ఎలాంటి జ్యూసర్లు మంచివి? ఇది కూడా నన్ను చాలా మంది నన్ను ఎప్పటి నుండో అడుగుతున్న ప్రశ్నలలో ఒకటి. ఈ పోస్ట్ లో నాకు తెలిసినంత వరకు దాని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిజం చెప్పాలి అంటే అసలు ఈ జ్యూస్లు అవీ తాగడం కన్నా నేరుగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. నేను కూడా అది తెలిసే చాలా సంవత్సరాలు ఎటువంటి జ్యూసర్లు వాడలేదు. నేను ఎప్పటి నుండో ఇంట్లో ఉపయోగిస్తున్న Morphy Richards Icon DLX మిక్సీ తో పాటు ఒక జ్యూసర్ జార్ కూడా వచ్చింది. నేను దానిని ఒక్కసారి కూడా వాడలేదు.
మేము జ్యూస్ చేసుకోకుండా నేరుగా తినేవాళ్ళము. ఇంతకు ముందు అంటే పచ్చి కూరగాయలు, పండ్లు ప్రధాన ఆహారం తో పాటుగా తీసుకునేవాళ్ళము కాబట్టి రోజూ కాకుండా అప్పుడప్పుడూ తినేవాళ్ళము. కానీ ఎప్పుడైతే పచ్చి కూరగాయలు, పండ్లే మా ప్రధాన ఆహారంగా మారాయో, అప్పుడప్పుడు కాకుండా వాటిని రోజువారీ ఆహారం గా మార్చుకున్నామో అప్పటి నుండి మాకు నేరుగా తినాలి అంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది.
ఎందుకంటే ఏదైనా ఆహారాన్ని తీసుకునేటప్పుడు మనం బాగా నమిలి తినాలి. కనీసం ఒక 30 నుండి 32 సార్లు నమిలి తినాలి. అప్పుడే ఆ ఆహారం మన లాలాజలంతో కలిసి కొంత వరకు అరుగుతుంది. అంటే ఆహారం యొక్క అరుగుదల అనేది నోట్లో నుండే మొదలవుతుంది. ఈ విషయం తెలీక చాలా మంది హడావిడిగా సరిగ్గా నమలకుండా మింగేస్తుంటారు. అలా తింటే మనం తీసుకున్న ఆహారం లోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించలేదు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాను అంటే పచ్చి కూరగాయలు మరియు పండ్లలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటిని నమలడం కాస్త కష్టంగానే ఉంటుంది. 25-30 ఏళ్ల లోపు వారేమన్నా కాస్త ఓపికగా నమలగలరేమో గానీ ఆ తర్వాతి వారికి అంత ఓపిక, సహనం, తీరిక ఉండవు. ఇక్కడ నేను చెప్తుంది పళ్ళ గురించి కాదు. బాధ్యతల గురించి. ఇంటి పనులు, పిల్లలు వాళ్ళ పనులు ఇవన్నీ ఉండడం వల్ల మగవారు కానీ ఆడవారు కానీ తీరిగ్గా కూర్చుని తినే సమయం కూడా ఉండదు. ఆవులు, గేదెలు చూడండి అవి తిన్న ఆహారాన్నితర్వాత తీరిగ్గా ఎంత సేపు నెమరవేస్తాయో. మనకా సౌకర్యం, సమయం ఉండదు కదా అందుకే ఈ జ్యూసర్ల మీద పడాల్సి వచ్చిందన్నమాట.
ఎంతైనా జ్యూసర్లు వాడితే కూరగాయలు మరియు పండ్లలోని పోషకాలు నశిస్తాయి అనేది వాస్తవం. అది ఎలా అంటారా. ఉదాహరణకు ఒక కీర దోసకాయో క్యారెట్టో తీసుకుందాం. దాన్ని మనం కట్ చేయకుండా నేరుగా బాగా నమిలి తింటే మనకు దాని నుండి 90 శాతం పోషకాలు లభిస్తాయి. అదే కీరా లేదా క్యారెట్టు ను మనం సన్నగా తురిమి తింటే సగం పోషకాలు పోతాయి. తురిమి నప్పుడు లేదా చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు అందులోని ప్రతీ చిన్న ముక్కకు బయట వాతావరణంలోని ఆక్సిజన్ తగలడం వల్ల అవి ఆక్సిడైజ్ అయి పోషకాలను కోల్పోతాయి.
మన శరీరం అంతటా కూడా నిరంతరం ఈ ఆక్సిడేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ లో భాగంగా ఫ్రీ రాడికల్స్ విడుదల అవుతాయి. అవి మన శరీరంలోని కణాలను నిర్వీర్యం చేస్తుంటాయి. దాని వల్ల మన వయసుకు తగ్గట్లుగా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల మనల్ని యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఆహారం తీసుకోమంటారు. యాంటీ యాక్సిడెంట్ రిచ్ ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం వయసును మీద పడకుండా చూసుకోవచ్చు. అంటే వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలి అంటే యాంటీ యాక్సిడెంట్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలన్నమాట.
సరే ఇప్పుడు మళ్ళీ అసలు విషయానికొస్తే మేము నమిలి తినలేము జ్యూస్ లా మాత్రమే తీసుకోగలము అనుకుంటే ఏ జ్యూసర్ తీసుకోవాలి. జ్యూసర్ అంటేనే చెడు అనుకుంటే ఆ చెడులో కూడా కాస్త మంచి చెడుని ఎంచుకోవడం మంచిది.( ఇక్కడ నేను వాడిన ‘మంచి చెడు’ అనే పదాల ను ఆంగ్లంలో oxymoron అంటారు. అంటే ఏదైనా రెండు పరస్పర విరుద్ధమైన పదాలను పక్క పక్కన పెట్టి వాడాల్సి వస్తే దానిని oxymoron అంటారన్నమాట. ఉదా:- it’s a little big…మన తెలుగు భాషలో అలాంటి కొన్ని పదాల్ని వెతకండి చూద్దాము. ఇది మెదడుకి మేత).
ఇక జ్యూసర్లలో రకాలు చూద్దాము. Blenders, Centrifugal Juicers మరియు slow cold press juicers.
Blenders
ఇవి మనం మాములుగా ఇళ్లల్లో వాడే మిక్సర్ గ్రైండర్లు లాంటివే. మనం లోపల వేసిన కూరగాయలు లేదా పండ్లను బ్లేడ్లతో చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. ఇంకా వీటిల్లో నుండి జ్యూస్ రావాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక ద్రవ పదార్ధాన్ని వేయాల్సి ఉంటుంది. అంటే నీళ్ళు కానీ పాలు లాంటివి పోస్తేనే కాని ఆ బ్లేడ్లు సులభంగా తిరగలేవు. పల్ప్ సెపెరేటర్ మెష్ లేకపోతే జ్యూస్ మరియు ఫైబర్ కలిసిపోయి జ్యూస్ ను మింగడం లేదా గుటక వేయడం ఇబ్బందిగా ఉంటుంది. పల్ప్ సెపరేటర్ మెష్ పెట్టి చేస్తే పిప్పి విడిగా ఉంటుంది కానీ దానిలో చాలా జ్యూస్ కూడా ఉంటుంది. మళ్ళీ దాన్ని బయటకు తీసి విడిగా గట్టిగా నొక్కుతూ ఆ మిగిలిన జ్యూస్ ను కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి బ్లెండర్స్ లో RPM(Rotations per Minute) సాధారణంగా 20000, 22000 నుండి 32000 దాకా ఉంటుంది, అంటే నిమిషానికి 22 వేల సార్లు అలా తిరుగుతుందన్నమాట. అంత వేగంగా తిరిగేటప్పుడు ఎంత వేడి ఉత్పత్తి అవుతుంది? అంత వేడికి ఆ జ్యూస్ లో ఉన్న విటమిన్లు మరియు ఎంజైములు నశిస్తాయి. పిప్పి మొత్తం పోవడం వల్ల తగిన పీచు పదార్ధం ను కూడా తీసుకోలేకపోతాము. అయితే వీటిని వాడడం చాలా తేలిక, ఖరీదు కూడా తక్కువ కాబట్టి అందరూ ఎక్కువగా వీటిని వాడుతుంటారు. అతి తక్కువ సమయం లో జ్యూస్ రెడీ అయిపోతుంది. జార్ లను తేలిగ్గా కడుక్కోవచ్చు. కానీ వీటిల్లో చేసిన జ్యూస్ లు తాగి మనం పౌష్టికాహారం తీసుకుంటున్నాము అనేది ఒక భ్రమ అంతే.
Centrifugal Juicers
పైన చెప్పిన బ్లెండర్లతో పోలిస్తే వీటి పని చేసే తీరు కొద్దిగా వేరేగా ఉంటుంది. పైన ఫీడర్ ట్యూబ్ లో నుండి మనం ఏదైనా కూరగాయ లేదా పండు లేదా ఆకుకూరను వేసినప్పుడు కింద ఉన్న గుండ్రటి మెష్ బుట్టలోకి వెళ్తుంది. ఆ బుట్టలో కింద ఒక చక్రం లాంటి ఒక బ్లేడ్ ఉంటుంది. కింద దాని ఫోటో పెట్టాను చూడండి.
అది వేగంగా తిరుగుతూ వాటిని అతి చిన్న ముక్కలుగా కట్ చేసి గుండ్రంగా తిప్పుతూ పదునైన స్టీల్ మెష్ బుట్ట అంచులకు తగిలేలా చేస్తుంది. ఇక్కడ centrifugal force టెక్నిక్ పనిచేస్తుంది అన్నమాట. పిప్పి అంతా మెష్ బుట్టలో ఉండిపోయి రసం మాత్రం బయటకు వచ్చేస్తుంది. అయితే పైన బ్లెండర్ లలో లాగా ఇందులో ద్రవ పదార్ధం అంటే నీళ్లు, పాలు లాంటివి పోయాల్సిన అవసరం లేదు. అవి లేకుండానే రసం తీసుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిల్లో RPM సాధారణంగా 6000-14000 రేంజ్ లో ఉంటుంది. అంటే నిమిషానికి 6-14 వేల సార్లు తిరుగుతుంది అన్నమాట. అంటే దీనిలో కూడా వేడి వల్ల విటమినులు ఎంజైములు నశిస్తాయి. కానీ పైన బ్లెండర్స్ తో పోలిస్తే తక్కువ. అందువల్ల సాధారణ బ్లెండర్ కన్నా ఈ Centrifugal Juicers కాస్త నయం. వీటిల్లో కూడా జ్యూస్ త్వరగా అయిపోతుంది. ఖరీదు పైన బ్లెండర్స్ తో పోలిస్తే కాస్త ఎక్కువ ఉంటుంది. పైన బ్లెండర్ తో పోలిస్తే క్లీనింగ్ కొంచెం కష్టం.
Slow Cold Press Juicers.
సాధారణ బ్లెండర్ మరియు Centrifugal Juciers తో పోలిస్తే వీటి పని తీరు చాలా వేరేగా ఉంటుంది. వీటిలో ఒక స్పైరల్ షేప్ లో ఉన్న స్క్వీజింగ్ గేర్ ఉంటుంది. దాని ఫోటో పెట్టాను చూడండి .
ఫీడర్ ట్యూబ్ ద్వారా మనం వేసిన కూరగాయలు లేదా పండ్లు ఆ స్క్వీజింగ్ గేర్ లేదా (squeezer) ద్వారా మెల్లిగా క్రష్ అవుతూ కింద ఉన్న స్టైన్ లెస్ స్టీల్ మెష్ బుట్టలోకి వెళ్తాయి. పైన రెండింటిలో బ్లేడ్లు మనం వేసిన వాటిని అతి చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూస్ లా మారిస్తే ఇక్కడ పిండడం లేదా క్రషింగ్ ద్వారా జ్యూస్ లా మారుస్తుంది. ఈ జ్యూస్ర్లలో RPM 45-80 మాత్రమే ఉంటుంది. అంటే నిమిషానికి 45 నుండి 80 సార్లు మాత్రమే తిరుగుతూ మెల్లిగా జ్యూస్ ను తీస్తుంది. తక్కువ సార్లు తిరగడం వల్ల మరియు మెల్లిగా తిరగడం వల్ల వేడి చాలా అతి తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల మనం తీసిన జ్యూస్ లోని పోషకాలు అంటే విటమిన్లు మరియు ఎంజైములు 90 శాతం అలానే ఉంటాయి. వీటిలో ట్విన్ గేర్ మోడల్స్ కూడా ఉంటాయి. అంటే పైన ఉన్న స్పైరల్ గేర్లు రెండు ఉంటాయి. మనం వేసిన పండ్లు కూరగాయలు ఆ రెండింటి మధ్య నలగడం వల్ల జ్యూస్ బయటకు వస్తుంది. అంటే చెరుకు రసం తీసే మిషన్ లా అన్నమాట. ఇది అతి తక్కువ శబ్దం చేస్తుంది. దాని పక్కన ఉన్న వారికి తప్ప వేరే గదుల్లో ఉండేవారికి శబ్దం వినపడదు. ఒక కంటైనర్ లోకి పిప్పి ఇంకో కంటైనర్ లోకి రసం విడి విడిగా బయటకు వచ్చేస్తాయి. కొత్తల్లో వాడడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. మెల్లిగా అలవాటు అయిపోతుంది. వాటిల్లో ఉన్న భాగాలను ప్రతిసారీ అమర్చడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ అలవాటయ్యాక 30 సెకన్లలో అయిపోతుంది. పైన రెండింటితో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కవగానే ఉంటుంది.
ఇప్పటి వరకు వివిధ రకాల జ్యూసర్లు పనిచేసే తీరును వివరించాను. ఇప్పుడు వాటిలో తీసిన జ్యూస్ texture ఎలా ఉంటుంది దాని అర్ధం ఏమిటి అనేది చెప్తాను.
సాధారణ బ్లెండర్ లలో జ్యూస్ చేసినప్పుడు అందులో మనం నీళ్లు పోసి చేస్తాము కాబట్టి నీళ్ళగా పల్చగా ఉంటుంది. పైన నురుగు ఏర్పడుతుంది. జార్ లో వేగంగా తిరిగినప్పుడు లోపల ఉన్న గాలితో చర్య జరపడం వల్ల ఈ నురుగు ఏర్పడుతుంది. మనం దీనిలో చేసిన జ్యూస్ ను ఒక గ్లాస్ గ్లాసులో పోసినప్పుడు కాసేపు ఆగాక చూస్తే అందులో జ్యూస్ లో ఉన్న చిక్కని పదార్ధం అడుగుకు చేరుతుంది.పైన పల్చని నీళ్లలాంటి జ్యూస్ ఉంటుంది. ఇలాంటి జ్యూస్ లో అసలే పోషక విలువలు చాలా వరకు పోతాయి కాబట్టి ఆ మిగిలిన పోషకాలన్నా మనకు అందాలంటే చేసిన వెంటనే తాగేయాలి. ఇందులో కేవలం కూరగాయలు, పండ్లే కాకుండా గట్టిగా ఉండే కొబ్బరి, బాదం పప్పులు నుండి పాలు, మృదువుగా ఉండే అరటి పండ్లు, సపోటా లాంటి వాటితో కూడా స్మూతీ లాంటివి చేసుకోవచ్చు.
Centrifugal Juicers లలో జ్యూస్ చేసినప్పుడు అందులో మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు కాబట్టి చిక్కని రసం వస్తుంది. అయినా ఇది కూడా వేగంగా తిరగడం వల్ల పైన చెప్పిన బ్లెండర్ అంత కాకపోయినా ఎంతో కొంత నురుగు వస్తుంది. గాజు గ్లాస్ లో పోసి కొంత సేపు ఆగితే చిక్కని పదార్ధం కాస్త పైకి తెట్టలా తేలుతున్నల్టు కనిపిస్తుంది. ఈ జ్యూస్ను కూడా సాధ్యమైనంత వరకు చేసిన వెంటనే తాగితేనే మంచిది. వీటిల్లో కొబ్బరి పాలు, ఆల్మండ్ మిల్క్ లాంటివి చేయొచ్చో లేదో నాకు తెలీదు.
Cold Press Juicers లలో కూడా జ్యూస్ చేసినప్పుడు మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు కాబట్టి రసం చాలా చిక్కగా వస్తుంది. Centrifugal వాటితో పోలిస్తే సాధ్యమైనంత ఎక్కువ జ్యూస్ ను బయటకు తీస్తుంది. కానీ ఇలాంటి జ్యూసర్లలో లీటర్లు లీటర్లు జ్యూస్ వస్తుందని ఆశించకూడదు. 250 గ్రాములు క్యారెట్లు వేస్తే చిన్న టీ గ్లాస్ అంత చిక్కని రసం మాత్రమే వస్తుంది. కావాలంటే అందులో కాస్త నీరు కలిపి పల్చగా చేసుకుని తాగొచ్చు.కానీ ఎలా తీసుకున్నా అందులో ఉండే పోషకాలు ఒకటే కాబట్టి నేను చిక్కని రసాన్నే తాగేస్తూ ఉంటాను. ఇందులో చేసిన జ్యూస్ ను గాజు గ్లాస్ లో పోసి కాసేపు ఉంచి చూస్తే అలానే ఉంటుంది. నీళ్లు రసం విడిపోయినట్లు కానీ, తెట్టలా తేలుతున్నల్టు కానీ ఉండదు. మరీ చాలా సేపు ఉంచితే ఏదైనా కాస్త అడుగుకు చేరుతుందేమో కానీ మాములుగా అయితే చిక్కగా గ్లాస్ అంతా ఒకేలా కనిపిస్తుంది. ఈ జ్యూస్ ను తయారు చేసుకుని 2-3 రోజులు ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకుని కూడా తాగొచ్చు. అందులో ఉండే పోషకాలు అలానే ఉంటాయి. అయితే వీటిలో గట్టిగా ఉండే కొబ్బరి ముక్కలు వేసి కొబ్బరి పాలు తీయలేము. కావాలంటే కొబ్బరిని కాస్త విడిగా గ్రైండ్ చేసి దానిని ఈ జ్యూసర్ లో వేస్తే మాక్సిమమ్ పాలు తీయవచ్చు. నేను ఇప్పుడు Borosil బ్రాండ్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ వాడుతున్నాను. ఒకసారి తెలీక అలానే కొబ్బరి వేస్తే జ్యూసర్ తిరగకుండా ఆగిపోయింది. అసలు మూత కూడా తెరుచుకోలేదు. కనీసం సర్వీస్ కి తీసుకెళ్లడానికి సమయం లేక 2 డేస్ అలా వదిలేశాను. తర్వాత లోపల అడ్డం పడిన కొబ్బరి ముక్క కాస్త మెత్తపడి కుంగినట్లయింది. అందువల్ల మూత తెరుచుకుంది. ఇందులో అరటి పండు వంటి మృదువైన పండ్లు కూడా వేయకూడదు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, కీరా, సొరకాయ, ఆరంజ్, బత్తాయి, పైన్ ఆపిల్(కాస్త చిన్న ముక్కలుగా చేసి వేయాలి), ఆకుకూరలు జ్యూస్ చేసుకోవచ్చు. పిప్పి ఎక్కువ పోతుంది అని బాధ పడనవసరం లేదు. పిప్పిలో కూడా రెండు రకాలు ఉంటాయి. soluble ఫైబర్, insoluble ఫైబర్..దాదాపు soluble పిప్పి అంతా జ్యూస్ లోనే ఉంటుంది. లేదా ఆ పిప్పి అంతా వృధాగా పోతుంది అంటే వాడుకోవచ్చు. నేనైతే క్యారెట్ బీట్రూట్ వంటి వాటిని జ్యూస్ చేసినప్పుడు వచ్చిన పిప్పితో సింపుల్ గా ఫ్రై చేస్తాను. 10 నిమిషాల్లో అయిపోతుంది అది అన్నం లోకి చపాతీ లోకి బాగుంటుంది. ఆ ఫ్రై వీడియో నేను యూట్యూబ్ లో కూడా పెట్టాను.
ఇప్పుడు కింద వివిధ రకాల జ్యూసర్లు లిస్ట్ ఇక్కడ ఇస్తాను చూడండి.
Centrifugal Juicers
Slow Cold Press Juicers
స్లో కోల్డ్ ప్రెస్ జ్యూసర్లు అన్నింటిలో Kuvings బ్రాండ్ చాలా బాగుంటుంది. దాని RPM 50 మాత్రమే. ఇది చైనా బ్రాండ్. ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. 18900 రూపాయలు ఉంది. కానీ రేటింగ్స్ చాలా బాగున్నాయి. మీరు ఈ kuvings అన్న లింక్ ను క్లిక్ చేస్తే కనిపిస్తుంది. దీని కన్నా ఎక్కువ ధర Panasonic cold ప్రెస్ juicer ఉంది. అది 24000 రూపాయలు ఉంది. దాని RPM 45 మాత్రమే. Wonderchef ది RPM 43 ఉంది. Borosil 70, Usha 67, Agaro 60 ఉన్నాయి. RPM ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ పోషక విలువలు నిలిచి ఉండే అవకాశం ఉంది. కానీ RPM తక్కువ ఉన్న వాటి ధర ఎక్కువగా ఉంది. అంత ఎక్కువ ధర చెల్లించి కొనుక్కోవాలి అంటే కాస్త కష్టమే.
ఈ పైన వాటిల్లో నేను వాడుతున్నది Borosil బ్రాండ్ ది. నేను కొనాలి అనుకున్నప్పుడు పెద్ద రేటింగ్స్ ఏమి ఎక్కువ లేవు కానీ అయినా కాస్త ధైర్యం చేసి కొన్నాను. నేను వాడడం మొదలు పెట్టి దాదాపు 7 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా ఎటువంటి సమస్యా రాలేదు. జ్యూస్ కూడా బాగా వస్తుంది. పైన చెప్పాను కదా ఒకసారి మాత్రం తెలీక పెద్ద పెద్ద కొబ్బరి ముక్కలు వేయడం వల్ల పనిచేయలేదు. అది నా తప్పు. జ్యూసర్ తప్పు కాదు. Balzano బ్రాండ్ కూడా బాగానే ఉంటుంది. దానికి రేటింగ్స్ కూడా బాగున్నాయి. ఉషా కి మాత్రం అసలెందుకో రేటింగ్ సరిగ్గా లేదు.
నిజం చెప్పాలి అంటే ఇంతకు ముందు నాకు కోల్డ్ ప్రెస్ జ్యూస్ ల గురించి అసలు అవగాహన లేదు. ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే ఆ మాటే వినలేదు కూడా. రెండు సంవత్సరాల కిందట ఒకసారి సచిన్ స్నేహితుడు కాల్ చేసినప్పుడు మాటల మధ్యలో తను పని చేసే చోటు ప్రస్తావన వచ్చింది. అది జూబ్లీ హిల్స్ లోనో లేదా ఫిలిం నగర్ లోనో ఒక కేఫ్, బెవరేజ్ అండ్ హెల్తీ ఫుడ్ రెస్టారెంట్. అక్కడ తను మేనేజర్ గా ఉన్నారు అట. సచిన్ అక్కడికి ఒకసారి వెళ్ళినప్పుడు తను ఫస్ట్ టైమ్ కోల్డ్ ప్రెస్ జ్యూస్ గురించి చెప్పి 3-4 రకాల జ్యూస్ లు ఇచ్చారు. ధర ఒక్కోటి 200 -300 రూపాయలు ఉంది. సానియా మీర్జా ఇంకొంత మంది సెలబ్రిటీస్ అక్కడి నుండి తెప్పించుకునేవారు అట. అప్పుడు తెలిసింది అసలు కోల్డ్ ప్రెస్ అంటే ఏమిటి? అది ఎందుకు మంచిది అని.
ఏదైనా సరే కొనాలి అనుకుంటే కొనే ముందు కాస్త దాని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్లు చదివి అర్ధం చేసుకుని తీసుకుంటే మంచిది.సరే అండీ నాకు జ్యూసర్ల గురించి నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నించాను. ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.
ఇంతకు ముందు పోస్ట్ లలో ఉపయోగపడే కిచెన్ టూల్స్ గురించి మరియు ఎలాంటి వంట పాత్రలలో వండితే మంచిది అని కూడా రాశాను తెలుసుకోవాలి అంటే పై లింక్ లను క్లిక్ చేసి చదవగలరు.