ఒక మిక్సింగ్ బౌల్ లో పసుపు, ఉప్పు, కారం, టిక్కా మసాలా పొడి, ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్, అల్లం వెల్లులి ముద్ద, గిలకొట్టిన మందపాటి పెరుగు వేసి బాగా కలిపి మసాలా మిశ్రమాన్ని తయారు చేయాలి.
తర్వాత అందులో బోన్ లెస్ చికెన్ ముక్కలు వేసి మసాలా మిశ్రమం అంతా ముక్కలకు బాగ్ పట్టేలా కలపి ఒక గంట సేపు నానబెట్టాలి.
బియ్యం నాన బెట్టుట
4 కప్పులు లేదా 450 గ్రాములు బాస్మతి బియ్యం తీసుకుని నీళ్లు పోసి 30 నిమిషాలు నానబెట్టాలి.
అన్నం వండుట
మనం సాధారణంగా ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో రోజూ వండే మాదిరిగానే 1 కప్పు బియ్యానికి 2 కప్పులు చొప్పున నీళ్లు పోయాలి.
అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, బిర్యానీ ఆకులు, షాజీరా, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ ముక్క, జాపత్రి, ఏలకులు, పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసి కలిపి గిన్నె ఎలక్ట్రిక్ కుక్కర్ లో పెట్టి స్విచ్ ఆన్ చేయాలి.
అన్నం పూర్తిగా ఉడికి కుక్కర్ ఆగిపోకముందే అంటే 90 శాతం ఉడికి ఇంకా కొద్దిగా నీరు/లేదా తేమ ఉండగానే స్విచ్ కట్టేసి అన్నం గిన్నె పక్కన పెట్టుకోవాలి.
చికెన్ టిక్కా తయారు చేయుట
అన్నం ఉడుకుంతుండగా ఈ లోపు చికెన్ టిక్కా తయారు చేసుకోవాలి.
ఒక మందపాటి పాన్ లో నూనె వేసి కాగాక, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ టిక్కా ముక్కలను పెనం లో వేసి ఒకసారి కలపాలి.
తర్వాత మూత పెట్టి చికెన్ ముక్కలు చక్కగా ఉడికే వరకు వేయించాలి. మధ్య మధ్యలో మూట తెరిచి కలుపుతుండాలి.
చికెన్ ముక్కలు బాగా ఉడికాక స్టవ్ కట్టేసి పెనం మధ్యలో కొద్దిగా చోటు చేసి అందులో ఒక కాల్చిన బొగ్గు ముక్కని చిన్న గిన్నెలో పెట్టి ఉంచాలి.
బొగ్గు మీద కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేస్తే పొగ రావడం మొదలవుతుంది.
పొగ బయటకు పోకుండా వెంటనే మూతతో కవర్ చేయాలి. ఆ పొగ వాసం అంతా ముక్కలకు పట్టి ఇంకా పొగ రావడం ఆగిపోయినప్పుడు మూత తెరవాలి.
చికెన్ టిక్కా బిర్యానీ వండు విధానం
ఒక మందపాటి పాత్రలో నూనె వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు వేసి కొద్దిగా వేయించాలి.
తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారేవరకు వేయించాలి.
తర్వాత పసుపు, కారం, బిర్యానీ మసాలా వేసి, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కలపాలి.
తర్వాత 1 కప్పు పల్చని పెరుగు, పుదీనా, కొత్తిమీర, నిమ్మ రసం కూడా వేసి బాగా కలపాలి.
వేయించి పెట్టుకున్న చికెన్ టిక్కా ముక్కలు కూడా వేసి బాగా కలిపి నూనె అంచులకు చేరే వరకు మీడియం సెగ మీద ఉడికించాలి. (ఒకసారి ఉప్పు సరి చూసుకోవాలి).
ముక్కలతో కూడిన సగం గ్రేవీ ని గిన్నె లో నుండి పక్కకు తీసి పెట్టుకోవాలి.
తర్వాత గిన్నెలో మిగిలిన కూరను సర్ది దాని మీద 80 శాతం వండిన బాస్మతి అన్నం సగం వేయాలి. కొద్దిగా పుదీనా ఆకులుం కొత్తిమీర, నెయ్యి వేసి తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న గ్రేవీ ని పైన వేయాలి.
మిగిలిన అన్నం కూడా పొర లా వేసి దాని పైన మళ్ళీ పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసి గిన్నెను తడి బట్టతో గానీ, అల్యూమినియం ఫాయిల్ తో గానీ ఆవిరి బయటకు పోకుండా కవర్ చేయాలి.
మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు బాగా సన్నని ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించి తర్వాత స్టవ్ కట్టేయాలి. ఒక 15 నుండి 20 నిమిషాలు మూత తెరవకుండా అలానే ఉంచి తర్వాత సర్వ్ చేయాలి.