What to eat in Intermittent Fasting?ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఏమి తినాలి? అనేది తెలుసుకునే ముందు అది ఎలా పాటించాలి అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను ఉపయోగిస్తున్న ఆహారాల లిస్ట్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి.
మీకు ఇంతకు ముందు ఒక పోస్ట్ లో Good foods list అని ఒక పోస్ట్ రాశాను అది చదవండి. అందులో ఉన్న ఆహారాలన్నీ ఉండేలా చూసుకుంటే చాలు. అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహారాలలో ఏది కల్తీ నో ఏది నిజమో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. 90 % మంది తీవ్ర అస్వస్థత కు గురి చేసే లాంటి ఆహారం తీసుకుంటున్నారు. కాస్త అవగాహన ఉన్న వారు మాత్రమే మంచి ఆహారాలను ఎంచుకుని మరీ తింటున్నారు. ఇక్కడ ఒక విషయం ఒప్పుకోవాలి. మంచి ఆహారం ఖరీదు ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అందరూ అంత డబ్బు వెచ్చించి కొనుక్కోలేరు. అయినా సరే ఉన్నంతలో మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఎన్నో సార్లు టీవీ లో చూశాము పాల సేకరణ కేంద్రాలకు వచ్చే పాలలో చాలా మంది యూరియా తో తయారు చేసిన పాలు ఇస్తారని. ఎక్కువ పాలు ఇవ్వడానికి హార్మోన్ ఇంజక్షన్ చేసిన పశువుల దగ్గర నుండి పాలు సేకరించడం వల్ల ఆ హార్మోన్ల ప్రభావం మన మీద పడుతుంది అని. కోడి మాంసం, గుడ్లు ఇలా అన్నీ అలాంటివే. మనం తినే కూర గాయలు, ఆకు కూరలు అన్నీ విష పూరితం. సేంద్రియ పద్ధతుల్లో పెంచకపోవడమే కాకుండా, విపరీతంగా పురుగు మందులు వాడడం వల్ల ఆయా కూరగాయలలో అసలు పోషకాలు లేకపోగా పురుగు మందుల అవశేషాలు ఉంటాయి. పాలిష్ చేసిన బియ్యం, కందిపప్పు లాంటివి వాడుతున్నారు. మీకు తెలుసా కొన్ని చోట్ల కందిపప్పు ను పాలిష్ చేయడానికి మిల్లులో జంతువుల చర్మం వాడతారని. ఈ విషయం నేను గ్రూప్స్ చదివేటప్పుడు మా సర్ చెప్పారు.
ఇంకా నూనెలు. చాలా రిఫైన్డ్ నూనెలు వాడుతున్నారు. నూనె కోసం సేకరించిన విత్తనాలను నూనె ఎక్కువ రావడం కోసం ప్రెస్సింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద చేస్తారు. ఆ వేడికి అందులో సహజంగా ఉన్న పోషకాలు నశిస్తాయి. ఎక్కువ కాలము నిల్వ ఉండడానికి హైడ్రోజినేషన్ చేస్తారు. అసలు రిఫైన్డ్ నూనెలు ఎలా తయారు చేస్తారో చూస్తే ఎవరూ వాడరు. ఇంకా పండ్లు. ఆపిల్ మీద వాక్స్ రాస్తారు. కార్బైడ్ తో అరటి పండు, మామిడి పండు వంటి వాటిని మగ్గ బెడతారు. ప్రభుత్వము కార్బైడ్ ను నిషేధించినా చాటుగా వాడుతున్నారు. పుచ్చకాయలు ఎర్రగా తీయగా ఉండడానికి తీపి ఎర్ర రంగు నీళ్లను ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఎన్నో ఉన్నాయి.
ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాను అంటే. మీరు ఒక గమ్యం చేరాలి. కొద్దిగా కూడా అటు ఇటు కాకుండా సరియిన సమయానికి రైల్వే స్టేషన్ కి వెళ్లారు. రైలు వచ్చిన వెంటనే రైలు ఎక్కారు. చాలా సేపు ఓపికగా ప్రయాణం కూడా చేశారు. కానీ రైలు దిగాక తెలిసింది మీరు మీ గమ్యం చేరలేదు అని. ఎందుకు చేరతారు?? మరి మీరెక్కింది తప్పు ట్రైన్ కదా! మీరు సరియిన టైం కి తిని అన్ని పోషకాలు ఉన్నాయి అనుకుని భ్రమ పడి లెక్క బెట్టుకుని మరీ జాగ్రత్తగా తీసుకుని, చాలా సేపు ఉపవాసం ఉన్నా, మంచి సేంద్రియ ఆహారం, సహజమైన కల్తీ లేని ఆహారం తీసుకోలేకపోతే లాభం ఉండదు. తప్పు ట్రైన్ ఎక్కి గమ్యం చేరలేదని బాధపడడం ఎంత మూర్ఖత్వమో, కల్తీ ఆహారం తిని ఆరోగ్యంగా లేము అని బాధ పడడం కూడాఆంటే మూర్ఖత్వం. అందుకే సాధ్యమైనంత వరకు మంచి పోషక విలువలున్న సహజమైన కల్తీ లేని ఆహారం తీసుకోవాలి.
నేను నా యూట్యూబ్ లో అంతకు ముందు కమ్యూనిటీ ట్యాబు లో రోజూ నేను తినే ఫుడ్ ఫోటో షేర్ చేసేదాన్ని. “అందరూ తిన గలిగే కొనగలిగే వి ఉంటే పెట్టు. ఇవన్నీ పెట్టి నువ్వు రిచ్ అని మా ముందు బిల్డ్ అప్ ఇస్తున్నావా” అని ఒకామె రాశారు. ఇంకో ఇద్దరు ముగ్గురు సున్నితంగా అడిగారు. కాస్త మేము కూడా కొనుక్కుని తినగలిగేవి పెట్టండి అని. చవకైన ఆహారం కల్తీ ఆహారం తీసుకుని అనారోగ్యాల బారిన పడి ఖరీదైన రోగాలు తెచ్చుకుని హాస్పిటల్ కి వెళ్ళినపుడు డాక్టర్ వేసే బిల్లు, నేను సంవత్సరానికి మంచి ఆహారానికి వాడే డబ్బుకి 10 రెట్లు ఉంటుంది. నన్ను అడిగినట్టు డాక్టర్ ని అడగ గలదా ఆవిడ ?? ” ఏంటి నువ్వు రిచ్ అని బిల్ ఎక్కువ వేశావా” అని ఆవిడ డాక్టర్ ను అనగలదా?? దయచేసి ఇది ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి. అయినా నేను నాకు సాధ్యమయినంత వరకు అందరికీ అందుబాటులో ఉండే ఆహారమే చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను సినిమాలకు వెళ్ళను, బ్యూటీ పార్లర్ కి వెళ్ళను.బ్యూటీ ప్రొడక్ట్స్ వాడను, ఇంట్లో పని చేయడానికి ఎవర్నీ పెట్టుకోలేదు, అనవసర షాపింగ్ చేయను బట్టలు ఎక్కువగా కొనను, ఇమ్మిటేషన్ నగలు లాంటివి అస్సలు కొనను. ఇలాంటి అనవసర మైన వాటికి ఖర్చు చేయకుండా ఆ డబ్బుని ఆరోగ్యమైన ఆహారం కోసం ఖర్చు పెడతాను. ఇలా అందరు అనవసర ఖర్చులను తగ్గించుకుని మంచి వాటి కోసం ఉపయోగించాలి.
నేను ఒక 3 సంవత్సరాల నుండి పాలు, పళ్ళు, గుడ్లు, మాంసం, కూరగాయలు, ఆహార ధాన్యాలు అన్నీ ఆర్గానిక్ వి మాత్రమే వాడుతున్నాను. మేము హాస్పిటల్ కి వెళ్లడం అసలు చాలా చాలా అరుదు. నాకు గుర్తుండి నేను ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ వెళ్ళింది 6 సంవత్సరాల క్రితం. అది కూడా బయట తిన్న ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల వాంతులు వస్తే వెళ్ళాను. ఇక కంటి హాస్పిటల్ కి వెళ్తే అది లెక్క లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారేమో చిన్న పిల్లి పిల్లకి వెనక రెండు కాళ్ళు విరిగి నడవలేకపోతుంటే కాపాడదామని వెళ్తే ఆ బుజ్జి పిల్లి నేను దాన్ని ఏదో చేస్తున్నాను అనుకుని భయంతో నా వేలిని కరిచింది అప్పుడు వెళ్ళాను హాస్పిటల్ కి.
సరే ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్, 1 వ మీల్, రెండవ మీల్ ఎలా తీసుకోవచ్చో చెప్తాను.
బ్రేక్ఫాస్ట్ లో తీసుకో దగిన ఆహారాలు
- జొన్న , రాగి, ఓట్స్, మిల్లెట్ వెజిటేబుల్ ఇడ్లీ లలో ఏదైనా ఒకటి చేసుకుని తినొచ్చు. ( 2 ఇడ్లీలు)
- 3 రోజుల పాటు మొలకెత్తించిన పెసర మొలకలు 1 కప్పు + 1/4 కప్పు నానబెట్టిన బ్రౌన్ రైస్ + 1/2 కప్పు ఓట్స్ తో చేసిన పిండితో పెసరట్టు ఒకటి.
- జొన్న, రాగి, మిల్లెట్స్,ఓట్స్ దోశె లలో ఏదో ఒక దోశ ఒకటి.
- గుడ్లు తినే అలవాటు ఉన్నవారు ఉడికించిన గుడ్లు, scrambled eggs, వెజిటేబుల్ ఆమ్లెట్. 2 గుడ్లతో చేసుకోవచ్చు.
- తినగలిగితే పెసర మొలకలు ఒక 50 గ్రాములు తినొచ్చు.
- వెజిటేబుల్ సలాడ్ తినొచ్చు( క్యాబేజి, క్యారెట్, బీట్రూట్, కీరా, క్యాప్సికం, టమాటో, ముల్లంగి, పాలకూర, lettuce, దొరికితే బీట్రూట్ ఆకులు) వీటితో చేసిన సలాడ్. కావాలంటే ఇదే సలాడ్ లో scrambled eggs కానీ ఉడికించిన గుడ్డు ముక్కలు కూడా చేసుకుని తినొచ్చు. వెజ్ సలాడ్ లో ఆలివ్స్ కూడా 1/4 కప్పు కలుపుకోవచ్చు.
- రాగి జావ చేసుకుని తాగొచ్చు. లేదా మల్టీ గ్రైన్ అండ్ నట్స్ తో చేసిన జావ కూడా తాగొచ్చు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు రెసిపీ ఉంటుంది.
- నానబెట్టిన బాదం పప్పులు 6 లేదా 10 మరియు walnuts 4 లేదా 6, ఆప్రికాట్స్ 2(ఇవి రోజు రాత్రే నానబెట్టుకుని తింటే మంచిది)
పైన చెప్పిన లిస్ట్ లోవి అన్నీ రెండు రోజులకో రకంగా తినడం మంచిది. అప్పుడు అన్ని రకాల పోషకాలు సరిగ్గా అందుతాయి. మీరు వాటిలో ఏది తిన్నా కింద చివరగా చెప్పిన బాదాం, వాల్నట్స్ పైన వాటితో కలిపి రోజూ తీసుకోగలిగితే మంచిది. బాదాం వాల్నట్స్ మేము వాడలేము అంత ఖర్చు పెట్టాలి అంటే ఇబ్బందిగా ఉంది అనుకుంటే అస్సలు బాధ పడనవసరం లేదు. చక్కగా నువ్వులు, అవిశెలు/flax seeds కలిపి చేసిన కారం పొడి 1 tbsp మీ ఇడ్లీలలో గానీ, దోశెతో కానీ, లేదా వెజ్ సలాడ్ లో కానీ లేదా ఉడికించిన గుడ్ల మీద చల్లుకుని కానీ, ఆమ్లెట్ లో కానీ కలిపి తినేయండి. వీటిలో కూడా అత్యుత్తమ మైన పోషకాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే వాటిలో కన్నా ఎక్కువ పోషకాలు ఉన్నాయి. పైగా ఇవి వాటితో పోలిస్తే చవక అందరూ కొనగలరు.
మొదటి మీల్ లో తీసుకోదగ్గ ఆహారాలు
మీరు 14:12 పద్దతి పాటించే వరకే బ్రేక్ఫాస్ట్ తింటారు. తర్వాత 16:8 ప్రారంభించాక బ్రేక్ఫాస్ట్ ఉండదు. కావాలంటే మీ మొదటి మీల్ లో నేను పైన చెప్పినవి కూడా తీసుకోవచ్చు. లేదా
- మన ప్రధాన ఆహారం బియ్యం కాబట్టి అది మానాల్సిన అవసరం లేదు. కాకపోతే కాస్త తగ్గించి తినాలి. కూర బాగుంది అని రెండు మూడు సార్లు కలుపు కోవడం మానేయాలి. తినగల్గితే బ్రౌన్ రైస్ ఉత్తమం. వైట్ రైస్ బ్రౌన్ రైస్ రెండింట్లో ను కార్బ్స్ ఉంటాయి. కానీ మనం బ్రౌన్ రైస్ ను ఎక్కువ తినలేము. కొద్దిగా తినగానే కడుపు నిండి నట్లుగా ఉంటుంది. బ్రౌన్ రైస్ ను ఒకసారి కడిగి, తరువాత ఆ బియ్యం లో 1 కప్పుకి 3 1/2 కప్పుల చప్పున నీళ్లు పోసి కనీసం ఒక 4 గంటలు నానబెట్టి, ఆ నానబెట్టిన నీటితోనే వండుకుని తినాలి. లేదా మిల్లెట్స్ కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. కొద్దిగా ఖరీదు ఎక్కువ బియ్యంతో పోలిస్తే. కానీ మనం వీటిని కూడా కొద్దిగా తినగానే కడుపు నిండి పోతుంది. వీటిని కూడా అచ్చు బ్రౌన్ రైస్ లానే ముందు శుభ్రంగా కడిగి కొద్దీ గంటలు నానబెట్టి తర్వాత వండుకుని తినాలి.
- మీకు ఇష్టం ఉంటే రాగి సంకటి, జొన్న సంకటి లాంటివి చేసుకుని వాటిని కూరతో కలిపి తినొచ్చు.
- పైన చెప్పిన తెల్ల బియ్యం అన్నం కానీ, బ్రౌన్ రైస్ అన్నం కానీ లేదా మిల్లెట్ రైస్ కానీ వీటిలో ఏదో ఒకటి 1 లేదా 1 1/2 కప్పుల అన్నం తో కూర ఎక్కువ పెట్టుకుని తినాలి. అన్ని రకాల కూరగాయలు శుభ్రంగా సంశయించుకుండా తినండి. అలుగడ్డలతో సహా. ఆలు గడ్డలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని మానకండి. పెరుగు కూడా ఒక 50 గ్రాములు తింటే మంచిది. లేదా మజ్జిగ కూడా చేసుకోవచ్చు. కాకపోతే వేపుడు కూరలు, డీప్ ఫ్రై చేసిన కూరలు పూర్తిగా మానేయాలి.
- ఇంట్లో కరివేపాకు, నువ్వులు, అవిశెలు కలిపి చేసిన కారం పొడి, మునగాకు కారం పొడి ఎప్పుడూ రెడీ గా పెట్టుకోవాలి. మొదటి ముద్ద లో 1 tbsp ఈ కారం పొడి వేసుకుని తినాలి. ఒక రోజు ఒకటి రెండో రోజు ఇంకో కారం పొడి మార్చి మార్చి తింటుండాలి. ఇలా కారం పొడులు రోజూ తిన్నారంటే మీ జుట్టు ఊడడం ఆగిపోవడమే కాకుండా చక్కగా పెరుగుతుంది.
- మీరు అన్నంతో పాటు 1 ఉడికించిన గుడ్డు రెండు రోజుల కొకసారి తినొచ్చు. నేను ప్రతి రోజూ తింటాను. వీలయితే ఫారం గుడ్లు కాకుండా ఆర్గానిక్ నాటు కోడి గుడ్లు తినాలి.
- అన్నానికి బదులు గ్రిల్ల్డ్ చికెన్(బ్రెస్ట్ మంచిది ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి), ఫిష్ కూడా తినొచ్చు. ఏదైనా 200 గ్రాములు మించకుండా చూసుకోవాలి. పనీర్ అయితే 50 గ్రాములకు మించకుండా తినాలి. వీటితో పాటు ఖచ్చితంగా చాలా వెజిటేబుల్ సలాడ్ తినాలి. mashed పొటాటోస్ కూడా చాలా మంచిది. చిలగడ దుంప అయినా పర్లేదు. నాటు కోడి మాంసంతో గ్రిల్ల్డ్ చికెన్ చేసుకోలేము. చేసుకుందామన్నా ఎక్కువ ఫ్లెష్ ఉండదు. అందుకే మాములు ఫార్మ్ కోడి మాంసమే ఆంటిబయోటిక్స్ లేని, సేంద్రియ ఆహారం ఇచ్చి పెంచిన కోడి మాంసం తినొచ్చు. సాల్మన్, బస, మెకెరెల్ లాంటి చేపలు మంచివి. ఈ చేపలతో మేలు చేసే కొవ్వు ఉంటుంది.
రెండవ మీల్ లో తీసుకోదగ్గ ఆహారాలు
మీరు రెండో మీల్ లో కూడా నేను పైన మొదటి మీల్ లో చెప్పినవన్నీ యధాతథంగా మీకు కుదిరింది తీసుకోవచ్చు. అవి కాకుండా ఇంకా
- 2 చిన్న పుల్కాలు విత్ రాజ్మా కూర లేదా చోళే కూర లేదా, పనీర్ బఠాణి కూర, మష్రూమ్స్, పూల్ మాఖనా కూరలతో తినొచ్చు. పెసర మొలకల కూర కూడా చేసుకోవచ్చు. మేతి చికెన్, డమ్ కా చికెన్ లాంటివి కూడా తినొచ్చు. పుల్కా లు మాత్రమే చేసుకోండి. చపాతీలు, పరోటాలు, లచ్చ్చా పరాటా లాంటివి మర్చిపోండి. ఇలా వారం లో రెండు రోజలు తిన గలిగితే మంచిది. రాజ్మా మరియు కాబూలీ శనగల్లో చాలా పోషక విలువలుంటాయి అందువల్ల ఇవి కూడా ఆహారం లో భాగం చేసుకుంటే మంచిది.
- పుల్కాల కోసం కలిపే పిండిలో అంటే 1 కేజీ గోధుమ పిండికి 50 గ్రాములు రాగుల పిండి, 50 గ్రాములు జొన్న పిండి, 50 గ్రాముల సోయా పిండి కలిపి పెట్టుకుని ఆ పిండితో చేసుకుంటే ఇంకా మంచిది. జొన్న పిండి బదులు సజ్జ పిండి కూడా కలుపు కోవచ్చు.
ఇంకా ఇవి కాకుండా తినాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి పండ్లు. మీరు ప్రతిరోజూ ఒక అరటి పండు మొదటి లేదా రెండవ మీల్ అవ్వగానే తింటే మంచిది. అది కూడా బాగా పండిన అరటి పండు తింటే మలబద్దకం లేకుండా ఉంటుంది. అరటి పండు సహజం గా laxative కాబట్టి. కానీ మీరు కొనేటప్పుడు పచ్చిగా (గ్రీన్ గా ) ఉన్న అరటి పండ్లు కొని తెచ్చు కోవాలి. ఇంట్లో పండాక అప్పుడు తినాలి. ఇంకా దానిమ్మ పండ్లు, బత్తాయి, జామ, కివి, స్ట్రాబెర్రీ, గంగ రేగు పండ్లు, గ్రేప్స్, ఖర్బుజా, వాటర్ మెలోన్, బొప్పాయి, పైన్ ఆపిల్, పనస ఇలాంటి వాటిలో ఏదో ఒకటి మీల్ తో పాటే తినొచ్చు. అరటిపండు అన్ని సీసన్స్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అన్నింటికన్నా అది ఉత్తమం. మిగతా ఫ్రూప్ట్స్ అన్ని ఖచ్చితంగా తినాలి అని కాదు. ఒక వేళా తినాలి అనుకుంటే ఇలా తినాలి అని చెప్తున్నాను. ఫ్రూట్ జ్యూస్ చేయకుండా నేరుగా తాగడం మంచిది. ఇక ఆదివారాలు వచ్చినప్పుడు అందరం స్పెషల్స్ వండుకుంటాము కాబట్టి పులావ్, బిర్యానీ లాంటివి చేయాలి అనుకుంటే బాస్మతి బియ్యం వాడొచ్చు. బాస్మతి కూడా మంచిదే.
ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు తీసుకో దగినవి
- టీ లేదా కాఫీ తీసుకోవచ్చు. ప్లెయిన్ టీ లేదా కాఫీ తీసుకోగలిగితే మంచిది. అయితే మనకు పాలతో చేసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి అలా తాగాలి అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు 2 tbsp పాలల్లో చిన్న కప్పు నీళ్లు కలిపి కాఫీ గానీ టీ కానీ చేసుకోవచ్చు. చిక్కని పాలు నిషిద్ధం. 2 tbsp లలో ఉండే కార్బ్స్ నెగ్లిజబుల్. 1 గ్రాము కన్నా తక్కువ. అందువల్ల ఇబ్బంది ఉండదు. లేదా క్రీమ్ తో కాఫీ కూడా చేసుకోవచ్చు. ఇది ఇంకా బెటర్. కానీ క్రీం డబ్బా ఒకటి 75 rs ఉంటుంది. ఒకసారి మూత తెరిస్తే మొత్తం వాడేయాలి అంటారు. అవన్నీ మనవల్ల కాదు కాబట్టి పల్చని నీళ్ల లాంటి పాలతో చేసుకుంటే ఏమి కాదు. నేను క్రీమ్ కాఫీ రెసిపీ పెట్టాను మన యూట్యూబ్ ఛానల్ లో చుడండి. ఇక వీటిలో పంచదార వాడారు అంటే మీరు ఫాస్ట్ ని బ్రేక్ చేసినట్లే. అందుకని స్టీవియా డ్రాప్స్ కానీ erythritol powder కానీ వాడాలి. వీటిలో అస్సలు కార్బ్స్ కానీ క్యాలోరీస్ కానీ ఉండవు. మీరు కావాలి అంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కూడా చేసుకోవచ్చు. కానీ పైన నేను చెప్పినట్లు పల్చని నీళ్లలాంటి పాలు బెటర్. తాగొచ్చు కదా అని పెద్ద లోటా లో పోసుకుని తాగకూడదు. చిన్న కప్పు మాత్రమే తాగాలి. అది కూడా రోజులో ఒకసారి మాత్రమే.
- గ్రీన్ టీ లేదా నిమ్మ రసం లేదా రెండు కలిపి తాగొచ్చు.
- జీలకర్ర, సోంపు కషాయం తాగొచ్చు.
- ఆపిల్ సీడర్ వెనిగర్ తాగొచ్చు.
- ఆమ్లా జ్యూస్
- కలబంద రసం
- అల్లం కషాయం తాగొచ్చు.
- వీట్ గ్రాస్ జ్యూస్ తాగొచ్చు.
- విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవచ్చు
- ఒక చిన్న కీరా తినొచ్చు. అందులో ఉన్న 2 గ్రాముల కార్బన్ వల్ల సమస్య ఉండదు.
- ఇంట్లో పెంచుకున్న మైక్రో గ్రీన్స్ తినొచ్చు.
- 50 గ్రాముల పాలకూర లేదా 50 గ్రాముల lettuce తినొచ్చు… పచ్చిగా
- 1 tsp చియా గింజలు వేసిన నీళ్లు కావాలంటే నిమ్మరసం కలుపుకోవచ్చు.
ఈ పైన ఇచ్చిన లిస్ట్ వీటి వల్లా మీకు ఫాస్ట్ ని బ్రేక్ చేసినట్లు అవదు. అందువల్ల మీరు ఫాస్టింగ్ పీరియడ్ లో ఇవి సంశయం లేకుండా తీసుకోవచ్చు.
ఇంకా కొన్ని మంచి పదార్ధాలను ఎలా ఆహారంలో భాగం చేసుకోవాలి??
- గుమ్మడి గింజలు,చియా గింజలు లాంటి వాటిని వెజ్ సలాడ్ లో వేసుకుని తినొచ్చు. 1 tbsp మాత్రమే వాడాలి రోజుకి.
- కావాలి అనుకుంటే అన్నం లో నెయ్యి వేసుకోవచ్చు.
- ఛీజ్ తినాలి అనుకుంటే వెజ్ సలాడ్ లో వేసుకోవచ్చు లేదా గ్రిల్ల్డ్ చికెన్ ఫిష్ ల మీద ఒక్క నిమిషం వేడి చేస్తే కరిగిపోతుంది అలా తినొచ్చు.
- క్రీమ్ ని పాలక్ పనీర్, కాఫీ, టీ పనీర్ కూరల్లో వేసుకుని వాడొచ్చు.
- కసూరి మేతి ని కూరల్లో వేసుకోవచ్చు. మెంతి పిండి చేసుకుని కొద్దిగా మజ్జిగలో వేసుకుని అన్నం తినేటప్పుడు తాగొచ్చు.
- ఎప్పుడైనా బెల్లంతో చేసిన స్వీట్స్ అంటే పల్లీ చిక్కి నువ్వుల చిక్కి సున్నుండ లాంటివి తినాలి అంటే మొదటి లేదా 2 వ మీల్ తినేటప్పుడే తినేయాలి. విడిగా స్నాక్స్ లా తినకూడదు.
ఈ పోస్ట్ లో నేనెలా పాటిస్తున్నానో అలానే చెప్పాను. నేను వాడే ఫుడ్ బ్రాండ్ ల లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. బరువు తగ్గాలి అనుకునే అందరికీ ఇది ఒక లానే ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అయినా సహనంగా చేయాలి. ఒకవేళ ఇది పాటిస్తున్నపుడు ఏమాత్రం తేడాగా అనిపించినా వెంటనే మానేయాలి. వైద్యుల సలహా తప్పకుండా పాటించాలి. IF చేసేటప్పుడు అతి కొంతమంది స్త్రీలలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్క నెల తేడా వచ్చినా వెంటనే ఆపేయాలి.
IF చేసేటప్పుడు ఎక్సరసైజులు చేయొచ్చా??
మీకు ఓపిక ఉంటే చేయొచ్చు. కానీ పెద్ద భారీ వర్క్ ఔట్స్ చేయకూడదు. ఉపవాస సమయంలో అలా చేయడం వల్ల అలసిపోయి అనవసరంగా ఆకలి అనిపించే అవకాశం ఉంది. అందుకే మెల్లిగా వాకింగ్ చేయొచ్చు రెండు పూటలా కుదిరితే.
నా ఈ పోస్ట్ లో నాకు తెలిసిన వరకు వివరంగా చెప్పడానికి ప్రయత్నించాను. మీకు ఇది ఉపయోగంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అడగండి. నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను.
ప్రకటన : నేను పైన రాసిన ఈ వ్యాసం Intermittent Fasting గురించి మీకు అవగాహన కలిగించడం కోసం మాత్రమే. నేను పైన ఇచ్చిన ఆహారాలలో మీకు సరిపడని ఆహారం ఏదైనా ఉందేమో తెలుసుకుని మరీ వాడాలి. ఇది వైద్యానికి సంబంధించిన సలహా మాత్రం కాదు మరియు వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా తీవ్ర సమస్య వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి తప్ప సొంత వైద్యం చేసుకోకూడదు. గమనించ గలరు.