, ఏదైనా గర్వ భావన కలిగే లోపే నా ఎదురుగా కనిపించే మనిషినో, వస్తువునో, జంతువునో, పక్షినో, చెట్టునో, పుట్టనో, ఆకాశాన్నో, సూర్యుడినో చూడగానే వాటి ముందు నాకు నేను చాలా అల్పురాలిలా కనిపిస్తాను. ఆ క్షణాన్నే నాలోని గర్వము సర్వమూ ఖర్వమైపోతుంది. మొన్నకూడా అలాగే అనిపించింది. సూర్యోదయానికి ముందే  గిన్నె కోళ్లు నిద్ర లేచాయి. నన్ను లేపాయి. సూర్యాస్తమయం అవ్వగానే తిరగడం ఆపేసి చక్కగా పందిరి పైకి ఎక్కేశాయి. “Bindu what the hell are you doing with your life. look at us, learn from us.” అని కోళ్లు నన్ను తిడుతున్నట్లు నాకు వినిపించింది. కానీ అవి పైకి  మాత్రం అసలు నన్నేమీ అననట్లు గా అమాయకంగా తలలు ఆటు, ఇటూ తిప్పుతూ పైన కూర్చున్నాయి.

అక్కడ  పశు పక్ష్యాదులు, చెట్టు చేమలు అన్నీ సమయానుసారం, కాలానుసారం నడుచుకుంటున్నాయి. వాటికి గడియారాలు లేవు, క్యాలెండర్లు లేవు. అయినా వాటి ధర్మం అవి తప్పడం లేదు. అసలు రోజూ నేనేమి చేస్తున్నాను? ఎప్పుడు లేస్తున్నాను? ఎప్పుడు నిద్రపోతున్నాను? నాకు వెబ్సైట్లు వుంటే ఏంటి? యూట్యూబ్ ఛానల్ ఉంటే ఏంటి? ఎన్ని సౌకర్యాలు ఉంటే ఏమిటి? ఎంత సంపాదిస్తే ఏంటి? ఎవరికి గొప్ప? దేనికి గొప్ప? నేను ఆ కోడి ముందు, ఆ పువ్వు ముందు, ఆ చెట్టు ముందు అన్నింటి ముందు అల్పురాలినే కదా. అవన్నీ సమయాన్ని, ప్రకృతి నియమాల్ని పాటిస్తున్నాయి. నేను పాటిస్తున్నానా? ఒకవేళ పాటించాలి అనుకున్నా పాటించగలనా? నా బాధ్యతలు నన్ను పాటించనిస్తాయా? ఒక్కసారి sky-diving చేద్దాము అనుకుని పై నుండి దూకినాక మధ్యలో వద్దు అనుకుంటే కుదరదు కదా…కింద నేల మీదకు చేరేవరకు మనకిష్టమున్నా లేకపోయినా ఖచ్చితంగా గాల్లో తేలాల్సిందే కదా. మనిషి బాధ్యతలు కూడా అలాంటివే.

మొన్న పొలానికి వెళ్లేసరికి అన్ని చెట్లకు ఆకులు రాలిపోయాయి. మా అమ్మాయి అది చూసి ” అమ్మా చూడు! రాలి నేల మీద పడిన ఆకు అందమే, ఆకులు లేకపోయినా చెట్టు కూడా అందమే.  ఆకు రాలు కాలం గురించి ఎప్పుడూ పుస్తకాల్లో చదవడమే కానీ నిజంగా ఇప్పుడు ఇలా చూస్తే చాలా అందంగా, ఆనందంగా ఉంది” అని అంది. తన మాటలకు నేను అచ్చెరువొందాను. నేను ఎప్పుడూ అలానే అనుకుంటూ ఉంటాను కాబట్టి నాకు అలాంటి మాటలు చాలా చిన్నవిగా అనిపించవచ్చు. కానీ ఆ మాటలు తన నోట వినే సరికి చాలా ముచ్చటేసింది.  ప్రకృతే మనకు అలా మాట్లాడే శక్తినిస్తుందేమో బహుశా. మళ్ళీ వెంటనే అనిపించింది  ఒక్కసారి తను కూడా ఈ బాధ్యతల వలయంలో చిక్కుకుంటే అలాంటి మాటలు ఇక పలకలేదేమో అని.

ప్రకృతితో సహజీవనం చేయగలిగితే మనం ఎలా ఉండాలో మనకు ప్రకృతే నేర్పిస్తుంది.  ప్రకృతి మనకు ఆస్వాదించడం నేర్పుతుంది.  సహనం నేర్పుతుంది.  గమనించడం నేర్పుతుంది. అర్ధం చేసుకోవడం నేర్పుతుంది. ఆచరించడం నేర్పుతుంది. ప్రతీ  క్షణంలో నిండుగా జీవించడం నేర్పుతుంది. ఆది నుండి ప్రకృతి కి ఒకే సెట్ అఫ్ రూల్స్/నియమాలు ఉన్నాయి. కాలాలు, ఋతువులు, దిక్కులు, పంచభూతాలు, ఇవన్నీ మారవు. ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ప్రతీ చెట్టు, జీవి ప్రకృతి నియమాలకు కట్టుబడి జీవనం సాగిస్తున్నాయి ఒక్క మనిషి తప్ప. 5 నిమిషాలు చేతిలో సెల్ లేకపోతే “అబ్బా బోర్ కొడుతుంది” అనే వారిని చూశాను. కొన్ని వందల సంవత్సరాలు ఒకే స్థలంలో  నిల్చుని ఉండే చెట్టుకు మాత్రం ఎందుకో బోర్ కొట్టదు పాపం. ఎందుకంటే అది మనిషి కాదు కదా!

పైన రాసిన అన్ని పేరాల్లో ఎంతో కొంత నా వేదన కనిపిస్తుంది. ప్రకృతికి దగ్గరగా జీవించాలి అని ఆరాటపడే నా మనసుకి, యంత్రంలా జీవిస్తున్న నా శరీరానికి మధ్య సంఘర్షణ అది. నాకు లా ఇంకెంత మంది ఆలోచిస్తుండి ఉంటారు అని కూడా అనుకుంటూ ఉంటాను. అలుపెరగకుండా పనిచేస్తున్న మన మానవ యంత్రాల్ని నియంత్రించే మంత్ర దండం ఎప్పటికైనా వెతుక్కుంటూ వస్తుంది అన్న ఆశతో — బిందు

 

Exit mobile version